Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2030 అభివృద్ధి అజెండాకు అనుగుణంగా జ‌రిగిన రూల్ ఆఫ్ లా అంత‌ర్జాతీయ స‌ద‌స్సులో ప్ర‌ధాని ప్ర‌సంగం పూర్తి పాఠం

2030 అభివృద్ధి అజెండాకు అనుగుణంగా జ‌రిగిన రూల్ ఆఫ్ లా అంత‌ర్జాతీయ స‌ద‌స్సులో ప్ర‌ధాని ప్ర‌సంగం పూర్తి పాఠం


గౌర‌వ‌నీయ భారత‌ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి,

వేదిక‌పై ఆశీనులైన పెద్ద‌లు,

దేశ‌విదేశాల‌కు చెందిన న్యాయ‌నిపుణులు,

ఆహూతులు, ప్ర‌తినిధులు, సోద‌ర‌సోద‌రీమ‌ణులారా ..

దేశీయ చ‌ట్టాలు, సుస్థిర అభివృద్ధిపై (రూల్ ఆఫ్ లా అండ్ స‌స్టైనబుల్ డెవ‌ల‌ప్‌మెంట్) అంత‌ర్జాతీయ స‌ద‌స్సును ఉద్దేశించి ప్ర‌సంగించ‌డం నాకు ఆనందంగా ఉంది. విదేశాల నుంచి త‌ర‌లివ‌చ్చిన మిత్రులంద‌రికీ హార్థిక స్వాగ‌తం చెబుతున్నాను. ఈ స‌ద‌స్సులో చురుగ్గా భాగ‌స్వాముల‌వుతున్న వారంద‌రికీ హార్థిక అభినంద‌న‌లు.

2015 సంవ‌త్స‌రంలో కుదిరిన రెండు కీల‌క అంత‌ర్జాతీయ ఒప్పందాల నేప‌థ్యంలో ఈ వ‌ర్క్‌షాప్ జ‌రుగుతోంది. వాతావ‌ర‌ణ మార్పుల‌పై పారిస్ అంగీకారం ఒక‌టి కాగా సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యాల‌పై కుదిరిన ఒప్పందం మ‌రొక‌టి. ఈ రెండు ఒప్పందాల నేప‌థ్యంలో ఇది స‌రైన స‌మ‌యంలో జ‌రుగుతున్న స‌మావేశం. వాటిని మ‌రింత ముందుకు తీసుకెళ్ళే దిశ‌గా చ‌ర్చించేందుకు ఇది చ‌క్క‌ని వేదిక‌. జాతీయంగానే కాకుండా అంత‌ర్జాతీయంగా కూడా ఇది కీల‌క ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. మీ చ‌ర్చ‌ల్లో ప్ర‌పంచ మాన‌వాళి సంక్షేమాన్నే కాకుండా అంత‌ర్జాతీయ స‌మాజం ఎదుర్కొంటున్న అంశాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని కోరుతున్నాను.

సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యాల‌ను సాధించే క్ర‌మంలో రానున్న కాలంలో నిబంధ‌న‌లు, చ‌ట్టాల పాత్ర కీల‌కం కానుంది. కాని నిబంధ‌న‌లు ఆ ల‌క్ష్యాల‌ను సుసాధ్యం చేసేవిగా ఉండాలి. కాని కొన్ని సంద‌ర్భాల్లో ప‌ర్యావ‌ర‌ణప‌ర‌మైన ఆందోళ‌న‌ల‌ను సంకుచిత దృక్ప‌థంలో నిర్వ‌చిస్తున్నారు. ఇలాంటి సంఘ‌ర్ష‌ణ‌లు త‌లెత్తితే వాస్త‌వ‌ ప్ర‌యోజ‌నం నెర‌వేర‌దు. చ‌ట్ట‌ప‌ర‌మైన, సామాజిక‌ప‌ర‌మైన అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ప్ర‌పంచ‌వ్యాప్తంగా న్యాయ‌బ‌ద్ధ‌మైన వాతావ‌ర‌ణం క‌ల్పించేందుకు అనుకూల‌మైన వాతావ‌ర‌ణం నిర్మించే మార్గాన్ని మీరు మాకు సూచిస్తార‌ని ఆశిస్తున్నాను.

2030 సంవ‌త్స‌రానికి సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యాల‌ను ఆమోదించిన ఐక్య‌రాజ్య‌స‌మితి స‌ర్వ‌ప్ర‌తినిధి స‌భ‌ స‌మావేశాల‌కు నేను హాజ‌ర‌య్యాను. మ‌న జీవితాల‌తో ముడిప‌డి ఉన్న అత్యంత కీల‌క‌మైన సామాజిక‌, ఆర్థిక‌, ప‌ర్యావ‌ర‌ణ అంశాల‌కు ఆ ల‌క్ష్యాలు ద‌ర్ప‌ణం ప‌డుతున్నాయి.

ఆ స‌మావేశం త‌ర్వాత జ‌రిగిన సిఒపి-21 స‌ద‌స్సులో వాటికి స్ప‌ష్ట‌మైన వివ‌ర‌ణ‌లు ఇవ్వ‌గ‌లిగాం. సిఒపి-21లో మేం ప్ర‌క‌టించిన క‌ట్టుబాట్లు మారుతున్న కాలానికి అనుగుణంగా భార‌త పౌరుల జీవ‌న‌శైలిని తీర్చిదిద్ద‌డంలోను, అందుకు అనుగుణంగా మా ఆర్థిక ల‌క్ష్యాల‌ను రూపొందించుకోవ‌డంలోను మే౦ అనుస‌రిస్తున్న విలువ‌ల‌కు దీటుగా ఉన్నాయి. మ‌న వినిమ‌య జీవ‌న‌శైలికి అనుగుణంగానే ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. వాటి ప్ర‌భావం అర్ద‌వంత‌మైనదిగా ఉండాలంటే న్యాయ‌ప‌ర‌మైన గ్రంథాల‌ను అన్వేషించే క‌న్నా ముందుగా వాస్త‌వ స్థితుల ప‌రిధిలోనే వాటిని ప‌రిశీలించాల్సి ఉంటుంది.

మిత్రులారా..

వాస్త‌వ ల‌క్ష్యాల‌కు దీటుగా లేనిదేదీ అభివృద్ధి కాద‌ని నేను త‌రచూ చెబుతూ ఉంటాను. “బ‌హుజ‌న హితాయ‌, బ‌హుజ‌న సుఖాయ‌, స‌ర్వే భ‌వంతు సుఖినః”, “లోకాః స‌మ‌స్తా సుఖినో భ‌వంతు” అన్న‌ది అభివృద్ధికి మా సంస్కృతి ఇచ్చిన భాష‌ణం. అభివృద్ధి అనేది స‌మ్మిళితం, సుస్థిరం కానిదే ఇది సాధ్యం కాదు. భ‌విష్య‌త్ త‌రాలు వారి అవ‌స‌రాలు తీర్చుకోగ‌ల సామ‌ర్థ్యాల‌తో రాజీ ప‌డితే దాన్ని అభివృద్ధిగా ప‌రిగ‌ణించ‌లేము. భార‌త్‌లో మేం ఎప్పుడూ స్థిర‌మైన అభివృద్ధినే విశ్వ‌సిస్తాం. మా వ‌ర‌కు మేం ప్ర‌కృతిసిద్ధ‌మైన న్యాయానికే విలువ ఇస్తాం. దాన్ని తుచ త‌ప్ప‌కుండా పాటించిన‌ట్ట‌యితే మాన‌వ నిర్మిత చ‌ట్టాల అవ‌స‌ర‌మే ఉండ‌దు.

స‌హ‌జీవ‌నం, స‌హ అస్తిత్వ సిద్ధాంతాల‌ను అనుస‌రించిన‌ట్ట‌యితే మ‌న‌కి మ‌నం స‌హాయం చేసుకోగ‌లుగుతాం. ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంలో స్టేక్‌హోల్డ‌ర్ (భాగ‌స్వామి) అనే ఒక ప‌దం ఉంది. ఒక విధానంలో భాగ‌స్వాములుగా ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ లాభం పొందిన ప‌క్షంలో అది ఆధార‌నీయ ల‌క్ష్య‌మే అవుతుంది. కాని ఈ సంద‌ర్భంగా ఒక అప్ర‌మ‌త్త సంకేతం కూడా నేను ఇవ్వ‌ద‌ల‌చుకున్నాను. ఆ భాగ‌స్వామ్యం అనేది స‌హ‌జ‌సిద్ధంగాను, స్వాభావికంగాను ఉండాలి. సంకుచిత ల‌క్ష్యాల‌తో ప‌నిచేసే వారికి ఇందులో స్థానం ఉండ‌దు. ప్ర‌కృతి ఎప్పుడూ స్వ‌చ్ఛంగా ఉంటుంది. స్వ‌చ్ఛ‌మైన ల‌క్ష్యాలు మాత్ర‌మే మ‌నుగ‌డ సాగించ‌గ‌లుగుతాయి.

ప్ర‌కృతితో స‌హ‌జీవ‌నం సాగించ‌డం భార‌తీయులు అనుస‌రించే శ‌క్తివంత‌మైన సాంప్ర‌దాయం. మేం ప్ర‌కృతిని ఆరాధిస్తాం. సూర్యుడు, చంద్రుడు, న‌దులు, భూమి, వృక్షాలు, జంతువులు, వాన‌లు, వాయువు, అగ్ని అన్నింటినీ మే ఆరాధిస్తాం. మా సంస్కృతి ప్ర‌కృతిలోని అన్నింటికీ దైవ‌త్వం ఆపాదించింది. మా పురాణాల‌న్నింటిలోనూ దేవుళ్ళు, దేవ‌త‌లంద‌రూ ప‌శువులు, వృక్షాల‌తో అనుబంధం క‌లిగి ఉన్నారు. ప్ర‌కృతిని గౌర‌వించ‌డం మా సంస్కృతిలో అంత‌ర్భాగం. ఈ సాంప్ర‌దాయాన్ని మేం త‌దుప‌రి త‌రాల‌కు అందిస్తూ ఉంటాం. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకోవ‌డం ఆ ర‌కంగా మాకు స‌హ‌జ‌సిద్దంగా సంక్ర‌మించింది. ఈ శ‌క్తివంత‌మైన సిద్ధాంత‌మే మాకంద‌రికీ ఆదేశిక సూత్రం.

అత్యంత ప్రాచుర్యంలో ఉన్న సంస్కృత నానుడి ఇలా చెబుతోంది.

స‌ర్వేశాం స్వ‌స్తిర్భ‌వ‌తు, స‌ర్వేశాం శాంతిర్భ‌వ‌తు

స‌ర్వేశాం పుష్టిర్భ‌వ‌తు, స‌ర్వేశాం మంగ‌ళం భ‌వ‌తు

స‌ర్వేస‌ర్వ‌త్రా అంద‌రూ శాంతిగా జీవించాలి, అంద‌రి ఆశ‌లు నెర‌వేరాలి, అంద‌రూ సుభిక్షంగా ఉండాలి, అంద‌రికీ శుభం చేకూరాలి అన్న‌దే దాని అర్ధం.

ప్ర‌స్తుత స‌మాజానికే కాదు…భ‌విష్య‌త్ త‌రాల‌కు కూడా మా క‌ట్టుబాటు ఇదే. దీన్ని నిరంత‌రం ధ్యానిస్తూ అనుస‌రిస్తూ, ఆచ‌రిస్తూ ఉంటే సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యాల సాధ‌న దిశ‌గా భార‌త్ నాయ‌క‌త్వం అందించ‌గ‌లుగుతుంది. ఉదాహ‌ర‌ణ‌కి మ‌న‌లోని కోర్కెల‌ను, సంతృప్త స్థాయిని స‌మ‌తూకం చేసేదే యోగ‌. యోగ మ‌నంద‌రినీ ఆత్మ‌నియంత్ర‌ణ‌, సుస్థిర జీవ‌నశైలి దిశ‌గా న‌డిపిస్తుంది. యోగ అంటే భౌతిక‌మైన‌దే కాదు. దానికి స‌మ‌గ్ర అర్ధం ఉంది. య‌మ్‌, నియ‌మ్‌, ప్ర‌త్యాహార్ సూత్రాలు మ‌న‌కి క్ర‌మ‌శిక్ష‌ణ‌, పొదుపు, నియంత్ర‌ణ‌ల‌ను బోధిస్తాయి.

సుస్థిర అభివృద్ధిపై చ‌ర్చ ప్రారంభం కావ‌డం క‌న్నా చాలా ముందు కాలంలోనే జాతిపిత మ‌హాత్మాగాంధీ ప్ర‌కృతి వ‌న‌రుల‌కు మ‌నం ట్ర‌స్టీలుగా వ్య‌వ‌హ‌రించాల‌ని, వాటిని న్యాయ‌బ‌ద్ధంగా ఉప‌యోగంచుకోవాల‌ని చెప్పారు. త‌దుప‌రి త‌రాల‌కు ఆరోగ్య‌వంత‌మైన ప్ర‌పంచాన్ని అందించ‌డం మా నైతిక బాధ్య‌త‌.

మిత్రులారా

ప‌ర్యావ‌ర‌ణానికి అతి పెద్ద స‌వాలు పేద‌రికం అని మ‌నంద‌రం అంగీక‌రించాల్సిందే. అందుకే మా ప్ర‌భుత్వం పేద‌రిక నిర్మూల‌నే ప్ర‌ధాన ల‌క్ష్యంగా నిర్దేశించుకుంది. చిత్త‌శుద్ధితో ఈ ల‌క్ష్యాన్ని సాధించేందుకు మా నైతిక విలువ‌లే మార్గ‌ద‌ర్శ‌కంగా మేం కృషి చేస్తున్నాం. అంద‌రూ స‌మానంగా, సుసంప‌న్నంగా అభివృద్ధి చెందేందుకు అనుకూల‌మైన వాతావ‌ర‌ణాన్ని 125 కోట్ల మందికి అందించాల‌న్న‌దే మా ఆకాంక్ష‌. యువ‌కులంద‌రి జీవితాల్లోనూ వికాసం తీసుకురాగ‌లిగే విద్య‌, నైపుణ్యాల వృద్ధి, డిజిట‌ల్ అనుసంధానం, పారిశ్రామిక ధోర‌ణుల‌ను ప్రోత్స‌హించే వాతావ‌ర‌ణం క‌ల్పించ‌డానికి కృషి చేస్తున్నాం. సుస్థిర‌త‌కు ఎలాంటి భంగం చేకూర‌ని రీతిలోనే వీట‌న్నింటినీ సాధించాల‌న్న‌ది మా ల‌క్ష్యం.

అభివృద్ధి ల‌క్ష్యాలు సాకారం కావాలంటే ఇంధ‌నం కోసం ఎదుర‌వుతున్న స‌వాలును ప‌రిష్క‌రించాల్సిన అవ‌స‌రం మేం గుర్తించాం. ఈ స‌వాలును దీటుగా ప‌రిష్క‌రించేందుకే 175 గిగావాట్ల పున‌ర్ వినియోగ ఇంధ‌నం ఉత్ప‌త్తికి మేం కంక‌ణం క‌ట్టుకున్నాం. ఈ బృహ‌త్ ల‌క్ష్యాన్ని సాధించే దిశ‌గా మేం అడుగులు వేస్తున్నాం.

మేం స్వ‌చ్ఛ‌భార‌త్‌, గంగా శుద్ధి కార్య‌క్ర‌మాల‌ను కూడా పెద్ద ఎత్తున చేప‌ట్టాం. మేం చేప‌ట్టిన స్వ‌చ్ఛ‌తా ఉద్య‌మంలో దేశ‌వ్యాప్తంగా కోట్లాది మంది భాగ‌స్వాముల‌వుతున్నారు. ఈ సంఘ‌టిత ప్ర‌య‌త్నాన్ని బ‌లోపేతం చేసేందుకు గ‌ల అవ‌కాశాల‌ను అన్వేషించాల‌ని ఈ స‌మావేశంలో పాల్గొంటున్న వారంద‌రినీ అభ్య‌ర్థిస్తున్నాను. కాలుష్యం, వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ వంటి అంశాల‌పై కూడా ఈ స‌ద‌స్సులో చ‌ర్చిస్తార‌ని నేను ఆశిస్తున్నాను. ఈ అంశాల‌న్నింటినీ సానుకూల దృక్ప‌థంతో ప‌రిశీలించాల్సి ఉంది. ఈ చొర‌వ‌ల‌న్నింటినీ శ‌క్తివంతం చేయ‌డానికి మీ స‌ల‌హాల కోసం నేను ఎదురు చూస్తాను.

మిత్రులారా

భార‌త్‌లో మేం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు మాకు మాత్ర‌మే ప్ర‌త్యేక‌మైన‌వి కావు. ఇత‌ర నాగ‌రిక‌త‌లు కూడా ఇదే త‌ర‌హా స‌మ‌స్య‌లుఎదుర్కొన్నాయి. విజ‌య‌వంతంగా ప‌రిష్క‌రించుకోగ‌లిగాయి. ఉమ్మ‌డి కృషితో మేం కూడా వాటిని అధిగ‌మించ‌గ‌లుగుతాం. ఈల‌క్ష్య‌సాధ‌న‌కు చేసే కృషిలో అభివృద్ధిక‌, సుస్థిర అభివృద్ధికి మ‌ధ్య సంఘ‌ర్ష‌ణను నివారించుకోవ‌లసి ఉంది. వ్య‌క్తి, స‌మ‌స్తి మ‌ధ్యఅనుసంధానం ఉండాల‌ని మా సంస్కృతి బోధిస్తోంది. ఒకే ల‌క్ష్యంతో ముందుకు సాగిన‌ట్ట‌యితే ప్ర‌యోజ‌నాల వైరుధ్యం అనేదేత‌లెత్త‌దు.

వాతావ‌ర‌ణ మార్పుల‌కు సంబంధించిన స‌వాలును ఒక స‌మ‌స్య‌గా క‌న్నా ఒక అవ‌కాశంగా మా ప్ర‌భుత్వం భావిస్తోంది. యోగాః క‌ర్మ‌సుకౌశ‌ల‌మ్ అనే సిద్ధాంతాన్ని మేం అనుస‌రిస్తున్నాం. ప‌ర్యావ‌ర‌ణానికి అతి త‌క్కువ న‌ష్టం క‌లిగే విధంగా మేం కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల్సిఉంది. త‌యారీ రంగంలో ఎలాంటి లోపాలు లేని, ఎలాంటి ప్ర‌భావం లేని (జీరో డిఫెక్ట్‌, జీరో ఎఫెక్ట్) విధానాలు అనుస‌రించాల‌ని నేనుచెబుతూ ఉంటాను. మార్పుకు నాంది, సానుకూల కార్యాచ‌ర‌ణ (క‌న్వీనియెంట్ యాక్ష‌న్ః కంటిన్యుటీ ఫ‌ర్ చేంజ్) పేరుతో నేను రాసినపుస్త‌కంలో నా ఆలోచ‌న‌లు కొన్నంటిని ఆవిష్క‌రించాను.

మిత్రులారా

ఒక‌రి త‌ప్పుల‌కు మ‌రొక‌రిని శిక్షించ‌రాద‌ని స‌హ‌జ న్యాయ సూత్రం చెబుతోంది. వాతావ‌ర‌ణ మార్పుల స‌మ‌స్య‌కు అతి త‌క్కువ బాధ్యులైన వారు చాలా మంది ఉన్నార‌న్న విష‌యం మ‌నం గుర్తించాలి. ఇప్ప‌టికీ ఆధునిక సౌక‌ర్యాలు అందుబాటులోకి రావ‌ల‌సిన వారెంద‌రో ఉన్నారు. అలాంటి వారు వాతావ‌ర‌ణ మార్పుల ప్ర‌భావాన్ని అధికంగా భ‌రిస్తున్నారు. వ‌ర‌ద‌లు, తుపానులు, దుర్భిక్షాలు, వ‌డ‌గాడ్పులు, స‌ముద్ర‌మ‌ట్టం పెర‌గ‌డం వంటి స‌మ‌స్య‌ల‌న్నీ ఇందులో భాగ‌మే. వాతావ‌రణ సంబంధిత వైప‌రీత్యాలను దీటుగా ఎదుర్కొనేందుకు అవ‌స‌ర‌మైన వ‌న‌రులు అతి త‌క్కువ‌గా ఉన్న పేదవ‌ర్గాల‌వారెంద‌రో ఉన్నారు. ఇలాంటి వ‌ర్గాల‌కు చెందిన వ‌ర్త‌మాన‌, భ‌విష్య‌త్ త‌రాలు దుర‌దృష్ట‌వ‌శాత్తు వాతావ‌ర‌ణ మార్పుల సంబంధ‌మైన ఇలాంటి చ‌ట్టాలు, ఒప్పందాల బారిన ప‌డుతున్నారు. అందుకే నేను వాతావ‌ర‌ణ న్యాయం గురించి మాట్లాడుతున్నాను. ఒక దేశంలో అమ‌లులో ఉన్న నిబంధ‌న‌లు, చ‌ట్టాలు, ఆచ‌ర‌ణ‌లు, సిద్ధాంతాలు ఒకే త‌ర‌హాలో మ‌రో దేశంలో ఆచ‌ర‌ణ‌లోకి తేవ‌డం సాధ్యం కాదు. ప్ర‌తి ఒక్క దేశానికి దానికే ప్ర‌త్యేక‌మైన స‌వాళ్ళు, ప‌రిష్కార‌ మార్గాలు ఉంటాయి. ఒకే త‌ర‌హా నిబంధ‌న‌లు అన్ని దేశాల‌కు, ప్ర‌జ‌ల‌కు వ‌ర్తింప‌చేయ‌డం కుద‌ర‌దు.

స్థిర‌మైన అభివృద్ధి మ‌నంద‌రి బాధ్య‌త‌. ఉమ్మ‌డి క‌ట్టుబాటుతో మ‌నం దాన్ని సాధించ‌గ‌ల‌మ‌న్న విశ్వాసం నాకుంది. ప‌ర్యావ‌ర‌ణ మిత్ర‌మైన అభివృద్ధి మార్గాలు కూడా మ‌నం సాధించ‌గ‌ల‌మ‌న్న విశ్వాసం నాకుంది. ముందు త‌రాల‌కు చెందిన మ‌న నాయ‌కులు న‌డిచిన బాట‌లో ప్ర‌యాణించి వాటిని క‌నుగొనే అవ‌కాశం ఉంది. ఈ అంశాల‌న్నింటి పైనా అంద‌రి అభిప్రాయాల‌తో కూడిన స‌మ్య‌క్ అవ‌గాహ‌న ఈ వ‌ర్క్‌షాప్‌లో వెలుప‌లికి వ‌స్తుంద‌ని నేను ఆశిస్తున్నాను.

ఈ స‌ద‌స్సు ఘ‌న విజ‌యం సాధించాల‌ని నేను ఆకాంక్షిస్తున్నాను.

ధ‌న్య‌వాదాలు