Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని ఎర్ర కోట బురుజు పై నుంచి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం

70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని ఎర్ర కోట బురుజు పై నుంచి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం


ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ 70వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఎర్రకోట బురుజు పై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సహా దేశ స్వాతంత్య్ర సాధనకు ప్రాణాలు అర్పించిన మహామహులకు శ్రద్ధాంజలి ఘటించారు. 125 కోట్ల మంది భారతీయులు స్వరాజ్య నుంచి సురాజ్యకు ప్రయాణం పూర్తి చేయాలని ఇప్పుడు తీర్మానించుకున్నట్లు ప్రధాని చెప్పారు. సురాజ్య సాధనకు త్యాగాలు, క్రమశిక్షణ, అంకితభావం, అకుంఠిత దీక్ష, సాహసం అవసరమని ఆయన అన్నారు. పంచాయతీరాజ్ నుంచి పార్లమెంటు స్థాయి వరకు ప్రతి ఒక్క సంస్థ ఈ లక్ష్య సాధనకు పూర్తి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

గతంలోని ప్రభుత్వాలు ఎన్నో ఆరోపణల్లో ఉక్కిరిబిక్కిరి అయ్యేవని, కానీ, తమ ప్రభుత్వం పట్ల ప్రజలు ఎన్నో అంచనాలతో ఎదురుచూస్తున్నారని ప్రధాని చెప్పారు. ఆశావాహ దృక్పథం అంచనాలను పెంచినపుడు సురాజ్యం దిశగా మరింత వేగంగా కదలడానికి అవసరమైన శక్తి లభిస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏం చేసిందనేదాని కన్నా, పని సంస్కృతిని పెంచాలన్నదే తన ఆకాంక్ష అని ప్రధాని అన్నారు. సానుకూల దృక్పథం, బాధ్యత, పారదర్శకత, సమర్థత, సత్పరిపాలన, సురాజ్య సాధనలో అత్యంత ప్రధానమైనవని ఆయన పేర్కొన్నారు. ఇందులో ప్రతి ఒక్క అంశం విషయంలో తమ ప్రభుత్వం పాటిస్తున్న ఉదాహరణలను ఉటంకిస్తూ.. ప్రధాన ఆస్పత్రుల్లో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు, త్వరితగతిన ఆదాయపన్ను రిఫండ్లు, వేగంగా పాస్ పోర్టులు అందించడం, కంపెనీ రిజిస్ట్రేషన్ల సత్వర జారీ, గ్రూప్-సి, గ్రూప్-డి ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానం రద్దు వంటివన్నీ ఇందుకు సజీవ నిదర్శనాలని ఆయన చెప్పారు.

కీలక రంగాల్లో పనులు ఎంత వేగం అందుకున్నది ఆయన వివరించారు. గ్రామీణ రోడ్ల నిర్మాణం, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యం, ట్రాన్స్ మిషన్ లైన్ల నిర్మాణం, వంట గ్యాస్ కనెక్షన్లు జారీ వేగవంతమయిందని ఆయన చెప్పారు. కొన్ని కొన్ని రంగాల్లో పనులు ఎంత విస్తృతంగా జరిగాయో కూడా ఆయన వివరించారు. జనధన్ యోజన కింద 21 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచారని, గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్ల మరుగు దొడ్ల నిర్మాణమయ్యాయని, ఇప్పటి వరకు విద్యుత్ వసతికి నోచుకోని 10 వేల గ్రామాలకు స్వల్ప కాల పరిమితిలోనే విద్యుత్ వెలుగులు అందుబాటులోకి వచ్చాయని ఆయన తెలియజేశారు. ఎల్ ఇ డి బల్బుల ధరలు సగటు జీవికి అందుబాటులోకి వచ్చే స్థాయికి తీసుకువచ్చామని ఆయన చెప్పారు. ఎల్ ఇ డి బల్బులను విస్తృతంగా వినియోగించడం వల్ల అధిక మొత్తంలో విద్యుత్ ఆదా చేయవచ్చునని మోదీ చెప్పారు.

రెండు వరుస దుర్భిక్షాలు పీడించినప్పటికీ తగినన్ని ఆహారధాన్యాలు అందుబాటులోకి తెచ్చినందుకు రైతాంగాలను ఆయన అభినందించారు. ఈ ఏడాది పప్పు దినుసులు పండించే భూమి విస్తీర్ణం గణనీయంగా పెంచామని ప్రధాని చెప్పారు. వ్యవసాయరంగాన్ని ఉత్తేజితం చేయడానికి సాయిల్ హెల్త్ కార్డులు, నీటిపారుదల, సోలార్ పంపులు, విత్తనాలు, ఎరువులు, పంటల బీమా వంటి ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రధాని తెలియజేశారు.

జాతీయ గుర్తింపు సాధించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మోదీ తెలిపారు. సంస్కరణలు, సమర్థవంతమైన పని, పరివర్తన అనే మూడు అంశాల ఆధారంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఆయన తెలిపారు. మాటల కన్నా చేతలు, సమగ్ర అభివృద్ధి, సాధికారత సాధనకై ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ప్రధాని చెప్పారు. దీర్ఘకాలంగా నిలిచిపోయిన వివిధ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన వివరించారు. కీలక రంగాల్లో ప్రాజెక్టుల అనుమతులకు పట్టే కాలపరిమితిని గణనీయంగా తగ్గించినట్లు తెలిపారు.

ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా సేవలు అందిస్తున్నదో వివరిస్తూ చెరకు రైతులకు బకాయీల చెల్లింపు, కొత్త ఎల్ పి జి కనెక్షన్ల జారీ, ఎయిర్ ఇండియా, బి ఎస్ ఎన్ ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహణాపరమైన లాభాల్లోకి ప్రవేశించడం వంటి అంశాలను ఆయన ఉదహరించారు. పారదర్శకతకు పట్టం కట్టే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం అవసరంలో ఉన్నవారికి మాత్రమే సబ్సిడీలు అందించేందుకు చర్యలు తీసుకుందని తెలిపారు. పరిపాలనలో భిన్న రంగాలు సాధించిన పురోగతిని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు కూడా గుర్తించినట్లు ప్రధాని చెప్పారు.

“భేటీ బచావో – భేటీ పడావో, సుకన్యా సమృద్ధి యోజన, ఉజ్వల యోజన” వంటి కార్యక్రమాలతో మహిళా సమస్యల పరిష్కారానికి సమగ్ర దృక్పథంతో కృషి చేస్తున్నట్లు మోదీ చెప్పారు. ఈ కార్యక్రమాల ద్వారా మహిళల భౌతిక, విద్య, ఆర్థిక అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

రామానుజాచార్య, మహాత్మాగాంధీ, బాబా సాహెబ్ అంబేడ్కర్ వంటి మహామహులు ప్రభోదించిన శాంతి, ఏకత, సౌభ్రాతృత్వ సూత్రాలకు అనుగుణంగా సామాజిక ఐక్యత సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు యువతకు పలు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తెచ్చాయని ప్రధాని అన్నారు. ప్రభుత్వం కొత్తగా రూపొందించిన నమూనా దుకాణాలు, సంస్థల చట్టం వల్ల ఇక నుండి అన్ని దుకాణాలు, అన్ని రోజుల్లోనూ తెరిచే ఉంటాయని ఆయన చెప్పారు.

ప్రధాన నిర్ణయాలు తీసుకునే విషయంలో ప్రభుత్వం వెనుకంజ వేయబోదని మోదీ హామీ ఇచ్చారు. ఒక ర్యాంకు ఒక పింఛను, నేతాజీకి సంబంధించిన ఫైళ్ళ పునర్ వర్గీకరణ, బంగ్లాదేశ్ తో భూ సరిహద్దు ఒప్పందం వంటి కీలక చర్యలను ఈ సందర్భంగా ప్రధాని ఉదహరించారు.

ఉగ్రవాదులను త్యాగధనులుగా ప్రచారం చేసే చర్యలను ప్రధాని తీవ్రంగా ఖండించారు. భారతదేశం అనుసరిస్తున్న మానవతావాద దృక్పథం, ఉగ్రవాద కార్యకలాపాలను ముక్త కంఠంతో ఖండించడం వంటి చర్యలను ప్రపంచం యావత్తూ కొనియాడుతున్నదని ప్రధాని చెప్పారు. జాతిని ముందుకు నడిపించే ఏకైక సంకల్పంతో ముందుకు సాగాలని ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ప్రధాని కొన్ని కొత్త చొరవలు, కార్యక్రమాలు ప్రకటించారు. స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్లు 25 వేల నుంచి 30 వేల రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఆదివాసీ స్వాతంత్య్ర సమరయోధుల కోసం ప్రత్యేక మ్యూజియమ్ లు, స్మారక చిహ్నాలు ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. పేద వర్గాలకు చెందిన ప్రజలు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి వస్తే లక్ష రూపాయల వరకూ వ్యయాలను ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు.