పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్.. 5 స్టేషన్లతో (4 ఎలివేటెడ్, 1 అండర్ గ్రౌండ్), 6.032 కి.మీ. పొడవైన కారిడార్ అయిన అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-2(ఎ)కు ఆమోదం తెలిపింది. ఫేజ్-2(ఎ) అందుబాటులోకి వస్తే అహ్మదాబాద్-గాంధీనగర్ మధ్య 77.63 కిలోమీటర్ల మేర క్రియాశీల మెట్రో రైలు వ్యవస్థ ఉంటుంది. ఫేజ్-2(ఎ) కారిడార్‌లోని స్టేషన్ల పేర్లు… ఆశ్రమ్ రోడ్, కోటేశ్వర్ ప్రాచీన్ మందిర్, సబర్మతి నది, సర్దార్ నగర్, ఎయిర్‌పోర్టు.
ఐడీసీ (నిర్మాణ సమయంలో వడ్డీ)తో కలిపి ఈ ప్రాజెక్టు పూర్తవటానికి అయ్యే మొత్తం వ్యయం రూ.2,169.04 కోట్లు.
ప్రయోజనాలు, వృద్ధికి ఊతం:
నగర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-2(ఎ) కీలక పురోగతిని సూచిస్తుంది. అహ్మదాబాద్ నగరంలోని మెట్రో రైలు వ్యవస్థలో ఫేజ్-2(ఎ) భారీ విస్తరణ అవుతుంది.
మెరుగైన అనుసంధానం:
అహ్మదాబాద్ మెట్రో ప్రాజెక్టు ఫేజ్-2(ఎ) ద్వారా సుమారు 6.032 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో కారిడార్‌ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విమానాశ్రయానికి మెరుగైన అనుసంధానత ద్వారా ప్రస్తుతం రవాణా సౌకర్యం లేని కీలక నివాస, వాణిజ్య ప్రాంతాలను కలుపుతూ ప్రజా రవాణాను గణనీయంగా మెరుగుపరచడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం.
నివాస, వాణిజ్య కేంద్రాలతో సహా కీలక ప్రాంతాలను, ఇప్పటికే ఉన్న అహ్మదాబాద్-గాంధీనగర్ కారిడార్‌తో అనుసంధానించటమే ఈ దశ లక్ష్యం. వరల్డ్ పోలీస్ గేమ్స్-2029, కామన్వెల్త్ గేమ్స్-2030 కోసం దీని పరిసర ప్రాంతాల్లో క్రీడా సదుపాయాలను అభివృద్ధి చేసే అవకాశముంది.
ఈ కీలక ప్రాంతాలను మెట్రో వ్యవస్థతో అనుసంధానించటం ద్వారా ఫేజ్-2(ఎ) కేవలం ప్రయాణ సౌకర్యాన్ని పెంచడమే కాక… ఆర్థిక కార్యకలాపాలను, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. స్థానిక ప్రజలకు, సందర్శకులకు నగర రవాణాను మరింత సులభతరం చేస్తుంది.
· ట్రాఫిక్ రద్దీ తగ్గుదల: రోడ్డు రవాణాకు ప్రత్యామ్నాయంగా మెట్రో రైలు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇందులో భాగంగా మెట్రో వ్యవస్థను ఎయిర్‌పోర్టు వరకు విస్తరిస్తూ చేపట్టిన ఫేజ్-2(ఎ) ప్రాజెక్టు… అహ్మదాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. రహదారులపై రద్దీ తగ్గటం వల్ల వాహనాల రాకపోకలు సజావుగా సాగుతాయి. ప్రయాణ సమయం ఆదా అవుతుంది. రహదారి భద్రత కూడా మెరుగుపడుతుంది.
· పర్యావరణ ప్రయోజనాలు: అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-2(ఎ) అందుబాటులోకి రావటం, అహ్మదాబాద్, గాంధీనగర్ నగరాల్లో మెట్రో వ్యవస్థ విస్తరణ ద్వారా సంప్రదాయ ఇంధన ఆధారిత రవాణా సాధనాలతో పోలిస్తే కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చు.
· ఆర్థిక వృద్ధి: ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్లు, బస్ డిపోల వంటి నగరంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణ సమయం తగ్గటం, రవాణా సౌకర్యం మెరుగుపడటం వల్ల కార్యాలయాలకు, గమ్యస్థానాలకు ప్రజలు వేగంగా చేరుకోగలుగుతారు. ఇది వారి ఉత్పాదకతను పెంచటమే కాక, మెరుగైన అనుసంధానతతో స్థానిక వ్యాపారాలు ఊపందుకుంటాయి. ముఖ్యంగా కొత్త మెట్రో స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. గతంలో రవాణా సౌకర్యం సరిగ్గా లేని ప్రాంతాలు కూడా పెట్టుబడులను, అభివృద్ధిని ఆకర్షించేందుకు ఇది దోహదపడుతుంది.
· సామాజిక ప్రయోజనం: అహ్మదాబాద్‌లో మెట్రో రైలు వ్యవస్థ ఫేజ్-2(ఎ) విస్తరణ ద్వారా ప్రజలకు ప్రజా రవాణా మరింత సులభంగా అందుబాటులోకి వస్తుంది. ఇది విభిన్న సామాజిక-ఆర్థిక వర్గాలకు ప్రయోజనం చేకూర్చి, రవాణా అసమానతలను తగ్గిస్తుంది. తద్వారా ప్రయాణ సమయం తగ్గి, నిత్యావసర సేవలు ప్రజలకు మరింత చేరవవటం ద్వారా జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహదపడుతుంది.
నగర అభివృద్ధిలో అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-2(ఎ) కీలకమైన మార్పును తీసుకురానుంది. ఇది మెరుగైన రవాణా అనుసంధానతను, ట్రాఫిక్ రద్దీ తగ్గింపును, పర్యావరణ ప్రయోజనాలను, ఆర్థిక వృద్ధిని, మెరుగైన జీవన ప్రమాణాలను కల్పిస్తుందని స్పష్టమవుతోంది. పట్టణ ప్రాంత సవాళ్లను పరిష్కరిస్తూ భవిష్యత్తు విస్తరణకు కీలకంగా నిలవటం ద్వారా అహ్మదాబాద్ నగర అభివృద్ధి పథాన్ని, సుస్థిరతను తీర్చిదిద్దటంలో ఫేజ్ 2(ఎ) కీలక పాత్ర పోషిస్తుంది.
అహ్మదాబాద్ మెట్రో ఫేజ్-2(ఎ) ప్రాజెక్టు వల్ల నిర్మాణ పనులు సాగే సమయంలో సుమారు 2,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ మెట్రో వ్యవస్థ నిర్వహణ, పర్యవేక్షణ పనుల కోసం దాదాపు 500 మంది ఉపాధి పొందవచ్చు.

***
Ahmedabad’s urban transformation is getting further momentum!
— Narendra Modi (@narendramodi) June 11, 2026
The Cabinet’s approval for Phase 2(A) of the Ahmedabad Metro Rail Project will strengthen connectivity, particularly to the airport, thus making travel faster and more convenient. This expansion will reduce…