Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత -ఇటలీ దేశాల ఉమ్మడి ప్రకటన


 
ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 మే 19-20 తేదీల్లో ఇటలీలో అధికారిక పర్యటన చేపట్టారు. 2024 జూన్‌లో జీ7 సదస్సు సందర్భంగా ఇటలీలో ప్రధాని మోదీ పర్యటన, 2023లో జీ20 సదస్సు సందర్భంగా భారతదేశంలో ప్రధాని మెలోనీ పర్యటనల అనంతరం జరిగిన ఈ పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత్-ఇటలీ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంస్థాయికి పెంచాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.

 

రాజకీయ సంప్రదింపులు

 

ఉన్నత స్థాయి ప్రతినిధుల పరస్పర పర్యటనల విషయంలో వేగం పుంజుకోవటాన్ని ఇరు దేశాల ప్రధానులు స్వాగతించారు. బహుపాక్షిక సదస్సులతో పాటు నాయకుల స్థాయి వార్షిక సమావేశాలను, క్రమం తప్పకుండా మంత్రిత్వ శాఖల, సంస్థల స్థాయి సమావేశాలను నిర్వహించడానికి ఇరువురు అంగీకరించారు.

 

రియో డి జెనీరోలో 2024 నవంబర్‌లో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా సమావేశమైనప్పుడు ఆమోదించిన భారత్-ఇటలీ ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-2029′కు సంబంధించి వివిధ విభాగాల్లో సాధించిన స్పష్టమైన పురోగతిని ఇరువురు నేతలు అభినందించారు. ఈ భారత్-ఇటలీ ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-29 పురోగతిని సమీక్షించటంతో పాటు భారత్-ఇటలీ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి మార్గదర్శకత్వాన్ని అందించడానికి విదేశాంగ మంత్రుల నేతృత్వంలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఇరువురు అంగీకరించారు.

 

ఆర్థిక సహకారం, పెట్టుబడులు

 

గత ఏడాది కాలంగా మూడు ఉన్నత స్థాయి వ్యాపార సదస్సులు విజయవంతంగా జరిగిన నేపథ్యంలో ద్వైపాక్షిక ఆర్థిక, పారిశ్రామిక సహకారంలో పెరుగుతున్న ఉత్తేజం పట్ల ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ సాధిస్తున్న వేగవంతమైన, స్థిరమైన ఆర్థిక వృద్ధి ద్వారా లభిస్తున్న అవకాశాలను పురస్కరించుకొని ఈయూ-భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విషయంలో విజయవంతంగా చర్చలు ముగియటాన్ని ప్రాతిపదికగా తీసుకుంటూ 2029 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 20 బిలియన్ల యూరోల స్థాయికి చేర్చాలనే ఉమ్మడి లక్ష్యాన్ని వారు పునరుద్ఘాటించారు.

 

కీలక రంగాల్లో ద్వైపాక్షిక పెట్టుబడుల పెరుగుదలను వారు స్వాగతించారు. దృఢమైన సరఫరా గొలుసులను నిర్మించడానికి
పారిశ్రామిక, సాంకేతిక భాగస్వామ్యాలను పెంపొందించుకోవాల్సిందిగా ఇరు దేశాల పరిశ్రమలను వారు ప్రోత్సహించారు. ముఖ్యంగా వస్త్రాలు, స్వచ్ఛ సాంకేతికతలు (క్లీన్ టెక్నాలజీస్), సెమీకండక్టర్లు, వాహనాలు, ఇంధన రంగం, పర్యాటకం, ఔషధాలు- వైద్య సాంకేతికతలు, డిజిటల్ సాంకేతికతలు, కీలకమైన ముడి పదార్థాలు, ఉక్కు, ఓడరేవులు, మౌలిక సదుపాయాల రంగాల్లో మరింత విస్తృతంగా పెట్టుబడులు వచ్చే అవకాశాలను వారు స్వాగతించారు. వ్యాపార సంబంధాలను, ఉత్పాదక సౌకర్యాలను పెంపొందించేందుకు ఇరు దేశాల్లో అందుబాటులో ఉన్న విధానపరమైన ప్రోత్సాహకాలు, పథకాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు పరిశ్రమలకు దిశా నిర్దేశం చేశారు.

 

స్టాక్ ఎక్స్ఛేంజీలు, ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్, వెంచర్ క్యాపిటల్స్, బ్యాంకులు, బీమా కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థల మధ్య చర్చలు, పరస్పర సహకారాన్ని ప్రోత్సహించడానికి ఇరువురు ప్రధాన మంత్రులు అంగీకరించారు. సరఫరా వ్యవస్థల విషయంలో మరింత నిర్దిష్ట అంశాల ఆధారిత భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అంగీకరించారు. అంతరిక్ష యాక్సెస్, అంతరిక్ష మౌలిక సదుపాయాల రక్షణపై సహకార అవకాశాలను అన్వేషించడానికి వారు అంగీకరించారు. ఇరు దేశాల అంతరిక్ష పరిశ్రమల ప్రతినిధి బృందాల ఇటీవలి పరస్పర పర్యటనల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. నిపుణుల మార్పిడి, ఉమ్మడి కార్యక్రమాల ద్వారా వాణిజ్యపరమైన సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని, తృతీయ పక్ష దేశాలలోనూ ఈ

భాగస్వామ్యాన్ని విస్తరించాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. 

 

రక్షణ రంగం
మంత్రుల స్థాయి సమావేశాలు… ఇరు దేశాల సైన్యానికి సంబంధించిన విభాగాల మధ్య ప్రత్యక్ష కార్యకలాపాలు, శిక్షణ మొదలైన ఒప్పందాలు… ఓడరేవుల సందర్శనలు సహా రక్షణ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడం కోసం కొనసాగుతున్న చర్యల పట్ల ఇరువురు ప్రధానమంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. హెలికాప్టర్లునౌకాదళ ప్లాట్‌ఫారమ్‌లునౌకాదళ ఆయుధాలుఎలక్ట్రానిక్ యుద్ధాలు సహా సాంకేతిక సహకారంసహ-ఉత్పత్తిసహ-అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భాగస్వామ్యాలను ప్రోత్సహించే ఉమ్మడి ఉద్దేశ ప్రకటనరక్షణ రంగ పరిశ్రమల రోడ్‌మ్యాప్‌ను ఆమోదించుటను వారు స్వాగతించారు. పారిశ్రామిక సామర్థ్యాలను బలోపేతం చేయడం ద్వారా కీలక మౌలిక సదుపాయాలను, వాటికి సంబంధించిన సరుకు రవాణా వ్యవస్థలను పరిరక్షించాల్సిన ప్రాముఖ్యాన్ని వారు గుర్తించారు.

 

జాయింట్ డిఫెన్స్ కమిటీ, మిలిటరీ సహకార బృందం కార్యకలాపాలకు తోడ్పాటునిస్తూ, సంవత్సరానికోసారి సైన్యానికి సంబంధించి ఉన్నత స్థాయి నిర్మాణాత్మక చర్చలను నిర్వహించడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి… సంయుక్త సైనిక విన్యాసాలను, ఇరు దేశాల ఉమ్మడి సైనిక చర్యలను సులభతరం చేసేందుకు వీలుగా శిక్షణ, విద్యా సంబంధిత పాఠ్యప్రణాళికను రూపొందించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.

నౌకా వాణిజ్య రంగంలో భద్రతాపరమైన సహకారం, సమన్వయం, సమాచారం, అత్యుత్తమ విధానాలను పంచుకోవడాన్ని పెంపొందించే లక్ష్యంతో… నౌకా వాణిజ్య భద్రతపై చర్చలను ప్రారంభించడానికి ఇరు దేశాల నేతలూ అంగీకరించారు.

 
భద్రత
సరిహద్దు ఉగ్రవాదం సహా… అన్ని రూపాలు, వ్యక్తీకరణల్లోని ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని ఇరువురు నేతలు తీవ్రంగా ఖండించారు. 2025 ఏప్రిల్ నెలలో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని వారు ఖండించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 1267 ఆంక్షల పరిధిలోని ఉగ్రవాదులు, ఉగ్రవాద సమూహాలు, వాటి అనుబంధ సంస్థలపై పోరాటంలో పరస్పర సహకారం పట్ల తమ నిబద్ధతను ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉగ్రవాదుల సురక్షిత స్థావరాలు, మౌలిక సదుపాయాలను నిర్మూలించడం… ఉగ్రవాద నెట్‌వర్క్‌లను అడ్డుకోవడం… ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడాన్ని ఎదుర్కోవడం కోసం అన్ని దేశాలూ తమ కృషిని కొనసాగించాలని వారు పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి, ఎఫ్ఏటీఎఫ్, ఇతర బహుపాక్షిక వేదికలపైనా కలిసి పనిచేయడం పట్ల తమ నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు.

ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడాన్ని ఎదుర్కోవడానికి భారత్, ఇటలీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన శాశ్వత కార్యాచరణ బృందం తొలి సమావేశాన్నీ… ఉగ్రవాదాన్ని నిరోధించడం లక్ష్యంగా పనిచేసే సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశాన్ని ఇరు దేశాల నాయకులు స్వాగతించారు.

ఇటాలియన్ గార్డియా డి ఫినాంజా, భారత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ఇరు దేశాల ప్రధానమంత్రులు స్వాగతించారు. క్లాసిఫైడ్ సమాచారాన్ని పంచుకోవడం, పరస్పర రక్షణ కల్పించడానికి సంబంధించిన ఒప్పందం… పోలీసు సహకారాన్ని బలోపేతం చేసే ఒప్పందం త్వరలోనే పూర్తవుతాయని వారు ఆకాంక్షించారు. నేరస్తుల అప్పగింత ఒప్పందం, పరస్పర న్యాయ సహాయ ఒప్పందం సహా ఇతర ఒప్పందాలపై కొనసాగుతున్న చర్చలనూ వారు స్వాగతించారు.

వలసలు, రాకపోకలు

ఎస్‌టీఈఎమ్ రంగాల్లో విద్యార్థులు, పరిశోధకులునైపుణ్యం కలిగిన కార్మికుల రాకపోకలను మెరుగుపరచడానికి… కార్మిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధిపై సహకారాన్ని విస్తరించడానికి ఇరువురు నేతలు అంగీకరించారు. ఇందులో భాగంగా, భారత్ నుంచి ఇటలీకి నర్సుల రాకపోకలను సులభతరం చేయడంపైనా ఒక నిర్దిష్ట ఉమ్మడి ఉద్దేశ ప్రకటనను వారు జారీ చేశారు. సామాజిక భద్రతా ఒప్పందం (ఎస్ఎస్ఏ) పై సంబంధిత ఏజెన్సీల మధ్య జరుగుతున్న చర్చలనూ వారు స్వాగతించారు.

ఇటాలియన్ విశ్వవిద్యాలయాల్లో చేరిన భారతీయ విద్యార్థులకు మార్గనిర్దేశం, మ్యాచింగ్, ఇటాలియన్ చట్టాలకు అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేయడం కోసం నిర్దిష్ట మార్గాలను అందించడం ద్వారా వారి ప్రతిభను పెంపొందించే లక్ష్యంతో “ఐసీఐ – ఇటలీ కాల్స్ ఇండియా: ఎ యూనివర్సిటీ-ఎంటర్‌ప్రైజ్ టాలెంట్ బ్రిడ్జ్”ను ప్రారంభించడాన్ని వారు స్వాగతించారు.

సురక్షితమైన, చట్టబద్ధమైన వలసలను నిర్ధారించడానికి… అక్రమ వలసలు, శ్రమ దోపిడీ, మానవ అక్రమ రవాణాల వ్యతిరేక పోరాటంలో సహకారాన్ని బలోపేతం చేసే అవకాశాలనూ వారు చర్చించారు.

సంస్కృతి, విద్యాసంబంధ సహకారం

ద్వైపాక్షిక చర్చలకు సంస్కృతి మూలస్తంభమని ఇరువురు నేతలు స్పష్టం చేశారు. లోథాల్‌లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అభివృద్ధిలో ఇటలీ భాగస్వామ్యానికి సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు. 2026లో వెనిస్ ఆర్ట్ బినాలేలో భారత జాతీయ పెవిలియన్‌నూ వారు గుర్తించారు. 2027ను “ఇటలీ-భారత్ సంస్కృతిపర్యాటక సంవత్సరం”గా జరుపుకోవాలనే తమ ఉద్దేశాన్నీ వారు వ్యక్తం చేశారు. ఈ సంవత్సరంలో అనేక కార్యక్రమాలతో కూడిన క్యాలెండర్‌ను రూపొందించడం సహా, ఇరు దేశాల సాంస్కృతిక మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిర్వహించే ఇటలీ-భారత్ ప్రాచీన సాంస్కృతిక సంబంధాల ప్రదర్శనకూ ఇది మార్గం సుగమం చేస్తుందని వారు అభిప్రాయపడ్డారు.

సంస్థలు, నిపుణులు, సృజనాధారిత పరిశ్రమల ప్రతినిధులను ఒకచోట చేర్చే ఇటలీ-భారత్ సాంస్కృతిక వేదికను నిర్వహించాలని ఇరువురు నేతలు ప్రోత్సహించారు. సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, అభివృద్ధి, నిర్వహణలో సహకారాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో… యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం పొందిన భారతీయ, ఇటాలియన్ ప్రదేశాల మధ్య జంట నగరాల కార్యక్రమాన్ని ప్రారంభించడాన్నీ ఇరువురు నేతలు అభినందించారు.

ఇరు దేశాల పరిశ్రమల బలం, నూతన ఆవిష్కరణల సామర్థ్యాలు, ద్వైపాక్షిక సహ-నిర్మాణ ఒప్పందం ద్వారా అందించిన చట్టపరమైన విధాన ప్రణాళిక ఆధారంగా… చలనచిత్ర, ఆడియో-విజువల్ సహకారాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఇరువురు నేతలు అంగీకరించారు.

ఉన్నత విద్యారంగంలో సహకారాన్ని బలోపేతం చేయాలనే తమ ఉద్దేశాన్ని ఇరువురు ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారు. ఉన్నత విద్య, పరిశోధనలపై ఇండో-ఇటాలియన్ రోడ్‌మ్యాప్‌ను ఆమోదించడాన్ని స్వాగతించారు. భారత నూతన విద్యా విధానానికి అనుగుణంగా భారత్‌లో క్యాంపస్‌లను ప్రారంభించాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటలీ విశ్వవిద్యాలయాలు, అగ్రశ్రేణి సంస్థలను ఆహ్వానించారు.

భారత్-ఈయూ సంబంధాలు

2026 జనవరి 27న జరిగిన భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశంలో అంగీకరించిన భారత్-ఈయూ సమగ్ర వ్యూహాత్మక ఉమ్మడి ఎజెండాను, భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఫలవంతమైన చర్చలను ఇరువురు నేతలు స్వాగతించారు. మార్కెట్‌ను మరింత అందుబాటులోకి తేవడం, వాణిజ్య అవరోధాలను తగ్గించడం, వైవిధ్యభరితమైన వ్యాపార సంస్థలు, కొత్త మార్కెట్ అవకాశాల ద్వారా ఆర్థిక భద్రతను, సామర్థ్యాలను బలోపేతం చేయడం ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలను ఈ ఒప్పందం సమున్నత స్థాయికి తీసుకువెళుతుందని వారు అభిప్రాయపడ్డారు.

వాణిజ్యం, కీలక సాంకేతికతలు, ఆర్థిక భద్రత రంగాల్లో సహకారానికి ముఖ్య వేదికగా భారత్-ఈయూ వాణిజ్య, సాంకేతిక మండలి బలోపేతానికి తమ మద్దతును వారు పునరుద్ఘాటించారు. భారత్-ఈయూ భద్రత, రక్షణ భాగస్వామ్యాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు. సమగ్ర రవాణా విధాన ప్రణాళిక గురించిన అవగాహన ఒప్పందం సహా… రవాణా రంగ సహకారంలో సాధించిన పురోగతిని వారు ప్రశంసించారు.

 

బహుపాక్షిక సహకారం
ఐక్యరాజ్యసమితిని మరింత ప్రాతినిధ్యం గలదిగా, నేటి వాస్తవాలకు అనువుగా మార్చేందుకు గానూ అవసరమైన సంస్కరణలు అమలు చేయాల్సిన తక్షణ అవసరాన్ని ఇరువురు నాయకులు ప్రధానంగా ప్రస్తావించారు.

బహుపాక్షికవాదాన్ని పరిరక్షించడానికి, నియమాల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను కొనసాగించడం కోసం ఐక్యరాజ్యసమితి, జీ20 సహా ఇతర ప్రపంచ వేదికల్లో కలిసి పనిచేయాల్సిన ప్రాముఖ్యాన్ని ఇరువురు నేతలు స్పష్టం చేశారు.

ఆఫ్రికాకు ఇరు దేశాలు ఇస్తున్న వ్యూహాత్మక ప్రాధాన్యతను గుర్తించిన నేతలు… ఆఫ్రికా అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం, ఇటలీ మాటీ ప్రణాళికకు అనుగుణంగా డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ), వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ, కృత్రిమ మేధ, కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనాల వంటి రంగాల్లో ఆఫ్రికన్ భాగస్వాములతో కలిసి త్రైపాక్షిక కార్యక్రమాల్లో పనిచేయడానికీ వారు అంగీకరించారు.

యూఎన్‌సీఎల్ఓఎస్ సహా అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా స్వేచ్ఛాయుత, అందుబాటులో గల, శాంతియుత, సుసంపన్న ఇండో-పసిఫిక్ సాధన పట్ల తమ ఉమ్మడి నిబద్ధతను ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. ఇండో-పసిఫిక్ మహాసముద్ర కార్యక్రమాల సంబంధిత శాస్త్ర-సాంకేతిక, విద్యాసంబంధిత సహకార విభాగాల్లో తమ భాగస్వామ్యం కొనసాగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

పశ్చిమాసియాలోని పరిస్థితిపైనా… ఆ ప్రాంతంతో పాటు ప్రపంచంలోని మిగతా ప్రాంతాలపై దాని ప్రభావాలపైనా ఇరువురు నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 8 ఏప్రిల్ 2026న ప్రకటించిన కాల్పుల విరమణను వారు స్వాగతించారు. పశ్చిమాసియాలో శాశ్వత శాంతి కోసం ఉద్రిక్తతలను తగ్గించడం… చర్చలు, దౌత్యం ప్రాముఖ్యతనూ వారు స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధి ద్వారా నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించేలా చర్యలు చేపట్టాలని, ప్రపంచ దేశాలకు సరుకు రవాణాను పునఃప్రారంభించాలనీ ఇరువురు ప్రధానమంత్రులు పిలుపునిచ్చారు.

ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం వల్ల అపారమైన నష్టాలు, ఇబ్బందులు సహా ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిణామాలు కొనసాగుతున్నాయని ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలకు అనుగుణంగా… చర్చలు, దౌత్యం ద్వారా ఉక్రెయిన్‌లో సమగ్రమైన, న్యాయమైన, శాశ్వతమైన శాంతిని సాధించే ప్రయత్నాలకు మద్దతు కొనసాగించడానికి వారు అంగీకరించారు.

 

ముగింపు
భారత్-ఇటలీ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య అద్భుత వృద్ధినీ, బలోపేతాన్నీ గమనించిన ఇరువురు నేతలు… అన్ని రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించడంకీలకమైన ప్రపంచ, ప్రాంతీయ పరిణామాలపై ఉన్నత స్థాయి సంప్రదింపులను కొనసాగించడం పట్ల తమ నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు.

 

ఇటలీ ప్రభుత్వం, ప్రజలు అందించిన ఆత్మీయ ఆతిథ్యానికి గానూ ఆ దేశ ప్రధానమంత్రి మెలోనికి ప్రధానమంత్రి శ్రీ మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఇరుపక్షాలకు అనుకూలమైన సమయంలో భారత్‌ను సందర్శించాల్సిందిగా ఇటలీ ప్రధానమంత్రిని… శ్రీ మోదీ ఆహ్వానించారు.

 

***