పిఎంఇండియా
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం! మీ అందరినీ మరోసారి మన్ కీ బాత్ కార్యక్రమం లోకి ఆహ్వానిస్తున్నాను. ఈ మార్చి నెలలో ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. మనకు గతంలోని కోవిడ్ పరిస్థితులు గుర్తున్నాయి. చాలా కాలంపాటు కోవిడ్ కారణంగా మనం ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం. కరోనా సంకట కాలం నుండి బయట పడ్డ తర్వాత ప్రపంచం ప్రగతి దిశలో పురోగమిస్తుందని ఆశించాం. కానీ ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో యుద్ధాలు, సంఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మన ఇరుగుపొరుగు ప్రాంతాల్లో ఒక నెల రోజులుగా యుద్ధం కొనసాగుతూ వస్తోంది. మన లక్షలాది దేశీయుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆ దేశాలలో నివసిస్తున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో వారు ఉన్నారు. నేను గల్ఫ్ దేశాలకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అక్కడ ఉన్న కోటికి పైగా భారతీయులకు వారు అన్ని రకాలుగా సహాయం అందజేస్తున్నారు.
మిత్రులారా! ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న ప్రాంతం మన ఇంధన అవసరాలకు కేంద్రం. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ తదితర అవసరాలకు ఇబ్బంది ఏర్పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి అందుతోన్న సహకారం, గత దశాబ్ద కాలంగా దేశంలో పెరిగిన సామర్థ్యం కారణంగా భారతదేశం ఈ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కుంటోంది.
మిత్రులారా! ఇది సవాళ్ళతో కూడిన సమయం. మనమంతా సామూహిక శక్తితో ఈ సవాలును ఎదుర్కోవాలని మన్ కీ బాత్ మాధ్యమం ద్వారా దేశ ప్రజలందరినీ కోరుతున్నాను. ఈ విషయాన్ని ఎవరూ రాజకీయం చేయకూడదు. ఇది దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన విషయం. కాబట్టి ఇందులో రాజకీయానికి స్థానం లేదు. ఈ విషయంలో వదంతులు ప్రచారం చేసేవారు దేశానికి చాలా నష్టం కలిగిస్తున్నారు. ఈ పుకార్ల మాయలో పడవద్దని నేను దేశప్రజలందరినీ కోరుతున్నాను. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందజేస్తున్న సమాచారాన్ని విశ్వసించండి. ఆ సమాచారం ఆధారంగానే అడుగు ముందుకువేయండి. ప్రతిసారీ లాగానే ఈసారి కూడా నాకు విశ్వాసముంది. 140 కోట్ల మంది దేశ ప్రజలు సమర్థతతో, సామూహికంగా గతంలోని గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నట్టు గానే ఇప్పుడు కూడా సామూహిక కృషితో కఠిన పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటాం. క్షేమంగా బయటపడతాం.
నా ప్రియమైన దేశ ప్రజలారా! భారతదేశ శక్తి ఇక్కడి కోట్లాది ప్రజల్లో నిక్షిప్తమై ఉంది. దేశవాసుల ప్రజాభాగస్వామ్య భావనను వెల్లడించే ఒక కృషిని గురించి ఈరోజు ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ కృషి పేరు- జ్ఞాన భారతం సర్వే. ఇది మన గొప్ప సంస్కృతి, వారసత్వాలకు సంబంధించినది. దీని లక్ష్యం దేశవ్యాప్తంగా ఉన్న మాన్యుస్క్రిప్ట్స్ – అంటే లిఖిత ప్రతులను గురించి సమాచారాన్ని క్రోడీకరించడం. జ్ఞాన భారతం యాప్ ద్వారా ఈ సర్వేలో పాల్గొనవచ్చు. మీ దగ్గర ఏదైనా మాన్యు స్క్రిప్ట్- ఏదైనా లిఖిత ప్రతి ఉంటే ఆ ఫోటోను జ్ఞాన భారతం యాప్ లో అప్ లోడ్ చేయండి. లిఖిత ప్రతులకు సంబంధించిన సమాచారం ఉన్నా ఆ వివరాలను యాప్ లో నమోదు చేయండి. ప్రతి ఎంట్రీకి సంబంధించిన సమాచారం నిక్షిప్తం చేయడానికి ముందు ధృవీకరణ కూడా జరుగుతుంది. ఇప్పటివరకు వేలాది రాత ప్రతులను ప్రజలు పంచుకోవడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఉదాహరణకు అరుణాచల్ ప్రదేశ్‌లోని నామ్సాయికి చెందిన చావో నంతిసింధ్ లోకాంగ్ గారు తాయ్ లిపిలో లిఖిత ప్రతులను పంచుకున్నారు. అమృత్ సర్ కు చెందిన సోదరులు అమిత్ సింగ్ రాణా గారు గురుముఖి లిపిలో రాత ప్రతులను షేర్ చేశారు. ఇది మన మహోన్నత సిక్కు పరంపర, పంజాబీ భాషతో అనుసంధానమైన లిపి. తాటాకులపై రాసిన రాత ప్రతులను కొన్ని సంస్థలు పంచుకున్నాయి. రాగి రేకులపై రాసిన అత్యంత పురాతనమైన రాత ప్రతిని రాజస్థాన్ కు చెందిన అభయ్ జైన్ గ్రంథాలయం అందజేసింది. లడఖ్‌లోని హమీస్ మఠం టిబెటన్ భాషలోని విలువైన రాతప్రతుల సమాచారం ఇచ్చింది. ఇక్కడ నేను కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇచ్చాను. ఈ సర్వే జూన్ నెల మధ్య వరకు కొనసాగుతుంది. సంస్కృతికి సంబంధించిన విషయాలను అందరికీ తెలియజేయాలని నేను మీ అందరినీ కోరుతున్నాను.
నా ప్రియమైన దేశ వాసులారా! భారతదేశం ప్రపంచంలోనే అన్నిటికంటే యువదేశం. దేశ యువత శక్తి దేశ నిర్మాణంతో అనుసంధానమైతే గొప్ప సహకారం లభిస్తుంది. దేశ నిర్మాణ బాధ్యతలో గొప్ప భూమికను నిర్వహిస్తోంది మై యంగ్ భారత్ – MY Bharat సంస్థ. దేశ యువతను అనేక పాజిటివ్ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసింది ఈ సంస్థ. MY Bharat సంస్థ ద్వారా Budget Quest కార్యక్రమం కూడా జరిగింది. ఈ కార్యక్రమ లక్ష్యం దేశ యువతను బడ్జెట్ ప్రక్రియలో, విధాన రూపకల్పనలో భాగస్వాములను చేయడం. దీనితో అనుసంధానమైన క్విజ్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 12 లక్షల మంది యువతీ యువకులు పాల్గొన్నారు. క్విజ్ కార్యక్రమం తర్వాత సుమారు ఒక లక్ష 60 వేల మంది యువతీ యువకులను వ్యాస రచన పోటీకి ఎంపిక చేశారు. వీటిలో కొన్ని వ్యాసాలు చదివే అవకాశం నాకు లభించింది. దేశ యువత దేశ వికాసంలో భాగస్వాములయ్యేందుకు ఎంత ఆసక్తితో ఉన్నారో వీటి ద్వారా నాకు తెలిసింది. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కోట్ల రఘువీర్ రెడ్డి, ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీకి చెందిన సౌరభ్ బైసవార్, బీహార్ లోని గోపాల్ గంజ్ కు చెందిన సుమిత్ కుమార్ రైతుల సంక్షేమానికి సంబంధించిన అంశంపై రాశారు. పంజాబ్ లోని మొహాలీకి చెందిన ఆంచల్, ఒడిషాలోని కేంద్రపాడా కు చెందిన ఓం ప్రకాశ్ రథ్ మహిళల సారథ్యంలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళే విధానాలపై తమ అభిప్రాయాలను వ్యక్తీకరించారు. హరిత, స్వచ్ఛ భారత్ మాత్రమే సమృద్ధ భారతదేశానికి మార్గమని హర్యానాలోని యమునానగర్ కు చెందిన ప్రథమ్ బరార్ అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయాలు వారి లోతైన ఆలోచనాధోరణులకు అద్దం పడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు సంబంధించి ఎక్కువ కృషి జరగాలని ఢిల్లీ కి చెందిన శంఖ్ గుప్తా రాశారు. మన యువ మిత్రులు skill development, ease of doing business అంశాలపై కూడా తమ అభిప్రాయాలను తెలియజేశారు. తమ అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకున్న యువ మిత్రులందరినీ నేను అభినందిస్తున్నాను. ఈ అభిప్రాయాలు దేశాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తాయి.
నా ప్రియమైన దేశ ప్రజలారా! దేశవ్యాప్తంగా ఉన్న cricket fans ను ఈ నెల ఉల్లాస ఉత్సాహాలతో నింపింది. భారతదేశం T20 World Cup లో చారిత్రాత్మక విజయం పొందడంతో దేశవ్యాప్తంగా ఆనందం వెల్లువైంది. మన టీం సాధించిన ఈ అద్భుత విజయం మనందరికీ గర్వ కారణం. కర్ణాటకలోని హుబ్లీలో గత నెల చివర్లో ఒక ఆసక్తికరమైన పోటీ జరిగింది. ఈ పోటీలో గెలిచి, జమ్మూ కాశ్మీర్ కు చెందిన క్రికెట్ జట్టు రంజీ ట్రోఫీ సాధించింది. సుమారు ఏడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ జట్టు రంజీని సాధించడం సంతోషించదగ్గ విషయం. ఈ అద్భుత విజయం క్రీడాకారులు ఎన్నో సంవత్సరాల పాటు సాగించిన కృషి ఫలితం. టీం కెప్టెన్ పారస్ డోగ్రా అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. తన నేతృత్వంలో సాధించిన ఈ విజయంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. రంజీ ట్రోఫీ సీజన్‌లో 60 వికెట్లు తీసిన యువ కాశ్మీరీ బౌలర్ ఆకిబ్ నబీ ప్రదర్శన గురించి ఈ రోజు దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. ఈ విజయం జట్టు ఆటగాళ్లను, కోచింగ్ సిబ్బందిని, అలాగే జమ్మూ కాశ్మీర్ ప్రజలను ఎంతగానో ఉత్సాహపరిచింది. క్రికెట్ మైదానంలో ఈ అద్భుత ప్రదర్శన అక్కడి యువతలో క్రీడల పట్ల ఉత్సాహాన్ని మరింత పెంచింది. భవిష్యత్తులో ఇది ఇంకా చాలా మందిని క్రీడలలో పాల్గొనేందుకు ప్రేరేపిస్తుంది. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు క్రీడల పట్ల అపారమైన అభిరుచి ఉంది. ఈ రాష్ట్రం ఇప్పుడు ప్రధాన క్రీడా కార్యక్రమాలకు కేంద్రంగా మారుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. గుల్మార్గ్ ఇప్పటికే ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌కు వేదికగా నిలిచింది. ఇక్కడి యువతలో ఫుట్‌బాల్ వంటి క్రీడలు కూడా చాలా ప్రాచుర్యం పొందాయి. జమ్మూ కాశ్మీర్ ఆటగాళ్ల ఈ విజయ పరంపర భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతుందని నేను ఆశిస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! ఆడేవారే రాణిస్తారని నేను తరచుగా చెప్తుంటాను. గతంలో అంతగా ప్రాచుర్యం లేని క్రీడలను కూడా మన దేశ యువత ఇప్పుడు స్వీకరిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రతిభావంతుడైన అథ్లెట్ గుల్వీర్ సింగ్ అలాంటి ఒక క్రీడలో రాణించారు. కొన్ని వారాల క్రితం న్యూయార్క్ సిటీ హాఫ్ మారథాన్‌లో మూడవ స్థానంలో నిలిచి ఆయన చరిత్ర సృష్టించారు. గంటలోపు హాఫ్ మారథాన్‌ను పూర్తి చేసిన మొదటి భారతీయ అథ్లెట్‌గా ఆయన రికార్డు నెలకొల్పారు. స్క్వాష్ క్రీడాకారిణి అయిన అనాహత్ సింగ్ స్క్వాష్ ఆన్ ఫైర్ ఓపెన్‌లో ఒక ప్రధాన అంతర్జాతీయ టైటిల్‌ను గెలుచుకున్నారు. కేవలం 17 ఏళ్ల వయసులోనే ఆమె ఈ విజయాన్ని సాధించారు. దీంతో PSA ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-20లోకి ప్రవేశించిన అతి చిన్న వయస్కురాలైన ఆసియా మహిళా క్రీడాకారిణిగా ఆమె నిలిచారు. నాకు అస్మిత అథ్లెటిక్స్ లీగ్ గురించి కూడా తెలిసింది. మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా ఇందులో అనేక క్రీడా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ లీగ్‌లో సుమారు 2 లక్షల మంది అమ్మాయిలు పాల్గొన్నారు. దేశంలో జరుగుతున్న ఈ క్రీడా పరివర్తనలో భారత మహిళా శక్తి కీలక పాత్ర పోషిస్తుండటం ఆనందదాయకంగా ఉంది.
మిత్రులారా! మీరందరూ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టాలని నేను ఎప్పుడూ కోరుతూనే ఉన్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 100 రోజుల కన్నా తక్కువ సమయం మిగిలి ఉండగా ప్రపంచవ్యాప్తంగా యోగా పట్ల ఆకర్షణ కూడా నిరంతరం పెరుగుతోంది. ఆఫ్రికాలోని జిబూతిలో అల్మిస్ గారు తన అరవింద యోగా కేంద్రం ద్వారా యోగాను ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ అనేక ఇతర ప్రదేశాలలో కూడా అల్మిస్ గారు ప్రజలకు యోగా నేర్పిస్తారు. ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ యువరాజ్ దువా పోస్ట్‌కు నేను ఇచ్చిన సమాధానంపై మీలో చాలా మంది స్పందించారు. చక్కెర వాడకాన్ని తగ్గించుకోవలసిందిగా తన తండ్రికి చెప్పమని ఆయన నన్ను కోరారు. నా అభ్యర్థన ఆయన తండ్రిపై సానుకూల ప్రభావాన్ని చూపినందుకు నాకు సంతోషంగా ఉంది. మీరందరూ కూడా చక్కెర వాడకాన్ని తగ్గించాలని నేను కోరుతున్నాను. నేను ఇంతకు ముందే చెప్పినట్టు మనం వంట నూనె వాడకాన్ని కూడా 10 శాతం తగ్గించుకోవాలి. ఈ చిన్న చిన్న ప్రయత్నాలతో మీరు ఊబకాయం, జీవనశైలి సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంటారు.
నా ప్రియమైన దేశ ప్రజలారా! ‘అభ్యాసం కూసు విద్య’ అని లోకోక్తి. అంటే అభ్యాసం చేసిన కొద్దీ జ్ఞానం వికసిస్తుందని అర్థం. నిరంతర సాధన మనుషులను పరిపూర్ణులుగా చేస్తుంది. ప్రజలు చురుకుగా పాల్గొన్నప్పుడు ఎక్కువగా నేర్చుకుంటారు. నేను బెంగళూరులో ఒక విశిష్టమైన విద్యా కార్యక్రమం గురించి తెలుసుకున్నాను. ఒక బృందం ‘ప్రయోగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్’ను నిర్వహిస్తోంది. ఈ బృందం పరిశోధన ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. వారు పాఠశాల స్థాయిలో విజ్ఞాన శాస్త్ర విద్యను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. వారు ‘అన్వేషణ’ అనే ప్రయోగాన్ని నిర్వహించారు. ఇది 9వ తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులకు రసాయన శాస్త్రం, భూ శాస్త్రం, ఆరోగ్యం వంటి రంగాలలో నూతన ఆవిష్కరణలు చేసే అవకాశాన్ని అందిస్తుంది. ఇది విద్యార్థులకు విలువైన పరిశోధన అనుభవాన్ని ఇస్తుంది. వారి ప్రాజెక్టులను ప్రచురించడానికి ఒక వేదికను అందిస్తుంది.
మిత్రులారా! మనం పరీక్షల గురించి చర్చిస్తున్నప్పుడు కొంతమంది విద్యార్థులు తాము సైన్స్ చదవాలనుకుంటున్నామని, కానీ ఆ విషయంలో భయపడుతున్నామని నాతో చెప్పారు. ఈ దిశగా ప్రయోగ్ బృందం చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయం. ఈ కార్యక్రమం విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రంతో మమేకమై, ఏదైనా విషయాన్ని ప్రాక్టికల్ గా ప్రదర్శించే అవకాశాన్ని ఇస్తుంది. మనం ఏదైనా స్వయంగా ప్రయత్నించినప్పుడు మనలో ఉత్సాహం, ఆసక్తి కలుగుతాయి. ఎవరికి తెలుసు- నా ఈ యువ మిత్రులలో ఒకరు భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్త కావచ్చు!
మిత్రులారా! నాగా సమాజం కూడా విద్య ద్వారా గతాన్ని పరిరక్షించి, భవిష్యత్తుకు సిద్ధం కావడానికి కృషి చేస్తోంది. ఈ సమాజ ప్రజలు తమ గిరిజన సంప్రదాయాలను ఎంతో గౌరవిస్తారు. వారు వాటి విషయంలో గర్వపడటమే కాకుండా తమ ధోరణులను ఆధునికంగా కూడా ఉంచుకుంటారు. నాగా తెగలకు మోరుంగ్ అభ్యసనమనే సాంప్రదాయిక వ్యవస్థ ఉండేది. ఇందులో పెద్దలు తమ అనుభవాల నుండి యువతకు సాంప్రదాయిక జ్ఞానం, చరిత్ర, జీవిత నైపుణ్యాలను బోధించేవారు. కాలక్రమేణా, ఈ వ్యవస్థ ఇప్పుడు మోరుంగ్ విద్యా భావనగా పరిణామం చెందింది. దీని ద్వారా గణితం, విజ్ఞానశాస్త్రం వంటి విషయాలపై పిల్లలు ఆసక్తి కనబరిచేలా ప్రోత్సహిస్తారు. ఇందులో సమాజంలోని పెద్దలు వారికి కథలు, జానపద గీతాలు, సంప్రదాయ ఆటలతో పాటు జీవిత నైపుణ్యాలను బోధిస్తారు. ఈ విధంగా మన నాగాలాండ్ తన సాంస్కృతిక వారసత్వాన్ని సురక్షితంగా ఉంచుకుంటూనే పిల్లల విద్యను ముందుకు తీసుకువెళుతోంది. మీ ప్రాంతంలో ఇలాంటి ప్రయత్నాల గురించి మీకు తెలిస్తే నాతో తప్పకుండా పంచుకోండి.
నా ప్రియమైన దేశ ప్రజలారా! దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. జల సంరక్షణ సంకల్పాన్ని మరోసారి ముందుకు తీసుకురావలసిన సమయం వచ్చేసింది. గత 11 సంవత్సరాలలో ‘జల్ సంచయ్ అభియాన్’ ప్రజల్లో చాలా అవగాహనను పెంచింది. ఈ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 50 లక్షల Artificial Water Harvesting Structures తయారయ్యాయి. నీటి సమస్యను నివారించేందుకు ప్రతి గ్రామంలో సామూహికంగా కృషి జరగడం చూసి నాకు సంతోషంగా ఉంది. కొన్ని చోట్ల పాత చెరువులను శుద్ధి చేస్తున్నారు. కొన్ని చోట్ల వాన నీటి సంరక్షణ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమృత్ సరోవర్ అభియాన్ కింద దేశవ్యాప్తంగా 70 వేల అమృత సరోవరాలు ఏర్పాటు అయ్యాయి. వర్షాకాలం వచ్చే ముందుగానే ఈ సరోవరాలను శుద్ధి చేయడం ప్రారంభమైంది. స్ఫూర్తిదాయకమైన ఒక ఉదాహరణను ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రజల భాగస్వామ్యంతో జల సంరక్షణ ఎంత విస్తృతమవుతుందో ఈ ఉదాహరణ తెలియజేస్తుంది.
మిత్రులారా! త్రిపురలోని వాంగమున్ గ్రామం జంపుయీ పర్వతాలలో మూడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఊరు నీటి విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఎండాకాలం నీటి కోసం ఈ గ్రామస్తులు చాలా దూరం వెళ్ళవలసి వచ్చేది. వర్షాకాలంలో కురిసిన ప్రతి నీటిబొట్టును కాపాడుకోవాలనే నిర్ణయానికి ఆ ఊరి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వాంగమున్ గ్రామంలో దాదాపు ప్రతి ఇంట్లో Rooftop Rainwater Harvesting System ఏర్పాటు జరిగింది. ఒకప్పుడు నీటికి కటకట ఎదుర్కొన్న గ్రామం ఇప్పుడు నీటి సంరక్షణ విషయంలో ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణగా మారింది.
మిత్రులారా! ఇదే విధంగా ఛత్తీస్ గఢ్ లోని కొరియా జిల్లాలో కూడా ఒక ప్రత్యేకమైన చొరవను ఉదాహరణగా చెప్పవచ్చు. అక్కడి రైతులు ఒక ప్రభావవంతమైన, సులువైన ఆలోచనను అమలు చేశారు. చిన్న చిన్న చెరువులను, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు. వీటి కారణంగా వాన నీరు పొలాల్లోనే నిలిచే విధంగా చూశారు. పొలాల్లో నిలిచిన వాన నీరు నెమ్మది నెమ్మదిగా అక్కడి భూమి లోకి ఇంకిపోయేది. ఆ ప్రాంతంలోని 1200కు పైగా రైతులు ఈ విధానాన్ని పాటించారు. ఇప్పుడు గ్రామంలోని భూగర్భ జల మట్టం మెరుగుపడింది. ఇదే విధంగా తెలంగాణలోని మంచిర్యాల జిల్లా ముధిగుంట గ్రామంలో కూడా ప్రజలు సంఘటితంగా ఉండి, నీటి సమస్యను దూరం చేసుకున్నారు. గ్రామంలోని 400 కు పైగా కుటుంబాల వారు ఇంకుడు గుంతలను ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నారు. వారు నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చారు. దీంతో భూగర్భజల మట్టం మెరుగుపడింది. అంతే కాకుండా కలుషిత నీటి వల్ల కలిగే వ్యాధులు గణనీయంగా తగ్గాయి.
ప్రియమైన దేశప్రజలారా! మన మత్స్యకార సోదర సోదరీమణులు కేవలం సముద్ర యోధులు మాత్రమే కాదు- వారు ఆత్మనిర్భర భారతదేశానికి బలమైన పునాదిని కూడా ఏర్పరుస్తున్నారు. తెల్లవారుజామున సముద్రపు అలలతో పోరాడుతూ వారు తమ కుటుంబాలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తారు. కష్టపడి పనిచేసే ఈ మత్స్యకారుల జీవితాలు నేడు అనేక విధాలుగా సులభతరంగా మారుతున్నాయి. ఓడరేవుల అభివృద్ధి, మత్స్యకారుల భీమా మొదలైన అనేక కార్యక్రమాలు వారి అభివృద్ధికి దోహదపడుతున్నాయి. సముద్రంలో వారి కార్యకలాపాలపై వాతావరణ పరిస్థితులు ఎంతగానో ప్రభావం చూపుతాయని మనకు తెలుసు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి సాంకేతికత ద్వారా పూర్తి సహకారం లభిస్తోంది. ఇటువంటి ప్రయత్నాలు మన మత్స్య రంగాన్ని సుసంపన్నం చేయడమే కాకుండా నూతన ఆవిష్కరణల స్ఫూర్తిని కూడా నింపుతున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను.
నేడు ఫిషరీస్, సీవీడ్ – మత్స్య, సముద్రపు నాచు రంగాలలో కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. మన మత్స్యకార సోదర సోదరీమణులు స్వయం సమృద్ధి సాధిస్తున్నారు. ఒడిషాలోని సంబల్‌పూర్‌కు చెందిన సుజాత భూయాన్ ఒక గృహిణి. ఆమె వినూత్నంగా ఏదైనా పని చేసి తన కుటుంబానికి మరింత సహాయం చేయాలనుకుంది. అందుకే కొన్ని సంవత్సరాల కిందట ఆమె హీరాకుడ్ జలాశయంలో చేపల పెంపకాన్ని ప్రారంభించింది. ఆమెకు తొలి రోజులు అంత సులభంగా గడవలేదు. వాతావరణ మార్పులు, చేపలకు ఆహారం ఏర్పాటు చేయడం, ఇంటి బాధ్యతలను సమతుల్యం చేసుకోవడం వంటివి ఎన్నో సవాళ్లను విసిరాయి. కానీ ఆమె సంకల్పం చెక్కుచెదరలేదు. కేవలం రెండు, మూడు సంవత్సరాలలోనే ఆమె తన ప్రయత్నాన్ని ఒక విజయవంతమైన వ్యాపారంగా మార్చారు. నేడు ఆమె విజయం తన సమాజంలోని మహిళలకు ఒక నవీన ఆశాకిరణంగా మారింది.
మిత్రులారా! లక్షద్వీప్‌లోని మినీకాయ్‌కు చెందిన హావ్వా గుల్జార్ గారి కథ మన తల్లులు, సోదరీమణుల అద్భుతమైన సంకల్ప బలాన్ని తెలియజేస్తుంది. ఆమె ఒక చేపల ప్రాసెసింగ్ యూనిట్‌ను నడిపేవారు. కానీ, ఒక మంచి కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం ఉంటే ఇంకా మెరుగ్గా రాణించగలనని ఆమె భావించారు. అందుకే ఆమె ఒక కోల్డ్ స్టోరేజ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈనాడు అదే ఆమెకు బలంగా మారింది. ఇప్పుడు ఆమె మెరుగైన ప్రణాళికతో తన వ్యాపారాన్ని నడపగలుగుతున్నారు.
మిత్రులారా! దేశంలో ఇప్పుడు ప్రతిచోటా జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. బెళగావికి చెందిన శివలింగ్ సతప్ప హూద్దార్ సంప్రదాయ వ్యవసాయానికి భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఇందుకోసం ఆయన ఒక పాండ్ ఫామ్ ఏర్పాటు చేశారు. ఈ వ్యాపారం కోసం ఆయన శిక్షణ కూడా పొందారు. ఇప్పుడు ఆయన తన చెరువులోని చేపలను అమ్మి మంచి ఆదాయం పొందుతున్నారు. సముద్రపు నాచుకు ఉన్న డిమాండ్‌ను చూసి చాలా మంది దాని సాగును కూడా చేపట్టారు. దాని ద్వారా వారు అపారమైన ప్రయోజనాలను పొందుతున్నారు. మత్స్య రంగంతో సంబంధం ఉన్న వారందరినీ నేను మరోసారి అభినందిస్తున్నాను. మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి వారు చేస్తున్న ప్రయత్నాలు అత్యంత ప్రశంసనీయం.
నా ప్రియమైన దేశవాసులారా! సమాజమే స్వయంగా ముందుకు వచ్చినప్పుడు చిన్న చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద మార్పుకు పునాది అవుతాయి. మన దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ విషయాన్ని మనకు నేర్పుతూ ఎన్నో ఉదాహరణలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయత్నం జరిగింది. అక్కడ కేవలం ఒక్క గంటలోనే 2,51,000 కు పైగా మొక్కలు నాటి, ఒక కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఈ ప్రయత్నంలో వేలాది మంది పాల్గొనడం అత్యంత విశేషమైన అంశం. విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంస్థల సామూహిక కృషితో ఇది సాధ్యమైంది. ఇదే విధమైన ప్రజా భాగస్వామ్యం ‘ఏక్ పెడ్ మా కే నామ్’ ఉద్యమంలో కూడా కనిపిస్తుంది. ఈ ఉద్యమం కింద దేశవ్యాప్తంగా కోట్లాది చెట్లను నాటారు.
మిత్రులారా! నాగాలాండ్‌లోని చిజామీ గ్రామంలో ఒక అత్యంత స్ఫూర్తిదాయకమైన ప్రయత్నం జరిగింది. చిజామీ గ్రామ మహిళలు సమష్టిగా 150 రకాలకు పైగా సాంప్రదాయిక విత్తనాలను పరిరక్షిస్తున్నారు. ఈ విత్తనాలను గ్రామ మహిళలు నడుపుతున్న ఒక కమ్యూనిటీ సీడ్ బ్యాంకులో భద్రపరుస్తున్నారు. వీటిలో వరి, జొన్న, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, కూరగాయలు, వివిధ రకాల మూలికలు ఉన్నాయి. జ్ఞానాన్ని పరిరక్షించి, సంప్రదాయాలను సజీవంగా ఉంచి, భవిష్యత్ తరాలకు బలమైన పునాది వేసే ఒక ప్రయత్నమిది.
మిత్రులారా! ప్రపంచం వాతావరణ మార్పుల వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ తరుణంలో పరిష్కారాలు ఎప్పుడూ దూరంగా ఉండవని ఇటువంటి ప్రయత్నాలు మనకు చూపిస్తున్నాయి. కొన్నిసార్లు మన సొంత సాంప్రదాయిక జ్ఞానం, సామూహిక ప్రయత్నాలే మనకు ముందుకు సాగడానికి బలమైన మార్గాన్ని చూపిస్తాయి.
నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు మీరు ఏ నగరాన్ని సందర్శించినా ఖచ్చితంగా ఒక మార్పును గమనిస్తారు. పెద్ద సంఖ్యలో ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి ఉండటాన్ని మీరు చూస్తారు. కొన్ని సంవత్సరాల కిందటి వరకు ఇది కేవలం కొన్ని ఇళ్లపై మాత్రమే కనిపించేది. కానీ నేడు ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన’ ప్రభావం దేశంలోని ప్రతి మూలలోనూ కనిపిస్తోంది. ఈ పథకం కారణంగా గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాకు చెందిన పాయల్ ముంజ్‌పారా జీవితం ఒక పెద్ద మార్పును చూసింది. ఆమె సౌర విద్యుత్ సాంకేతికతలో శిక్షణ పొంది, 4 నెలల సోలార్ పీవీ టెక్నీషియన్ కోర్సును పూర్తి చేశారు. ఇప్పుడు ఆమె నైపుణ్యం కలిగిన సోలార్ టెక్నీషియన్‌గా మారారు. పాయల్ ప్రస్తుతం ఒక సోలార్ పారిశ్రామికవేత్తగా తనకంటూ ఒక పేరు సంపాదించుకుంటున్నారు. ఆమె సమీప జిల్లాల్లో సోలార్ రూఫ్‌టాప్ ఇన్‌స్టాలేషన్ పనిచేస్తూ, ప్రతి నెలా వేల రూపాయలు సంపాదిస్తున్నారు.
మిత్రులారా! మీరట్ కు చెందిన అరుణ్ కుమార్ కూడా తన ప్రాంతంలో శక్తి వనరుల దాతగా మారారు. ఢిల్లీ లో జరిగిన కార్యక్రమంలో అరుణ్ కుమార్ పాల్గొని, తన అనుభవాన్ని పంచుకున్నారు. విద్యుత్తు బిల్లును తగ్గించుకోవడమే కాకుండా తాను విద్యుచ్ఛక్తిని అమ్ముతున్నట్టు ఆయన తెలియజేశారు.
మిత్రులారా! జయపూర్ కు చెందిన మురళీధర్ విజయం కూడా ఇలాంటిదే. మొదట్లో ఆయన పొలంలో డీజిల్ పంప్ వాడేవారు. దీని వల్ల ప్రతి ఏటా వేలాది రూపాయల డబ్బు ఖర్చయ్యేది. సోలార్ పంప్ ఏర్పాటు తర్వాత ఆయన పొలం రూపురేఖలు మారిపోయాయి. ఇప్పుడు ఆయనకు ఇంధనం గురించి ఆలోచన లేదు. సమయానికి నీటి పారుదల జరుగుతుంది. వార్షిక ఆదాయం కూడా పెరిగింది. ఇప్పుడు ఆయన కుటుంబం స్వచ్ఛమైన శక్తివనరులతో మెరుగైన జీవితం గడుపుతోంది.
మిత్రులారా! ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన’ ప్రయోజనాలు ఇప్పుడు ఈశాన్య భారతదేశ ప్రాంతానికి కూడా లభిస్తున్నాయి. త్రిపురలోని రియాంగ్ ఆదివాసీ తెగ వారు నివాసముండే కొన్ని గ్రామాల్లో విద్యుత్తు సమస్య ఉండేది. ఇప్పుడు సోలార్ మినీ గ్రిడ్ కారణంగా అక్కడి గ్రామాలకు వెలుగు వచ్చింది. ఇప్పుడు అక్కడి పిల్లలు సాయంత్రం తర్వాత కూడా చదువుకుంటున్నారు. ప్రజలు మొబైల్ ఛార్జింగ్ చేసుకోగలుగుతున్నారు. ఆ గ్రామాల సామాజిక జీవన విధానం మారిపోయింది.
మిత్రులారా! దేశంలో సౌర శక్తికి సంబంధించి ఇలాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈ విప్లవంలో మీరు కూడా పాలుపంచుకోండి. ఇతరులను కూడా భాగస్వాములను చేయండి.
నా ప్రియమైన దేశప్రజలారా! ‘మన్ కీ బాత్’ కార్యక్రమం కోసం ప్రతి నెలా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అనేక సందేశాలు అందుతున్నాయి. సుదూర ప్రాంతాలలోని ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఎంత ఆసక్తిగా వింటారో ఈ సందేశాల ద్వారా తెలుస్తోంది. ‘మన్ కీ బాత్’ కేవలం ఒక కార్యక్రమం కాదని, మన మధ్య జరిగే సంభాషణ అని మీ సందేశాలు చదివితే నాకు అనిపిస్తుంది. మీ ఆలోచనలు, మీ అనుభవాలు ఈ కార్యక్రమాన్ని మెరుగుపర్చేందుకు స్ఫూర్తినిస్తాయి. మీ ప్రాంతంలోని ప్రేరణాత్మక గాథలను మీరు నాతో పంచుకుంటూ ఉండండి. మీరు చేసే చిన్న ప్రయత్నమే మరొకరి జీవితంలో భారీ మార్పును తీసుకురావచ్చు. మరొకరు ముందడుగు వేసేందుకు ప్రేరణగా మారవచ్చు. రేడియోకు ఉన్న అసలైన శక్తి ఇదే. దేశంలోని వేర్వేరు ప్రాంతాల ప్రజల ఆలోచనలను, భావనలను, ఉద్దేశ్యాలను రేడియో అనుసంధానిస్తుంది. వచ్చే నెల మళ్ళీ కలుద్దాం. మనం ముందంజ వేసేందుకు కొత్త శక్తిని ఇచ్చే ప్రేరణాత్మక వ్యక్తిత్వాలతో, స్ఫూర్తిదాయక గాథలతో కలుద్దాం. అప్పటివరకు మీరు జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. సంతోషంగా ఉండండి. చాలా చాలా ధన్యవాదాలు.
***
#MannKiBaat has begun. Do listen. https://t.co/uGQRfbExDE
— PMO India (@PMOIndia) March 29, 2026
Amid the West Asia conflict, PM @narendramodi's appeal to 140 crore Indians.#MannKiBaat pic.twitter.com/wwp8gMV3qY
— PMO India (@PMOIndia) March 29, 2026
Gyan Bharatam survey aims to document and preserve manuscripts from across the country. If you have a manuscript or information about it, do share its image on the Gyan Bharatam App. #MannKiBaat pic.twitter.com/ujcoPuNJvL
— PMO India (@PMOIndia) March 29, 2026
From Team India's victory in the ICC Men's T20 World Cup to Jammu and Kashmir's maiden Ranji Trophy win, the nation has witnessed moments of sporting excellence.#MannKiBaat pic.twitter.com/tFAex6tQlj
— PMO India (@PMOIndia) March 29, 2026
India's growing sporting culture.#MannKiBaat pic.twitter.com/vMxDmA0DZY
— PMO India (@PMOIndia) March 29, 2026
Adopt healthier habits like regular exercise, yoga and mindful eating to prevent lifestyle diseases.#MannKiBaat pic.twitter.com/dSiUA8IRrD
— PMO India (@PMOIndia) March 29, 2026
An innovative initiative in Bengaluru is making learning science more engaging.#MannKiBaat pic.twitter.com/K2cuLOdyiD
— PMO India (@PMOIndia) March 29, 2026
The Naga community is blending tradition with modern education through the Morung system.#MannKiBaat pic.twitter.com/Sx8ccWHLOQ
— PMO India (@PMOIndia) March 29, 2026
With the onset of summer, communities across India are coming together to conserve water through initiatives like rainwater harvesting, rejuvenation of ponds, creation of soak pits and more.#MannKiBaat pic.twitter.com/gBApKeFBF9
— PMO India (@PMOIndia) March 29, 2026
Efforts are being made to improve the quality of life for fishermen.#MannKiBaat pic.twitter.com/AtYBkCaON1
— PMO India (@PMOIndia) March 29, 2026
Innovations in fisheries and seaweed are helping fishermen become self-reliant.#MannKiBaat pic.twitter.com/lvVTNU138U
— PMO India (@PMOIndia) March 29, 2026
Across India, community efforts are creating big change. Here are examples from Varanasi and Nagaland. #MannKiBaat pic.twitter.com/gCkZimxb8l
— PMO India (@PMOIndia) March 29, 2026
The PM Surya Ghar Muft Bijli Yojana is transforming lives across India.#MannKiBaat pic.twitter.com/YzjV5sfnWe
— PMO India (@PMOIndia) March 29, 2026