Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు – 2026 ప్రారంభం ప్రధాని ప్రసంగం

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు – 2026 ప్రారంభం ప్రధాని ప్రసంగం


మీ అందరికీ సాదర స్వాగతం.

రుతుపవనాల సానుకూల ప్రభావం మొదలైంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నాయి. రుతుపవనాలయినా, పార్లమెంటు సమావేశాలయినా.. క్రియాశీలంగా ఉంటేనే అవెంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అవి ప్రయోజనకరంగా ఉంటేనే దేశ శ్రేయస్సుకు, సమస్త జీవరాశి సంక్షేమానికి దోహదపడతాయి. ఇదే ఆశతో రుతుపవనాలు సానుకూలంగా కొనసాగాలని, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కూడా ఫలప్రదంగా సాగాలని ఆశిస్తూ ప్రార్థిద్దాం.

మిత్రులారా,

గత నెల రోజుల్లో ప్రజలు గర్వించేలా దేశం ఎన్నో విజయాలను సాధించింది. జాతీయ, అంతర్జాతీయ అంశాలతోపాటు అంతరిక్ష రంగంలోనూ అద్భుతాలు చేసింది. భారత ఖ్యాతిని ఇనుమడింపజేసిన రోజులివి. సరిగ్గా గతేడాది వర్షాకాల సమావేశాలకు ముందు ఒక భారతీయ పౌరుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఇక నిన్న గాక మొన్న ఒక యువ భారతీయ అంకుర సంస్థ అసాధారణ ఘనతను సొంతం చేసుకుంది. వేళ్ల మీద లెక్కపెట్టగలిగేటన్ని దేశాల్లో మాత్రమే ప్రైవేటు సంస్థలు ఇలాంటి అద్భుత సామర్థ్యాన్ని కనబరిచాయి. మన యువ ఆవిష్కర్తలు అంతరిక్ష రంగంలో దేశ ఆకాంక్షలను సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లారు. ఇది నిజంగా అద్భుతమైన విజయం. స్కైరూట్ స్టార్టప్‌లో పనిచేస్తున్న బృందం సగటు వయస్సు కేవలం 28 ఏళ్లు మాత్రమేనని నాకు తెలిసింది. ఈ యువ మేధావులే ఈ అద్భుతాన్ని సాధ్యం చేశారు. నేనేదో ‘56 ఏళ్ల యువకుడి’ గురించి మాట్లాడడం లేదు. సగటు వయస్సు కేవలం 28 ఏళ్లున్న ఒక స్టార్టప్ బృందం గురించి మాట్లాడుతున్నాను. వారు అంతరిక్షంలో భారత పతాకాన్ని సగర్వంగా నిలిపారు. వారు కచ్చితంగా మన హృదయపూర్వక అభినందనలకు అర్హులు. మరీ ముఖ్యంగా, ఇలాంటి విజయాలు దేశంలో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. ప్రపంచంలో ఒక గౌరవప్రదమైన, నమ్మకమైన భాగస్వామిగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయి.

మిత్రులారా,

ఇది యాదృచ్ఛికం కాదు. ఇదొక శక్తిమంతమైన సందేశం. భారతీయ యువత సామర్థ్యాలు, ఆశయాలు అంతరిక్షం లాగే అనంతమైనవని తెలిపే సందేశమిది. దేశానికి దీని కన్నా గొప్ప స్ఫూర్తి మరొకటి ఉండదు.

మిత్రులారా,

దేశం చేపట్టిన సంస్కరణల పరంపర ఫలితమే ఇది. దీనివల్లే మన యువత ఇలాంటి సాహసోపేతమైన అడుగులు వేసి విజయం సాధించగలుగుతున్నారు.

మిత్రులారా,

ఇటీవల రాజస్థాన్‌లో ఒక భారీ చమురు శుద్ధి కర్మాగారం ప్రారంభమైంది. కొన్ని వారాల కిందటే దేశంలో మూడో సెమీకండక్టర్ ప్లాంటును కూడా ప్రారంభించుకున్నాం. ప్రపంచంలో చాలా కొద్ది దేశాల్లోనే అందుబాటులో ఉన్న గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత రైలును కూడా కొన్ని రోజుల కిందటే భారత్ ప్రారంభించింది. అయితే భారత్ ప్రారంభించిన ఈ హైడ్రోజన్ రైలు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఇంజిన్‌తో నడిచేదీ, అత్యంత పొడవైనదీ కావడం విశేషం. దేశం కోసం ఒక నిర్దిష్ట లక్ష్యంతో కృషి చేస్తున్న భారత శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, కార్మికుల అంకితభావం, నిరంతర కృషి ఫలితంగానే ఈ అద్భుత విజయాలు సాధ్యమయ్యాయి.

మిత్రులారా,

యుద్ధ సదృశ పరిస్థితులు తలెత్తుతూ ఉండడం, దానిపై ప్రపంచ దేశాల ఆందోళన మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం… ఇంధనం కోసం ఇతర దేశాలపై ఎక్కువగా ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఒక పెద్ద సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. దీని వల్ల పెట్రోలు, డీజిల్, ఎల్‌పీజీ, ఎరువులు, రసాయనాల సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ భారత్ 7.7 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతూ, ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. భారత్ బలాన్ని, ఉత్సాహంతో శక్తితో సరికొత్త శిఖరాలను అధిరోహించాలన్న దేశ దృఢ సంకల్పాన్ని ఇది స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో.. దేశం ఇప్పటికే వేగాన్ని సంతరించుకుంది. సభా స్ఫూర్తి ఈ ప్రగతి గమనానికి సరికొత్త శక్తిని, ఉత్సాహాన్ని అందించగలదు. దేశ లక్ష్యాలను సాధించాలంటే ఇలాంటి సానుకూల స్ఫూర్తి ఎంతో అవసరం. రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా మన సభలో ఎంతోమంది అనుభవజ్ఞులైన పార్లమెంటు సభ్యులు ఉన్నారు. వారి జ్ఞానం, దార్శనికత పార్లమెంటుకు, దేశానికి ఎంతగానో అవసరం. అందువల్ల పార్లమెంటు సజావుగా సాగాలి. అర్థవంతమైన చర్చలు జరగాలి. దేశాన్ని ముందుకు నడిపించేందుకు ఉమ్మడి తీర్మానాలు చేయాలి. నేటి కాలపు అత్యావశ్యకమిది. నేటి యువత ఆకాంక్షిస్తున్నది కూడా ఇదే. దేశభక్తి, సమర్పణ భావమున్న వారికి పార్లమెంటు సరైన వేదికగా నిలవాలి. వారు తమ గళాన్ని వినిపించడంతోపాటు దేశానికి దిశానిర్దేశం చేయడం నేడు అత్యావశ్యకం. వాస్తవాలకు, తర్కానికి ప్రాధాన్యమున్న చోట అంతరాయాలకు తావుండదని నేను బలంగా నమ్ముతున్నాను. బలమైన వాదనలు, పక్కా వాస్తవాలు ఉన్నప్పుడు… గందరగోళం లేకుండా ప్రశాంతంగా, అత్యంత శక్తిమంతంగా తమ గళాన్ని వినిపించే అవకాశం ఉంటుంది. వాస్తవాలు, తర్కంతో పార్లమెంటు చర్చలు సుసంపన్నం కావాలనిఅందరికీ తమ వాదనను వినిపంచే అవకాశం లభించాలని, ప్రతి ఆలోచనకూ గౌరవం దక్కాలని నేను ఆశిస్తున్నాను. పార్లమెంటులో మన పాత్ర ఇదే. ఈ సమావేశంలో క్రియాశీలక భాగస్వాములు కావాల్సిందిగా ఎంపీలందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయం స్పీకర్ కూడా సామాజిక మాధ్యమం ద్వారా ఎంపీలకు స్వాగతం పలికారు. నేను కూడా ఆయనతో గొంతు కలుపుతున్నాను.

మీ అందరికీ ధన్యవాదాలు.

నమస్కారం.  

 

***