Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సాంకేతిక విద్యలో బహుళ కోర్సుల అభ్యాసం-పరిశోధన మెరుగుకు రూ.4,200 కోట్ల మేర బడ్జెట్ మద్దతుపై మంత్రిమండలి ఆమోదం


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రిమండలి ఈ రోజు దేశంలోని 275 సాంకేతిక విద్యా సంస్థ‌ల‌లో బహుళ కోర్సుల అభ్యాసం–పరిశోధన మెరుగుద‌ల ప‌థ‌కం (ఎంఈఆర్ఐటీఈ) అమ‌లు ప్ర‌తిపాద‌న‌కు ఆమోదం తెలిపింది. మొత్తం 175 ఇంజినీరింగ్‌ కళాశాలలు, 100 పాలిటెక్నిక్‌లలో ఈ పథకాన్ని అమలు చేస్తారు. జాతీయ విద్యా విధానం–2020 (ఎన్‌ఈపీ) అనుగుణ కార్యక్రమాల అమలు ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సాంకేతిక విద్య నాణ్యత, సమానత, నిర్వహణ విధానాలను  మెరుగుపరచడం దీని లక్ష్యం.

ఈ కేంద్ర ప్రభుత్వరంగ పథకాన్ని రూ.4,200 వ్యయంతో 2025-26 నుంచి 2029-30 వరకు అమలు చేస్తారు. ఈ నిధులలో రూ.2,100 కోట్లు (50 శాతం) ఆర్థిక సంస్థల సహాయం కింద ప్రపంచ బ్యాంకు నుంచి రుణం రూపేణా అందుతాయి.

ప్రయోజనాలు:

ఈ పథకం కింద ఎంపిక చేసే 275 ప్రభుత్వ, ఎయిడెడ్‌ సాంకేతిక విద్యా సంస్థలకు ఆర్థిక మద్దతు లభిస్తుంది. ఈ జాబితాలో జాతీయ సాంకేతిక విద్యా సంస్థలు (ఎన్‌ఐటీ), రాష్ట్ర ఇంజినీరింగ్ సంస్థలు, పాలిటెక్నిక్‌లు, అనుబంధ సాంకేతిక విశ్వవిద్యాలయాలు (ఏటీయూలు) కూడా ఉంటాయి. వీటితోపాటు సాంకేతిక విద్యా రంగాన్ని పర్యవేక్షించే రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకూ చేయూత అందుతుంది. మొత్తంమీద దాదాపు 7.5 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు.

ఉపాధి కల్పన సహా పథకం ప్రభావం:

ఈ పథకం కింద లభించగల కీలక ఫలితాలు, పరిణామాలు:

i.       భాగస్వామ్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో డిజిటలీకరణ వ్యూహాలు,

ii.       సాంకేతిక కోర్సులలో బహుళ పాఠ్యప్రణాళిక కార్యక్రమాలకు మార్గదర్శకాల రూపకల్పన,

iii.       విద్యార్థుల అభ్యసన–ఉపాధి సముపార్జన నైపుణ్యాల మెరుగుదల,

iv.       వివిధ బృందాల్లోని విద్యార్థులలో రూపాంతరీకరణ శాతం పెరుగుదల,

v.       ఆవిష్కరణ–పరిశోధనావరణ వ్యవస్థ బలోపేతం,

vi.       దీర్ఘకాలిక ప్రయోజనాల కింద మెరుగైన నాణ్యత, పాలన విధానాలకు భరోసా,

vii.       సాంకేతిక విద్యా సంస్థ స్థాయిలో నాణ్యతకు భరోసా, గుర్తింపు పెరుగుదల,

viii.       సముచిత, కార్మిక మార్కెట్ అనుగుణ పాఠ్యాంశాలు, మిశ్రమ కోర్సుల రూపకల్పన–అమలు

ix.       భవిష్యత్ విద్యారంగ పరిపాలకుల, ప్రత్యేకించి మహిళా అధ్యాపకులను తీర్చిదిద్దడం.

అమలు వ్యూహం.. లక్ష్యాలు

ఈ పథకం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ సంస్థలు, పాలిటెక్నిక్‌లలో ‘ఎన్‌ఈపీ-2020’కి అనుగుణంగా అమలవుతుంది. భాగస్వామ్య సంస్థల నాణ్యత, సమానత, పాలన నైపుణ్యం పెంపు దీని లక్ష్యం. కేంద్ర రంగ పథకంగా ఇది అమలు కానుండగా, భాగస్వామ్య సంస్థలకు కేంద్ర నోడల్ సంస్థ ద్వారా నిధులు బదిలీ అవుతాయి.

ఈ పథకం అమలులో దేశంలోని ఐఐటీలు, ఐఐఎంల వంటి ప్రసిద్ధ విద్యాసంస్థలు, ఏఐసీటీఈ, ఎన్‌బీఏ తదితర ఉన్నత విద్యారంగ నియంత్రణ సంస్థలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.

ఉపాధి కల్పన:

సమగ్ర, బహుముఖ విధానంతో విద్యార్థుల్లో నైపుణ్యం పెంచి, వారి ఉపాధి సముపార్జన సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఈ పథకం ప్రధాన భూమిక నిర్వహిస్తుంది. అనుభవ శిక్షణ (ఇంటర్న్‌షిప్) అవకాశాల కల్పన, పారిశ్రామిక రంగ అవసరానుగుణ పాఠ్యాంశాల నవీకరణ, అధ్యాపకత్వ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ, పరిశోధన కేంద్రాల ఏర్పాటు వంటివి ఇందులో భాగంగా ఉంటాయి. అంతేకాకుండా సంపోషక (ఇంక్యుబేషన్), ఆవిష్కరణ కేంద్రాలు, నైపుణ్య–తయారీ ప్రయోగశాలలు, భాషా వర్క్‌ షాప్‌ల కింద మద్దతు లభిస్తుంది. ఈ కార్యక్రమాలన్నీ కాబోయే పట్టభద్రుల ఉపాధి సామర్థ్యం పెంపు, అధిక నియామక అవకాశాలు, అంతిమంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ విద్యార్థులపరంగా నిరుద్యోగం తగ్గించడంలో తోడ్పడతాయి.

నేపథ్యం:

ఒక దేశపు సుస్థిర, సమగ్రాభివృద్ధి అధికశాతం సాంకేతిక పరిజ్ఞాన పురోగమనంపై ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం విద్యా–పరిశోధన ప్రమాణాల నిరంతర ఉన్నతీకరణ అవశ్యం. ఈ పరిశోధనలు ఆధునిక సవాళ్ల పరిష్కారానికి అనువైన ప్రాథమిక ఆవిష్కరణలకు తోడ్పడటమేగాక దీర్ఘకాలిక సానుకూల ప్రభావం చూపుతాయి. ఈ దృక్పథం ప్రాతిపదికగానే ప్రపంచ బ్యాంకు సహకారంతో ‘ఎంఈఆర్‌ఐటీఈ’ పథకం రూపొందింది. ఈ పథకం నిర్దేశించిన కార్యక్రమాలకు ‘ఎన్‌ఈపీ-2020’ ద్వారా ఉన్నత విద్యారంగంలో తేదలచిన సంస్కరణలే ఆధారం.

ఈ విధానంలోని ప్రధాన సంస్కరణాంశాల్లో పాఠ్యాంశాల పునర్నవీకరణ, బోధన విధానం, మూల్యాంకనం, సాంకేతిక విద్యలో బహుళ కోర్సుల కార్యక్రమాలు, పరిశోధనావరణ వ్యవస్థ బలోపేతం, భవిష్యత్ విద్యా నిర్వాహకులను తీర్చిదిద్దడం, అధ్యాపక నైపుణ్యం పెంపు, సాంకేతిక విద్యలో లింగపరమైన–డిజిటల్ అంతరాల తగ్గింపు తదితరాలు అంతర్భాగంగా ఉన్నాయి.

ఈ పథకంలో భాగస్వామ్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలే కీలక పాత్రధారులు. పథకం అమలులో ప్రధాన పాత్ర పోషించాల్సింది అవే. తదనుగుణంగా అనేక సమావేశాలు, సంప్రదింపుల ద్వారా వాటినుంచి అందిన అభిప్రాయాలు, సూచనలను సముచిత రీతిలో పరిగణనలోకి తీసుకుని పథకానికి రూపకల్పన చేశారు.

 

***