Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

14వ భార‌త‌దేశం- ఇయు శిఖ‌రాగ్ర స‌ద‌స్సు (అక్టోబ‌ర్ 06, 2017) సంద‌ర్భంగా భార‌త్, ఇయు ల సంయుక్త ప్ర‌క‌ట‌న‌


1. భార‌త‌దేశం, యూరోపియ‌న్ యూనియ‌న్ (ఇయు) ల న‌డుమ 14వ వార్షిక శిఖ‌రాగ్ర స‌మావేశం 2017 అక్టోబ‌ర్ 6వ తేదీన న్యూ ఢిల్లీలో జ‌రిగింది. భార‌త రిప‌బ్లిక్ త‌ర‌ఫున‌ ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ ప్రాతినిధ్యం వ‌హించారు. యూరోపియ‌న్ త‌ర‌ఫున యూరోపియ‌న్ కౌన్సిల్ అధ్య‌క్షుడు శ్రీ డోనాల్డ్ ట‌స్క్, యూరోపియ‌న్ క‌మిష‌న్ అధ్య‌క్షుడు జీన్ క్లావుడ్ జంక‌ర్ ప్రాతినిధ్యం వ‌హించారు.

2. భార‌త-ఇయు వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం కింద విస్తృత భాగ‌స్వామ్యాన్ని నాయ‌కులు స‌మీక్షించారు. భార‌త, ఇయు స‌హ‌జ‌సిద్ధ‌మైన భాగ‌స్వాముల‌ని గుర్తిస్తూ ప్ర‌జాస్వామ్యం, స్వేచ్ఛ‌, దేశీయ చ‌ట్టాలు, మాన‌వ హ‌క్కుల‌పై గౌర‌వం, దేశాల ప్రాదేశిక స‌మ‌గ్ర‌త ల వంటి ఉమ్మ‌డి విలువ‌లు, సిద్ధాంతాల ఆధారంగా భార‌త‌-ఇయు మ‌ధ్య భాగ‌స్వామ్యాన్ని మ‌రింత గాఢం, ప‌టిష్ఠం చేసుకోవాల‌న్న క‌ట్టుబాటును ప్ర‌క‌టించారు.

3. భార‌త‌-ఇయు 13వ శిఖ‌రాగ్రం సంద‌ర్భంగా ఆమోదించిన ద్వైపాక్షిక స‌హ‌కార మార్గసూచీ 2020 భార‌త‌-ఇయు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక అమ‌లు దిశ‌గా సాగుతున్న పురోగ‌తి ప‌ట్ల వారు సంతృప్తిని వ్యక్తంచేశారు.

4. భార‌త‌-ఇయు వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం ప‌ర‌స్ప‌ర లాభ‌దాయ‌కంగాను, స‌త్ఫలితాలను అందించేదిగాను ఉండేలా తీర్చిదిద్దేందుకు కృషి చేయాల‌ని నాయ‌కులు క‌ట్టుబాటును ప్ర‌క‌టించారు. వాణిజ్య స‌హ‌కారం పెంచుకోవ‌డం; రెండు వైపులా పెట్టుబ‌డుల ప్ర‌వాహం పెంచ‌డం; సంప్ర‌దింపుల విస్త‌ర‌ణ‌; వాతావ‌ర‌ణ మార్పులు, వ‌ల‌స‌లు, శ‌ర‌ణార్థుల సంక్షోభం స‌హా ప్ర‌పంచ‌ స్థాయి, ప్రాంతీయ అంశాల‌పై సంప్ర‌దింపుల నిర్వ‌హ‌ణ వంటి భిన్నకోణాల్లో స‌హ‌కారాన్ని మ‌రింత లోతుగా విస్త‌రించుకోవాల‌ని, ఈ రంగాల‌న్నింటిలోనూ ద్వైపాక్షిక‌, బ‌హుముఖీన స‌హ‌కారాన్ని మ‌రింత ప‌టిష్ఠం చేసుకోవాల‌ని నిర్ణ‌యించారు.

5. వాతావ‌ర‌ణ కార్యాచ‌ర‌ణ‌, పున‌రుత్పాద‌క ఇంధ‌నం స‌హా కీల‌క రంగాల్లో భార‌త్ లోని యూరోపియ‌న్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ భాగ‌స్వామ్యాన్ని నాయ‌కులు ప్ర‌శంసించారు.

6. భార‌త‌-ఇయు స‌హ‌కారాన్ని, ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న‌ను విస్త‌రించుకునేందుకు నిరంత‌రం అత్యున్న‌త స్థాయి సంప్ర‌దింపులు చేప‌ట్టాల్సిన ప్రాధాన్య‌ాన్ని నాయ‌కులు గుర్తించారు. 2017 ఏప్రిల్ 21వ తేదీన న్యూఢిల్లీలో విదేశీ విధానం, భ‌ద్ర‌తా స‌హ‌కారం-భ‌ద్ర‌త‌లో భాగ‌స్వాములు అనే అంశంపై జ‌రిగిన భార‌త‌-ఇయు విదేశాంగ మంత్రుల స‌మావేశం ఫ‌ల‌వంత‌మైన‌ట్టు ప్ర‌క‌టించారు.

7. ఒక‌రితో మరొక‌రు అనుసంధాన‌మైన బ‌హుళ ధ్రువ ప్ర‌పంచంలో స‌మ్మిళిత వృద్ధి, సుస్థిర అభివృద్ధిని ప్రోత్స‌హించేందుకు; అంత‌ర్జాతీయ నిబంధ‌న‌లు, ప్ర‌పంచ శాంతి, సుస్థిర‌త‌లకు అనుగుణంగా నిబంధ‌న‌ల ఆధారిత అంత‌ర్జాతీయ వ్య‌వ‌స్థ‌ను అభివృద్ధి చేయ‌డం ల‌క్ష్యంగా దానికి మ‌ద్ద‌తు ఇచ్చే అంద‌రితో క‌లిసి ప్ర‌పంచంలోని అతి పెద్ద ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లైన భార‌త్, ఇయు లు కృషి చేయాల‌ని వారు అంగీకారానికి వ‌చ్చారు. స‌మ‌కాలీన ప్ర‌పంచ అంశాల‌న్నింటి పైన ప్ర‌పంచ‌దేశాల‌న్నింటిలోనూ ఏకాభిప్రాయం ఏర్ప‌డ‌డాన్ని ఆహ్వానిస్తూ ఈ దిశ‌గా అన్ని బ‌హుముఖీన వేదిక‌ల పైన భార‌త‌-ఇయు క‌లిసి కృషి చేయాల‌ని అంగీకారానికి వ‌చ్చారు. అంత‌ర్జాతీయ శాంతి, సుస్థిర‌త‌; బ‌హిరంగ‌, స‌మ్మిళిత అంత‌ర్జాతీయ వ్య‌వ‌స్థ అభివృద్ధి చేయ‌డంలో త‌మ‌కు గ‌ల ఉమ్మ‌డి బాధ్య‌త‌ను వారు గుర్తించారు.

8. సంఘ‌ర్ష‌ణ‌ల‌ను నిలువ‌రించి భ‌ద్ర‌త‌, సుసంప‌న్న‌త‌ల‌ను ప్రాచుర్యంలోకి తేవ‌డంలోను; ఆయుధ వ్యాప్తిని అరిక‌ట్ట‌డంలోను, నిరాయుధీక‌ర‌ణ‌లోను; ఉగ్ర‌వాదాన్ని స‌మ‌ర్థ‌వంతంగా నిలువ‌రించేందుకు అంత‌ర్జాతీయ స‌మాజాన్ని ఐక్యం చేయ‌డంలోను; ప‌్ర‌పంచంలో అంద‌రి సంప‌ద అయిన స‌ముద్ర మార్గాలు, సైబ‌ర్ ప్ర‌పంచం, అంత‌రిక్ష విభాగాల్లో భ‌ద్ర‌త‌ను ప‌రిర‌క్షించ‌డంలోను నాయ‌కులు త‌మ క‌ట్టుబాటును ప్ర‌క‌టించారు. 2017 ఆగ‌స్టు 25న జ‌రిగిన రాజ‌కీయ భ‌ద్ర‌తా రంగాల్లో స‌హ‌కారం విస్త‌రించుకోవ‌డానికి వేదిక‌గా ఉన్న భార‌త‌-ఇయు విదేశాంగ విధానం, భ‌ద్ర‌తా సంప్ర‌దింపుల వ్య‌వ‌స్థ 5వ స‌మావేశం నిర్ణ‌యాల‌ను నాయ‌కులు ఆహ్వానించారు.

9. బ‌హిరంగ‌, స్వేచ్ఛాయుత, భ‌ద్ర‌మైన‌, సుస్థిర‌మైన‌, శాంతియుత‌మైన‌, అంద‌రికీ అందుబాటులో ఉండే సైబ‌ర్ వ్య‌వ‌స్థ అభివృద్ధికి; అందుకు స‌హాయ‌కారిగా ఉండే ఆర్థిక వృద్ధి, న‌వ్య‌త‌ల‌కు నాయ‌కులు త‌మ క‌ట్టుబాటును పున‌రుద్ఘాటించారు. త‌మ సైబ‌ర్ వ్య‌వ‌స్థ అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌కు అనుగుణంగా ఉండేలా చూడాల‌న్న క‌ట్టుబాటును పున‌రుద్ఘాటిస్తూ సైబ‌ర్ వ్య‌వ‌స్థ‌కు అంత‌ర్జాతీయ చ‌ట్టాలు వ‌ర్తింప‌చేయ‌డం, బాధ్య‌తాయుతంగా ప్ర‌వ‌ర్తించేలా దేశాల‌కు నిబంధ‌న‌లు నిర్దేశించ‌డానికి కృషి చేయాల‌ని కూడా నిర్ణ‌యించారు. న‌వంబ‌ర్ 23వ,24వ తేదీలలో న్యూ ఢిల్లీ లో నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన 5వ ప్ర‌పంచ సైబ‌ర్ స్పేస్ స‌ద‌స్సును నాయ‌కులు ఆహ్వానించారు. ఉభ‌యుల మ‌ధ్య‌ ద్వైపాక్షిక సైబ‌ర్ చ‌ర్చ‌లు ప్ర‌స్తుత‌, భ‌విష్య‌త్ స‌హ‌కారానికి బ‌ల‌మైన పునాదిగా నిలుస్తాయ‌న్న విశ్వాసం వారు ప్ర‌క‌టించారు. భార‌త-ఇయుల మ‌ధ్య ఆగ‌స్టు 29వ తేదీన జ‌రిగిన ద్వైపాక్షిక చ‌ర్చ‌ల‌ను వారు ఆహ్వానించారు. వ‌చ్చే ఏడాది బ్ర‌సెల్స్ లో త‌దుప‌రి ఇండియా-ఇయు చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయి.

10. ప్ర‌పంచం లోని ప‌లు ప్రాంతాల్లో ఇటీవ‌ల జ‌రిగిన ఉగ్ర‌వాద దాడుల‌ను నాయ‌కులు బ‌ల‌మైన స్వ‌రంతో ఖండించారు. ఉగ్ర‌వాదం, తీవ్ర‌వాదం ప్ర‌పంచానికి విసురుతున్న స‌వాలుపై ఉమ్మ‌డి ఆందోళ‌న ప్ర‌క‌టించారు. ఉగ్ర‌వాదం ఏ తీరులో ఉన్నాపోరాడేందుకు క‌ట్టుబాటు ప్ర‌క‌టిస్తూ వారు ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న జారీ చేశారు. క్ర‌మం త‌ప్ప‌కుండా నిర్వ‌హించుకునే ద్వైపాక్షిక చ‌ర్చ‌లు, అంత‌ర్జాతీయ వేదిక‌ల ద్వారా స‌హ‌కారాన్ని పెంపొందించుకోవాల‌ని తీర్మానించారు. ఉగ్ర‌వాద వ్య‌తిరేక పోరాటంపై భార‌త‌-ఇయు మ‌ధ్య ఈ ఏడాది ఆగ‌స్టు 30వ తేదీన జ‌రిగిన చ‌ర్చ‌ల‌ను వారు ఆహ్వానిస్తూ ఆన్ లైన్ లో ఎదుర‌వుతున్న ఉగ్ర‌వాద ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు స‌మాచారం పంపిణీ చేసుకోవాల‌ని, ఉత్త‌మ ప్ర‌మాణాలు పంచుకోవాల‌ని, శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు, వ‌ర్క్ షాప్ లు నిర్వ‌హించ‌డం ద్వారా సామ‌ర్థ్యాల నిర్మాణం కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. ఐక్య‌ రాజ్య‌ స‌మితి, ఫైనాన్షియ‌ల్ యాక్ష‌న్ టాస్క్ ఫోర్స్ ద్వారా స‌హ‌కారం పెంచుకోవాల‌ని కూడా నిర్ణ‌యించారు.

11. న్యూ ఢిల్లీ లో 2017 జూలై 18వ తేదీన జ‌రిగిన ఇండియా-ఇయు ఆయుధ వ్యాప్తి నిరోధం, నిరాయుధీక‌ర‌ణ చ‌ర్చ‌లలో ప్ర‌ముఖంగా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన అంశాల ఆధారంగా ప్ర‌పంచ‌ దేశాల్లో ఆయుధ వ్యాప్తి నిరోధాన్ని ప‌టిష్ఠం చేసుకునేలా చ‌ర్య‌లు బ‌లోపేతం చేయాల‌న్న క‌ట్టుబాటు ప్ర‌క‌టించారు. క్షిప‌ణి సాంకేతిక ప‌రిజ్ఞాన యంత్రాంగంలో (ఎంటిసిఆర్‌) భార‌త్ చేరిక ప‌ట్ల ఇయు అభినంద‌న‌లు తెలిపింది. ఖండాంత‌ర క్షిప‌ణుల వ్యాప్తి నిరోధానికి రూపొందించిన హేగ్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళికి ఇండియా అందించిన వాటా ప‌ట్ల ఇయు అభినంద‌న‌లు తెలిపింది. అలాగే అణు స‌ర‌ఫ‌రాదారుల బృందం (ఎన్ ఎస్ జి), వాసెనార్ అంగీకారం, ఆస్ట్రేలియా గ్రూపు ల‌తో భార‌త్ సంప్ర‌దింపుల‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తూ దీని వ‌ల్ల ప్ర‌పంచ ఆయుధ వ్యాప్తి నిరోధ‌క చ‌ర్య‌లు ప‌టిష్ఠం అవుతాయ‌ని పేర్కొంది.

12. హిందూ మ‌హాస‌ముద్రంలోను, వెలుప‌ల కూడా సాగ‌ర జ‌లాల భ‌ద్ర‌త‌ను ప‌టిష్ఠం చేసుకునేందుకు భార‌త‌-ఇయు క‌ట్టుబాటు ప్రక‌టించాయి. ఉభ‌యుల మ‌ధ్య నౌకాద‌ళ స‌హ‌కారానికి ఇటీవ‌ల సోమాలియా తీరంలో జ‌రిగిన ఇయు నౌకాద‌ళం, భార‌త నౌకాద‌ళం ఉమ్మ‌డి విన్యాసాలు ద‌ర్ప‌ణంగా నిలుస్తాయ‌ని ఉభ‌య వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. స‌మీప భ‌విష్య‌త్తులోనే ప్ర‌పంచ ఆరోగ్య కార్య‌క్ర‌మానికి ఆహార‌ధాన్యాలు ర‌వాణా చేసే నౌక‌ల‌కు ఎస్కార్టింగ్ లో కూడా భార‌త్ భాగ‌స్వామి అయ్యే త‌రుణం కోసం ఎదురు చూస్తున్న‌ట్టు ఇయు పేర్కొంది. స్వేచ్ఛాయుత నౌకార‌వాణా, అంత‌ర్జాతీయ చ‌ట్టాల్లోని నియ‌మావ‌ళికి ప్ర‌త్యేకించి 1982 సంవ‌త్స‌ర‌పు ఐక్య‌ రాజ్య‌ స‌మితి సాగ‌ర‌ జ‌లాల చ‌ట్టాల స‌ద‌స్సు నిర్ణ‌యాల‌కు అనుగుణంగా వివాదాల శాంతియుత ప‌రిష్కారం ఆవ‌శ్య‌క‌త‌ను వారు ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. సాగ‌ర జ‌లాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను అభివృద్ధి చేసే క్ర‌మంలో సాగ‌ర జ‌లాల‌ భ‌ద్ర‌త‌, సుస్థిర‌త‌, అనుసంధాన‌త‌, సుస్థిర అభివృద్ధి ప్రాధాన్య‌ానికి పెద్ద పీట వేయాల‌ని ఉభ‌య నాయ‌కులు నిర్ణ‌యించారు.

13. అర్థ్ అబ్జ‌ర్వేష‌న్ తో పాటు అంత‌రిక్ష స‌హ‌కారం విస్త‌రించుకోవాల‌ని ఉభ‌య వ‌ర్గాలు అంగీక‌రించాయి.

14. స‌మాజ జీవ‌నంలోని అన్ని రంగాల్లోనూ మ‌హిళా సాధికార‌త‌, లింగ స‌మాన‌త్వంతో స‌హా మాన‌వ హ‌క్కుల స‌హ‌కారానికి తాము ఇస్తున్న ప్రాధాన్య‌ాన్ని ఇండియా, ఇయు లు పున‌రుద్ఘాటించాయి. న్యూ ఢిల్లీ లో జ‌రుగ‌నున్న త‌దుప‌రి విడ‌త చ‌ర్చ‌లు, ఆ త‌రువాత అంత‌ర్జాతీయ వేదిక‌లు ప్ర‌త్యేకించి ఐక్య‌ రాజ్య‌ స‌మితి సాధారణ స‌భ‌, మాన‌వ హ‌క్కుల‌ మండ‌లి స‌మావేశాలలో జ‌రిగే సంప్ర‌దింపుల కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ట్టు వారు ప్ర‌క‌టించారు.

15. ఉభ‌య పక్షాలు అఫ్గానిస్తాన్ ప్ర‌జ‌లు, అఫ్గాన్ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. జాతీయ శాంతి, రాజీ ప్రక్రియ‌లో అఫ్గానిస్తాన్ నాయ‌క‌త్వంలోని అఫ్గాన్ యాజ‌మాన్యంలోని శాంతి సేన‌లకే మ‌ద్ద‌తు ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించాయి. అన్ని ర‌కాల ఉగ్ర‌వాద‌, తీవ్ర‌వాద చ‌ర్య‌ల‌ను ఉభ‌య వ‌ర్గాలు తీవ్రంగా ఖండిస్తూ వాటిని అంత‌ర్జాతీయ శాంతి, సుస్థిర‌త‌ల‌కు మౌలిక ముప్పుగా ప్ర‌క‌టించాయి. అఫ్గానిస్తాన్ లో శాంతి, భ‌ద్ర‌త‌, సుసంప‌న్న‌త నెల‌కొన‌డానికి ప్రాంతీయ శ‌క్తుల‌తో పాటు కీల‌క అంత‌ర్జాతీయ భాగ‌స్వాములంద‌రూ ఆ దేశంలో రాజ‌కీయ ప్ర‌క్రియ‌ను, దాని ఫ‌లితాన్ని గౌర‌వించి, మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని సూచించాయి. అఫ్గానిస్తాన్ లో సామాజిక‌, ఆర్థిక మౌలిక వ‌స‌తుల నిర్మాణం, ప్ర‌భుత్వ సంస్థ‌ల ఏర్పాటు, మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి, సామ‌ర్థ్యాల నిర్మాణంలో కీల‌క భాగ‌స్వామిగా ఉంటూ ఆ దేశానికి భార‌త్ అందిస్తున్న స‌హాయాన్ని ఇయు అభినందించింది. స్వ‌యంస‌మృద్ధ‌, సుసంప‌న్న దేశంగా ఆవిర్భ‌వించాల‌న్న ఆకాంక్ష‌తో కృషి చేస్తున్న అఫ్గానిస్తాన్ లో శాంతి, భ‌ద్ర‌త‌, స్థిర‌త్వం నెల‌కొనేందుకు మ‌ద్ద‌తు ఇవ్వాల‌న్న త‌మ క‌ట్టుబాటును ఉభ‌య వ‌ర్గాలు పున‌రుద్ఘాటించాయి.

16. మ‌య‌న్మార్ లోని రాఖిన్ రాష్ర్టంలో ఇటీవ‌ల చెల‌రేగిన దౌర్జ‌న్య‌కాండ ప‌ట్ల భార‌త‌, ఇయు లు తీవ్ర ఆందోళ‌నను వ్యక్తం చేశాయి. ఈ దౌర్జ‌న్య‌కాండ‌కు భ‌య‌ప‌డి భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు ఆ ప్రాంతాన్ని వీడిపోయి స‌మీపంలోని బాంగ్లాదేశ్ లో ఆశ్ర‌యం పొందేందుకు త‌ర‌లిపోయారు. ఆరాక‌న్ రోహింగ్యా సాల్వేష‌న్ ఆర్మీ (ఎఆర్ఎస్ఎ) నిర్వ‌హించిన ఈ దౌర్జ‌న్య‌పూరిత వ‌రుస దాడుల్లో అటు భ‌ద్ర‌తా ద‌ళాల్లోను,ఇటు పౌరుల్లోను కూడా భారీ ప్రాణ‌న‌ష్టం జ‌రిగింది. ఈ దౌర్జ‌న్య‌కాండ‌ను త్వ‌రితంగా అంతం చేసి రాఖిన్ రాష్ర్టంలో సాధార‌ణ ప‌రిస్థితులు పున‌రుద్ధ‌రించాల్సిన అవ‌స‌రాన్ని ఉభ‌య వ‌ర్గాలు ప్రాధాన్యంగా గుర్తించాయి. శ్రీ కోఫి అన్న‌న్ నాయ‌క‌త్వంలోని రాఖిన్ స‌ల‌హా క‌మిష‌న్ సిఫార‌సుల‌ను త్వ‌రితంగా అమ‌లుప‌రిచి బాంగ్లాదేశ్ లో త‌ల దాచుకుంటున్న వారంద‌రినీ ఉత్త‌ర రాఖిన్ రాష్ర్టానికి తిరిగి వ‌చ్చేలా చూడాల‌ని మ‌య‌న్మార్ అధికారుల‌కు వారు సూచించారు. మ‌య‌న్మార్ ప్ర‌జ‌ల‌కు మాన‌వ‌తాపూర్వకంగా బంగ్లాదేశ్ అందించిన స‌హాయాన్ని ఉభ‌య వ‌ర్గాలు గుర్తించాయి.

17. ఇరాన్ అణు స‌మ‌స్య విష‌యంలో ఉమ్మ‌డి స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక (జెసిపిఒఎ) పూర్తిగా అమ‌లుజ‌ర‌గ‌డానికి ఉభ‌య వ‌ర్గాలు మ‌ద్ద‌తును పున‌రుద్ఘాటించాయి. అణు ఇంధ‌నం విష‌యంలో జెసిపిఒఎ కు పూర్తిగా క‌ట్టుబ‌డి ఉన్న‌దంటూ అంత‌ర్జాతీయ అణు ఇంధ‌న సంస్థ (ఐఎఇఎ) చేసిన ధ్రువీక‌ర‌ణ‌ను తాము గుర్తిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాయి. ఐక్య‌ రాజ్య‌ స‌మితి భ‌ద్ర‌త మండ‌లి ఆమోదించిన ఈ డీల్ ను పూర్తిగాను, స‌మ‌ర్థ‌వంతంగాను అమ‌లుప‌ర‌చాల‌ని, అంత‌ర్జాతీయ శాంతి, సుస్థిర‌త‌, భ‌ద్ర‌తకు, ఆయుధ వ్యాప్తి నిరోధానికి ఇదే కీల‌క‌మ‌ని ఉభ‌య దేశాలు ప్ర‌క‌టించాయి.

18. డిపిఆర్ కె 2017 సెప్టెంబ‌ర్ 3వ తేదీన నిర్వ‌హించిన అణుప‌రీక్ష‌ల‌ను ఉభ‌య వ‌ర్గాలు ఖండించాయి. అంత‌ర్జాతీయ క‌ట్టుబాట్ల‌కు డిపిఆర్ కె మ‌రో ప్ర‌త్య‌క్ష ఉల్లంఘ‌న‌గా దీన్ని అభివ‌ర్ణిస్తూ ఇది ఏ మాత్రం ఆమోద‌నీయం కాద‌ని ప్ర‌క‌టించాయి. అణు, ఖండాంత‌ర క్షిప‌ణి కార్య‌క్ర‌మాల‌ను డిపిఆర్ కె నిరంత‌రాయంగా చేప‌డుతూ ఉండ‌డం అంత‌ర్జాతీయ శాంతి, భ‌ద్ర‌త‌ల‌కు పెను ముప్పుగా ప్ర‌క‌టిస్తూ కొరియా ద్వీప‌క‌ల్పం అంత‌టిలోనూ ఐక్య‌ రాజ్య‌ స‌మితి భ‌ద్ర‌త మండ‌లి, ఆరు పార్టీల చ‌ర్చావేదిక ఆమోదించిన మేర‌కు సంపూర్ణమైన, ఎలాంటి అంత‌ర్జాతీయ త‌నిఖీకీ అభ్యంత‌రాలు ఉండనటువంటి అణు నిరాయుధీక‌ర‌ణ జ‌ర‌గాల‌ని పిలుపు ఇచ్చాయి. డిపిఆర్ కె అణు, క్షిప‌ణి కార్య‌క్ర‌మాల‌కు మ‌ద్ద‌తు ఇచ్చే వారంద‌రూ దీనికి బాధ్య‌త వ‌హించాల‌ని ప్ర‌క‌టించాయి. ఈ స‌వాలును దీటుగా ఎదుర్కొన‌డంలోను, ఐక్య‌ రాజ్య స‌మితి ఆంక్ష‌ల‌ను అంత‌ర్జాతీయ స‌మాజం పూర్తిగా అమ‌లుప‌ర‌చ‌డంలోను, చ‌ర్చ‌ల ద్వారా స‌మ‌స్య‌కు శాంతియుత‌, స‌మ‌గ్ర ప‌రిష్కారం సాధించ‌డంలోను అంత‌ర్జాతీయ స‌మాజం ఐక్యంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఉభ‌య వ‌ర్గాలు నొక్కి చెప్పాయి.

19. సిరియా సంక్షోభానికి రాజ‌కీయ ప‌రిష్కారం సాధించ‌డంలో సిరియా అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల‌ను ప్రోత్స‌హించాల‌ని, ఐక్య‌ రాజ్య‌ స‌మితి నేతృత్వంలోని జెనీవా ప్ర‌క్రియ‌కు ప్రాధాన్యం కొన‌సాగాల‌ని ఉభ‌య దేశాలు త‌మ అభిప్రాయాన్న పున‌రుద్ఘాటించాయి. సిరియాలో పౌర‌, ప్రాదేశిక స‌మ‌గ్ర‌త‌ల కాపాడ‌డం మౌలిక‌మ‌ని ప్ర‌క‌టిస్తూ ఈ సంక్షోభానికి కార‌కులైన వారు, వారి మ‌ద్ద‌తుదారులు కూడా తాము ప్ర‌క‌టించిన క‌ట్టుబాట్ల‌ను గౌర‌వించాల‌ని పిలుపు ఇచ్చాయి. సిరియాలో డాయిష్‌, ఇత‌ర ఐక్య‌ రాజ్య‌ స‌మితి ప్ర‌క‌టిత ఉగ్ర‌వాద మూక‌లు ప‌రాజ‌యం సాధించాలన్నా, సుస్థిర‌త నెల‌కొనాల‌న్నా 2012 జెనీవా ప్ర‌క‌ట‌న, ఐక్య‌ రాజ్య‌ స‌మితి భ‌ద్ర‌త మండ‌లి తీర్మానం 2254 ప‌రిధిలో విశ్వ‌స‌నీయ రాజ‌కీయ ప‌రిష్కారం ఒక్క‌టే మార్గ‌మ‌ని ఇండియా, ఇయు లు పున‌రుద్ఘాటించాయి. 2018 వేస‌విలో సిరియా స‌మ‌స్య‌పై బ్ర‌సెల్స్ లో జ‌రుగ‌నున్న రెండ‌వ స‌మావేశం అంత‌ర్జాతీయ క‌ట్టుబాటుకు ద‌ర్ప‌ణం ప‌డుతుంద‌న్న భావం ఉభ‌య వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి.

20. మ‌ధ్య‌ ప్రాచ్య శాంతి ప్ర‌క్రియను గురించి ప్ర‌స్తావిస్తూ రెండు దేశాల ప్ర‌యోజ‌నాలు ల‌క్ష్యంగా ఐక్య‌ రాజ్య‌ స‌మితి తీర్మానాలు, మాడ్రిడ్ సిద్ధాంతాలు, అర‌బ్బు శాంతి ప్ర‌క్రియ ప‌రిధిలో శాశ్వ‌త‌మైన శాంతి, సుస్థిర ప‌రిష్కారానికి నిర్మాణాత్మ‌క చ‌ర్చ‌ల‌కు రావాల‌ని ఇజ్రాయెల్‌-పాల‌స్తీనా ప్ర‌య‌త్నించాల‌ని పిలుపు ఇచ్చాయి.

21. లిబియా రాజ‌కీయ సంక్షోభానికి కూడా లిబియా నేతృత్వంలో, లిబియా నిర్మిత రాజ‌కీయ ప‌రిష్కారానికి ఉభ‌య వ‌ర్గాలు పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. అంత‌ర్జాతీయ స‌మాజం ప్ర‌యోజ‌నాలను దృష్టిలో ఉంచుకొని శాంతి, సుస్థిర‌త‌ల నిర్మాణం ల‌క్ష్యంగా స‌మ్మిళిత ప్ర‌భుత్వం ఏర్పాటు కావాల‌ని పిలుపు ఇచ్చాయి.

22. నేటి ప్ర‌పంచీక‌ర‌ణ యుగంలో అనుసంధాన‌త ప్రాధాన్యాన్ని ఇండియా, ఇయు లు గుర్తించాయి. సార్వ‌త్రికంగా గుర్తించిన అంత‌ర్జాతీయ నిబంధ‌న‌లు, స‌త్ప‌రిపాల‌న‌, దేశీయ‌ చ‌ట్టాలు, విశాల దృక్ప‌థం, పార‌ద‌ర్శ‌క‌త‌, స‌మాన‌త్వం ప్రాతిప‌దిక‌గా అనుసంధానత సాగాల‌ని ఉభ‌యపక్షాలు నొక్కి చెప్పాయి. ఆర్థిక బాధ్య‌త‌లు, బాధ్య‌తాయుత‌మైన ఫైనాన్సింగ్ విధానాలు, స‌మ‌తుల్య‌మైన ప‌ర్యావ‌ర‌ణ‌, వాతావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, సామాజిక సుస్థిర‌త ప్రాతిప‌దిక‌గా ఇది జ‌ర‌గాల‌ని సూచించాయి.

23. ఆసియా, యూరోప్ ల మ‌ధ్య అనుసంధానానికి స‌మాచార వేదిక‌గా ఎఎస్ఇఎమ్ ప్రాధాన్య‌ాన్ని ఉభ‌య పక్షాలు గుర్తించాయి. అంత‌ర్జాతీయ స‌వాళ్ల‌ను ఉమ్మ‌డిగా, దీటుగా ఎదుర్కొనే ప్ర‌క్రియ‌లో భాగంగా బ్ర‌సెల్స్ లో జ‌రుగ‌నున్న త‌దుప‌రి ఎఎస్ఇఎమ్ స‌మావేశానికి స‌మాయ‌త్తం అయ్యేలా ఎఎస్ఇఎమ్ కు నూతనోత్తేజాన్ని అందించాల‌ని ఉభ‌యులు నిర్ణ‌యించారు.

24. ఐక్య‌ రాజ్య‌ స‌మితి భ‌ద్ర‌తమండ‌లి తీర్మానం 2202 కు (2015) అనుగుణంగా మిన్ స్క్ అంగీకారాల ప‌రిధిలో యూక్రేన్ స‌మ‌స్య‌కు ప‌రిపూర్ణ‌మైన దౌత్య ప‌రిష్కార సాధ‌న‌కు ఉభ‌య వ‌ర్గాల నాయ‌కులు బ‌ల‌మైన మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

25. ఎమ్ వి సీమాన్ గార్డ్ ఓహియో కు చెందిన 14 మంది ఎస్తోనియ‌న్ పౌరులు, బ్రిటిష్ పౌరుల‌కు భార‌తీయ న్యాయస్థానం జైలు శిక్షను విధించిన కేసులో భార‌తీయ చ‌ట్టాల ప‌రిధిలో దీటైన ప‌రిష్కారం రాగ‌ల‌ద‌న్న ఆశాభావాన్ని ఇయు వెలిబుచ్చింది.

26. శాంతి, భ‌ద్ర‌త‌, అభివృద్ధి, నిర్వ‌హ‌ణ సంస్క‌ర‌ణ‌లు ప్ర‌ధానంగా ఐక్య‌ రాజ్య‌ స‌మితి చేప‌ట్టిన కొత్త సంస్క‌ర‌ణ అజెండాకు ఉభ‌య వ‌ర్గాలు మ‌ద్ద‌తు పున‌రుద్ఘాటించాయి. ఐక్య‌ రాజ్య‌ స‌మితి భ‌ద్ర‌త మండ‌లి స‌మ‌గ్ర సంస్క‌ర‌ణ‌లు, సాధారణ స‌భ పున‌ర్నిర్మాణ కృషి, 2030 అజెండా కు ఆయా క‌మిటీల కార్య‌క‌లాపాల‌ను అనుసంధానం చేయ‌డం ద్వారా బ‌ల‌మైన ప్రాపంచిక ప‌రిపాల‌న‌కు ఉభ‌య వ‌ర్గాలు త‌మ క‌ట్టుబాటును ప్ర‌క‌టించాయి.

27. అంత‌ర్జాతీయ భ‌ద్ర‌త‌, ప్ర‌పంచ ఆర్థిక స్థిర‌త్వం, వృద్ధికి ఎదుర‌వుతున్న స‌వాళ్ల‌ను ప‌రిష్క‌రించేందుకు జి-20, ఐక్య‌ రాజ్య‌ స‌మితి, ఇత‌ర అంత‌ర్జాతీయ వేదిక‌ల భాగ‌స్వామ్యం లోను, ద్వైపాక్షికం గాను క‌లిసిక‌ట్టుగా కృషి చేయాల‌ని ఉభ‌య వ‌ర్గాలు అంగీక‌రించాయి.

28. ప్ర‌పంచంలో సుస్థిర‌మైన వృద్ధి, అభివృద్ధి సాధ‌న‌కు స్వేచ్ఛాయుత‌మైన‌, నిజాయ‌తీతో కూడిన బ‌హిరంగ వాణిజ్య వ్య‌వ‌స్థ ఏర్పాటు కావ‌ల‌సిన అవ‌స‌రాన్ని గుర్తిస్తూ ఈ కృషిలో నిబంధ‌న‌ల ఆధారిత బ‌హుముఖీన వాణిజ్య వ‌వ‌స్థ ఆవిర్భ‌వించాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని నాయ‌కులు పున‌రుద్ఘాటించారు. 11వ ప్ర‌పంచ వాణిజ్య మండ‌లి (డబ్ల్యు టిఒ) మంత్రుల స్థాయి స‌మావేశం సుస్ప‌ష్ట‌మైన ఫ‌లితం సాధించేలా, విజ‌య‌వంతం అయ్యేలా డ‌బ్ల్యుటిఒ స‌భ్య‌త్వ దేశాల‌న్నింటితోనూ క‌లిసి ప‌ని చేయాల‌న్న క‌ట్టుబాటును ఉభ‌యులు ప్ర‌క‌టించారు.

29. అభివృద్ధికి ఇయు ఏకాభిప్రాయంతో రూపొందించిన నియ‌మావ‌ళి, భార‌త‌దేశం ఆచ‌రిస్తున్న ‘‘స‌బ్ కా సాథ్, స‌బ్ కా వికాస్’’ విధానాల మ‌ద్ద‌తుతో 2030 సుస్థిర అభివృద్ధి అజెండాను ఆమోదించ‌డాన్ని ఉభ‌య వ‌ర్గాలు గుర్తు చేశాయి. సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యాలు, పేద‌రిక నిర్మూల‌న దిశ‌గా ప్ర‌పంచ భాగ‌స్వామ్యాలు ఏర్పాటు కావ‌ల‌సిన అవ‌స‌రాన్ని నొక్కి చెప్పాయి. ఈ దిశ‌గా ఉమ్మ‌డి ప్రాధాన్య‌ాలు ఆచ‌ర‌ణీయం చేయ‌డానికి ఉభ‌యులు క‌ట్టుబాటు ప్ర‌క‌టిస్తూ ఇండియా-ఇయు అభివృద్ధి చ‌ర్చ‌లు కొన‌సాగించేందుకు గ‌ల అవ‌కాశాల అన్వేష‌ణ‌కోసం ఎదురు చూస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాయి. 2015-2030 సంవ‌త్స‌రాల మ‌ధ్య‌ కాలంలో వైపరీత్యాల రిస్క్ త‌గ్గింపున‌కు రూపొందించిన సెండై ఫ్రేమ్ వ‌ర్క్ ను ఉభ‌యులు ముందుకు న‌డిపించాల్సిన అవ‌స‌రాన్ని గుర్తించిన‌ట్టు ప్ర‌క‌టించాయి.

30. ఆఫ్రికాలో శాంతి, అభివృద్ధి స్థాప‌న‌కు భార‌త్ పోషిస్తున్న పాత్ర‌ను, ఐక్య‌ రాజ్య‌ స‌మితి శాంతి కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌లో భార‌త్ భాగ‌స్వామ్యాన్ని ఇయు ఆహ్వానించింది. ఆఫ్రికా విష‌యంలో ఉభ‌యులు ఆచ‌రిస్తున్న చొర‌వ‌ల్లోని సారూప్య‌త‌ల‌ను మ‌రింత పెంచ‌డం ల‌క్ష్యంగా సంప్ర‌దింపులు, స‌హ‌కారం విస్త‌రించుకోవాల‌ని ఉభ‌య వ‌ర్గాలు నిర్ణ‌యించాయి. రానున్న ఇయు-ఆఫ్రిక‌న్ యూనియ‌న్ శిఖ‌రాగ్రంలో ప‌రిశీల‌క హోదాలో భార‌త్ పాల్గొనే త‌రుణం కోసం ఎదురు చూస్తున్న‌ట్టు ఉభ‌యులు ప్ర‌క‌టించారు. మ‌రింత విస్తృత వాణిజ్య‌, ఆర్థిక స‌హ‌కారం ప్రాతిప‌దిక‌గా సుసంప‌న్న‌త‌లో భాగ‌స్వామ్యం, భార‌త ఆధునికీక‌ర‌ణ‌లో భాగ‌స్వామ్యం.

31. భార‌త్ చేప‌ట్టిన ఆర్థిక‌, సామాజికాభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ఇయు ఆహ్వానిస్తూ వాటిలో అగ్ర‌ స్థానంలోని ‘మేక్ ఇన్ ఇండియా’, “డిజిట‌ల్ ఇండియా”, “స్కిల్ ఇండియా”, “స్మార్ట్ సిటీ”, “క్లీన్ ఇండియా”, “స్టార్ట్ అప్ ఇండియా” కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వామి కావ‌డంపై ఇయు ఆస‌క్తిని వ్యక్తం చేసింది. దేశంలో వ్యాపారానుకూల‌త‌ను పెంచ‌డం, స‌ర‌ళ‌మైన‌, స‌మ‌ర్థ‌వంత‌మైన‌, జాతీయ‌స్థాయి ప‌రోక్ష ప‌న్ను విధానం ద్వారా జాతి యావ‌త్తును ఒకే విపణి గా స‌మీకృతం చేయ‌డం కోసం ప్ర‌వేశ‌పెట్టిన చరిత్రాత్మక వ‌స్తువులు మరియు సేవ‌ల ప‌న్ను (జిఎస్ టి) స‌హా ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ మోదీ ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌న్నింటినీ నిశితంగా గ‌మ‌నిస్తున్న‌ట్టు ఇయు ప్ర‌క‌టించింది. భార‌త్ అమ‌లుప‌రుస్తున్న ప్ర‌ధాన కార్య‌క్ర‌మాల‌న్నింటిలోనూ ఇయు భాగ‌స్వామి కావ‌డాన్ని ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ మోదీ ప్ర‌శంసిస్తూ భార‌త అభివృద్ధి ప్రాధాన్య‌త‌లలో మ‌రింత చురుకైన భాగ‌స్వాములు కావాల‌ని ఆహ్వానించారు. ఎంట‌ర్ ప్రైజ్ యూరోప్ నెట్ వ‌ర్క్ లో భార‌త వ్యాపార సంఘాలు మ‌రింత చురుకైన భాగ‌స్వాములు కావ‌డాన్ని ప్రోత్స‌హిస్తున్న‌ట్టు ఇయు తెలిపింది. వ‌న‌రుల సామ‌ర్థ్యం, స‌ర్క్యుల‌ర్ ఇకాన‌మీలలో భార‌త-ఇయు స‌హ‌కారంలో పురోగ‌తిని గుర్తించిన‌ట్టు నాయ‌కులు ప్ర‌క‌టించారు. మేధో సంప‌త్తి హ‌క్కులు (ఐపిఆర్), ప్ర‌భుత్వ సేక‌ర‌ణ విభాగాలలో అనుభ‌వాలు, ఉత్త‌మ ప్ర‌మాణాలు ప‌ర‌స్ప‌రం పంచుకోవ‌డానికి, మ‌రింత విస్తృత స‌హ‌కారానికి ఉభ‌య వ‌ర్గాలు అంగీక‌రించాయి.

32. భార‌త‌దేశం, ఇయు కు మ‌ధ్య‌గ‌ల ఆర్ధిక భాగ‌స్వామ్యాన్ని బ‌లోపేతం చేయ‌డానికిగాను నేత‌లు త‌మ నిబ‌ద్ద‌త‌ను చాటారు. అంతే కాదు స‌మ‌గ్ర‌మైన‌, ప‌రస్ప‌రం ప్ర‌యోజ‌నంగ‌ల‌ ఇండియా-ఇయు బ్రాడ్ బేస్డ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ అగ్రిమెంట్ (బిటి ఐఎ)ను తిరిగి స‌మ‌యానుకూలంగా ప్రారంభించ‌డానికిగాను ఇరువైపులా జ‌రుగుతున్న కృషిని గ‌మ‌నంలోకి తీసుకున్నారు.

33. వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల వాణిజ్యం ప్రాధాన్య‌ాన్ని ఇరు పక్షాలు గుర్తించాయి. ముఖ్యంగా బియ్యం విష‌యంలో. ఈ రంగంలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవ‌డానికి అంగీక‌రించాయి. బియ్యంలో ట్రైసైక్లజోల్ (క‌మిష‌న్ రెగ్యులేష‌న్ ( ఇయూ) 2017/ 983) దిగుమ‌తి ప‌రిమ‌తి స్థాయికి సంబంధించి సంబంధిత మొక్క సంర‌క్ష‌ణ కంపెనీలను ఆహ్వానించ‌డం జ‌రుగుతుంది. వాటితో దీనికి సంబంధించిన నూత‌న శాస్త్రీయ స‌మాచారాన్ని అందుబాటులోకి తేవ‌డం జ‌రుగుతుంది. తద్వారా ఎలాంటి జాప్యం లేకుండా యూరోపియ‌న్ ఆహార భ‌ద్ర‌త సంస్థ (ఇఎఫ్ ఎస్ ఎ) అద‌న‌పు ప్ర‌మాదాల‌పైన మ‌దింపు చేస్తుంది. ఈ ప్రాదిప‌దిక‌ను లెక్క‌ లోకి తీసుకొని పైన తెలిపిన రెగ్యులేష‌న్ ను స‌మీక్షించాలా లేదా అనే విష‌యాన్ని యూరోపియ‌న్ క‌మిష‌న్ తొంద‌ర‌గా నిర్ణ‌యం తీసుకుంటుంది. యూరోపియ‌న్ ఆహార భ‌ద్ర‌త సంస్థ , భార‌త ఆహార భ‌ద్ర‌త మ‌రియు ప్ర‌మాణాల సంస్థ (ఎఫ్ ఎస్ఎస్ఎఐ) ల‌కు సంబంధించిన స‌హ‌కారాన్ని తొంద‌ర‌గా వ్య‌వ‌స్థీకృతం చేయడానికి ఇరు ప‌క్షాలు మ‌ద్ద‌తు ప‌లికాయి. త‌ద్వారా ఇరు ప‌క్షాలు ప‌మాచార స‌మీక‌ర‌ణ‌, ప్ర‌మాద మ‌దింపు, ప్ర‌మాద స‌మాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవ‌డం మొద‌లైన విష‌యాల్లో అనుస‌రించే ప‌ద్ధతుల్లో త‌మ నైపుణ్యాన్ని, స‌మాచారాన్నిపంచుకోవ‌డంపైన దృష్టి పెట్ట‌వ‌చ్చని భావించాయి. అంతే కాదు ఆహార భ‌ద్ర‌త విష‌యంలో ఇయూ, ఇండియాలు క‌లిసి త‌మ స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేసుకోవాల‌నుకుంటున్నాయి. ఈ అంశాలు ఏవంటే:

ఎ). ఇప్ప‌టికే ఇరు ప‌క్షాల మ‌ధ్య‌న గ‌ల చ‌ర్చ‌ల్ని బలోపేతం చేయాలి. ఇవి ఏవంటే.. అగ్రిక‌ల్చ‌ర‌ల్ అండ్ మెరైన్ వ‌ర్కింగ్ గ్రూప్‌, ఎస్‌పిఎస్‌-టిబిటి వ‌ర్కింగ్ గ్రూప్ మొద‌లైన‌వాటిని బ‌లోపేతం చేయ‌డం ద్వారా ఆహార భద్ర‌త‌, వ్య‌వ‌సాయ వాణ‌ిజ్యం లాంటి అంశాల్లోని స‌మస్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవ‌డం జ‌రుగుతుంది. అంతే కాదు సంబంధిత భార‌తీయ మంత్రిత్వ‌శాఖ‌లు, విభాగాలు, యూరోపియ‌న్ క‌మిష‌న్ సేవ‌ల విభాగాల మ‌ధ్య‌ గ‌ల వ్యవ‌సాయ వాణిజ్యాన్ని బ‌లోపేతం చేయ‌డం జ‌రుగుతుంది.

బి. నాణ్య‌మైన‌ వ్య‌వ‌సాయ విధానాలు, అవ‌శేషాల సామ‌ర్థ్యాల‌ను క‌నిపెట్టడంలో ప్ర‌గ‌తి, ప్ర‌యోగ‌శాల‌ల కార్య‌క్ర‌మాల్లో స‌హ‌కారం, ప‌రీక్ష‌లు, ప‌ర్య‌వేక్ష‌ణ‌తో స‌హా ప‌లు అంశాల్లో ఉమ్మ‌డి ప్రాజెక్టుల‌ను ప్రారంభించాల‌ని నిర్ణ‌యించారు.

సి. బాస్మ‌తి బియ్యానికి సంబంధించి భౌగోళిక గుర్తింపు కోసం భార‌త‌దేశం పెట్టుకున్న ద‌ర‌ఖాస్తును ఇయు స్వాగ‌తిస్తుంది. అంతే కాదు అలాంటి ద‌ర‌ఖాస్తుల‌ను వీలైనంత తొంద‌ర‌గా ప‌రిష్క‌రిస్తుంది.

డి. ఇప్ప‌టికే భార‌త‌దేశం బాస్మ‌తి బియ్యానికి సంబంధించిన వివిధ ర‌కాల విత్త‌నాల గుర్తింపు కోసం ప్ర‌య‌త్నిస్తోంది. ఈ గుర్తింపును ఇండియా వేగంగా పొంద‌డానికి వీలుగా ఇయూ చేస్తున్న కృషిని భార‌త‌దేశం స్వాగ‌తించింది.

34. భార‌త‌దేశంలో ఇయూ పెట్టుబ‌డుల‌కోసం ఇన్వెస్ట్‌మెంట్ ఫెసిలిటేష‌న్ మెకానిజం (ఐఎఫ్ ఎం) ఏర్పాటును నేత‌లు స్వాగ‌తించారు. దీని ద్వారా వ్యాపార వాతావ‌ర‌ణానికి ప్రోత్సాహం ల‌భిస్తుంది. అంతే కాదు ఈ వ్య‌వ‌స్థ ద్వారా ఇయూకు సంబంధించిన నూత‌న సాంకేతిక‌, ఉత్త‌మ విధానాలను ఇండియాకు బ‌దిలీ చేయ‌డం జ‌రుగుతుంది. భార‌త‌దేశం అమ‌లు చేస్తున్న మేక్ ఇన్ ఇండియా విధానం వ‌ల్ల ఇయు స‌భ్యత్వ దేశాల్లోని ప‌లు కంపెనీల‌కు అనేక అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని నేత‌లు స్ప‌ష్టం చేశారు.

35. యూరోపియ‌న్ యూనియ‌న్‌కు చెందిన ద‌క్షిణ ఆసియా ప్రాంతీయ ప్రాతినిధ్య కార్యాల‌యాన్ని భార‌త‌దేశంలో స్థాపించ‌డాన్ని నేత‌లు ఆహ్వానించారు. త‌ద్వారా వ‌చ్చే పెట్టుబ‌డుల కార‌ణంగా ముఖ్యంగా న‌గ‌ర ర‌వాణా, పున‌ర్ వినియోగ శ‌క్తి ప్రాజెక్టుల్లో పెట్టే పెట్టుబ‌డులు వాతావ‌ర‌ణ ఎజెండాపైన భార‌త‌దేశం, యూరోపియ‌న్ యూనియ‌న్ ల మ‌ధ్య‌ ఏర్ప‌డిన స‌హ‌కారాన్ని ప్రోత్స‌హిస్తాయి. బెంగ‌ళూరు మెట్రో రెండో ద‌శ ప్రాజెక్టు కోసం యూరోపియ‌న్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు (ఇఐబి) ఇస్తున్న 500 మిలియ‌న్ యూరోల రుణం ప‌ట్ల నేత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేవారు. 2017లో భార‌త‌దేశానికి 1.4 బిలియ‌న్ యూరోల రుణాన్ని ఇస్తామంటూ ఇఐబి చేసిన హామీలో భాగంగానే ఈ కొత్త రుణాన్ని ఇవ్వ‌డం జ‌రిగింది.

36. ప్ర‌స్తుతం ఆశాజ‌న‌కంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌లను నేత‌లు ప‌రిగ‌ణ‌నలోకి తీసుకున్నారు. అంత‌ర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఎ) తాత్కాలిక కార్యాల‌యానికి, యూరోపియ‌న్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఇఐబి)కు మ‌ధ్య సంయుక్త ప్ర‌క‌ట‌నను ఇచ్చి పుచ్చుకోవ‌డాన్ని గుర్తించారు. ఈ సంయుక్త ప్ర‌క‌ట‌న కార‌ణంగా ఐఎస్ఎ ప‌రిధిలోని 121 స‌భ్య‌త్వ దేశాలలో అంద‌రికీ అందుబాటులోకి రాగ‌లిగే సౌర విద్యుత్ వ్య‌వ‌స్థ‌ల‌ను స‌మ‌గ్రంగా ఏర్పాటు చేసుకోవ‌డానికి కావ‌ల‌సిన నిధుల‌ను పొంద‌వ‌చ్చు.

37. పున‌ర్ వినియోగ ఇంధ‌నం, వాతావ‌ర‌ణ మార్పుల‌పైన ఇరు ప‌క్షాలు ఉమ్మ‌డి ప్ర‌క‌న‌ను ఆమోదించాయి. 2015 పారిస్ ఒప్పందం కింద ఇరు ప‌క్షాలు త‌మ నిబ‌ద్ధ‌త‌ల‌ను మ‌రోమారు చాటాయి. అంతే కాదు ఈ ఒప్పంద అమ‌లు విష‌యంలో ముందు ముందు స‌హ‌కరించుకోవాల‌ని అంగీక‌రించాయి. వాతావ‌ర‌ణ మార్పుల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంటూ భ‌ద్ర‌మైన అంద‌రికీ అందుబాటులోకి రాగ‌లిగే, సుస్థిర‌మైన ఇంధ‌న స‌ర‌ఫ‌రా ఇరు ప‌క్షాల‌కు ప్రాధాన్యాంశాలు కావాల‌ని ప‌రిగ‌ణించాయి. అంతే కాదు స్వచ్ఛ ఇంధ‌నం, వాతావ‌ర‌ణ భాగస్వామ్యంలో జ‌రుగుతున్న ప్ర‌గ‌తిని తెలుసుకున్నాయి. ఈ అంశాల‌ను 2016 ఇయు- ఇండియా శిఖ‌రాగ్ర స‌మావేశంలో ఆమోదించ‌డం జ‌రిగింది. వీటి అమ‌లు కోసం, వీటి విష‌యంలో ముందు ముందు ప్ర‌గ‌తిని తేవ‌డం కోసం ఇరు ప‌క్షాలు మ‌రోసారి త‌మ నిబ‌ద్ధ‌త‌ను చాటాయి. అయితే ఈ ప‌నంతా 2016 అక్టోబ‌ర్‌లో జ‌రిగిన‌ ఇండియా ఎన‌ర్జీ ప్యానెల్ స‌మావేశంలో అంగీక‌రించిన కార్యాచ‌ర‌ణ ప్ర‌కారం ఉండాల‌ని నిర్ణ‌యించాయి.

38. పునర్ వినియోగ ఇంధ‌న ప్రాజెక్టుల ఏర్పాటు, ప్ర‌గ‌తి విష‌యంలో వ్యయాన్ని త‌గ్గించ‌డానికి ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం తీసుకోవాల‌ని భార‌త‌దేశం, యూరోపియ‌న్ యూనియ‌న్ లు గ‌ట్టిగా నిర్ణ‌యించాయి. నూత‌న సాంకేతిక‌త‌, స‌మాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవ‌డం, సామ‌ర్థ్య నిర్మాణం, వాణిజ్యం, పెట్టుబ‌డులు, ప్రాజెక్టు ఏర్పాటు మొద‌లైన అంశాల ద్వారా వ్య‌యాన్ని త‌గ్గించాల‌ని నిర్ణ‌యించాయి.

39. ఆర్ధికాభివృద్ధి, ప‌ర్యావ‌ర‌ణ సంర‌క్ష‌ణ విష‌యాల్లో స‌మ‌న్వ‌యం యొక్క ప్రాధాన్యాన్ని నేత‌లు మ‌రోమారు చాటారు. ప్రాథమిక వ‌న‌రుల వినియోగాన్ని త‌గ్గించే స‌ర్క్కుల‌ర్ ఇకనామిక్ మోడ‌ల్ ప్రాధాన్యాన్ని నేత‌లు ప్ర‌త్యేకంగా చాటారు. త‌ద్వారా ద్వితీయ స్థాయి ముడి ప‌దార్థాల వినియోగం పెరుగుతుంది. ఇంట‌ర్ నేష‌న‌ల్ రీసోర్స్ ప్యానెల్ చేసిన కృషిని నేత‌లు స్వాగ‌తించాయి. ఎంతో ముఖ్య‌మైన ఆర్ధిక ప‌ర‌మైన ఈ మార్పు కోసం భార‌త‌దేశ ప‌ర్యావ‌ర‌ణ అట‌వీ మంత్రిత్వ‌శాఖ‌, నీతి ఆయోగ్ లు చేసిన కృషిని నేత‌లు ప్ర‌శంసించారు. నూత‌నంగా ఏర్పాటు చేసిన జి20 రీసోర్స్ ఎఫిషియ‌న్సీ డైలాగ్ అనేది స‌మాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవ‌డానికి ఆద‌ర్శ‌నీయ‌మైన వేదిక‌గా ఇరు ప‌క్షాలు అంగీక‌రించాయి. అంత‌ర్జాతీయ స్థాయిలో వ‌న‌రుల సామ‌ర్థ్యాన్ని ఉమ్మ‌డిగా ప్రోత్స‌హించాల‌ని నిర్ణ‌యించాయి. ప‌ర్యావ‌ర‌ణ స‌వాళ్ల‌యిన నీటి నిర్వ‌హ‌ణ‌, వాయు కాలుష్యం మొద‌లైన వాటి ప‌రిష్కారంలో స‌హ‌కారాన్ని మ‌రింత అధికం చేయాల‌ని నేత‌లు అంగీక‌రించారు. ఇండియా- ఇయూ నీటి భాగ‌స్వామ్యాన్ని అమ‌లు చేయ‌డం ద్వారా వ‌చ్చిన ప్ర‌గ‌తిని ఇరు ప‌క్షాల నేత‌లు గుర్తించారు. ఇరు ప‌క్షాలు అంగీక‌రించిన కార్యాచ‌ర‌ణ‌ను, ప‌రిశోధన రంగంలో పెరిగిన స‌హ‌కార అవ‌కాశాల‌ను గుర్తించారు. త్వ‌ర‌లో జ‌రిగే మూడో భార‌త దేశ‌-యూరోపియ‌న్ యూనియ‌న్ వాటర్ ఫోరమ్ స‌మావేశం ప‌ట్ల ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.

40. సృజ‌న‌, సాంకేతికాభివృద్ధి రంగాల్లో స‌హ‌కారాన్ని అధికం చేసే దిశ‌గా ప‌ని చేయాల‌ని ఇరు ప‌క్షాల నేత‌లు అంగీక‌రించారు. యూరోప్‌, భార‌త దేశ పారిశ్రామిక సంస్థ‌లు, నూత‌న కంపెనీల మ‌ధ్య‌ స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేయ‌డానికి ఈ ప‌ని ఉప‌యోగ‌ప‌డుతుంది.

41. భార‌త‌దేశం, యూరోప్ టెలిక‌మ్యూనికేష‌న్ ప్ర‌మాణాల సంస్థ‌లు (టిఎస్ డి ఎస్ ఐ, ఇటిఎస్ ఐ)ల మ‌ధ్య‌ సాంకేతిక స‌హ‌కారాన్ని అధికం చేయాల‌నే నిర్ణ‌యాన్ని ఇరు ప‌క్షాల నేత‌లు స్వాగ‌తించారు. యూరోపియ‌న్ యూనియ‌న్ ప్రోత్సాహంతో ఈ చొరవ మొదలైంది. అంతే కాదు 5జి కోసం ప్ర‌మాణాలు, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్ట‌మ్స్‌, ఇంటర్ నెట్‌, భ‌విష్య‌త్ నెట్ వ‌ర్కులు, టెలిక‌మ్ భ‌ద్ర‌త మొద‌లైన అంశాల‌పైన దృష్టి పెట్ట‌డాన్ని స్వాగ‌తించారు. ఈ స‌హ‌కారాన్ని మ‌రింత విస్త‌రించ‌డానికిగాను ఇరు ప‌క్షాలు దీనికి సంబంధించిన వారి వెన్ను త‌ట్టాయి. త‌ద్వారా స‌రైన సాంకేతిక ప‌రిష్కారాలు ఏర్ప‌డ‌తాయి. అంతే కాదు డిజిట‌ల్ ఇండియా, యూరోప్ ల కోసం డిజ‌ట‌ల్ సింగిల్ మార్కెట్ కార్య‌క్ర‌మాల మ‌ధ్య‌న బంధాలు మ‌రింత బ‌లోపేతం అవుతాయి.

42. ఇంట‌ర్ నెట్ పాల‌న‌లోని స‌వ్య ప‌రిణామాల‌ను ఇరు ప‌క్షాలు గుర్తించాయి. ఇరు ప‌క్షాలకు చెందిన ఐసీటీ కంపెనీల‌ కోసం సులువైన వ్యాపార వాతావ‌ర‌ణం పెర‌గ‌డాన్ని గుర్తించాయి. స్టార్ట్ అప్ యూర‌ప్ ఇండియా నెట్ వ‌ర్క్ కింద భార‌త‌దేశం, యూరోపియ‌న్ స్టార్ట‌ప్ ఎకో సిస్ట‌మ్స్ మ‌ధ్య‌ స‌మావేశాల‌ను గుర్తించాయి.

43. మందుల త‌యారీ రంగంలో స‌హ‌కారాన్ని మ‌రింత బ‌లోపేతం చేయ‌డం ప‌ట్ల త‌మ‌కున్న సుముఖ‌త‌ను ఇరు ప‌క్షాలు వ్య‌క్తం చేశాయి. నిర్మాణాత్మ‌క‌మైన‌, స్థిర‌మైన శిక్ష‌ణా వాతావ‌ర‌ణాన్ని త‌యారు చేసుకోవ‌డం ద్వారా సామ‌ర్థ్యాన్ని నిర్మించుకోవ‌డం, త‌నిఖీల‌ పైన దృష్టి పెడుతూ నియంత్ర‌ణా వ్య‌వ‌స్థ‌ను నిర్మించుకోవ‌డం ముఖ్య‌మ‌ని ఇరుప‌క్షాలు గుర్తించాయి. స‌మ‌గ్ర‌మైన ఫార్మా వాల్యూ చెయిన్ సామ‌ర్థ్య నిర్మాణంలో స‌హ‌కారం సాధించ‌డానికి భార‌త‌దేశం త‌న సంసిద్ధ‌త‌ను వ్య‌క్తం చేసింది.

44. ఆక‌ర్ష‌ణీయ‌మైన‌, సుస్థిర‌మైన న‌గ‌రీక‌ర‌ణకు సంబంధించిన ఇండియా- యూరోపియ‌న్ యూనియ‌న్ సంయుక్త ప్ర‌క‌ట‌న‌కు ఇరు ప‌క్షాల నేత‌లు ఆమోదం తెలిపారు. దీని ద్వారా ఇరు ప‌క్షాల మ‌ధ్య‌ ప్రాధాన్య‌ రంగాలలో స‌హ‌కారాన్ని నెల‌కొల్ప‌వ‌చ్చు. ర‌వాణా, పారిశుద్ధ్యం అంశాల్లో న‌గ‌ర మౌలిక వ‌స‌తుల‌ను మ‌రింత మెరుగు చేయ‌వ‌చ్చు. దేశంలో ఆక‌ర్ష‌ణీయ న‌గ‌రాల‌ను అభివృద్ధి చేయ‌వ‌చ్చు. అంతే కాదు 2016లో ఆమోదించిన ఐక్య‌ రాజ్య స‌మితి న్యూ అర్బన్ అజెండాను ప్రోత్స‌హించ‌వ‌చ్చు.

45. పున‌రుద్ధ‌రించిన ఇండియా- ఇయు శాస్త్ర సాంకేతిక స‌హ‌కార ఒప్పందం కింద స‌హ‌కారాన్ని ముందుకు తీసుకుపోవ‌డానికి నేత‌లు అంగీక‌రించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లోని ప్ర‌ధాన అంశాల్లో స‌హ‌కారం ఉంటుంది. అంతే కాదు అంత‌ర్జాతీయ స‌వాళ్ల‌ను ఎదుర్కోవ‌డం జ‌రుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం, నీరు, స్వ‌చ్ఛ ఇంధ‌న రంగాల్లో. నీటి సంబంధిత స‌వాళ్ల‌ను ఎదుర్కోవ‌డానికి ప్రారంభించిన 30 మిలియ‌న్ యూరోల ప్ర‌ధాన‌మైన ఉమ్మ‌డి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించడానికి చేసుకున్న ఒప్పందాన్ని నేత‌లు స్వాగ‌తించారు. నీటి వ‌న‌రుల‌పైన ప‌డుతున్న భారాన్ని త‌గ్గించ‌డానికిగాను సాంకేతికంగా, శాస్త్రీయంగా, నిర్వ‌హ‌ణా ప‌రంగా సామ‌ర్థ్యాల‌ను పెంచుకోవ‌డంలో స‌హ‌కారం ఎంత ముఖ్య‌మో ఈ ఒప్పందం తెలియ‌జేస్తోంది. యూరోపియ‌న్ యూనియ‌న్ నిబంధ‌న‌ల కార్య‌క్రమాన్ని ప‌ర‌స్ప‌రం ప్రారంభించ‌డానికి వీలుగా కృషి చేయాల‌ని ఇరు పక్షాలు అంగీక‌రించాయి. ఇది ప‌రిశోధ‌న‌, సృజ‌న‌ల‌తో కూడిన హొరైజ‌న్ 2020కు ఉయోగ‌ప‌డుతుంది. ఇంకా భార‌తీయ కార్య‌క్ర‌మాల‌కు ఉప‌కరిస్తుంది. అంతే కాదు ఇరువైపులా ప‌ని చేయ‌గ‌లిగే ప‌రిశోధ‌కుల‌ కోసం పిలుపునిచ్చారు. సైన్స్ అండ్ ఇంజినీయరింగ్ రీసెర్చ్ బోర్డ్ (ఎస్ ఇ ఆర్ బి), యూరోపియ‌న్ రీసెర్చ్ కౌన్సిల్ (ఇఆర్ సి) ల మ‌ధ్య‌ అమ‌లు ఏర్పాటు కుద‌ర‌డాన్ని ఇరు పక్షాలు స్వాగ‌తించాయి.

46. అణు శక్తిని శాంతియుత కార్య‌క్ర‌మాల‌ కోసం ఉప‌యోగించుకోవ‌డానికి వీలుగా యూరాట‌మ్‌, అణు ఇంధ‌న విభాగం ల‌ మ‌ధ్య‌ ప‌రిశోధ‌న‌, అభివృద్ధి స‌హ‌కారం కోసం ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకోవాలంటూ నేత‌లు కోరారు. అణు ఇంధ‌న భ‌ద్ర‌త మ‌రింత విస్త‌రించ‌డానికిగాను ఈ స‌హ‌కారం ఉప‌యోగ‌ప‌డాల‌ని నేత‌లు ప్ర‌త్యేకంగా కోరారు. ప‌ర‌స్ప‌రం ఉప‌యోగ‌కరంగా ఒప్పందం ఉండాల‌ని భావించారు. స‌మాజానికి ఉప‌యోగ‌క‌రంగా ఉండేలా నీరు, ఆరోగ్య భ‌ద్ర‌త‌, వైద్యం, ప‌ర్యావ‌ర‌ణ రంగాల్లో ఇంధ‌నేత‌ర సాంకేతిక‌త‌లను ప్ర‌వేశ‌పెట్టడానికి, నైపుణ్యాల‌ను మెరుగుపర‌చడానికి ఈ స‌హ‌కారం ఉప‌యోగ‌ప‌డుతుంది.

47. ఫ్యూజన్ ఎనర్జీ అభివృద్ధిలో గ‌ల బ‌ల‌మైన భాగ‌స్వామ్యాన్ని కొన‌సాగించాల‌ని ఇరు ప‌క్షాలు అంగీక‌రించాయి. చేసుకున్న ఒప్పందాల అమ‌లును చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించాయి. ఫ్యూజన్ ఎనర్జీ సంబంధిత ప‌రిశోధ‌న విష‌యంలో చేసుకున్న యూరాట‌మ్ ఇండియా స‌హ‌కార ఒప్పందం కూడా ఇందులో ఉంది.

48. 2008లో చేసుకున్న హోరిజోంట‌ల్ సివిల్ ఏవియేష‌న్ ఒప్పందాన్ని వెంట‌నే అమ‌లు చేయ‌డం ప‌ట్ల నేత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. దీని ద్వారా ఇండియా, యూరోప్ ల మ‌ధ్య‌ గగనతల అనుసంధానం పెరుగుతుంది. త‌ద్వారా ప్ర‌జ‌లకు, ప్రజలకు మ‌ధ్య‌ సంబంధ బాంధ‌వ్యాలు పెరుగుతాయి. వ్యాపార ప్ర‌యాణాలు పెరుగుతాయి. ప‌ర్యాట‌కులు పెరుగుతారు. అన్ని ర‌కాల ర‌వాణా, ముఖ్యంగా స‌ముద్ర‌ ర‌వాణా, విమాన ర‌వాణా, న‌గ‌ర రవార‌ణా రంగాల్లో ఇరు పక్షాల‌కు మేలు జ‌రగ‌గ‌లిగే ర‌వాణా స‌హ‌కార అవ‌కాశాన్ని నేత‌లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నారు.

49. నైపుణ్యాల‌ను అభివృద్ధి చేసుకోవ‌డంలో స‌హ‌కారాన్ని మెరుగుపరుచుకోవాల‌ని భార‌త‌దేశం, యూరోపియ‌న్ యూనియ‌న్ లు అంగీక‌రించాయి. భార‌త‌దేశ నైపుణ్య భార‌త కార్య‌క్ర‌మం, యూర‌ప్ కోసం యూరోపియ‌న్‌ యూనియన్ నూత‌న నైపుణ్యాల అజెండాల మ‌ధ్య‌న ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకునే అంశాల‌ను తెలుసుకోవ‌డానికి అంగీక‌రించాయి.

50. ఇండియా- యూరోపియ‌న్ యూనియ‌న్ అజెండా ఫ‌ర్ యాక్ష‌న్ 2020 లో భాగంగా ఉన్న‌త విద్యారంగంలో స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉందని నేత‌లు ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. భార‌త‌దేశం యొక్క జిఐఎఎన్ కార్య‌క్ర‌మం, యూరోపియ‌న్ యూనియ‌న్ యొక్క ఎరాస్మ‌స్ కార్య‌క్ర‌మల‌ద్వారా కూడా ఈ ప‌ని చేయాల‌ని అన్నారు. ఎరాస్మ‌స్ కార్య‌క్ర‌మం ఈ మ‌ధ్య‌నే ఐదు వేల మంది భార‌తీయ విద్యార్థులను చేరుకుంది. అనేక భార‌తీయ విశ్వ‌విద్యాల‌యాల‌కు సంస్థాగ‌త‌మైన స‌హ‌కారానికి వీలుగా ఆర్ధిక స‌హాయం చేయ‌డానికి ముందుకువచ్చింది. ఉమ్మ‌డి అధ్యాప‌కులు, తాత్కాలికంగా ఇచ్చిపుచ్చుకోవ‌డం, సామ‌ర్థ్యం నిర్మాణ ప్రాజెక్టులు, యూరోపియ‌న్ యూనియ‌న్ అధ్య‌య‌నాల‌ కోసం జీన్ మానెట్ చ‌ర్య‌ల ద్వారా సంస్థాగ‌త‌మైన స‌హ‌కారం ఉంటుంది. దీనికి నేత‌లు స్వాగ‌తం ప‌లికారు. ఎరాస్మ‌స్‌ మొబిలిటీ కార్య‌క్ర‌మాలు ప్రారంభించిన త‌రువాత ఈ కార్య‌క్ర‌మాల‌ ద్వారా ప్ర‌పంచంలోనే ల‌బ్ధి పొందే దేశాల్లో భార‌త‌దేశం నంబ‌ర్ వ‌న్‌గా అవ‌త‌రించింది.

52. ప్ర‌జ‌ల మ‌ధ్య‌ రాక‌పోక‌లను, సంబంధ బాంధ‌వ్యాల‌ను పెంచ‌డానికి నేత‌లు అంగీక‌రించారు. ప‌ర్యాట‌కుల సంఖ్యను పెంచ‌డం, వ్యాపారుల‌ ప్ర‌యాణాల‌ను పెంచ‌డం, ఇండియా, యూరోపియ‌న్ యూనియ‌న్ ల మ‌ధ్య‌ ప‌రిశోధ‌కుల‌ను పెంచ‌డం ద్వారా ఈ ప‌ని చేయాల‌ని భావించారు. ఉన్న‌త స్థాయి గుర్తింపు గ‌ల నిపుణులు యూరోపియ‌న్ యూనియ‌న్‌ కు ప్ర‌యాణం చేయ‌డం పెంచ‌డానికి వీలుగా యూరోపియ‌న్‌ యూనియ‌న్ బ్లూ కార్డ్ స్కీమును స‌మీక్షిస్తున్నారు. ఈ విష‌యాన్ని భార‌త‌దేశం గుర్తించింది.

53. భార‌త‌దేశంతో యూరోపియ‌న్ యూనియ‌న్ రాజ‌కీయ సంబంధాల నివేదిక‌ను యూరోపియ‌న్ పార్ల‌మెంటులో ఆమోదించారు. ఈ విష‌యాన్ని నేత‌లు ప‌రిగ‌ణ‌న లోకి తీసుకున్నారు. భార‌త‌దేశం, యూరోప్ పార్ల‌మెంటు ప్ర‌తినిధులు ఇరు ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌డానికి వీలుగా ప‌లు చ‌ర్య‌ల‌ను అధికం చేస్తూ చేసిన ప్ర‌తిపాద‌న‌ల‌కు నేత‌లు స్వాగ‌తం ప‌లికారు. ఇరు ప్రాంతాల మ‌ధ్య‌ మేధావులు, విద్యావేత్త‌లు, సాంస్కృతిక‌ ప్ర‌తినిధులు త‌ర‌చుగా పర్య‌ట‌న‌లు చేప‌ట్టే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నేత‌లు ఆశాభావం వ్య‌క్తం చేశారు.

***