Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2018 అక్టోబ‌రు 7వ తేదీ నాడు డెస్టినేశన్ ఉత్తరాఖండ్: ఇన్వెస్టర్స్ సమిట్ లో ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగం


ఉత్త‌రాఖండ్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ‌మతి బేబీ రాణి మౌర్య‌ గారు, నా మంత్రివర్గ స‌హ‌చ‌రులు, రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ త్రివేంద్ర సింహ్ రావ‌త్‌ గారు, ఉత్త‌రాఖండ్ మంత్రివ‌ర్గ స‌భ్యులు, సింగ‌పూర్ కమ్యూనికేశన్స్ మరియు స‌మాచార శాఖ మంత్రి శ్రీ ఎస్‌.ఈశ్వ‌ర‌న్‌, జ‌పాన్‌, ఇంకా చెక్ రిప‌బ్లిక్ రాయ‌బారులు, ప్ర‌పంచం న‌లు మూల‌ల నుంచి విచ్చేసిన నవ పారిశ్రామికులు, మ‌హిళలు మరియు సజ్జనులారా.

దేశ‌ విదేశాల నుంచి తరలివచ్చిన మిత్రులంద‌రికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. బాబా కేదార్‌నాథ్ ప‌విత్ర స‌న్నిధి కి, చార్‌ధామ్‌ కు నిలయం అయినటువంటి ఉత్త‌రాఖండ్‌ లోకి మీకు ఇదే సాద‌ర స్వాగ‌తం. వేల సంవత్సరాల చ‌రిత్ర‌ కలిగివున్న భార‌త‌దేశం లోని వైవిధ్యభరిత సంస్కృతీ సంప‌న్న‌త‌ లతో పాటు దేశ ఆర్థిక స్థితిగ‌తులు మీకు అంద‌రికీ అనుభ‌వం లోకి వ‌చ్చాయ‌ని నేను విశ్వ‌సిస్తున్నాను. ఈ అనుభ‌వాల‌ తో మ‌మేక‌మై స‌రికొత్త భావ సంప‌ద‌ తో మీరు తిరిగి వెళ్లాల‌ని ఆకాంక్షిస్తున్నాను.

మిత్రులారా,

భార‌త‌దేశంలో ఆర్థిక‌, సామాజిక ప‌రివ‌ర్త‌నాత్మ‌క‌త ప‌రిఢ‌విల్లుతున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మీరు ఉత్త‌రాఖండ్‌ లో మ‌నం స‌మావేశ‌మ‌య్యాం. దేశం మొత్తం ఇప్పుడు అత్యంత ప్ర‌ధాన ప‌రివ‌ర్త‌న ద‌శ‌ నుంచి ముందుకు వెళ్తోంది. మేం న్యూ ఇండియా దిశ‌ గా దూసుకుపోతున్నాం. రాబోయే ద‌శాబ్దాలలో ప్ర‌పంచానికి వృద్ధి చోద‌కం గా భార‌త‌దేశం రూపుదాలుస్తుంద‌ని దాదాపు ప్ర‌తి ప్ర‌ధాన అంత‌ర్జాతీయ సంస్థ ప్ర‌క‌టిస్తోంది. నేడు భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ నిల‌క‌డ‌ గా ఉంది.. ద్రవ్య లోటు త‌గ్గి, ద్ర‌వ్యోల్బ‌ణ శాతం కూడా నియంత్ర‌ణ‌ లోకి వ‌చ్చింది. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గం శ‌ర‌వేగం గా పురోగ‌మిస్తోంది. దేశం లో 80 కోట్లు గా ఉన్న యువ‌శ‌క్తి జ‌న‌ శ‌క్తి ల‌బ్ధి ని చాటుతూ కొత్త ఆశ‌లతో, సామ‌ర్థ్యాల‌తో ఉర‌క‌లేస్తోంది.

మిత్రులారా,

ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు జోరందుకోగా, నైపుణ్య వృద్ధి కూడా అనూహ్య ప‌రిమాణం లో దూసుకెళ్తోంది. గ‌డ‌చిన రెండేళ్ల కాలం లో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు 10వేల‌ కు పైగా వినూత్న చ‌ర్య‌లను చేప‌ట్టాయి. ఈ చ‌ర్య‌ల కార‌ణం గానే వాణిజ్య సౌల‌భ్య సూచీ 42 స్థానాల మేర మెరుగుప‌డింది. సంస్క‌ర‌ణ‌ల ప్ర‌క్రియ‌లో భాగం గా మేం 1400 కాలం చెల్లిన చ‌ట్టాల‌కు స్వ‌స్తి చెప్పాం. దీంతోపాటు భార‌త ప‌న్నుల వ్య‌వ‌స్థ‌ లోనూ సంస్క‌ర‌ణ‌లను ప్ర‌వేశ‌పెట్టాం. ప‌న్ను సంబంధిత ప‌రిష్కారాల‌ను మ‌రింత స‌మ‌ర్థం గా, పార‌ద‌ర్శ‌కం గా రూపొందించే కృషి సాగుతోంది. వ్యాపారాన్ని, వాణిజ్యాన్ని సుల‌భ‌త‌రం చేస్తూ ఆర్థిక అశ‌క్త‌త‌, దివాలా స్మృతి ని స‌వ‌రించ‌డంతో పాటు బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌ ను బ‌లోపేతం చేశాం. భార‌త‌దేశం లో స్వాతంత్ర్యం అనంత‌రం వ‌స్తువులు, సేవ‌ల ప‌న్ను (జిఎస్ టి) రూపేణా అతి భారీ ప‌న్నుల సంస్క‌ర‌ణను అమ‌లు చేస్తున్నాం. దేశాన్ని ఏక‌ రూప ప‌న్ను విప‌ణి గా రూపుదిద్ద‌డం స‌హా ప‌న్ను పునాది ని విస్త‌రించ‌డంలో జిఎస్ టి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డింది.

మా మౌలిక స‌దుపాయాల రంగం కూడా ఎన్న‌డూ లేనంత వేగం తో వృద్ధి చెందుతోంది. భార‌త‌దేశం లో నిరుడు 10వేల కిలోమీట‌ర్ల పొడ‌వైన జాతీయ ర‌హ‌దారుల‌ను నిర్మించాం. మునుప‌టి ప్ర‌భుత్వ పాల‌న కాలంతో పోలిస్తే రెట్టింపు వేగంతో- అంటే రోజు కు 27 కిలోమీట‌ర్ల వంతున- ర‌హ‌దారుల నిర్మాణం చ‌క‌చ‌క సాగుతోంది. అలాగే రైల్వే మార్గాలు కూడా రెట్టింపు వేగం తో నిర్మాణమ‌వుతున్నాయి. వీటితో పాటు కొత్త మెట్రో, హైస్పీడ్, ర‌వాణా ప్ర‌త్యేక కారిడార్ వంటి రైలు ప్రాజెక్టుల ప‌నులు కూడా వివిధ న‌గ‌రాల ప‌రిధి లో కొన‌సాగుతున్నాయి. అంతేకాకుండా దేశం లో 400 రైల్వే స్టేశన్ ల ఆధునికీక‌ర‌ణ ను ప్ర‌భుత్వం చేప‌ట్టింది.

భార‌త పౌర విమాన‌యాన రంగం శ‌ర‌వేగం తో ముంద‌డుగు వేస్తోంది. ఈ ప్ర‌క్రియ‌ ను మ‌రింత వేగవంతం చేయ‌డం కోసం 100 కొత్త విమానాశ్ర‌యాలు, హెలిప్యాడ్ లు కూడా నిర్మాణం లో ఉన్నాయి. రెండో అంచె, మూడో అంచె ప‌ట్ట‌ణాలకు విమాన‌యాన అనుసంధానం లో భాగంగా “ఉడాన్‌” ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టాం. ఇవేకాకుండా 100 జాతీయ జ‌ల‌మార్గాల సృష్టి కి ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి.

మిత్రులారా,

దేశ ప్ర‌జ‌లంద‌రికీ ఇళ్లు, అంద‌రికీ విద్యుత్తు, అంద‌రికీ ప‌రిశుద్ధ ఇంధ‌నం, అంద‌రికీ ఆరోగ్యం, అంద‌రికీ బ్యాంకింగ్ ల వంటి అనేకానేక ప‌థ‌కాలకు సంబంధించిన‌ ల‌క్ష్యాల‌ను త్వ‌ర‌లోనే పూర్తిచేయ‌బోతున్నాం. ఒక్క‌ మాట‌ లో చెబితే.. ఈ స‌ర్వ‌తోముఖ ప‌రివ‌ర్త‌న కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్త పెట్టుబ‌డిదారుల‌కే కాకుండా మీకంద‌రికీ అనువైన వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతోంది.

ఇటీవ‌లే ప్రారంభమైన “ఆయుష్మాన్ భార‌త్ యోజ‌న” భార‌త వైద్య రంగం లో పెట్టుబ‌డుల‌కు అవ‌కాశాల‌ను మ‌రింత మెరుగుప‌ర‌చింది. స‌మీప భ‌విష్య‌త్తు లో కొత్త ఆసుపత్రులు, వైద్య క‌ళాశాల‌లు, అర్థ‌వైద్య (పారామెడిక‌ల్‌) మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి సంస్థ‌ లు ఏర్పాటు కాబోతున్నాయి. అలాగే రెండో అంచె నగరాల లోనూ, మూడో అంచె న‌గ‌రాల లోనూ ఈ ప‌థ‌కం కార‌ణంగా అర్థ‌వైద్య మౌలిక వ‌స‌తులు బ‌లోపేతం కానున్నాయి. ఈ ఆయుష్మాన్ భార‌త్ యోజ‌న ఆరోగ్య బీమా ద్వారా ఏడాది కి రూ.5 ల‌క్ష‌ల వంతున 50 కోట్ల మంది భార‌తీయులు ప్ర‌యోజ‌నం పొందుతారంటే ఇది ప్ర‌పంచం లోనే ఎంత భారీ ప‌థ‌క‌మో మీరు ఊహించుకోవ‌చ్చు. అంటే.. అమెరికా, కెన‌డా, మెక్సికో ల మొత్తం జ‌నాభా తో స‌మాన‌మైన సంఖ్య‌ లో లేదా మొత్తం ఐరోపా దేశాల జ‌నం క‌న్నా అధిక సంఖ్య‌ లో భార‌తీయులు ఈ బీమా తో ధీమా పొందుతున్నార‌న్న మాట‌. ప్ర‌జ‌ల‌కు ఈ ప్ర‌యోజ‌నాలను అందించేందుకు మాకు ఇంకా ఎన్నో ఆసుపత్రులు, ఎంద‌రో వైద్యులు కూడా కావాలి. అందువ‌ల్ల ఈ దిశ‌ గా పెట్టుబ‌డుల‌కు అపార అవ‌కాశాలు ఉండ‌డం తో పాటు రోగుల‌కు ముంద‌స్తుగానే చెల్లింపులు కూడా ఉంటాయి. దీనిని బ‌ట్టి పెట్టుబ‌డిదారుల లాభాల‌కు పూర్తి హామీ ఉంటుంద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. రెండో అంచె నగరాలలో, మూడో అంచె న‌గ‌రాలలో అత్యుత్త‌మ ప్ర‌మాణాలు కలిగిన ఆసుపత్రుల ఏర్పాటు కోసం మూల‌ధ‌న పెట్టుబడులు పెట్టేందుకు ఇది ఒక అతి పెద్ద‌ అవ‌కాశం.

మిత్రులారా,

మౌలిక స‌దుపాయాల రంగం లో వ్య‌యం నేడు మునుపు ఎన్న‌డూ లేనంత అధికం గా ఉంది. అందువ‌ల్ల పెట్టుబ‌డుల‌ కు అపార అవ‌కాశాలే గాక ల‌క్ష‌లాది ఉద్యోగాల‌కు కూడా అవ‌కాశాలు ఏర్ప‌డుతున్నాయి. ప్ర‌గ‌తి ప‌య‌నం లో సామ‌ర్థ్యం, విధానాలు, ప‌నితీరు కీల‌క ఉప‌క‌ర‌ణాలు. న్యూ ఇండియా పెట్టుబ‌డుల గ‌మ్య‌ం అయితే ఉత్త‌రాఖండ్ అందులో ఒక ఉజ్వ‌ల భాగం. న్యూ ఇండియా జ‌న‌ శ‌క్తి సామ‌ర్థ్యానికి ప్రాతినిధ్యం వ‌హించే రాష్ట్రాలలో ఉత్త‌రాఖండ్ కూడా ఒక‌ రాష్ట్రం. నేటి ఉత్త‌రాఖండ్ యువ‌జ‌నం తో, వారి ఉత్సాహం తో ఉర‌క‌లెత్తుతోంది. ఈ అంతు లేని సాధ్య‌త‌ ల‌ను ఈ ప్రాంత‌పు అపార అవ‌కాశాలు గా మ‌ల‌చుకోవ‌డం లో త్రివేంద్ర రావ‌త్ గారి నాయకత్వం లోని ప్ర‌భుత్వం అద్భుతంగా కృషి చేస్తుంద‌న్న న‌మ్మ‌కం నాకుంది. ఉత్త‌రాఖండ్ గ‌మ్యం ఇటువంటి అనేక ఉత్త‌మ ప్ర‌య‌త్నాల‌కు వేదిక‌. ఈ నేప‌థ్యం లో ప్ర‌స్తుత చ‌ర్చ‌లు, విశ్వాసం, ఉత్సాహాల‌ను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా క్షేత్ర‌ స్థాయి కి తేవ‌డం, త‌ద్వారా ఉత్త‌రాఖండ్ యువ‌త‌ కు గ‌రిష్ఠ‌ స్థాయి లో ఉద్యోగావ‌కాశాలను క‌ల్పించ‌డం త‌క్ష‌ణావ‌స‌రం.

మిత్రులారా,

ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనికీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్‌పేయీ గారు తలపెట్టినప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. ఆనాడు రాజకీయ అనిశ్చితి తో పాటు మెరుగైన భవిష్యత్తు దిశ గా మేం చాలా శ్రమించవలసిన పరిస్థితి. అయినప్పటికీ నేడు ఉత్తరాఖండ్ ప్రగతి పథం లో శరవేగం తో పరుగులు తీస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ లను ప్రోత్సహించి, సాధికారిత ను కల్పించడానికి అనేక చర్య లు తీసుకోబడ్డాయి. అధిక స్థాయి లో రుణ లభ్యత, మద్దతు మూలధనం, వడ్డీ రాయితీ, స్వల్ప పన్నుశాతాలు, చిన్న పరిశ్రమల కోసం ఆవిష్కరణలు తదితరాలకు ప్రాముఖ్యం ఇవ్వబడింది. ఇందులో భాగంగా ఎంఎస్ఎంఇ లకు కోటి రూపాయల వరకు రుణాలను స్వల్ప వ్యవధి లో మంజూరు చేయాలని ఇటీవలే నిర్ణయించాం. అలాగే ప్రాజెక్టులకు అనుమతుల కోసం పెట్టుబడిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా ఇప్పుడు అనేక సదుపాయాలు ఆన్‌ లైన్‌ ద్వారానే అందుబాటు లో ఉన్నాయి. మరో వైపు పర్యావరణ అనుమతులకు సంబంధించి ‘పరివేష్’ (PARIVESH) పేరిట ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు ద్వారా ఈ ప్రక్రియ సరళం కావడమే కాక వేగవంతం చేయబడింది కూడాను.

ఉత్త‌రాఖండ్‌ లో అనుసంధానం కోసం నాలుగు సంవత్సరాలు గా సాధ్యమైన ప్రతి మార్గం లో అనేక చర్యలు తీసుకోబడ్డాయి. ఫలితం గా నేడు జాతీయ, రాష్ట్ర రహదారులు, రైలు మార్గాలు, విమాన మార్గాలన్నింటా ఉత్తరాఖండ్ అనుసంధానమై ఉంది. ఇవాళ ప్రతి గ్రామానికీ మెటల్ రోడ్లు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా చార్‌ధామ్‌ పుణ్యక్షేత్రాల కోసం ఎలాంటి వాతావరణంలోనైనా ప్రయాణించగల రహదారి నిర్మాణంతో పాటు హృషీకేష్- కర్ణప్రయాగ్ రైలు మార్గం పనులు కూడా వేగంగా సాగుతున్నాయి.

మిత్రులారా,

అనుసంధానం మెరుగుపడితే ప్రత్యేకించి పర్యటక రంగానికి ఎంతో లబ్ధి చేకూరుతుంది. ఈ రాష్ట్రం సహజ వనరులు సమృద్ధం మాత్రమే గాక ఆధ్యాత్మిక విశ్వాసాలు, సంస్కృతితోనూ పెనవేసుకుని పవిత్రత కు నిలయంగా ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం లో పర్యాటక ప్యాకేజీ ప్రకృతి తో మమేకమైంది మాత్రమే గాక సాహస క్రీడలు, సంస్కృతి, యోగా, ధ్యానం తదితరాలతో కూడిన ఆదర్శ సందర్శనీయ రాష్ట్రం గానూ ప్రసిద్ధం. ఉత్తరాఖండ్ ప్రభుత్వం పర్యాటకానికి ప్రత్యేక విధానం రూపొందించి దానికి పరిశ్రమ హోదా ను ఇచ్చింది. ఆ మేరకు 18 సంవత్సరాల చరిత్ర లో తొలిసారి గా 13 జిల్లాల్లో 13 పర్యాటక స్థలాలను గుర్తించడమే గాక వాటిని సంపూర్ణం గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దీనివల్ల ఈ రాష్ట్ర యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.

మిత్రులారా,

ఉత్తరాఖండ్ సేంద్రియ వ్యవసాయ రాష్ట్రం కాగల సామర్థ్యం గలది. దీనికి తగిన రీతిలో సమూహ ప్రాతిపదిక న సేంద్రియ వ్యవసాయం అభివృద్ధికి సాగుతున్న కృషి నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఇక్కడ సేంద్రియ పద్ధతులలో పండించిన పంటలకు మార్కెట్ కల్పన లో కేంద్ర ప్రభుత్వం తన వంతు గా శ్రమిస్తోంది.

ఆహార పదార్థాల తయారీ కి కూడా ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరుగుతోంది. దేశం లో ఈ రంగాన్ని బలోపేతం చేయడం కోసం ఇందులో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆహార పదార్థాల తయారీ రంగం లో పేరు ఉన్న దేశాలలో భారతదేశం అగ్రగామి గా ఉంది. ఆహార ధాన్యాలు, ఫలాలు, కాయగూరలు, పాల ఉత్పత్తి కూడా ఈ ప్రక్రియ లో అంతర్భాగం. ఈ రంగాలన్నింటిలో భారతదేశం ప్రపంచం లోనే తొలి మూడు స్థానాలలో నిలుస్తుంది. రైతు పండించిన ఉత్పత్తులు వృథా పోకుండా చూడటమే కాకుండా వారికి గరిష్ఠ ప్రయోజనం కలిగే విధంగా ఆహార పదార్థాల తయారీ రంగం పైన మేం నిశిత దృష్టి సారించాం. ఈ రంగానికి సంబంధించి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది.

ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యవసాయ రంగం లో, వ్యవసాయ- వాణిజ్యం లో భారీ పెట్టుబడులు పెట్టాలని మీకు ప్రత్యేకం గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రానున్న కాలం లో వ్యవసాయానికి విలువ జోడింపు రైతుల ఆదాయాన్ని పెంచడం లో కీలకమైన పాత్ర ను పోషిస్తుంది. దీంతో పాటు వ్యవసాయ రంగం లో మరింతగా ప్రైవేటు పెట్టుబడుల వల్ల ఆహార తయారీ, విలువ జోడింపు, శీతల గిడ్డంగులు లేదా ప్రత్యేక యంత్రాల తో వస్తు రవాణా తదితరాలు కూడా పుంజుకుంటాయి. దీనికి తోడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా భారత ఆర్థిక సామర్థ్యానికి కొత్త కోణాన్ని జోడిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.

నవీకరణీయ శక్తి రంగానికి సంబంధించి భారతదేశం నేడు ప్రపంచం లో అగ్రగామిగా నిలుస్తోంది. అంతేకాదు.. ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించగల శక్తి ని కలిగివుంది. ఆ మేరకు 2030వ సంవత్సరాని కల్లా దేశ విద్యుదుత్పాదన లో 40 శాతాన్ని శిలాజేతర ఇంధన వనరుల తో ఉత్పత్తి చేయాలని మేం నిర్ణయించుకున్నాం. ఇక 2022వ సంవత్సరం కల్లా భారతదేశం స్వాతంత్ర్యం సంపాదించుకొని 75 సంవత్సరాలను పూర్తి చేసుకోనుంది. అప్పటికి దేశం లో నవీకరణీయ శక్తి సామర్థ్యాన్ని 175 గీగావాట్ లకు చేర్చాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకొన్నాం. ఈ లక్ష్య సాధన లో సౌర విద్యుదుత్పాదన క్షేత్రాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతర్జాతీయ సౌర కూటమి (ISA) ఏర్పాటు వెనుక అంతరార్థం ఇదే. ప్రపంచ ఇంధన అవసరాలు తీరడంతో పాటు పర్యావరణ రక్షణ కు హామీ కోసం మేం పఠిస్తున్న మంత్రం- ‘‘ఏకైక ప్రపంచం.. ఒకే సూర్యుడు… ఒకే వ్యవస్థ (గ్రిడ్).’’ ఈ మంత్రానికి అనుగుణంగానే ఉత్తరాఖండ్ రాష్ట్రం లోనూ నవీకరణీయ శక్తి రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. జల విద్యుదుత్పాదన ఈ రాష్ట్రానికి మరో పెద్ద బలం. దీనికి అదనంగా సౌర శక్తి ఉత్పాదన ను జోడిస్తే విద్యుత్తు పరంగా మిగులు రాష్ట్రం కాగలదు. ఆ విధంగా భారతదేశాన్ని శక్తి సంపన్నం గా మార్చగల సత్తా ఈ రాష్ట్రానికి ఉంది.

మిత్రులారా,

గడచిన నాలుగు సంవత్సరాలలో ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రధాన వ్యాపార చిహ్నం గా రూపుదాల్చింది. అయితే, ఇది ఒక్క భారతదేశానికి మాత్రమే కాక యావత్తు ప్రపంచానికి వర్తించాలని మేం అభిలషిస్తున్నాం. ఆ మేరకు ప్రపంచం మా ఆహ్వానాన్ని మన్నించడం తో నేడు భారతదేశం అటు సమాచార సాంకేతికత కు మాత్రమే కాక ఇటు ఎలక్ట్రానిక్ వస్తు తయారీ రంగానికి కూడా కూడలి గా రూపు దిద్దుకుంటోంది. ఇవాళ ప్రపంచం లోని అతి పెద్ద మొబైల్ ఫోన్ తయారీ కేంద్రం మా దేశం లోనే ఉండగా దాంతో పాటు మరో 120 కర్మాగారాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రపంచంలోని అనేక ప్రధాన బ్రాండ్ ల కంపెనీలు కూడా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం లో భాగం అయ్యాయి.

అదే సమయం లో ఆటోమొబైల్ రంగం లోనూ ఈ కార్యక్రమం గొప్ప గా ముందడుగు వేస్తోంది. దీనికి సంబంధించి జపాన్ నేడు ఉత్తరాఖండ్ రాష్ట్ర భాగస్వామి గా ఉంది. మిత్రులారా… జపాన్ ఉత్పత్తులు- ముఖ్యంగా కార్లు ఇప్పుడు మా దేశంలో తయారవుతుండగా, జపాన్ వాటిని దిగుమతి చేసుకుంటోందని తెలిస్తే మీరెంతో సంతోషిస్తారు.

మిత్రులారా,

న్యూ ఇండియా ప్రగతి చరిత్ర లోను, ఉత్తరాఖండ్ అభివృద్ధి లోను మీరంతా భాగస్వాములయ్యేలా వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టవలసింది గా నేను ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రాబోయే రెండు రోజుల్లో సంతకాలు పూర్తయ్యే అవగాహన ఒప్పందాలన్నీ అత్యంత త్వరలో కార్యరూపం దాల్చగలవని విశ్వసిస్తున్నాను. రాష్ట్రాల శక్తి సామర్థ్యాలను ఒక క్రమం లో గరిష్ఠ స్థాయి న సద్వినియోగం చేసుకోగలిగితే భారతదేశం ముందంజ ను, ప్రగతి గాథ ను ఆపగలిగే శక్తి అంటూ ఏదీ ఉండదు. దేశ వ్యాప్తంగా నేడు రాష్ట్రాల మధ్య పోటీతత్వం నెలకొనడం ఒక అద్భుత పరిణామం. ఇతర రాష్ట్రాల కన్నా తాము అన్నివిధాలా ఒక మెట్టు పైనే ఉండాలని ప్రతి రాష్ట్రం అభిలషిస్తోంది. తమ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా ప్రతి రాష్ట్రం ఆ వైపు అడుగులు వేస్తోంది. ఒక రాష్ట్రం తన సామర్థ్యానికి అనుగుణంగా పురోగమిస్తోందంటే ఇంకెంతో కాలం అది వెనుకబడి ఉండదన్న మాటే కదా.

ప్రపంచం లోని అనేక దేశాల కన్నా భారతదేశం లోని రాష్ట్రాలు ఎంతో బలమైనవి. అనేక చిన్న దేశాలతో పోలిస్తే మన రాష్ట్రాల శక్తి సామర్థ్యాలు అపారం. కాబట్టి ప్రతి రాష్ట్రం గొప్ప కలలు కనాలని నేను కోరుకుంటాను.

గుజరాత్ ముఖ్యమంత్రి గా నేను బాధ్యతలు చేపట్టిన తేదీ కూడా అక్టోబరు 7 అని నాకింకా గుర్తే.. అది 2001 సంవత్సరం.. అప్పటికి నాకు ఏమంత అనుభవం లేదు. ప్రభుత్వ విధులు ఎలా ఉంటాయో కూడా తెలియదు. నేను ఏ కార్యాలయాన్నీ మునుపు చూసింది లేదు. ఇవన్నీ నాకు పూర్తిగా కొత్త… విలేకరులు వచ్చి కఠినమైన ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. నాతో ఏదో ఒక తప్పు చేయించాలని లేదా నా రాజకీయ భవిష్యత్తు ను అసలు ముందుకు సాగనీయ రాదని వారంతా చాలా గట్టిగా ప్రయత్నించారు. అందులో భాగంగా- గుజరాత్ నిర్మాణం లో మీరు దేనిని ఆదర్శంగా తీసుకుంటారు..?, ఎవరిని అనుసరిస్తారు? అంటూ ఒకరు ప్రశ్నించారు. అటువంటి ప్రశ్న లకు బదులిచ్చేటప్పుడు సాధారణంగా ఎవరైనా అమెరికా లేదా ఇంగ్లాండ్ తమకు ఆదర్శమని చెబుతారని అందరూ భావిస్తారు. కానీ, నేను భిన్నమైన సమాధానాన్ని ఇచ్చాను.. దక్షిణ కొరియా తరహా లో గుజ‌రాత్‌ ను నిర్మిస్తానని జవాబిచ్చాను. అది విని అందరూ తికమక పడ్డారు.. అప్పుడు- ‘‘దయచేసి మీ కెమెరాలను ఆపివేయండి.. నన్ను వివరించనీయండి.. మీకు ఎలాంటి ఇబ్బందీ కలగకూడదు’’ అంటూ నేను విశదీకరించడం ప్రారంభించాను. ‘‘గుజరాత్ జనాభా కూడా దాదాపు దక్షిణ కొరియా జనాభా తో సమానం. రెండింటికీ తీర ప్రాంత సరిహద్దులు ఉన్నాయి. రెండింటి ప్రగతి ప్రయాణం ఒకే విధంగా సాగుతోంది’’ అని చెప్పాను. అలాగే ‘‘ఇదంతా నేను లోతు గా అధ్యయనం చేశాను. మనం కూడా అదే మార్గాన్ని అనుసరిస్తే కచ్చితంగా ముందుకు పోగలం.. ఆ మేరకు నా ప్రయాణం ఎన్నటికీ ఆగదు’’ అంటూ స్పష్టం చేశాను.

దేశం లోని ప్రతి రాష్ట్రానికీ ఈ సామర్థ్యం ఉందని నేను నమ్ముతాను. దక్షిణ కొరియా వంటి అనేక దేశాల తో పోటీ పడి వాటి ని పూర్తిగా వెనక్కు నెట్టగల శక్తియుక్తులు ఉన్నాయి. ఆ ప్రకారం ప్రతి రాష్ట్రం ముందుకు సాగగలదు. అందుకు తగిన బలం, శక్తి, సామర్థ్యం మన యువతరానికి పుష్కలంగా ఉన్నాయి.

రష్యా అధ్యక్షుడు మొన్న ఇక్కడికి వచ్చారు.. తొలి సారి గా మేం ఇరువురం ఒక విభిన్న కార్యక్రమం లో పాల్గొన్నాం. అంతక్రితం ఆయన రష్యా లో తనకు ఎంతో ఇష్టమైన విద్యా సంస్థ కు ఒకసారి నన్ను తీసుకుపోయారు. భారతదేశ పర్యటన కు వచ్చినపుడు అక్కడి విద్యార్థుల లో కొందరిని వెంట తీసుకు రావాలని ఆ సందర్భం లో నేను కోరాను. అదే విధంగా భారతదేశం నుంచి కొందరు విద్యార్థులను రష్యా కు పంపుతానని కూడా చెప్పాను. ఆ మాట ప్రకారం ఆయన మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఓ 20 మంది విద్యార్థులను తీసుకువచ్చారు. వారు మరో 20 మంది భారతదేశ విద్యార్థులతో కలసి మెలసి ఐదారు రోజుల పాటు వివిధ కార్యకలాపాలలో పాల్గొన్నారు. ఈ 40 మందీ కలసి సాధించింది చూసి మేం ఇద్దరం ఆశ్చర్యచకితులమయ్యాం. అంటే.. మన యువత లో అపార సామర్థ్యం ఉంది. వారికి సరైన వాతావరణం, సముచిత అవకాశాలు అందుబాటు లోకి రావాలి. ఈ దిశ గా నేడు ఉత్తరాఖండ్ ఒక అడుగు ముందుకు వేసింది. మన జీవితం లో 18వ ఏట ప్రవేశించడం ఒక ప్రత్యేక ఘట్టం. ఆ విధంగా ఉత్తరాఖండ్ పురాతనమే గానీ ఈ రాష్ట్రం లో ప్రభుత్వానికి ఇప్పుడు 18 సంవత్సరాలు.. కనుక ఈ వయస్సు కు సహజమైన స్వప్నాలు, వేగం ఎలాంటివంటే ఏదైనా కొత్తగా చేయాలన్న ఉత్సాహం ఉరకలేస్తూంటుంది. కనుక ఉత్తరాఖండ్ ఈ 18వ ఏడాది లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే… ఇది అత్యంత విలువైన సమయం.

అనేక దశాబ్దాలుగా ఆర్థికాభివృద్ధికి సంబంధించి మనం ప్రత్యేక ఆర్థిక మండళ్ల ను (SEZ) గురించి వింటున్నాం. అయితే, ఉత్తరాఖండ్ రాష్ట్రమే ఒక విభిన్నమైన సెజ్ (SEZ).. అది శతాబ్దాలుగా రుషి పుంగవులు, సాధుసంతుల తపస్సు తో పాటు గంగామాత, దేవాదిదేవుని నిలయమైన హిమాలయ సమన్వితం. అంటే ఇదొక ‘‘ఆధ్యాత్మిక పర్యావరణ మండలి’’ (Spiritual Eco Zone) అన్న మాట. ఈ సెజ్… ప్రత్యేక ఆర్థిక మండలి కన్నా లక్షలాది రెట్లు ఉన్నతమైంది. దీనిని అభివృద్ధి పరచుకునే దిశగా ఉత్తరాఖండ్ తన పథకాలను కేంద్రీకరించడం అవశ్యం. ఇక ఉత్సాహం పొంగులువారే ఈ 18 ఏళ్ల ప్రభుత్వం రావత్ గారి నేతృత్వం లో రాష్ట్రాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చగలదని నేను విశ్వసిస్తున్నాను. ఉత్తరాఖండ్ ప్రభుత్వం 25 ఏళ్ల ప్రాయానికి చేరే 2025 కల్లా మీ స్వప్నాలలో అధిక శాతం సాకారం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ బృహత్ కృషి కి శుభారంభం లభించింది. ఈ సందర్భం గా కేంద్రం నుంచి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుందని నేను హామీ ఇస్తున్నాను.

అనేకానేక ధన్యవాదాలు.