పిఎంఇండియా
గుజరాత్ ప్రజల ఆదరణ చూరగొన్న ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్ గారూ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారూ, మైక్రాన్ టెక్నాలజీ సీఈవో శ్రీ సంజయ్ మెహ్రోత్రా గారూ, భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి గారూ, విశిష్ట అతిథులూ, సోదరీ సోదరులారా…
ప్రపంచంలో అతిపెద్ద కృత్రిమ మేధ సదస్సును విజయవంతంగా నిర్వహించిన అనంతరం.. మరో చరిత్రాత్మక ఘట్టాన్ని మనం ఈ రోజు వీక్షిస్తున్నాం. ఈ ఏఐ సదస్సు భారత కృత్రిమ మేధో సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. కాగా సాంకేతికతలో అగ్రగామిగా నిలవాలన్న భారత నిబద్ధతకు నేటి ఈ కార్యక్రమం మరో నిదర్శనం.
మిత్రులారా,
ఇది ఎన్నో ఏళ్ల కిందటి విషయమేం కాదు.. 10 – 11 ఏళ్ల కిందటి వరకు కూడా దేశంలో డేటా, చిప్స్ గురించిన చర్చలు కొన్ని వర్గాలకే పరిమితమై ఉండేవి. సాంకేతికత అనగానే, మన చర్చలన్నీ ఎక్కువగా ఐటీ సేవల చుట్టే ఉండేవి. కానీ ఈరోజు చూడండి, సాఫ్ట్‌వేర్‌కు పేరెన్నికగన్న భారత్.. ఇప్పుడు హార్డ్‌వేర్ రంగంలోనూ బలంగా ఉనికిని చాటుకుంటోంది. నేడు సనంద్ గడ్డపై ఒక నూతన భవిత ఉదయిస్తోంది. మైక్రాన్ ఏటీఎంపీ ప్లాంట్‌లో వాణిజ్యపరమైన ఉత్పత్తి మొదలవుతోంది. అంతర్జాతీయ సాంకేతిక ఉత్పత్తి రంగంలో ప్రతీ దశలోనూ భారత్ పాత్రను ఇది మరింత బలోపేతం చేస్తుందనడంలో సందేహం లేదు.
మిత్రులారా,
అంతర్జాతీయ సెమీకండక్టర్ ఉత్పత్తి వ్యవస్థలో భాగస్వామిగా భారత్ నేడు అత్యంత వేగంగా ఎదుగుతోంది. ఈ సందర్భంగా మైక్రాన్ బృందానికీ, భూపేంద్ర భాయ్ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వానికీ, ఈ ప్రాజెక్టు కోసం శ్రమించిన ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, కార్మికులందరికీ హృదయపూర్వక అభినందనలు.
మిత్రులారా,
ఈ మైక్రాన్ కేంద్రం భారత నవోత్తేజానికి ఒక అద్భుత ఉదాహరణ. విధానాల రూపకల్పన నుంచి ఉత్పత్తి వరకు నేటి భారత్ ఎంత వేగంగా ముందుకు సాగుతున్నదో ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. మీకు గుర్తుండే ఉంటుంది.. 2023 జూన్‌లో ఈ కేంద్రం కోసం ఒప్పందం కుదిరింది. 2023 సెప్టెంబరులో సనంద్‌లో దీనికి భూమి పూజ జరిగింది. అనంతరం 2024 ఫిబ్రవరిలో ఇక్కడి పైలట్ ప్లాంటులో యంత్రాలను అమర్చడం మొదలైంది. ఇక ఇప్పుడు 2026 ఫిబ్రవరిలో ఈ కేంద్రంలో వాణిజ్యపరమైన ఉత్పత్తి కూడా మొదలైంది.
మిత్రులారా,
ఈ రంగంపై అవగాహన ఉన్న ఎవరికైనా.. ఇది ఎంత అద్భుతమైన వేగమో తెలుస్తుంది. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ముందస్తు ధరల ఒప్పందాల వంటి వంటి పన్ను ఒప్పందాలకు మూడు నుంచి అయిదేళ్ల సమయం పడుతుంది. ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. కానీ భారత్ దీన్ని కొన్ని నెలల్లోనే పూర్తి చేసింది. మన సంకల్పం బలంగా ఉంటే, దేశాన్ని వేగంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యం మనకుంటే.. విధానాలు కూడా స్పష్టంగా ఉంటాయి. నిర్ణయాల్లో వేగం కూడా దానంతట అదే వస్తుంది.
మిత్రులారా,
మైక్రాన్ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు. మిత్రుడు సంజయ్‌ను ఎంత అభినందించినా తక్కువే. ఈ రోజు సంజయ్ నన్ను ఆశ్చర్యపరిచారు. ఆయనెప్పుడు కలిసినా చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. కానీ నేడు ఆయన ప్రసంగం విన్నాక.. మరో సంజయ్ నాకు పరిచయమయ్యారు. భారత్‌పై ఆయన విశ్వాసం ఎప్పుడూ చెక్కుచెదరలేదు. సోదరుడు సంజయ్‌కు నా ప్రత్యేక అభినందనలు. కొన్నేళ్లుగా మేమెప్పుడు కలిసినా భారత సెమీకండక్టర్ రంగం గురించి ఆయనెంతో ఉత్సాహంగా చెప్పేవారు. నేడు ఆయన నాయకత్వం, భారత్‌పై ఆయన నమ్మకం శిఖరప్రాయంగా కనిపిస్తోంది. రాయబారి గోర్ భారత్‌లో బాధ్యతలు చేపట్టిన తర్వాత.. గుజరాత్‌కు రావడం బహుశా ఇదే మొదటిసారి అయ్యుంటుంది. అధికారికంగా నియమితులైన తర్వాత, ఆయనతో నా తొలి సమావేశం ఇదే. అదీ నా కర్మభూమిలో జరగడం విశేషం. మీరు పూర్తిస్థాయిలో మా ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తారన్న నమ్మకంగా చెప్పగలను.
మిత్రులారా,
మైక్రాన్‌కు చెందిన ఈ కేంద్రం, నేటి ఈ కార్యక్రమం.. భారత్ – అమెరికా మధ్య దృఢమైన సహకారానికీ, భాగస్వామ్యానికీ నిదర్శనం. ముఖ్యంగా ఏఐ, చిప్స్ వంటి సాంకేతిక రంగాల్లో భారత్ – అమెరికా భాగస్వామ్యం అత్యంత కీలకమైనది. మానవాళి మెరుగైన భవితతో ముడిపడి ఉన్న ఈ రెండు సాంకేతికతల్లో ఒక సురక్షితమైన సరఫరా వ్యవస్థను నేడు ప్రపంచమంతా కోరుకుంటోంది. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా ఇందుకోసం నిరంతరం కృషి చేస్తున్నాయి. ఏఐ సమ్మిట్ సందర్భంగా భారత్–అమెరికా మధ్య కుదిరిన ప్యాక్స్ సిలికా ఒప్పందం ఈ దిశగా మరో కీలక ముందడుగు. కీలక ఖనిజాల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థను మరింత సురక్షితంగా, విశ్వసనీయమైనవిగా నిలపడంలో మన ఉమ్మడి ప్రయత్నాలు దోహదం చేస్తాయి.
మిత్రులారా,
20వ శతాబ్దం వరకు ప్రపంచంలో పారిశ్రామిక విప్లవ కాలం కొనసాగింది. ఆ సమయంలో కర్మాగారాలు, యంత్రాలు, భారీ ఉత్పత్తిలో ముందున్న దేశాలు వేగంగా పురోగతి సాధించాయి. కానీ ఈ శతాబ్దం ఏఐ విప్లవానిది. ఈ మార్పునకు సెమీకండక్టర్ ఒక పెద్ద వారధి వంటిది. ఒక చిన్న చిప్.. పారిశ్రామిక విప్లవాన్నీ, ఏఐ విప్లవాన్నీ అనుసంధానించే మాధ్యమం. గత శతాబ్దాన్ని ‘చమురు’ శాసిస్తే.. ఈ శతాబ్దాన్ని మైక్రో చిప్ శాసించబోతోంది.
మిత్రులారా,
ఈ ఆలోచనతోనే సెమీకండక్టర్ రంగంలో అత్యంత వేగంగా ముందుకు సాగాలని భారత్ నిర్ణయించుకుంది. మీకు గుర్తుండే ఉంటుంది.. ప్రపంచమంతా కోవిడ్ ఉపద్రవంతో పోరాడుతున్న సమయంలో భారత్ సెమీకండక్టర్ మిషన్‌ను ప్రకటించింది. ఇక్కడ కూర్చున్న అనేకమంది సహచరులు, వివిధ బృందాలు ఆ సమయంలో ఒకదాని తర్వాత ఒకటిగా సమావేశమవుతూనే ఉన్నాయి. విపత్తు సమయంలో అంతా కుప్పకూలిపోతున్నట్టు అనిపించింది. కానీ నాడు మేం పూర్తి నమ్మకంతో నాటిన విత్తనాలే నేడు ఎదిగి ఫలాలనిస్తున్నాయి.
మిత్రులారా,
సెమీకాన్ ఇండియా కార్యక్రమం కింద ఇప్పటివరకు మొత్తం 10 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటిలో మైక్రాన్ కాకుండా, మరో మూడు ప్రాజెక్టులు కూడా అతి త్వరలో ఉత్పత్తిని ప్రారంభించబోతున్నాయి. మనం నిర్మిస్తున్న ఈ సెమీకండక్టర్ వ్యవస్థ ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. ఇది దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. అంటే వికసిత భారత సాంకేతిక కేంద్రాలు దేశం నలుమూలలా రూపుదిద్దుకోబోతున్నాయి. ఇక్కడ సనంద్‌తోపాటు ధోలేరాలో కూడా భారీ స్థాయిలో పనులు జరుగుతున్నాయి. కొన్ని రోజుల కిందటే ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో కూడా కొత్త కేంద్రం పనులు మొదలయ్యాయి. అస్సాం, ఒడిషా, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా సెమీకండక్టర్ యూనిట్ల పనులు వేగంగా సాగుతున్నాయి.
మిత్రులారా,
నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు భారత్ అందిస్తున్న సందేశం ఒక్కటే… భారత్ సిద్ధంగా ఉంది. భారత్ విశ్వసనీయమైనది. భారత్ ఫలితాలను సాధించి చూపుతుంది.
మిత్రులారా,
సెమీకండక్టర్ వ్యవస్థ అంటే ఫ్యాక్టరీ మాత్రమే కాదని మీకు తెలుసు. యంత్రాల తయారీదారులు, డిజైన్ ఇంజినీర్లు, పరిశోధన సంస్థలు, రవాణా వ్యవస్థలు, నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు.. ఇలా అనేక పొరలతో కూడిన ఒక వ్యవస్థ ఇది. వీరందరి సమన్వయంతోనే ఒక చిప్ తయారవుతుంది. భారత్ కూడా సెమీకండక్టర్ వ్యవస్థలోని ప్రతి దశపైనా ప్రధానంగా దృష్టి సారిస్తోంది. ఈ ఏడాది బడ్జెటులో ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0ను మేం ప్రకటించాం. దీని ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఉత్పత్తి పెరిగేకొద్దీ.. దానికి కావలసిన ముడి పదార్థాలు, విడిభాగాలు, సేవలకు డిమాండ్ భారత్‌లోనే పెరుగుతుంది. ఇది మన ముందున్న అతిపెద్ద అవకాశం.
మిత్రులారా,
ఉత్పత్తి లక్ష్యాలు మన దేశానికి మరో సానుకూలత. భారత్‌లో గ్యాడ్జెట్లను మొదటిసారి వాడేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఇతర సాంకేతిక పరికరాలైనా… భారత్‌లో వాటికి డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. అంటే ‘మేక్ ఇన్ ఇండియా’ ఇప్పుడు పూర్తి స్థాయిలో వేగంగా పురోగమిస్తోంది. మన ఎలక్ట్రానిక్స్ రంగాన్నే చూడండి.. గత 11 ఏళ్లలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి, ఎగుమతులు అనేక రెట్లు పెరిగాయి. ఇప్పుడు భారత్ విడిభాగాల నుంచి తుది ఉత్పత్తుల వరకు ప్రతీదీ దేశంలోనే తయారు చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పరిధి పెరిగేకొద్దీ.. దానికి తగ్గట్టుగా దేశీయంగా సెమీకండక్టర్లకు డిమాండ్ కూడా పెరుగుతుంది. అంటే భారత్‌లో పెట్టుబడి పెట్టేవారికి దేశీయ మార్కెట్టూ, అంతర్జాతీయ అవకాశాలూ రెండూ స్వాగతం పలుకుతున్నాయి.
మిత్రులారా,
ఈ సనంద్ ప్రాంతం మొత్తంతో నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మట్టిని కూడా బంగారంగా మార్చే నేల సనంద్. ఇది నా అనుభవంతో చెబుతున్నాను. ఇక్కడ సనంద్‌కు చెందిన వారెవరైనా ఉంటే వారికి తెలుసు – ఒకప్పుడు నేను ఇక్కడికి బస్సులో వచ్చేవాడిని. ఇక్కడి సందుల్లో సైకిలుపై తిరిగేవాడిని. ఇదొక చిన్న పట్టణంగా ఉండేది. ఇక్కడి నుంచి సైకిల్ తీసుకొని పైకి వెళ్ళేవాడిని. అంటే ఓ రకంగా ఇది చాలా కాలంపాటు నా కార్యక్షేత్రంగా ఉంది. చూస్తూండగానే సనంద్ ఎంతగానో మారింది. ఒకప్పుడు చిన్న పట్టణం నేడు పెద్ద నగరంగా మారుతోంది. ఇదంతా ఎక్కడ మొదలైందో తెలుసా? – ఒక రూపాయి ఎస్ఎంఎస్‌తో.. అవును ఒక రూపాయే! ‘‘వెల్కమ్, స్వాగతం’’ అంటూ రతన్ టాటా గారికి నేనొక సందేశాన్ని పంపాను. ‘స్వాగతం’ అని రాశాను. ఆ ఒక్క రూపాయి పెట్టుబడితో ఈ గుజ్జూ ఏం సాధించగలిగాడో చూడండి!
మిత్రులారా,
ఒక కార్ల ఫ్యాక్టరీ నుంచి నేడు దేశంలో ఒక పెద్ద ఆటోమొబైల్ కేంద్రంగా సనంద్ ఎదగడాన్ని నేను స్వయంగా చూశాను. నాకు బాగా గుర్తుంది.. ఒక పెద్ద ఆటోమొబైల్ కంపెనీ ఇక్కడికి రాగానే, దానితోపాటే ఒక పూర్తి స్థాయి వ్యవస్థ కూడా అభివృద్ధి చెందింది. ఒక కంపెనీ రాకతో ఎన్నో అనుబంధ పరిశ్రమలు ఇక్కడికి వచ్చాయి. సరఫరాదారుల నెట్‌వర్క్ ఏర్పడడంతో స్థానిక పరిశ్రమలు బలోపేతమయ్యాయి. పెట్టుబడులతోపాటు ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. దేశ విదేశాల నుంచి ఇక్కడ పనిచేయడానికి వస్తున్న సహచరులకు నేనొక మాట చెప్పాలి – ఉన్నట్టుండి ఒక చిన్న పట్టణం ప్రపంచ పటంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడం నిజం. అవసరమైన అభివృద్ధి, వసతుల విషయంలో.. ‘ఇది ఉంటే బాగుండు, అది జరిగితే బాగుండు’ అనే ఆలోచనలు మీ మనసులో ఉండవచ్చు.
నేను మాట ఇస్తున్నాను మిత్రులారా,
మీరు కోరుకునే జీవనశైలి, మీరు ఆశించే సామాజిక జీవితం, మీరు బ్రతకాలనుకునే విధానం… వాటన్నింటినీ ఈ గుజరాత్ అందిస్తుంది. మీకు ఏ లోటూ కలగనివ్వం. అదే విధంగా మార్గదర్శకంగా నిలుస్తున్న ఈ మైక్రాన్ కేంద్రం.. ఒక నూతన వ్యవస్థను విస్తరించబోతోంది. మున్ముందు సెమీకండక్టర్ రంగంలో కూడా సనంద్ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందన్న సంపూర్ణమైన విశ్వాసం నాకుంది.
మిత్రులారా,
మైక్రాన్ తయారుచేసే డీ–రామ్, నాండ్ సాధనాలు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటా సెంటర్లు, ఏఐ అప్లికేషన్లు, మొబైల్ పరికరాలు, అత్యాధునిక కంప్యూటింగ్ వ్యవస్థలకు ఊతంగా నిలుస్తాయి. ఇప్పుడివన్నీ ఇక్కడే మన సనంద్ గడ్డపైనే తయారవుతాయి. ఇక్కడ అత్యాధునిక వేఫర్లు అత్యుత్తమ మెమరీ, స్టోరేజీ ఉత్పత్తులుగా మారుతాయి. ప్రస్తుతం ఈ ప్లాంటులో వందలాది మందికి ఉపాధి లభించింది. రాబోయే కాలంలో ఇది మరింత విస్తరించబోతోంది.
మిత్రులారా,
మీరు ఇక్కడ నిర్మిస్తున్న క్లీన్‌రూం ప్రపంచంలో అతిపెద్ద ఏటీఎంపీ క్లీన్‌రూంలలో ఒకటిగా నిలవబోతోంది. ప్రగతికీ, ప్రకృతికీ మధ్య సమన్వయానికి కూడా ఈ ప్లాంటు ఒక మంచి ఉదాహరణ. నీటి వినియోగాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేలా మీరు చేసిన ఏర్పాట్లు నిజంగా అభినందనీయం.
మిత్రులారా,
గుజరాత్ ప్రభుత్వ విధానాలను కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. సెమీకండక్టర్ రంగం కోసం గుజరాత్ రూపొందించిన విధానాల ఫలితాలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి. భూపేంద్ర భాయ్ ప్రభుత్వ క్రియాశీల కార్యాచరణ వల్ల సాంకేతిక రంగంలో కూడా గుజరాత్ అత్యంత వేగంగా దూసుకుపోతోంది. అనుమతుల మంజూరు, భూమి కేటాయింపులతోపాటు వసతుల కల్పన ప్రక్రియలను సరళతరం చేయడం… ఇవన్నీ గుజరాత్‌పై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేశాయి. ధొలేరా, సనంద్ ప్రాంతాలు నేడు పశ్చిమ భారతదేశ సెమీకండక్టర్ నిలయాలుగా ఎదుగుతున్నాయి. అంతేకాకుండా, సెమీకండక్టర్ రంగానికి అవసరమైన ముడి పదార్థాల పరిశ్రమలు కూడా గుజరాత్‌లో అభివృద్ధి చెందాయి. రసాయన, పెట్రోకెమికల్ పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణా కార్యక్రమాలు.. ఇలా గుజరాత్‌లో అన్ని అంశాలపైనా ఒకేసారి పనులు జరుగుతున్నాయి.
మిత్రులారా,
ఇది భారత యువతకు సరికొత్త అవకాశాలకు బాటలు వేస్తోంది. ఈ రోజు మొదటి అడుగు వేశాం. దేశంలోని 10 సెమీకండక్టర్ పరిశ్రమ ప్రాజెక్టులు ఉత్పత్తిని ప్రారంభిస్తే… అది ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలు, మొత్తం ఎలక్ట్రానిక్స్ పారిశ్రామిక వ్యవస్థలోని అన్ని దశల్లోనూ అనేక రెట్ల సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. భారత్ సమర్థమైనదీ, పోటీనిచ్చేదీ, నిబద్ధత గలదీ అన్న సందేశం ప్రపంచానికి చేరింది. భారత ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వాలైనా.. మేమంతా మీకు అండగా ఉంటామని భారత భాగస్వాములకూ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకూ హామీ ఇస్తున్నాను.
మిత్రులారా,
భవిష్యత్ తరాలు ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూస్తే.. ఈ దశాబ్దంలో భారత్ ఎంతగా పురోగమించిందో గర్వంగా చెప్పకొంటారు. దేశ సాంకేతిక భవితకు ఈ దశాబ్దం నిర్ణయాత్మక మలుపుగా నిలవడం తథ్యం. మరోసారి మైక్రాన్ బృందానికీ, గుజరాత్ ప్రభుత్వానికీ, మీ అందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు!
***
The inauguration of Micron’s semiconductor facility marks a milestone in India’s journey towards technology leadership.
— Narendra Modi (@narendramodi) February 28, 2026
https://t.co/6b9FBoBK8k
India, long known for its software strength, is now firmly establishing its identity in the hardware sector as well. pic.twitter.com/hvZxNFA3Da
— PMO India (@PMOIndia) February 28, 2026
Today, India is rapidly becoming an integral part of the global semiconductor value chain. pic.twitter.com/DAZafT4c3A
— PMO India (@PMOIndia) February 28, 2026
This century belongs to the AI revolution. pic.twitter.com/zt7Yksw7x4
— PMO India (@PMOIndia) February 28, 2026
If oil was the regulator of the last century, microchips will be the regulator of this century. pic.twitter.com/wU0PZTPk1v
— PMO India (@PMOIndia) February 28, 2026
India has just one message for investors around the world... pic.twitter.com/fkiHA5HjCd
— PMO India (@PMOIndia) February 28, 2026
The message has reached the world loud and clear:
— PMO India (@PMOIndia) February 28, 2026
India is Capable.
India is Competitive.
India is Committed. pic.twitter.com/e3f9o3mvzc