పిఎంఇండియా
ప్రియమైన దేశవాసులారా! నమస్కారం! ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఈ కొత్త ఎపిసోడ్‌లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మన దేశవాసుల విభిన్నమైన కృషిని ప్రదర్శించడానికి, వినూత్న ఆలోచనలను చర్చించడానికి మన్ కీ బాత్ ఒక వేదిక అని మీ అందరికీ తెలుసు. ఈ ఆలోచనలలో చాలా వాటి వెనుక తమ జీవితకాల శక్తిని ధారపోసిన ప్రజల శ్రమ ఉంది.
మిత్రులారా! “ఆషాఢ ఏకాదశి పవిత్ర సందర్భంగా చరిత్రను ఆసక్తికరంగా మార్చే నా ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నానని ప్రకటించడానికి చాలా సంతోషంగా ఉంది.” అని కొద్ది కాలం కిందట ఒకరు సామాజిక మాధ్యమంలో ప్రకటించారు. ఆ ఆలోచన చాలా సాధారణమైందని ఆయన వివరించారు. ఈ వెబ్‌సైట్‌ను సందర్శించి, ఏదైనా ఒక సంవత్సరాన్ని ఎంచుకోండి. ఆ సమయంలో భారతదేశంలోని ఏ భాగాన్ని ఎవరు పరిపాలించారో ఇక్కడ మీరు సులభంగా తెలుసుకోవచ్చు. ఇది నాకు కూడా చాలా ఆసక్తికరంగా అనిపించింది. నేను దాని గురించి మరింతగా తెలుసుకోవాలని అనుకున్నాను. ముంబాయిలో నివసించే కృష్ణ శేషాద్రి గారు ఈ పని చేశారని నేను తెలుసుకున్నాను. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కృష్ణ గారు వెబ్‌సైట్ పేరును www.bharatrajya.com అని చాలా సాదాసీదాగా పెట్టారు. ఆయన పడిన శ్రమ తప్పకుండా మీ వరకు చేరాలి. అందువల్ల, “కృష్ణ గారితో నేరుగా ఎందుకు మాట్లాడకూడదు?!” అనుకున్నాను.
మిత్రులారా! కృష్ణ గారు ఫోన్‌లో మనతో సంభాషిస్తున్నారు.
ప్రధానమంత్రి: కృష్ణ గారూ… నమస్తే
కృష్ణ శేషాద్రి: నమస్తే సార్. నమస్తే.
ప్రధానమంత్రి: సోదరా! మీరు టెక్ ప్రపంచానికి చెందినవారు కాదని, చరిత్ర ఉపాధ్యాయులు కూడా కాదని నాకు తెలిసింది. అయినప్పటికీ మీరు టెక్నాలజీని ఉపయోగించి ఒక చరిత్ర వెబ్‌సైట్‌ను సృష్టించారు. అందుకే నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇదంతా ఎలా జరిగింది?
కృష్ణ శేషాద్రి: ధన్యవాదాలు సార్… మీతో మాట్లాడటం నా అదృష్టం సార్. నా గురించి చెప్పాలంటే, నేను ఒక ఇంజనీర్‌ని సార్. ఆ తర్వాత ఎంబీఏ చేశాను. తర్వాత మార్కెటింగ్ రంగంలోకి వెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచే చరిత్రపై గొప్ప ఆసక్తి ఉండేది. కాబట్టి నేను ఎప్పుడూ చరిత్రపై ఏదైనా చేయాలని అనుకునేవాడిని. చరిత్రను ఆసక్తికరంగా ఎలా మార్చాలా అని ఆలోచించేవాడిని. మనం చరిత్రను బోధించే విధానంలో చాలా మెరుగుపరచగలమని, అందులో ఎన్నో మార్పులు తీసుకురాగలమని, చరిత్రను ఒక కథగా మార్చి ప్రజలకు అందించగలమని కూడా నేను భావించాను.
ప్రధానమంత్రి: కృష్ణ గారూ… భారత చరిత్రలో ఏ అంశం గురించి అత్యధిక ప్రజలు తెలుసుకోవాలని మీరు భావించారు?
కృష్ణ శేషాద్రి: సార్.. మనం మన పాఠశాలలు, కళాశాలల్లో భారతీయ చరిత్ర బోధనను చూస్తే, దాన్ని ఒక సామ్రాజ్యం లేదా ఒక రాజ్యం కోణం నుండే బోధిస్తారు. ఆ సామ్రాజ్యాలకే విశేషమైన ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ప్రక్రియలో చోళులు, పల్లవులు, కర్కోట రాజవంశం, కాశ్మీర్‌లోని అహోములు వంటి మన ఇతర గొప్ప సామ్రాజ్యాల గురించి మనకు తెలియదు. వీరు కనీసం 600 సంవత్సరాల పాటు అద్వితీయంగా తమ సంస్కృతిని, విలువలను కాపాడుకున్నారు. కాబట్టి అలాంటి గొప్ప సామ్రాజ్యాలను ప్రజలకు పరిచయం చేసే ఒక వెబ్ సైట్‌ను సృష్టించాలని నేను అనుకున్నాను.
ప్రధానమంత్రి: కృష్ణ గారూ.. మీరు చాలా కష్టపడతారు. నేను మిమ్మల్ని ఒక ఊహాజనిత ప్రశ్న అడుగుతాను. భారత చరిత్రలోని ఏ ముగ్గురితోనైనా మాట్లాడే అవకాశం మీకు లభిస్తే, మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు. ఎందుకు?
కృష్ణ శేషాద్రి: సార్… అలా అయితే మొదటగా నేను చోళ సామ్రాజ్యంలోని అత్యంత శక్తిమంతమైన, ముఖ్యమైన రాజులలో ఒకరైన రాజరాజ చోళుడు లేదా రాజేంద్ర చోళుడితో మాట్లాడాలనుకుంటున్నాను. బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం వంటి భారీ శివాలయాలను నిర్మించాలనే ఆలోచన వారికి ఎలా వచ్చిందో నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటిని నిర్మించడానికి ఆ ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది? వారు ఎలా ప్రణాళిక తయారు చేశారు? రాబోయే వెయ్యి లేదా రెండు వేల సంవత్సరాల పాటు ఇతరులకు స్ఫూర్తినిచ్చే అంశాన్ని సృష్టించాలనే ఆలోచన వారికి ఎలా వచ్చింది? ఈ విషయాలన్నీ నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇక రెండవ వ్యక్తి… నా అభిప్రాయంలో భారత చరిత్ర చాలా తక్కువగా అంచనా వేసిన వ్యక్తి. సార్… ఆయన పేరు హేము. మనం భారత చరిత్రలో ఆయన గురించి గరిష్టంగా రెండు లేదా మూడు వాక్యాలు మాత్రమే చదువుతాం. హేము ఒక సామాన్యుడు, ఒక సాధారణ వ్యక్తి, ఒక వ్యాపారవేత్త అని మనకు తెలియదు. అక్కడి నుండి ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన కేవలం సామ్రాజ్య నిర్మాత మాత్రమే కాదు. ఒక సైనిక మేధావి కూడా. ఆయన తన జీవిత కాలంలో 23 యుద్ధాలు చేసి, వాటిలో 22 గెలిచాడు. అలాంటప్పుడు ఆయన ఆలోచనా విధానం ఎలా ఉండేది? ఒక సామాన్య స్థాయి నుండి ఆయన అంత గొప్ప రాజు ఎలా అయ్యాడు? ఆ ప్రయాణం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది సార్. ఇక మూడవ వారు చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహిళ. సార్.. ఆమె త్రిభువన్ మహాదేవి. ఒడిషాలో భౌమాకార వంశం అనే పాలకుల వంశం ఉండేది. వారి కథ కూడా చాలా ఆసక్తికరం సార్.. క్రీ.శ. 850 ప్రాంతంలో వారి పొరుగు రాజులు వారి సామ్రాజ్యంపై దాడి చేశారు. వారి రాజు- అంటే త్రిభువన్ మహాదేవి భర్త- ఆ యుద్ధంలో అమరవీరుడయ్యాడు. దీని కారణంగా సామ్రాజ్యం చాలావరకు కుదించుకునిపోయింది. దాని అధిపతులు, నాయకులు సామ్రాజ్యాన్ని విడిచి వెళ్ళడం ప్రారంభించారు. అప్పుడు త్రిభువన్ మహాదేవి అధికారం చేపట్టారు. ఆమె భారతదేశ చరిత్రలో మొట్టమొదటి స్వతంత్ర పాలకులలో ఒకరిగా నిలిచారు. ఆమె ప్రభుత్వాన్ని స్థిరపర్చడమే కాకుండా, దాన్ని చాలా శక్తిమంతంగా రూపొందించారు. ఎంతగా అంటే ఆ తర్వాత వంద సంవత్సరాల పాటు ఆ వంశం కళింగ, ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిపాలించింది. కాబట్టి చరిత్రలో నేను కలవాలనుకుంటున్న ముగ్గురు ఆసక్తికరమైన వ్యక్తులు వీరే సార్.
ప్రధానమంత్రి: కృష్ణ గారూ… మీరు ఇప్పుడు చరిత్రలో జీవిస్తున్నట్లు అనిపిస్తోంది. మీరు పూర్తిగా అందులో లీనమైపోయారు. నేను కూడా మీ వెబ్ సైట్‌ను చాలా ఆసక్తిగా పరిశీలిస్తున్నాను. అందులో నాకు అత్యంత ఆసక్తికరంగా అనిపించిన విషయం ఏమిటంటే మీ సైట్‌లో ప్రజలు దిద్దుబాట్లు, సూచనలు చేయడానికి ఒక ట్యాబ్ ఉంది. నిర్మాణాత్మకమైన అభిప్రాయాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండటం ఒక ముఖ్యమైన విజయం. మీరు ప్రజల నుండి సూచనలు స్వీకరించడం ప్రారంభించారా? మరి వాటిపై మీరు ఎలా చర్యలు తీసుకుంటున్నారు?
కృష్ణ శేషాద్రి: అవును సార్… మాకు ప్రజల నుండి చాలా సూచనలు వస్తాయి. సూచనలు రెండు రకాలుగా ఉంటాయి. ఒక రకం సూచనలు దిద్దుబాట్లు కోరుతూ వస్తాయి. ఉదాహరణకు ఫలానా రాష్ట్రంలో, ఫలానా సమయంలో, ఫలానా రాజ్యంలో ఫలానా రాజు ఉండేవాడు అని. లేదా ఫలానా సమయంలో ఫలానా యుద్ధం జరిగింది వంటివి. మరో రకం సూచనలు మీరు ఈ వెబ్‌సైట్‌లో ఫలానా ఫీచర్‌ను కూడా చేర్చవచ్చు అని వస్తాయి. మాకు రెండు రకాల సూచనలు వస్తాయి. ఉదాహరణకు ఫలానా రాష్ట్రంలో, ఫలానా సమయంలో ఫలానా రాజు పరిపాలించాడు అని సూచన వస్తే మాకు ఉన్న ఆధారాల ప్రకారం మేం ఆ సూచనను స్వీకరిస్తాం.
మరో ఉదాహరణ చెప్తాను. “మీరు భారతదేశాన్ని చూపించారు. దాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా చూపిస్తే బాగుంటుంద”ని ఒకరు సూచించారు. మేం ఆ ఫీచర్‌ను అమలు చేశాం. ఆ తర్వాత మాకు మరో ఫీచర్ వచ్చింది. అందులో మేం మొత్తం సామ్రాజ్యం డేటా గణాంకాలను ఒక trump card గా ఇచ్చాం. అది పిల్లలకు చేరుతుంది. అందరం డౌన్‌లోడ్ చేసుకుని, పంచుకునేలా మీరు దాన్నిఒకే చోట చేర్చాలని ఒకరు సూచించారు. మేం ఆ ఫీచర్‌ను అమలు చేస్తున్నాం. కాబట్టి మేం తప్పులు చేస్తామని అర్థం చేసుకోవడం మాకు ముఖ్యం. ఎందుకంటే మేమేమీ సర్వశ్రేష్టులం కాదు. ఈ విషయం దృష్టిలో ఉంచుకుని, ఇది అందరి సైట్ కావాలనే ఉద్దేశంతో మేం దిద్దుబాట్ల ట్యాబ్‌ను జోడించాం. ఇకపై అందరి సహకారాన్ని ఉపయోగించుకుని, రాబోయే కొన్నేళ్లపాటు చరిత్రను ఒక ఆసక్తికరమైన అంశంగా నిలిపే సైట్‌ను నిర్మించగలం.
ప్రధానమంత్రి: కృష్ణ గారూ… మీరు నిజంగా గొప్ప పని చేశారు. అయితే చరిత్రతో పాటు మీకు మరెన్నో అభిరుచులు ఉండి, ఇంకా మరెన్నో పనులు కూడా చేస్తుంటారు కదా!
కృష్ణ శేషాద్రి: కాదు సార్… నేను కాస్త boring type మనిషిని సార్.
ప్రధానమంత్రి: (నవ్వుతూ)
కృష్ణ శేషాద్రి: నాకు సాంకేతికత, చరిత్ర అంటే చాలా ఆసక్తి. ఇప్పుడు సాంకేతికత, చరిత్ర రెండూ కలిశాయి. కాబట్టి, నేను రోజంతా వాటిలోనే మునిగిపోతున్నాను.
ప్రధానమంత్రి: సరే కృష్ణ గారూ.. మీకు నా శుభాకాంక్షలు. మీరు మంచి ఆరంభం చేశారు. మీ విధానం చూస్తుంటే ప్రజలు తప్పకుండా ఇందులో పాలుపంచుకుంటారని, తప్పకుండా మీతో చేరతారని నాకు పూర్తి నమ్మకం ఉంది. మీకు నా శుభాకాంక్షలు.
మిత్రులారా! కృష్ణ గారు చేస్తున్న ఈ ప్రయత్నం చరిత్ర విద్యార్థులకు మాత్రమే కాకుండా మనందరికీ మన గతం గురించి ఆసక్తికరంగా తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఇలాంటి ప్రయత్నాల గురించి మీకు సమాచారం తెలిస్తే దయచేసి పంచుకోండి.
నా ప్రియమైన దేశప్రజలారా! “వికసిత భారతదేశం కోసం మాదకద్రవ్య రహిత యువత” అనే ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. దీని లక్ష్యం సుస్పష్టంగా ఉంది. మాదకద్రవ్య రహిత యువత, మాదకద్రవ్య రహిత భారతదేశం. చాలా మంది- ముఖ్యంగా మన యువత- ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఏది ఏమైనా ఇది భారతదేశ యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తు కోసం మనందరి సామూహిక నిబద్ధత.
మిత్రులారా! మాదకద్రవ్యాల వ్యసనం కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు- దాని దుష్ప్రభావాలు యావత్ కుటుంబం, సమాజంపై పడతాయి. మాదకద్రవ్యాల గురించి అవగాహన కల్పించి, వ్యసనంతో బాధపడుతున్న వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చేవారిని నేను అభినందిస్తున్నాను. మీరు మాదకద్రవ్యరహిత భారతదేశం కోసం ఒక శక్తిమంతమైన నినాదాన్ని సృష్టించగలరా? మన యువ సంగీతకారులు మాదకద్రవ్య రహిత జీవిత సందేశాన్ని అందించే పాటలను స్వరపరచగలరా? మాదకద్రవ్యాల ప్రమాదాలను, అలాగే వాటిని అధిగమించే మార్గాలను తెలియజేస్తూ హృద్యమైన నాటికలను విద్యార్థుల బృందాలు, నాటక సమాజాలు రూపొందించగలవా? మన దేశంలో అద్భుతమైన కంటెంట్ సృష్టికర్తలకు కొరత లేదు. ఈ దిశగా సమాజానికి సహాయపడే కంటెంట్‌ను వివిధ భాషలలో సృష్టించాలని నేను వారిని కోరుతున్నాను. దయచేసి మీ ప్రయత్నాలను హ్యాష్‌ట్యాగ్‌లతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. కొన్నిసార్లు అధికారిక ప్రచారాల కంటే సృజనాత్మక ప్రయత్నాలే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయి. రండి… భారతదేశ యువతను మాదకద్రవ్యాలకు దూరంగా, మాదకద్రవ్య రహితంగా ఉంచే ఈ పవిత్రమైన పనిలో మనమందరం మన వంతు పాత్ర పోషిద్దాం. దయచేసి మీ ప్రయత్నాలను #drugfreeyouth అనే హ్యాష్‌ట్యాగ్‌తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి.
నా ప్రియమైన దేశవాసులారా! ఆగస్టు నెలలో మనం ప్రతిచోటా దేశభక్తిలోని అనేక కోణాలను చూస్తాం. ఈ సమయంలో ప్రతి వ్యక్తి హృదయంలో దేశభక్తి భావన మరింత బలపడుతుంది. ‘జాతీయ చేనేత దినోత్సవం’, ‘క్విట్ ఇండియా ఉద్యమ’ వార్షికోత్సవం నుండి దేశ విభజన స్మరణ దినం వరకు, ఈ సందర్భాలు ప్రత్యేకమైనవి. ‘స్వాతంత్ర్య దినోత్సవం’, ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’ ప్రతి పౌరుడిని గర్వంతో నింపుతాయి. ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ ఈ భావనను మరింత బలపరుస్తుంది. ‘వందేమాతరం’ 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఈ సంవత్సరాన్ని మరింత ప్రత్యేకంగా మలిచింది. ఈసారి 8 కోట్లకు పైగా త్రివర్ణ పతాక సెల్ఫీలు అప్‌లోడ్ అయ్యాయి. ఈ త్రివర్ణ పతాక సంబరం భారతదేశానికే పరిమితం కాలేదు. ఈ సంవత్సరం ‘సూర్యపథ త్రివర్ణ పతాకం’ ద్వారా మన త్రివర్ణ పతాకం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫిజీలోని సువాలో సూర్యుని తొలి కిరణంతో పాటే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరప్ ల నుండి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో అంతటా ఉన్న భారతీయ మిషన్లు, పోస్టులలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఈ దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉండి ఉంటాయో మీరు ఊహించవచ్చు. ప్రపంచం నలుమూలలా సూర్యుని ప్రయాణంతో పాటే భారత త్రివర్ణ పతాకం కూడా రెపరెపలాడింది. ఇటువంటి ప్రయత్నాలు సమాజాన్ని ఏకం చేస్తాయి. అవి దేశంతో మన అనుబంధాన్ని కూడా బలపరుస్తాయి. ఈ ప్రయత్నాలలో పాలుపంచుకున్న వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు.
నా ప్రియమైన దేశప్రజలారా! ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు మన నగరాలు, పట్టణాల వీధుల్లో లక్షలాది మంది మహిళలు తమ పనులలో నిమగ్నమై ఉంటారు. కొందరు కూరగాయలు, కొందరు పండ్లు అమ్ముతారు, కొందరు టీ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. మరికొందరు పువ్వులు, దీపాలు, పూజా సామగ్రిని అమ్ముతారు. కొద్దిపాటి మూలధనం లేకపోవడం చాలా సందర్భాల్లో వారి వ్యాపారాలు ఎదగకుండా అడ్డుకుంటుంది. కానీ ఇప్పుడు అలాంటి లక్షలాది మంది తల్లులు, సోదరీమణులు పీఎం స్వనిధి యోజన ద్వారా కొత్త బలాన్ని పొందుతున్నారు. మహిళా సాధికారతకు సంబంధించిన ఈ అంశం గురించి జరగాల్సినంతగా చర్చ జరగడం లేదు. పీఎం స్వనిధి యోజన లబ్ధిదారులలో దాదాపు 46 శాతం మంది మహిళలే ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంలో పాల్గొంటూ, తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నారు.
మిత్రులారా! ఘజియాబాద్‌కు చెందిన బబితా శర్మ గారు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. బబిత గారు పూజా సామగ్రి అమ్మే ఒక చిన్న దుకాణాన్ని నడిపేవారు. పువ్వులు, దీపాలు, అగరుబత్తులు, కొబ్బరికాయలు వంటి వస్తువులను అమ్ముతూ, ఆమె తన కుటుంబ జీవనోపాధికి తోడ్పడేవారు. ఆమె చాలా కష్టపడేవారు. తన వ్యాపారాన్ని విస్తరించడానికి ఆమెకు పెట్టుబడి అవసరమైంది. ఆమెకు పీఎం స్వనిధి నుండి ఆర్థిక సహాయం అందింది. ఆమె తన సరుకులను పెంచుకుని, వ్యాపారాన్ని విస్తరించారు. వినియోగదారులు పెరిగారు. ఆదాయం పెరిగింది. క్రమంగా రోడ్డు పక్కన ఉండే ఆమె చిన్న స్టాల్ ఒక పెద్ద దుకాణంగా రూపాంతరం చెందింది.
మిత్రులారా! బెంగళూరుకు చెందిన టి.ఎస్. నింగమ్మ గారి ఉదాహరణ కూడా చాలా స్ఫూర్తిదాయకం. నింగమ్మ గారు, ఆమె భర్త ఇడ్లీ, దోశ, సాంబార్ అమ్మే ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆ వ్యాపారం విజయవంతమైంది. కానీ దాన్ని మరింత విస్తరించడానికి వారికి పెట్టుబడి అవసరమైంది. నింగమ్మ గారికి కూడా పీఎం స్వనిధి నుండి సహాయం అందింది. ఆమె తన టిఫిన్ల బండిని మెరుగుపరుచుకున్నారు. సరుకులను టోకున కొనడం ప్రారంభించారు. మెనూలో అనేక కొత్త వస్తువులను చేర్చారు. వినియోగదారులు పెరిగారు. ఆదాయం పెరిగింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఈ రోజు ఆమె తన ముగ్గురు పిల్లలకు మంచి చదువును అందించగలుగుతున్నారు.
మిత్రులారా! ఒక మహిళ వ్యాపారం వృద్ధి చెందినప్పుడు దానితో పాటు ఆమె కుటుంబ భవిష్యత్తు కూడా అభివృద్ధి చెందుతుంది. పిల్లల చదువులు మెరుగుపడతాయి. ఇంటి అవసరాలు తీరతాయి. మహిళ ఆత్మవిశ్వాసం మరింత బలపడుతుంది. ఇదే మహిళా సాధికారతకు సజీవ నిదర్శనం. వీధి వ్యాపారంలో నిమగ్నమైన సోదరీమణులందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! పరిశుభ్రతకు గొప్ప సుగుణం ఉంది. ఒక ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలనే సంకల్పం అక్కడి ప్రజల వ్యక్తిగత సంకల్పంగా మారినప్పుడు ఆ మార్పు కేవలం పరిశుభ్రతకే పరిమితం కాదు. అది ఆ ప్రదేశం మొత్తం స్వరూపాన్నే మార్చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో పరిశుభ్రత కోసం జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాలు మనకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. పట్వాయి అనేది ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఉన్న ఒక గ్రామం. అక్కడ ఆకాష్, రోహన్ అనే ఇద్దరు స్నేహితులు తమ చుట్టూ ఉన్న ప్రాంతం మురికితో నిండి ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఆకాష్, రోహన్ చెత్త సంచులు పట్టుకుని శుభ్రం చేయడానికి బయలుదేరారు. క్రమంగా ఇతర యువకులు కూడా వారితో కలిశారు. ‘క్లీన్-అప్ పట్వాయి’ అనే పేరుతో ఒక బృందం కూడా ఏర్పడింది. ఈ యువకులు ఇప్పటివరకు నాలుగు గంగా ఘాట్‌లను శుభ్రం చేశారు. వారు టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. వారు ఎన్నో చెరువులను, బహిరంగ ప్రదేశాలను శుభ్రపరిచారు.
మిత్రులారా! ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర సందర్భంగా పరిశుభ్రత, ప్రజా భాగస్వామ్యానికి సంబంధించిన ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ ఒకటి కనిపించింది. వేలాది మంది పారిశుధ్య కార్మికులు కష్టతరమైన మార్గాలలో పగలు, రాత్రి తేడా లేకుండా సేవ చేశారు. ఈ సంవత్సరం యాత్రలో 400 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాలను సేకరించి, శుద్ధి చేశారు. ఈ ప్రయత్నంలోని ఒక అంశం నాకు బాగా నచ్చింది. ఈ పరిశుభ్రతా కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొన్నారు. 16 వేల మందికి పైగా యాత్రికులు పరిశుభ్రతను పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. 10 వేల మందికి పైగా యాత్రికులకు ‘Responsible Yatri’ అంటే ‘బాధ్యతాయుతమైన యాత్రికులు’ అనే సర్టిఫికెట్లు కూడా అందజేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రయోగం కూడా నిర్వహించారు. యాత్ర సమయంలో గుర్రాలు, కంచర గాడిదల పేడను బయోగ్యాస్‌గా మార్చి, ఆ స్వచ్ఛమైన శక్తితో ‘స్వచ్చ జ్యోతి’ని వెలిగించారు. అంటే, అమర్ నాథ్ మంచు శివలింగమైన బాబా బర్ఫానీకి చేసే ఈ పవిత్ర యాత్రలో పరిశుభ్రత కూడా ఒక రకమైన సేవగా, విశ్వాసంగా మారింది. మిత్రులారా! మన గ్రామాలు, నగరాలు, నదులు లేదా పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే… వాటి గుర్తింపు మన ప్రవర్తన ద్వారా కూడా రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రవర్తనలో పరిశుభ్రతను కూడా భాగం చేసినప్పుడు ఆ ప్రదేశం అందం మరింత పెరుగుతుంది.
నా ప్రియమైన దేశవాసులారా! కొన్నిసార్లు ఒక చిన్న అభిరుచి జీవితంలో గొప్ప అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. నాగాలాండ్‌లోని ఫెక్ జిల్లాకు చెందిన వెసాలు పురో గారి ప్రయాణం కూడా ఇలాంటిదే. వెసాలు గారు ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. చిన్నప్పటి నుండి ఆమె తన తల్లిదండ్రులు వ్యవసాయం చేయడాన్ని చూశారు. ఆమెకు పూలంటే ఎంతో ఇష్టం. ఆమె ఈ అభిరుచిని కొనసాగిస్తూ, 2021లో చిన్న స్థాయిలో పూల పెంపకం ప్రారంభించారు. క్రమంగా ఆమె పూల పెంపకంలో ఉన్న సామర్థ్యాన్ని చూడటం ప్రారంభించారు. పెళ్ళిళ్లు లేదా పండుగలకు ఎల్లప్పుడూ పూలకు గిరాకీ ఉంటుందని ఆమె గమనించారు. వెసాలు గారు ఈ అభిరుచిని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రయాణంలో ఆమె స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పుష్ప సాగులో శిక్షణ పొందారు. ఆ తర్వాత కేవలం పావు ఎకరం భూమిలో వేలాది గ్లాడియోలస్ మొక్కలను నాటారు. ఆమె మొదటి ప్రయత్నంలోనే 5వేల కంటే ఎక్కువ పువ్వులు వికసించాయి. మిత్రులారా! ఈ విజయం వెసాలు జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని అందించింది. ఆమె పూల సాగును మరింత విస్తరించారు. ఒకప్పుడు స్థానిక మార్కెట్‌కే పరిమితమైన ఆ పువ్వులు ఇప్పుడు నాగాలాండ్‌ను దాటి ఢిల్లీ, ముంబాయి వంటి నగరాలకు చేరుకుంటున్నాయి. అభిరుచి, కఠోర శ్రమ, సరైన మార్గదర్శకత్వం కలిసినప్పుడు అది కొత్త అవకాశాలను ఎలా అందిస్తుందో వెసాలు పురో ప్రయాణం మనకు నిరూపిస్తుంది.
నా ప్రియమైన దేశవాసులారా! మన చుట్టూ చాలా మంది ఒక చిన్న ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు. అతి తక్కువ సమయంలోనే వారి కృషి ఎందరి జీవితాలనో మార్చివేస్తుంది. ఒడిషాలోని దేబ్రీగఢ్‌లో ‘ధోడరోకుసుమ్’ అనే గ్రామం ఉంది. కొన్ని సంవత్సరాల కిందటి వరకు ఈ గ్రామంలో నివసించే మైథిలీ భూయే గారు దాదాపు ప్రతిరోజూ అడవికి వెళ్ళేవారు. కొన్నిసార్లు కట్టెలు సేకరించడానికి; కొన్నిసార్లు మహువా, కేందు ఆకులను సేకరించడానికి; కొన్నిసార్లు వెదురు, ఇతర అటవీ ఉత్పత్తులను సేకరించడానికి అడవికి ఆమె వెళ్ళేవారు. ఆ అడవి ఆమె కుటుంబంతో పాటు అనేక ఇతర కుటుంబాల అవసరాలను తీర్చింది. ఆ తర్వాత మైథిలి గారు దేబ్రీగఢ్ ఎకో-టూరిజంలో చేరారు. అక్కడి నుండి అడవితో ఆమెకున్న అనుబంధం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు అటవీ సంరక్షణ ఆమె జీవనోపాధిగా కూడా మారింది. మిత్రులారా! మైథిలి జీవితంలో వచ్చిన ఈ మార్పు ఇతర మహిళలకు కూడా స్ఫూర్తినిచ్చింది. నేడు 60 మందికి పైగా మహిళలు అటవీ సంరక్షణలో పాలుపంచుకుంటున్నారు. కొందరు వన్యప్రాణులను రక్షించే బాధ్యతను నిర్వహిస్తున్నారు. కొందరు పచ్చిక బయళ్ల అభివృద్ధిలో, మరికొందరు పర్యావరణ పర్యాటకంలో నిమగ్నమై ఉన్నారు. వారు సామాజిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. మిత్రులారా! మైథిలీ గారు, దేబ్రీగఢ్ కు చెందిన ఈ సోదరీమణులు ప్రకృతిని పరిరక్షించడంతో పాటు జీవితాన్ని సుసంపన్నంగా మలుచుకోవచ్చని నిరూపించారు. ఈ సోదరీమణుల కృషి మనందరికీ గొప్ప స్ఫూర్తి.
మిత్రులారా! ఈ రోజు మన ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కలలు కనే వేలాది మంది ఆడపిల్లలను భారతదేశం ఏకం చేస్తోందని తెలిసి మీరు గర్వపడతారు. ఈ కార్యక్రమాన్ని మిషన్ శక్తిశాట్ అని పిలుస్తారు. దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12 వేల మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవడానికి, ఆవిష్కరణల రంగంలో పురోగమించడానికి అవకాశం పొందుతున్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవమైన ఆగస్టు 23న ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఈ మిషన్‌కు సంబంధించిన ఒక అందమైన దృశ్యం కనిపించింది. గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో మిషన్ శక్తిశాట్ రెండవ దశ ప్రారంభమైంది. ఈ సందర్భంగా భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుండి సుమారు 100 మంది విద్యార్థినులు ఒకచోట చేరారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుండి ఎంపిక చేసిన విద్యార్థినులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఈ మొత్తం ప్రయత్నం లక్ష్యం కూడా చాలా ప్రత్యేకమైనది. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్ష్యలోకి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. మిత్రులారా! రాబోయే కాలంలో ఈ విద్యార్థినులలో చాలా మంది సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాలలో తమకంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టించుకుంటారని నేను విశ్వసిస్తున్నాను.
ప్రియమైన దేశప్రజలారా! ఈ రోజుల్లో అవకాడో పండుకు విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో ఈ పండు గురించి చాలా తక్కువ మందికి తెలిసేది. దీని విలువ, డిమాండ్ రెండూ తక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో ఇది డైనింగ్ టెబుళ్లపై విరివిగా కనిపిస్తోంది. నేడు ఇది ఆరోగ్య, ప్రీమియం మార్కెట్లలో అత్యంత ఇష్టమైనదిగా మారింది. ఇది మన రైతు సోదర సోదరీమణులకు కూడా చాలా సహాయకారిగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన వరదరాజ్ గారు ఇందుకు ఒక ఉదాహరణ. ఆయన చాలా సంవత్సరాలుగా తన పొలాల్లో టమోటాలు, అరటిపండ్లు పండిస్తూ వచ్చారు. ఒకరోజు ఆయన తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూశారు. ఆ తర్వాత ఆయన యూట్యూబ్ నుండి దాని గురించి సమాచారం సేకరించారు. ఇప్పటివరకు ఆయన సుమారు 4 టన్నుల అవకాడోను పండించారు. ఈనాడు ఆయన దానిని నేరుగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొత్త పంట, శాస్త్రీయ సలహాలు, ప్రత్యక్ష మార్కెటింగ్‌తో ఆయన చిన్న పొలం ఆదాయం పూర్తిగా మారిపోయింది. తమిళనాడులోని కొడైకెనాల్‌కు చెందిన రైతు చంద్రశేఖరన్ గారు అర హెక్టారు భూమిలో అవకాడో పండించడం ప్రారంభించారు. ఆయనకు దానికి మంచి ధరలు లభిస్తున్నాయి. ఆయన ఆదాయం కూడా పెరిగింది. కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన కొందరు రైతు సోదర సోదరీమణులు తమ కాఫీ తోటల మధ్యలో అవకాడోను పండించారు. దీనివల్ల వారికి కాఫీ, నల్ల మిరియాలతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. మిత్రులారా! మనం నగరాల్లోని రెస్టారెంట్లలో అవకాడో టోస్ట్ గురించి తరచుగా వింటూ ఉంటాం. కానీ ఈ అవకాడో ద్వారానే మన సృజనాత్మక రైతులు ఆదాయం సంపాదించడానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొన్నారు. అంటే మన దేశపు అవకాడో మీ టోస్ట్ రుచిని మెరుగుపరచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా పెంచిందన్నమాట.
ప్రియమైన దేశవాసులారా! మరికొన్ని రోజుల్లో- సెప్టెంబర్ 3వ తేదీన- మనం గొప్ప కథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారి శత జయంతిని జరుపుకోబోతున్నాం. మిత్రులారా! ఉత్తమ్ కుమార్ గారు తన నటనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ‘నాయక్ – ది హీరో’ సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని మహా కథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారిని దృష్టిలో పెట్టుకునే సత్యజిత్ రే గారు రాశారని సినీ ప్రేమికులు భావిస్తారు. ఆయనలో హుందాతనంతో పాటు అద్భుతమైన భావోద్వేగ గాఢత కూడా ఉండేదని సత్యజిత్ రే గారు చెప్పేవారు. పాత్రకు జీవం పోయడానికి ఆయన చాలా కష్టపడేవారు. ఉత్తమ్ కుమార్ గారు తన నిరాడంబరతకు, దాతృత్వ సుగుణానికి ప్రసిద్ధి చెందారు. ఓటమి చెందినా నిరాశ పడకుండా విజయం వైపు పురోగమించాలని ఆయన జీవితం నుండి మనం నేర్చుకోగల మరో ముఖ్యమైన పాఠం. ఆయన తొలి చిత్రాలు అంతగా విజయం సాధించలేదు. కానీ ఆయన తన పనిపై దృష్టి సారించారు. అందువల్లే ఆయన విజయాలు సాధించారు. మిత్రులారా! నేను కోల్‌కతాలో రోడ్ షో చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమార్ గారి ఇంటి మీదుగా వెళ్ళిన విషయం నాకు గుర్తుంది. అక్కడ ఒక వ్యక్తి నాకు ఆయన ఫోటోను బహుమతిగా ఇచ్చారు. ఆ మహనీయుడు ఉత్తమ్ కుమార్ గారికి నేను మరోసారి నా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మన హృదయాలను ఏలుతూనే ఉంటారు.
“మహానాయక్ ఉత్తమ్ కుమార్ చీరోదిన్ మానుషేర్ హృదయే రాజ్ కోర్బెన్”
ప్రియమైన దేశవాసులారా! మన పర్వదినాలు, వేడుకలు మన సంప్రదాయాలతో పాటు మనల్ని ఒకరితో ఒకరు అనుసంధానం చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. రాబోయే రోజుల్లో మనం మరెన్నో ముఖ్యమైన పండుగలను జరుపుకోబోతున్నాం. పవిత్రమైన జన్మాష్టమి పండుగ సెప్టెంబర్ 4వ తేదీన ఉంది. మనం సెప్టెంబర్‌లో విశ్వకర్మ పూజను కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతివృత్తులవారు, శిల్పకారులు, విశ్వకర్మ మిత్రులను మనం గౌరవించుకోవాలి. ఇంకొన్ని నెలల్లో దీపావళి కూడా రాబోతోంది. దానికోసం సన్నాహాలు నెమ్మదిగా మొదలవుతున్నాయి. ఈ పండుగ కాలంలో ‘స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి’ అని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను. ‘స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి’- ‘వోకల్ ఫర్ లోకల్’ అంటే కేవలం మట్టి దీపాలు కొనడం మాత్రమే కాదు. దాని దృక్కోణం చాలా విస్తృతం. మనం మన ఇంటి కోసం ఏ వస్తువులు కొన్నా అవి భారతదేశంలో తయారయ్యాయో లేదో తప్పకుండా చూసుకోవాలి. భారతదేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల గర్వపడటం ద్వారా మాత్రమే భారతదేశం స్వయంసమృద్ధి మార్గాన్ని సుగమం చేసుకోగలదు. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయడం మన బాధ్యత. మన సృజనాత్మక ప్రపంచ మిత్రులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారు. ‘వోకల్ ఫర్ లోకల్’ అనే నినాదాన్ని మీరు పాటించాలని, అలాగే ఇతరులను కూడా అలా చేయడానికి ప్రేరేపించాలని నేను కోరుతున్నాను.
మిత్రులారా! మీ చుట్టూ ఉన్న ఎంతో మంది తమ చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా సమాజంలో గొప్ప మార్పులను తీసుకువస్తున్నారు. దయచేసి వారి గురించి ‘మన్ కీ బాత్’ కోసం రాయండి. మీరు పంపించే అనుభవాలు దేశంలోని ఏదో ఒక మూలలో ఉన్న కొందరికి ఎంతో కొత్త స్ఫూర్తిగా ఉంటాయి. మీ సూచనలు, అనుభవాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం!
***
#MannKiBaat has begun. Tune in! https://t.co/sLZaQ83YUp
— PMO India (@PMOIndia) August 30, 2026
A unique website created by Shri Krishna Seshadri Ji is making learning history even more interesting.#MannKiBaat pic.twitter.com/6Tp10CsJHO
— PMO India (@PMOIndia) August 30, 2026
Let us come together to build a drug-free India and a stronger future for our youth.#MannKiBaat#NashaMuktYuva pic.twitter.com/ep2f0WDzXA
— PMO India (@PMOIndia) August 30, 2026
The Tiranga brought people together across India and around the world.#MannKiBaat pic.twitter.com/RCaucEJue2
— PMO India (@PMOIndia) August 30, 2026
PM SVANidhi Yojana is helping lakhs of women street vendors expand their businesses, increase their incomes and build a better future for their families.#MannKiBaat pic.twitter.com/MOtKlVkXOK
— PMO India (@PMOIndia) August 30, 2026
From young volunteers in Uttar Pradesh's Rampur cleaning their neighbourhoods to pilgrims joining the cleanliness drive during the Shri Amarnath Ji Yatra, Swachhata is becoming a people's resolve.#MannKiBaat pic.twitter.com/xPLghWi7D6
— PMO India (@PMOIndia) August 30, 2026
From Phek district in Nagaland, Vesalu Puro Ji turned her passion for flowers into a thriving venture.#MannKiBaat pic.twitter.com/IkCztlKsLf
— PMO India (@PMOIndia) August 30, 2026
In Odisha's Debrigarh region, Maithili Bhue Ji's journey from depending on forest produce to becoming part of eco-tourism has inspired several women to contribute towards forest conservation.#MannKiBaat pic.twitter.com/g41BNVwfGJ
— PMO India (@PMOIndia) August 30, 2026
Mission ShaktiSAT is bringing together girl students from 108 countries and giving them the opportunity to learn about satellite technology as well as explore new frontiers in science, technology, and innovation.#MannKiBaat pic.twitter.com/0jydyhtTrV
— PMO India (@PMOIndia) August 30, 2026
Avocado is finding a new place in India's farms and markets. #MannKiBaat pic.twitter.com/oEnZfbij0T
— PMO India (@PMOIndia) August 30, 2026
Mahanayak Uttam Kumar continues to inspire generations. His remarkable performances, dedication and ability to bring every character to life made him an unforgettable icon of Indian cinema.#MannKiBaat pic.twitter.com/JayfStHgon
— PMO India (@PMOIndia) August 30, 2026