పిఎంఇండియా
న్యూఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్లో 2026 సెప్టెంబరు 2న సాయంత్రం 4:30 సమయంలో జలశక్తి మంత్రిత్వశాఖ నిర్వహించనున్న డిపార్ట్మెంటల్ సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా సమావేశాన్నుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
బృంద స్ఫూర్తిని బలోపేతం చేయడం, సహకార సమాఖ్యవాదాన్ని విస్తరించడం, కేంద్రం – రాష్ట్రాల మధ్య సన్నిహిత సహకారం ద్వారా దేశ ప్రాధాన్యాల విషయంలో సమష్టి నేతృత్వాన్ని పెంపొందించే దిశగా… ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా నిర్వహించతలపెట్టిన వరుస సదస్సుల్లో ఇది మొదటి కార్యక్రమం. ఈ రెండు రోజుల సదస్సును సెప్టెంబరు 1, 2 తేదీల్లో నిర్వహిస్తున్నారు. రంగాలవారీగా కీలకమైన ప్రాధాన్య అంశాలు, వాటి అమలును వేగవంతం చేయడంతోపాటు ఫలితాలపై కలిసి చర్చించడానికి.. ఒక క్రమబద్ధమైన వేదికను ఇది అందిస్తోంది.
అత్యుత్తమ ఆచరణ పద్ధతులను పరస్పరం పంచుకోవడంతోపాటు ప్రాధాన్య అంశాలు, అమలులో సవాళ్లకు పరిష్కారాలు, నిర్దిష్ట వ్యవధులతో కూడిన కార్యాచరణ ప్రణాళికల రూపకల్పనలపై చర్చించేలా.. రాజకీయ నాయకత్వాన్నీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులనూ ఈ సదస్సు ఒకే వేదికపైకి తేనుంది. జాతీయ లక్ష్యాల సాధనలో సమష్టి బాధ్యతను ప్రోత్సహించడంతోపాటు.. పరిపాలన పరంగానూ, సేవల్లోనూ ఈ చర్చలను స్పష్టమైన ఫలితాలుగా మలచే ముఖ్య లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు.
నాలుగు ప్రధాన అంశాలపై సదస్సులో ప్రధానంగా దృష్టి సారించనున్నారు:
సకాలంలో నీటిపారుదల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు
జల సంచయ్ జన భాగిదారీ – వర్షాన్ని ఒడిసి పట్టుకోవడం
తాగునీటి వ్యవస్థ వనరుల సుస్థిరత
జలజీవన్ మిషన్ 2.0 కింద గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ, సంరక్షణ
నీటిపారుదల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేయడం, జల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని మెరుగుపరచడం, తాగునీటి వనరుల సుస్థిరత, గ్రామీణ తాగునీటి సేవల్లో విశ్వసనీయతనూ, జవాబుదారీతనాన్నీ మెరుగుపరిచే దిశగా… స్పష్టమైన, నిర్దిష్ట కాలవ్యవధులతో కూడిన కార్యాచరణల రూపకల్పనలో ఈ చర్చలు సత్ఫలితాలస్తాయని ఆశిస్తున్నారు.
***