Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎంపిక చేసిన స్వీడన్ వ్యాపార దిగ్గజాలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ భేటీ

ఎంపిక చేసిన స్వీడన్ వ్యాపార దిగ్గజాలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ భేటీ


స్వీడన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఎంపిక చేసిన స్వీడన్ సీఈఓలతో 2026 మే17న సమావేశమయ్యారు. స్వీడన్ యువరాణి విక్టోరియా, స్వీడన్ ప్రధానమంత్రి శ్రీ ఉల్ఫ్ క్రిస్టెర్సన్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

భారత్, స్వీడన్ దేశాలు ప్రజాస్వామ్యం, పారదర్శకత, ఆవిష్కరణలు, సుస్థిరత వంటి ఉమ్మడి విలువల ద్వారా అనుసంధానమయ్యాయని, ఇవి ఉన్నత లక్ష్యాలను కలిగి భవిష్యత్ ఆధారిత ఆర్థిక భాగస్వామ్యానికి బలమైన పునాదిని అందిస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నేడు భారత్, స్వీడన్ భాగస్వామ్యం కేవలం ఒక ఆర్థిక సంబంధం మాత్రమే కాదని, అది ఆలోచనలు, సాంకేతికత, ఆవిష్కరణలు,  సహ సృష్టి ల భాగస్వామ్యమని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. భారతదేశ వృద్ధికి స్వీడిష్ కంపెనీలు సుదీర్ఘకాలంగా అందిస్తున్న సహకారాన్ని ఆయన స్వాగతించారు. పరిశోధన,  ఆవిష్కరణలు, ఇంధన మార్పు, తయారీ ఉత్పాదక రంగాలలో మరింత లోతైన సహకారాన్ని పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

సంస్కరణలు, బలమైన దేశీయ డిమాండ్, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, తయారీ రంగ విస్తరణ, తదుపరి తరం మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా భారతదేశంలో వేగంగా జరుగుతున్న ఆర్థిక మార్పును ప్రధానమంత్రి ప్రముఖంగా వివరించారు. మేక్ ఇన్ ఇండియా, జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, జాతీయ క్రిటికల్ మినరల్ మిషన్ వంటి కార్యక్రమాల కింద భారతదేశంలో తమ భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాల్సిందిగా ఆయన స్వీడిష్ కంపెనీలను ఆహ్వానించారు. స్వచ్ఛ ఇంధనం, రక్షణ రంగం, సెమీకండక్టర్లు, అధునాతన తయారీ ఉత్పాదక రంగాలలో విస్తరిస్తున్న అవకాశాలను ఉపయోగించుకోవాలని కూడా ఆయన కోరారు.

సుస్థిర సరఫరా వ్యవస్థలు, హరిత మార్పు, సుస్థిర రవాణా,  జీవ శాస్త్రాలు, డిజిటల్ సాంకేతికతలలో సహకారాన్ని బలోపేతం చేయడంపై కూడా ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి. 21వ శతాబ్దపు సవాళ్లకు ఉమ్మడిగా పరిష్కారాలను కనుగొనడం కోసం  ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధిలో స్వీడన్‌కు ఉన్న బలాన్ని, భారతదేశ విస్తృతి, ప్రతిభ,  వృద్ధి వేగంతో అనుసంధానించడం చాలా ముఖ్యమని ప్రధానమంత్రి శ్రీ మోదీ స్పష్టం చేశారు.