Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూజిలాండ్‌లోని వ్యాపార రంగ ప్రముఖులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

న్యూజిలాండ్‌లోని వ్యాపార రంగ ప్రముఖులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం


న్యూజిలాండ్ ప్రధానమంత్రి శ్రీ క్రిస్టోఫర్ లక్సన్‌తో కలిసి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రముఖ కంపెనీల సీఈఓలు, వ్యాపార రంగ ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

 

 ఈ సందర్భంగా  ప్రధానమంత్రి శ్రీ మోదీ మాట్లాడుతూ… భారత్, న్యూజిలాండ్ దేశాలు ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధమైన పాలన పట్ల గౌరవం, వైవిధ్యం, స్థిరమైన అభివృద్ధికి కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సద్భావనే ఇరు దేశాల ప్రతిష్ఠాత్మక, భవిష్యత్తు ఆర్థిక భాగస్వామ్యానికి బలమైన పునాది అని అభివర్ణించారు. భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కీలక మైలురాయి వంటిదని, ఇది ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలకు మరింత లోతును, చైతన్యాన్ని చేకూరుస్తుందని చెప్పారు. మార్కెట్ ప్రవేశం, పెట్టుబడులు, సేవలు, సాంకేతికత, ప్రతిభావంతుల రాకపోకలకు కొత్త అవకాశాలను ఈ ఒప్పందం తెరుస్తుందని స్పష్టం చేశారు.

 

భారత్‌లో కొనసాగుతున్న అధిక వృద్ధి రేటు, యువ నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, విస్తరిస్తున్న మధ్యతరగతి జనాభా, డిజిటల్ విప్లవం, తదుపరి తరం మౌలిక సదుపాయాల కల్పన, నిరంతర ఆర్థిక సంస్కరణలు న్యూజిలాండ్ కంపెనీలకు వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణల పరంగా అపారమైన అవకాశాలను కల్పిస్తున్నాయని ప్రధాని శ్రీ పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న రాజకీయ స్థిరత్వం, నిరంతర వృద్ధి పథం భారతదేశాన్ని ప్రపంచ వృద్ధికి ఒక ప్రధాన కారకంగా నిలిపాయన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పౌర విమానయానం, లాజిస్టిక్స్, స్వచ్ఛ ఇంధనం, పట్టణ రవాణా, నీటి నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ రంగాల్లో భాగస్వాములు కావాలని న్యూజిలాండ్ పెట్టుబడిదారులను, వ్యాపార సంస్థలను ఆయన ఆహ్వానించారు. దేశంలోని శక్తిమంతమైన అంకుర సంస్థల వ్యవస్థను ప్రస్తావిస్తూ ఆవిష్కరణలు, ఫిన్‌టెక్, కొత్తగా పుట్టుకొస్తున్న సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల ప్రైవేటు రంగాలు మరింత సన్నిహితంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పాడి పరిశ్రమ, ఉద్యానవనం, అటవీ రంగాల్లో న్యూజిలాండ్‌కు ఉన్న నైపుణ్యం.. భారత్‌లోని భారీ వినియోగదారుల మార్కెట్, ఫుడ్ పార్కులు, వ్యవసాయ-పరిశ్రమ ప్రతిభతో జత కట్టాలని ఆకాంక్షించారు. ఈ సమన్వయం ద్వారా ప్రపంచ ఆహార విలువ వ్యవస్థను సృష్టించవచ్చని తెలిపారు.

 

పెట్టుబడులు, వాణిజ్య భాగస్వామ్యాలను విస్తరించడం ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 7 బిలియన్ న్యూజిలాండ్ డాలర్లకు (సుమారు రూ.35,000 కోట్లు) రెట్టింపు చేయాలనే లక్ష్య సాధనకు వ్యాపార సంస్థలు తోడ్పడాలని ప్రధాని శ్రీ మోదీ ప్రోత్సహించారు. భారత్-న్యూజిలాండ్ ఆర్థిక భాగస్వామ్యం సమ్మిళిత, స్థిరమైన వాణిజ్యానికి ఒక ఆదర్శ నమూనాగా మారుతుందని, ఆవిష్కరణలు, శ్రేయస్సుకు ఇది ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని ఆయన చెప్పారు.