Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హరియాణా లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కి శంకుస్థాపన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం


 

‘‘సర్ ఛోటూ రామ్!’’ అని నేను అనగానే

మీరందరు ‘అమర్ రహే! అమర్ రహే!’ అంటూ రెండు సార్లు అని అనండి..

సర్ ఛోటూ రామ్! అమర్ రహే! అమర్ రహే!

సర్ ఛోటూ రామ్! అమర్ రహే! అమర్ రహే!

సర్ ఛోటూ రామ్! అమర్ రహే! అమర్ రహే!

సర్ ఛోటూ రామ్! అమర్ రహే! అమర్ రహే!

 

దేశ సరిహద్దులను పరిరక్షిస్తున్న సైనికులను, కోట్లాది దేశ ప్రజలకు ఆహారాన్ని సమకూరుస్తున్న రైతులను, క్రీడా పోటీల్లో అత్యధిక సంఖ్యలో పతకాలను సాధిస్తున్న క్రీడాకారులను దేశానికి అందిస్తున్న హరియాణా నేల కు నేను వందనం చేస్తున్నాను. దేశం పేరు ను, గౌరవాన్ని ముందుకు తీసుకుపోవడం లో హరియాణా ప్రజలకు మరెవ్వరూ సాటి రారు.

 

హరియాణా గవర్నర్ శ్రీ సత్యదేవ్ నారాయణ్ ఆర్య గారు,

నా మంత్రివర్గ సహచరులు చౌధరీ బీరేంద్ర సింహ్ గారు, శ్రీ కృష్ణ పాల్ గుర్జార్ గారు,

ప్రముఖ హరియాణా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ గారు,

జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ సత్పాల్ మాలిక్ గారు,

ఈ నేల పుత్రుడు, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ గారు,

హరియాణా ప్రభుత్వంలో మంత్రి, నా పాత మిత్రుడు, సోదరుడు ఓ.పి. ధన్కడ్ గారు,

శాసనసభ్యుడు శ్రీ సుభాష్ బరాలా గారు, మరియు

హరియాణా, పంజాబ్, రాజస్థాన్ ల నుండి తరలివచ్చిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా,

 

నేను, ఈ రోజు, దీనబంధు ఛోటూ రామ్ విగ్రహాన్ని మీకు అందజేయడానికి వచ్చాను. ఇంతకంటే ఎక్కువ ఆనందాన్ని నాకు ఇచ్చేది వేరే ఏమి ఉంటుంది ?

మిత్రులారా,

సాంప్ లా రైతుల వాణి గా, దూత గా ఉన్న రహబరే ఆజం దీన బంధు చౌధరీ ఛోటూ రామ్ గారి అద్భుతమైన విగ్రహన్ని ఆవిష్కరించే అవకాశం ఈ రోజు నాకు రావడం నిజంగా నా అదృష్టం. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ముందు, చౌధరీ ఛోటూ రామ్ గారి జ్ఞాపకార్ధం నిర్మించిన ప్రదర్శనశాల ను నేను సందర్శించాను. ఈ ప్రదర్శనశాల తో పాటు హరియాణా లోనే అత్యంత ఎత్తయిన ఈ విగ్రహం సాంప్ లా, రోహతక్ లకు మరొక ప్రత్యేక గుర్తింపు గా నిలచింది. రైతు దూత సర్ ఛోటూ రామ్ గారి అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని అక్టోబర్ నెల లో హరియాణా లో ఆవిష్కరించే అవకాశం నాకు దక్కడం, అదే విధంగా సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారి అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని కూడా ఆయన జయంతి రోజు న అనగా అక్టోబర్ 31వ తేదీ నాడు ఆవిష్కరించే అవకాశం నాకు లభించడం నా అదృష్టం గా భావిస్తున్నాను. ఈ ఇద్దరు గొప్ప వ్యక్తులూ రైతులు. వారు రైతు లను దేశం తో అనుసంధానించడానికి ఎంతో కృషి చేశారు. చెప్పుకోదగ్గ రెండో లక్షణం ఏమిటంటే ఈ విగ్రహాన్ని శ్రీ సుతార్ గారు నిర్మించారు. ఆయన వయస్సు 90 ఏళ్ల కంటే ఎక్కువ అయినప్పటికీ ఆయన ఇంకా పని ని కొనసాగిస్తున్నారు. ప్రపంచం లో అత్యంత భారీ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగహాన్ని కూడా ఈ సుతార్ గారే నిర్మించారు. హరియాణా, రాజస్థాన్, పంజాబ్ లతో పాటు దేశ ప్రజలందరినీ నేను ఈ సందర్భం గా అభినందిస్తున్నాను.

సోదర సోదరీమణులారా,

ఎప్పటికప్పుడు ఇటువంటి గొప్ప వ్యక్తులు మన దేశంలో జన్మిస్తూనే ఉన్నారు. సమాజానికి సేవ చేయడానికీ, దేశానికి దిశా నిర్దేశం చేయడానికీ వారి జీవితాలను అంకితం చేస్తూనే ఉన్నారు. పేదరికం, కొరత, సమస్యలు, విభేదాలు వంటివి చాలా ఉన్నా, ఇటువంటి వ్యక్తులు ఈ సవాళ్ళను అధిగమించి సమాజాన్ని పటిష్టపరచడానికి వారి జీవితాలను త్యాగం చేస్తున్నారు. చౌధరీ ఛోటూ రామ్ గారు హరియాణా గడ్డ పై జన్మించడం మనందరికీ ఎంతో గర్వకారణమైన విషయం.

భారతదేశ పునర్నిర్మాణం లో కీలక పాత్ర ను పోషించిన దేశం లోని సామాజిక సంస్కర్త లలో చౌధరీ ఛోటూ రామ్ గారు ఒకరు. రైతులు, కార్మికులు, సమాజం లోని అట్టడుగు వర్గాలు, నిరాదరణకు గురైన వర్గాల వారి తరఫున ఆయన తన వాణి ని బిగ్గరగా వినిపించే వారు. సమాజాన్ని విడదీసి, ప్రజల మధ్య వివక్ష ను రేకెత్తించే వారి కి వ్యతిరేకంగా ఆయన ధైర్యం గా పోరాడారు. వ్యవసాయానికి, రైతులకు సంబంధించిన సమస్యలను, చిన్న వ్యాపారస్తులు ఎదుర్కొనే సవాళ్ల ను నిశితంగా గమనించి, అర్ధం చేసుకుని ఆ సవాళ్ళను పరిష్కరించడానికి కృషి చేసే వారు.

మిత్రులారా,

ఈ రోజు సోనేపట్ లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కి శంకుస్థాపన జరుగుతున్నందుకు ఛోటూ రామ్ గారి ఆత్మ ఎంతో సంతోషిస్తుంది.

ఈ కర్మాగారాన్ని 5 వందల కోట్ల రూపాయల వ్యయం తో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లో ప్రతి ఏటా ప్రయాణికుల రైళ్ల కు అవసరమైన 250 రైలు పెట్టెల మరమ్మతులను, ఆధునీకరణ ను చేపడుతారు. ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి అయితే, ప్రయాణికుల కోచ్ లను మరమ్మతు కోసం దూరం గా ఉన్న ఫ్యాక్టరీ లకు తీసుకువెళ్లవలసిన అవసరం తప్పుతుంది. దీని వల్ల ఈ ప్రాంతం లో తిరిగే రైళ్ల లో ప్రయాణికుల కోచ్ ల సంఖ్య పెరుగుతుంది. తద్వారా ఇక్కడి ప్రజలకు సౌకర్యవంతమైన కోచ్ ల సౌకర్యం లభిస్తుంది.

సోదర సోదరీమణులారా,

సోనేపట్ లోనే కాక మొత్తం హరియాణా లో పారిశ్రామికాభివృద్ధి కి ఈ ఫ్యాక్టరీ సహాయపడుతుంది. మరమ్మతు కు కావలసిన పరికరాలను చిన్న వ్యాపారస్తులు సమకూర్చడం తో, తద్వారా వారికి కూడా కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ అవసరాలు సీట్ కవర్లు, ఫ్యాన్లు దగ్గర నుండి విద్యుత్తు ఉపకరణాలు, ఫిటింగుల వరకు ఉంటాయి. ఈ విధంగా చిన్న వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.

ఒక సారి ఊహించినట్లైతే కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ అనేక మంది యువతీయువకులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. ఈ ఫ్యాక్టరీ వల్ల మరొక ఉపయోగం కూడా ఉంది; ఈ ఫ్యాక్టరీ వల్ల రైలు కోచ్ ల మరమ్మతుల రంగం లో ఇంజినీర్లు, సాంకేతికులు స్థానికంగా నైపుణ్యాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటారు. అంటే, ఇక్కడ ఇంజినీర్లు, సాంకేతికులు ఒక వైవిధ్యమైన నైపుణ్యాన్ని అభివృద్ధి పరచుకొంటారన్నమాట. భవిష్యత్తు లో ఈ ప్రాంతానికి చెందిన నిపుణులు దేశం లోని ఇతర ప్రాంతాలలో కూడా తమ నైపుణ్యం ద్వారా దేశానికి ప్రయోజనం చేకూర్చిన వారవుతారు.

మిత్రులారా,

హరియాణా లో అనేక సంవత్సరాలు పనిచేసే అవకాశం లభించడం నా అదృష్టం. నేను ఇక్కడ పార్టీ పని లో నిమగ్నమై ఉన్నప్పుడు, దాదాపు ప్రతి రోజు సర్ ఛోటూ రామ్ గారి గొప్పదనం గురించి ఎవరో ఒకరి ద్వారా వింటూ ఉండే వాడిని. ఆయన ను గురించి నేను చదివిందీ, విన్నదీ సవాళ్లకు వ్యతిరేకంగా పోరాడాలనుకునే వారికి, సమాజం శ్రేయస్సు కోసం పనిచేయాలనుకునే వారికి స్ఫూర్తి ని ఇస్తుందనడం లో సందేహం లేదు. చౌధరీ సాహెబ్ ఒకసారి రోహతక్ లో ‘‘రైతు ను పేదరికానికి చిహ్నం గానే కాక ఇంగ్లీషు సైన్యం అరాచకాలకు వ్యతిరేకంగా జెండా ను పట్టుకు నిలబడ్డ జవానుకు కూడా ప్రతీక గా కూడా నేను భావిస్తాను’’ అని చెప్పారు.

మిత్రులారా,

హరియాణా నుండి భారత సైన్యం లో తమ పౌరులను సభ్యులుగా చేర్చని గ్రామం అంటూ ఒక్కటి కూడా లేదు. దేశానికి ఈ విధమైన సేవ చేయడానికి భారత సైన్యం లో చేరాలన్న అభిప్రాయాన్ని కలుగచేసిన ఘనత పూర్తిగా దీనబంధు ఛోటూ రామ్ గారి కే దక్కుతుంది. అంత పెద్ద సంఖ్య లో రైతులు సైన్యం లో చేరడానికి ఆయన ప్రోత్సాహమే కారణం. ఒకటో ప్రపంచ యుద్ధం సమయం లో ఈ ప్రాంతానికి చెందిన చాలా మంది సైనికులు ప్రపంచ శాంతి కై పోరాటం చేశారు.

మిత్రులారా,

ఆయన తన జీవిత కాలం లో స్వతంత్ర భారతదేశాన్ని చూడలేకపోయారు. అయినా, భారతదేశ సవాళ్లను, ఆశలను, ఆకాంక్షలను, అవసరాలను ఆయన పూర్తిగా అవగాహన చేసుకున్నారు. బ్రిటిష్ వారి ‘విభజించు, పాలించు’ విధానానికి వ్యతిరేకంగా ఆయన ఎల్లప్పుడూ తన గళాన్ని ఎత్తి వినిపించే వారు. రాజకీయాల్లోని ప్రతి విషయంలో సర్ ఛోటూ రామ్ గారు ఈ ఆలోచన లతో గౌరవించబడే వారు. సర్ ఛోటూ రామ్ గారిని గురించి ఒకసారి సర్దార్ పటేల్ గారు చెప్పిన విషయం ద్వారా ఆయన గొప్పదనం గురించి, అయన వ్యక్తిత్వం గురించి అంచనా వేయవచ్చు. దానికి హరియాణా లోని ప్రతి వ్యక్తీ గర్వపడతారని నేను భావిస్తున్నాను. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారు ‘‘ఒకవేళ చౌదరి ఛోటూ రామ్ గారు ఈ రోజు సజీవంగా ఉండి ఉంటే భారతదేశ విభజన అనంతరం పంజాబ్ ను గురించి నేను ఇంతగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండేదిర కాదు; దీని ని గురించి ఆయన జాగ్రత్త తీసుకొని ఉండే వారు’’ అన్నారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారు ఈ మాదిరిగా సర్ ఛోటూ రామ్ గారి శక్తి సామర్ధ్యాల గురించి వ్యాఖ్యానించారు.

పాశ్చాత్య, ఉత్తర భారతదేశం లోని చాలా ప్రాంతాల్లో ఆయన ప్రభావం ఎంత బాగా విస్తరించిందంటే, ఇంగ్లీషు పాలకులు సైతం ఆయన పట్ల అవిధేయత ను చూపడానికి ముందు తప్పకుండా వంద సార్లు ఆలోచించవలసి వచ్చేది. చౌదరి ఛోటూ రామ్ గారు మరియు సాహుకర్ గారులను గురించి ఒక సంఘటన ను నేను కనీసం ఒక వంద సార్లు వినివుంటాను. మీ అందరికీ కూడా ఈ విషయం తెలిసే ఉండవచ్చు. అప్పు తీర్చే బదులు పట్వారీ గా పనిచేయాలని సాహుకర్ గారు ఒకసారి సలహా ఇచ్చాడు. అయితే, పట్వారీ గా పని చేయాలని తాను అడిగిన వ్యక్తి, ఒక రోజున పంజాబ్ లోని వేలాది మంది పట్వారీ ల భవిష్యత్తు ను నిర్ణయించే స్థాయి కి చేరుతారని సాహుకర్ గారు కూడా ఊహించలేదు. కేవలం ఆయన ప్రతిభ, అలుపెరుగని పోరాటం ఫలితంగా చౌధరీ సాహెబ్ పంజాబ్ కు రెవిన్యూ మంత్రిగా నియమితులయ్యారు.

సోదర సోదరీమణులారా,

మంత్రిగా పనిచేసిన తన పదవీ కాలంలో, ఆయన పంజాబ్ రాష్ట్రానికి చెందిన రైతులతో పాటు మొత్తం దేశం లోని వ్యవసాయ కూలీల సంక్షేమం కోసం కృషి చేశారు. రెవిన్యూ రంగంలో చౌధరీ సాహెబ్ విశేషమైన కృషి చేసి, పంటల మార్కెటింగ్ కోసం చట్టాలను రూపొందించారు. అవి ఇప్పటికీ మన వ్యవస్థ లో భాగంగా కొనసాగుతున్నాయి. రైతులు సులువుగా రుణాలు తీసుకోడానికి వీలుగా చట్టాలను రూపొందించారు. కనీస మద్దతు ధర కు మరియు మండీ లకు సంబంధించిన చట్టాలను రూపొందించారు.

మనం బ్రిటిష్ పాలన లో ఉన్న సమయం లోనే వీటిని సాధించామన్న విషయాన్ని మనం విస్మరించకూడదు. అనేక పరిమితులు, ఆంక్షలు ఉన్నప్పటికీ రైతుల సంక్షేమం కోసం చౌధరీ సాహెబ్ ఆలోచించడం తో పాటు ఆ దిశగా చర్యలను కూడా తీసుకొన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ల అభివృద్ధి కి కూడా ఆయన సానుకూలం గా కృషి చేశారు. ఆ సమయం లోనే ఆయన కుటీర పరిశ్రమ ల, చిన్న తరహా పరిశ్రమ ల పటిష్టత పై దృష్టి పెట్టారు. రైతులతో కలసి పని చేసే విధంగా ఆయన పారిశ్రామిక వేత్త లను ప్రోత్సహించారు. ప్రతి ఒక్కరూ వ్యవసాయ రంగానికి సహకరించాలి.

మిత్రులారా,

ఛోటూ రామ్ గారి యొక్క ఈ విధానం గురించి చక్రవర్తి రాజగోపాలాచారి గారు ఒక సారి ప్రస్తావిస్తూ – ‘‘చౌధరీ ఛోటూ రామ్ గారి కి ఉన్నత లక్ష్యాలను నిర్ణయించడం తో పాటు ఆ లక్ష్యాలను సాధించడం కూడా ఆయనకు చాలా బాగా తెలుసు’’ అని పేర్కొన్నారు.

సోదర సోదరీమణులారా,

భాక్రా నంగల్ ఆనకట్ట ను నిర్మించాలన్న ఆలోచన ను ప్రప్రథమం గా ఊహించింది చౌధరీ సాహెబ్ అన్న వాస్తవం బహుశా చాలా మందికి తెలియదు. భాక్రా ఆనకట్ట కు సంబంధించిన కాగితాలపై బిలాస్ పుర్ రాజా తో కలసి ఆయన సంతకం చేశారు. ఈ నిర్ణయం ద్వారా లభించిన ఫలితాల ప్రయోజనాలను పంజాబ్, హరియాణా, రాజస్థాన్ ల ప్రజలు అనుభవించడం ఇప్పుడు మనం స్పష్టంగా చూస్తున్నాం. ఆయనకు గల గొప్ప దూర దృష్టిని ఒక్కసారి ఆలోచించండి.

మిత్రులారా,

ఇటువంటి దూరదృష్టి తో అనేక సంస్కరణలను తీసుకువచ్చి అందరి ముందు ఉంచిన వ్యక్తి ని గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరి హక్కు. ఇటువంటి గొప్ప వ్యక్తి గురించిన సమాచారం కేవలం ఒక ప్రాంతానికే ఎందుకు పరిమితం కావాలి ? అని నేను తరచూ ఆశ్చర్యానికి లోనవుతూ ఉంటాను. చౌధరీ సాహెబ్ గొప్పదనాన్ని ఇది ప్రభావితం చేయకపోయినప్పటికీ, దేశం లోని అనేక తరాలు ఆయన జీవితం నుండి పాఠాలను నేర్చుకోలేక పోయిందని నేను భావిస్తాను.

సోదర సోదరీమణులారా,

దేశం కోసం ఎవరైతే వారి జీవితాలను అంకితం చేశారో అటువంటి వారందరి యశస్సు ను పునరుద్దరించే దిశ గా మా ప్రభుత్వం పని చేస్తోంది. గత నాలుగు సంవత్సరాలుగా గొప్ప గొప్ప వ్యక్తుల కీర్తి ని తెలియజెప్పడంతో పాటు వారు చూపిన మార్గాన్ని అనుసరించడానికి కృషి చేస్తున్నాం. రైతులకు, చిన్న పారిశ్రామికవేత్తలకు అందుబాటు లోకి బ్యాంకులను తీసుకువచ్చాం. తద్వారా వారు వడ్డీ వ్యాపారస్తులపై ఆధారపడనక్కర లేదు. జన్ ధన్ యోజన లో భాగంగా హరియాణా లో దాదాపు 66 లక్షల 50 వేల మంది సోదర సోదరీమణులు ఖాతాలు తెరిచారు. సహకార బ్యాంకుల ద్వారా రుణాలు జారీ చేయడం ప్రభుత్వానికి సులభతరమైంది. ఇటీవల ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ప్రారంభమైంది. దీని వల్ల పోస్ట్ మన్ సహాయం తో మీ ఇంటి ముందే బ్యాంకు సేవలు లభిస్తాయి.

మిత్రులారా,

రైతులు, కూలీల సంక్షేమం గురించి చౌధరీ సాహెబ్ గట్టిగా ఆలోచించినట్లే మా ప్రభుతం కూడా విత్తనం స్థాయి నుండి విపణి సదుపాయం వరకు ఒక పటిష్టమైన విధానాన్ని రూపొందించాలని గట్టి గా కృషి చేస్తోంది. రైతులు తమ పంట లకు సరసమైన ధర ను పొందేలా మేము నిర్విరామంగా పని చేస్తున్నాం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుండి రైతులకు రక్షణ ను కల్పిస్తున్నాం. వారు అధునాతన విత్తనాలు, సమృద్ధి గా యూరియా, మంచి సారవంతమైన నేల తో పాటు సరైన సాగునీటి సదుపాయాన్ని కూడా పొందుతున్నారు. హరియాణా ప్రయోజనం పొందుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సుమారు 50 లక్షల మంది రైతులు భూమి ఆరోగ్య కార్డు లను అందుకున్నారు. దాదాపు 6 లక్షల 50 వేల మంది రైతులు ప్రస్తుతం పంటల బీమా సౌకర్యాన్ని కలిగివున్నారు. వారు ఇప్పటికే 350 కోట్ల రూపాయలకు పైగా బీమా మొత్తం అందుకున్నారు. 30-40 ఏళ్లు గా బీడు పడ్డ భూములకు సాగునీరు చేరుకుంది. లఖ్వార్ ఆనకట్ట కోసం ఆరు రాష్ట్రాల మధ్య ఒక చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. దీనివల్ల హరియాణా కు చాలా ప్రయోజనం చేకూరింది. రైతు లకు వారి పంట లకు గిట్టుబాటు ధర ను చెల్లించాలని సుమారు 8-10 దశాబ్దాల క్రితం చౌధరీ సాహెబ్ ఒక వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ చట్టాన్ని రూపొందించారు. మా ప్రభుత్వం కూడా ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (ఎఎఎస్ హెచ్ఎ)ను ప్రారంభించింది. ఈ పథకం లో భాగంగా రైతు కు ఒకవేళ తన ఉత్పత్తులకు మార్కెట్ లో కనీస మద్దతు ధర కంటే తక్కువగా లభిస్తే ఆ వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతు కు చెల్లిస్తుంది. అంతేకాదు, ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50 శాతం ఎక్కువ గా ధర లభించే విధం గా మేం ఇచ్చిన హామీ ని నిలబెట్టుకుంటాం.

మిత్రులారా,

వరి, గోధుమ, చెరకుల తో సహా 21 ముఖ్యమైన పంట లకు ప్రభుత్వం కనీస మద్దతు ధర లను పెంచింది. వరి కనీస మద్దతు ధర ను క్వింటాల్ కు 200 రూపాయల చొప్పున పెంచింది. ప్రస్తుతం దీని ధర క్వింటాల్ కు 1550 రూపాయల నుండి 1750 రూపాయలకు పెరిగింది. అదేవిధంగా కనీస మద్దతు ధరలు మొక్కజొన్న ధర క్వింటాలు కు 275 రూపాయల మేరకు, పొద్దుతిరుగుడు పువ్వు ధర 1300 రూపాయల మేరకు, సజ్జల ధర 500 రూపాయల మేరకు పెరిగాయి.

సోదర సోదరీమణులారా,

దీనికోసం రైతులు ఎంత కాలంగా డిమాండ్ చేస్తున్నారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఇప్పడు మా ప్రభుత్వం ద్వారా ఆ డిమాండ్ నెరవేరింది.

మిత్రులారా,

ఒక వైపు హరియాణా కు చెందిన గ్రామాలు, రైతుల ఆదాయం పెరిగే విధంగా కృషి చేస్తూనే మరో వైపు ఆ ఆదాయం వైద్య ఖర్చులకు మళ్లకుండా కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాం.

మీ రాష్ట్రం అభిమాన పుత్రిక గా రూపొందిన ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ యొక్క మొదటి లబ్ధిదారులు గా హరియాణా రాష్ట్ర ప్రజలను నేను అభినందిస్తున్నాను. ఈ పథకం ప్రారంభమైన రెండు వారాల లోపు దాదాపు 50 వేల మంది కంటే ఎక్కువ మంది పేద సోదర సోదరీమణులు వైద్యం పూర్తి చేకోవడం కానీ లేదా చికిత్స పొందుతూ కానీ ఉన్నారని తెలుసుకోవడం చాలా సంతృప్తి ని కలిగించింది.

బహిరంగ మల మూత్రాదుల విసర్జన లేని రాష్ట్రం గా హరియాణా తనకు తానుగా ప్రకటించుకోవడం నాకు చాలా ఆనందం గా ఉంది. స్వచ్చత స్థానాలలో మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం ప్రథమ స్థానం లో నిలచినందుకు నేను రోహతక్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

హరియాణా లో విజయవంతమైన ‘‘బేటీ బచావో, బేటీ పఢావో’ ప్రచారాన్ని చూస్తే చౌధరీ సాహెబ్ ఆత్మ ఎంతో సంతోషించేది. ఆయన కేవలం సంస్కరణ లను రూపొందించడమే కాక వాటి ని ప్రజల మనస్సు లకు హత్తుకునేలా తన ఇంటి నుండి ప్రచారాన్ని ప్రారంభించే వారు. మన సమాజం లో కుమార్తె ల పట్ల మనకు ఉండే వైఖరి ని ఆయన ఎల్లప్పుడూ వ్యతిరేకించే వారు. అందువల్లే, సమాజం నుండి ఎంత ఒత్తిడి ఎదురైనా ఆయన తన ఇద్దరు కుమార్తె లు ఎల్లప్పుడూ స్థిరంగా ఉండే విధంగా చూశారు.

సోదర సోదరీమణులారా,

ఈ రోజు, మనం చూసినట్లయితే, హరియాణా లోని చిన్న గ్రామాల నుండి వచ్చిన కుమార్తెలు అంతర్జాతీయ వేదిక లపై దేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నారు. హరియాణా నుండి యువతీ యువకులు క్రీడా రంగంలో భారతదేశం సత్తా ను చాటి చెప్తున్నారు. దేశం లోని నిరుపేద కుటుంబాలకు చెందిన యువతీ యువకులు ముందుకు దూసుకుపోతుంటే చౌధరీ సాహెబ్ కల లను సాకారం చేయడానికి మనం వేగం గా పురోగమిస్తున్నామని మనం గుర్తించాలి.

మిత్రులారా,

దేశాభివృద్ధి కి హరియాణా ప్రేరణ గా నిలచింది. ఇదే ధోరణి క్రమం గా పెరిగే విధం గా మనందరం కృషి చేయాలి. చౌధరీ ఛోటూ రామ్ జీ నుండి మనందరికీ లభించిన సందేశం ఇదే. కేవలం సామాజిక సామరస్యం, జాతీయ ఐక్యత ల కోసం జీవితాన్ని అంకితం చేసిన ఒక జాతీయ వ్యక్తి కి మనం చెల్లించే నిజమైన ఆరాధన ఆయన కలలు గన్న భారతదేశాన్ని, ఒక న్యూ ఇండియా ను సృష్టించడమే.

మరి కొన్ని రోజుల్లో మనం హరియాణా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఈ సందర్భం గా హరియాణా ప్రజలకు ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పెద్ద సంఖ్య లో ఇక్కడకు వచ్చి సర్ ఛోటూ రామ్ గారి కి నివాళులను అర్పించిన మీకు అందరికీ నేను నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను.

అనేక ధాన్యవాదాలు.

 

***