Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘వికసిత వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2026’లో ప్రధానమంత్రి ప్రసంగం

‘వికసిత వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2026’లో ప్రధానమంత్రి ప్రసంగం


మిత్రులారా,

ఈ రోజు మీ అందరితో మాట్లాడటం ఎంతో ఆనందంగా ఉంది. కేంద్ర మంత్రివర్గ సహచరుడు మన్సుఖ్ మాండవీయ, మంత్రి రక్షా ఖడ్సే, దేశవ్యాప్తంగా యువ మిత్రులు మనతో పాటు ఈ కార్యక్రమంలో ఉన్నారు. 

ఈ కార్యక్రమం నిజంగా ఎంతో ప్రత్యేకమైనది. దేశంలోని దాదాపు 250 జిల్లాల యువత ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం.

మిత్రులారా,

కొన్నేళ్ల కిందట మనం ‘మై భారత్’ వేదికను ఏర్పాటు చేశాం. ఈ రోజు దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువకులు ఇందులో భాగస్వాములై, ప్రశంసనీయమైన కృషి చేస్తున్నారు. ‘వికసిత భారత్ డైలాగ్’ నుంచి ‘వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్’ వరకు మీ సామర్థ్యాన్ని, సత్తాను చాటారు. 

మిత్రులారా,

యువ నాయకుల సమావేశం సమయంలో నాకు ఓ ఆలోచన వచ్చింది. కేవలం సాంకేతికత ద్వారా వర్చువల్‌గా ముచ్చటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగి, భారతదేశాన్ని అనుభూతి చెంది, అర్థం చేసుకుంటే ఎలా ఉంటుంది? గ్రామాల్లో అభివృద్ధి ఆకాంక్షలు కేవలం ఆ గ్రామాలను సందర్శించినప్పుడే స్పష్టంగా తెలుస్తాయి. మన సరిహద్దు గ్రామాల్లో అభివృద్ధి తపనతో పాటు అపారమైన దేశభక్తి అలరారుతుంటుంది. అక్కడ నివసించే ప్రజలకు స్వంత సౌకర్యాల కంటే దేశమే మొదటి ప్రాధాన్యం అని తరచూ అనిపిస్తుంది.

అందుకే వేర్వేరు జిల్లాల యువత హిమాచల్, ఉత్తరాఖండ్, లడఖ్ గ్రామాలకు వెళ్ళాలనేది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. అక్కడి ప్రజల జీవన విధానం, ఆహార అలవాట్లు, పనితీరు, సంస్కృతి, జీవన శైలి, వారు ఎదుర్కొనే సవాళ్లను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికే ఈ ఏర్పాట్లు చేశాం. దేశపు తొలి గ్రామాలలో నివసించే ప్రజలు దేశ భద్రత పట్ల ఎంత అప్రమత్తంగా ఉంటారో, మిగతా భారతదేశంతో వారి అనుబంధం ఎంత బలమైనదో కళ్లారా చూడటానికే ఈ అనుభవాన్ని మన యువతకు అందించాం. ఈ కార్యక్రమం పట్ల వెల్లువెత్తిన ఉత్సాహం నిజంగా అద్భుతం. ఈ పోటీలో దాదాపు 3 లక్షల మంది యువకులు పాల్గొనగా, వారిలో 400 మందికి పైగా ఎంపికయ్యారు. మీకు ఏమాత్రం పరిచయం లేని ఆ సుదూర గ్రామాలలో మీరు ఒక వారం రోజులు గడిపారు. వారి జీవనశైలిని అలవర్చుకుని, వారి సంస్కృతిలో మమేకమై, మీ ఆచారాలను వారితో పంచుకున్నారు. ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ భావనకు నిజంగా ఇది అత్యుత్తమ నిదర్శనం.

మిత్రులారా,

ఈ కార్యక్రమంతో నాకు వ్యక్తిగతంగా కూడా ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నేను ప్రభుత్వ బాధ్యతల్లో, రాజకీయాలో లేని రోజుల్లో తరచూ ఇటువంటి సరిహద్దు గ్రామాలను సందర్శించేవాడిని. అక్కడ చాలామందితో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఆత్మీయ బంధాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా సరిహద్దు గ్రామాలకు వెళ్లే అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. గడిచిన 25 ఏళ్లుగా నేను దీపావళి పండుగను సరిహద్దుల్లో మన వీర జవాన్లతో కలసి జరుపుకుంటున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. మీరు సందర్శించిన కొన్ని గ్రామాలకు గతంలో నేను కూడా స్వయంగా వెళ్లాను. మీరు మీ అనుభవాలు పంచుకుంటుంటే, ఆ పాత జ్ఞాపకాలన్నీ నా కళ్లముందు స్పష్టంగా మెదిలాయి. మీ అనుభవాలు కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. కొందరు ఎత్తైన పర్వత శ్రేణులు అందించిన ఆధ్యాత్మిక అనుభూతిని వివరించగా, మరికొందరు సరిహద్దు గ్రామీణుల ఆప్యాయతానురాగాలను గుర్తుచేసుకున్నారు. కొందరు చిన్నారుల కళ్ళలో కనిపించే కలలను ప్రస్తావిస్తే, ఇంకొందరు మన సైనికుల ధైర్యసాహసాలను, క్రమశిక్షణను కళ్లారా చూశారు. నిజంగా, ‘వైబ్రంట్ విలేజ్’ అనుభవం అత్యంత అద్భుతమైనది. కాకతాళీయంగా ఈ రోజు కార్గిల్ విజయ్ దివస్ కూడా. మీలో చాలామంది కార్గిల్ పరిసర ప్రాంతాలను సందర్శించారు. అక్కడ మన వీర సైనికులు అత్యంత కఠినమైన పరిస్థితులలో విజయం సాధించారు. ఆ ఘట్టాలను మీరు స్వయంగా కళ్లారా చూశారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములై, ఇటువంటి అమూల్యానుభవాలను పొందిన మీ అందరికీ నా అభినందనలు.

మిత్రులారా,

అభివృద్ధి చెందిన గ్రామమే వికసిత భారతానికి పునాది. వికసిత భారత నిర్మాణ యాత్ర నిరంతరం కొనసాగుతోంది. ఈ ప్రయాణంలో యువత పాత్ర అత్యంత కీలకం. యువత క్షేత్రస్థాయితో అనుసంధానమైనప్పుడే వికసిత భారతంపై వారి దృష్టికోణం మరింత విస్తృతమవుతుంది. దేశం కోసం జీవించాలనే సంకల్పాన్ని, దేశాభివృద్ధికి తమ వంతు సేవ చేయాలనే నిబద్ధతను అది మరింత బలోపేతం చేస్తుంది.

మిత్రులారా,

ఈ కార్యక్రమంలో భాగంగా సరిహద్దు గ్రామాలలో జీవనం ఎంత క్లిష్టతరమో మీరు స్వయంగా తెలుసుకుని ఉంటారు. ఇన్ని కష్టనష్టాలు ఎదురవుతున్నా, ఆ గ్రామాల ప్రజలు ప్రతిక్షణం దేశభక్తిని గుండెల్లో నింపుకుని జీవిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు సరిహద్దు గ్రామాలను “చివరి గ్రామాలు” అని పిలుస్తూ, వాటిని విధి దయాదాక్షిణ్యాలకు వదిలేశారు. రహదారులు, విద్యుత్, తాగునీరు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి ప్రాథమిక సౌకర్యాలు అసలే లేవు. అక్కడి ప్రజల నుంచి మీరు ఇలాంటి ఎన్నో కథలు వినే ఉంటారు. వారు నాటి పరిస్థితుల గురించి మీకు చెప్పే ఉంటారు. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వారిలో దేశభక్తి ఎంతమాత్రం సడలకుండా అలాగే నిలిచి ఉండటం మనమందరం గర్వించదగిన విషయం.

అందుకే మిత్రులారా,

మా ప్రభుత్వం ఈ సరిహద్దు గ్రామాలను దేశ తొలి గ్రామాలుగా పరిగణించింది. ఉదయించే భానుడి తొలి కాంతులు భారతదేశాన్ని పలకరించేది ఇక్కడే, అస్తమించే సూర్యకిరణాలు వీడ్కోలు చెప్పేది ఇక్కడే. మువ్వన్నెల జెండా తొలిసారిగా గాలులతో ముచ్చటించేది ఇక్కడే. ఈ ప్రపంచం భారతదేశాన్ని మొదటిసారిగా చూసేది కూడా ఇక్కడే!

ఆలోచనా దృక్పథంలో వచ్చిన ఈ మార్పే మన సరిహద్దు ప్రాంతాల ముఖచిత్రాన్ని మార్చివేసింది. ఎన్నో గ్రామాలకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా విద్యుత్ కాంతులు ప్రసరించాయి. రోడ్డు సదుపాయం ఏర్పడింది, ఇంటింటికీ కుళాయి నీళ్లు అందాయి, వంటింట్లోకి గ్యాస్ కనెక్షన్లు వచ్చాయి. నగరాల్లో ఉండేవారికి ఇవి సాధారణ విషయాలుగా అనిపించవచ్చు, కానీ ఆ గ్రామ ప్రజల జీవితాల్లో ఇవి విప్లవాత్మక మార్పును తీసుకొచ్చాయి. రైతులు, తోటల పెంపకందారులు ఇప్పుడు తమ కూరగాయలను, పండ్లను పెద్ద మార్కెట్లకు సులభంగా తరలించగలుగుతున్నారు. మెరుగైన రవాణా సదుపాయాల వల్ల అక్కడి ప్రజల జీవితం ఎక్కడా ఆగిపోకుండా వేగంగా ముందుకు సాగుతోంది. మీరు గమనించే ఉంటారు… అంతటి సుదూర గ్రామాల్లో కూడా ఇప్పుడు అద్భుతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని మీరు ఎంతో సంతోషంగా వివరించారు.

మిత్రులారా,

ఈ రకమైన సౌకర్యాల వల్ల మరొక గొప్ప ప్రయోజనం కూడా చేకూరింది. ఈ ప్రాంతాలలో పర్యాటకం విశేషంగా అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు నిర్మానుష్యంగా మారిన గ్రామాలు ఇప్పుడు మళ్లీ కళకళలాడుతున్నాయి. ఆడపిల్లలు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్తున్నారు. విద్యకు, ఉపాధి అవకాశాలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతోంది. ‘వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్’ ఈ అభివృద్ధికి మరింత వేగాన్ని అందిస్తోంది.

మిత్రులారా,

వికసిత సరిహద్దు గ్రామాల ప్రయాణం ప్రతీ ఒక్కరినీ ఏకం చేసే ఒక శక్తిమంతమైన మాధ్యమం. ఇప్పుడు మీ బాధ్యత మరింత పెరిగింది. మీ ఈ ప్రయాణం ప్రజా భాగస్వామ్యం ద్వారా సాధించే ఐక్యతా ప్రయాణం. భారత యువత సరిహద్దు గ్రామాలను ఎంతగా తెలుసుకుంటే, అంత సులభంగా భారతదేశాన్ని అర్థం చేసుకుంటారు. దేశంలోని ప్రతి మూలతో అనుసంధానమవుతారు, అలాగే దేశాన్ని మరింత బలోపేతం చేస్తారు. గుర్తుంచుకోండి, ఆ గ్రామాల్లో మీకు బస చేయడానికి ఎటువంటి అతిథి గృహాలు లేదా హోటళ్లు లేవు. ఆ ఊరు ఊరంతా మీకు ఆతిథ్యమిచ్చి తమ సొంతవారిగా ఆదరించింది. మీ బస కేవలం తలదాచుకోవడానికి మాత్రమే పరిమితం కాలేదు.  అది ఒక సాంస్కృతిక పాఠశాలగా మారింది. అక్కడ సౌకర్యాల కంటే మిమ్మల్ని ఎంతగానో సంతోష పెట్టే ఆదరాభిమానాలు, గౌరవమర్యాదలు లభించాయి. మీరు అక్కడ పొందిన అనుభవాన్ని ఏ తరగతి గదిలోనూ నేర్చుకోలేరు. ఈ అనుభవాలను తోటి యువతతో పంచుకోండి. వారిని కూడా సరిహద్దు గ్రామాలను సందర్శించేలా ప్రోత్సహించండి. ఎంత ఎక్కువ మంది యువకులు అక్కడికి వెళ్తే, మన దేశాన్ని అంతగా చూసి అర్థం చేసుకోగలరు. ప్రజల రాకపోకలు పెరిగేకొద్దీ, ఆ గ్రామాలకు వసతులు కూడా మరింత వేగంగా చేరుకుంటాయి.

మిత్రులారా,

మా ప్రభుత్వం సరిహద్దు గ్రామాల్లో పర్యాటకాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తోంది. మీరు ఈ ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్లవచ్చు. మీ అనుభవాలను కనీసం 100 మంది ఇతర యువకులతో పంచుకోవాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ ప్రాంతంలోని ప్రజలతో నిరంతరం అనుసంధానమై ఉండండి. మీరు అక్కడ తీసుకున్న ఫోటోలు లేదా వీడియోలను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయండి. అక్కడి ప్రకృతిని, సంస్కృతిని ప్రచారం చేయడానికి స్థానిక కంటెంట్ క్రియేటర్లతో కలిసి పనిచేయండి. మీరు అక్కడ ఏవైనా స్థానిక ఉత్పత్తులను చూసి ఉంటే, వాటిని మీ ప్రాంతంలో ఎలా ప్రోత్సహించాలో ఆలోచించండి. ఇంటర్నెట్‌లో ఎంతో సమాచారం లభిస్తుంది, కానీ ఆ గ్రామాల గురించిన ప్రామాణికమైన సమాచారాన్ని, ప్రత్యక్ష అనుభవాలను ప్రపంచానికి అందించగల శక్తి మీకు ఉంది. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆ గ్రామాలను మళ్లీ సందర్శించండి. అలాగే, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు,  సరిహద్దు గ్రామాలకు విద్యా పర్యటనలను  ఏర్పాటు చేయాలని నేను కోరుతున్నాను.

మిత్రులారా, 

21వ శతాబ్దాన్ని తీర్చిదిద్దేది మీ యువతేనని నేను ఎప్పుడూ దృఢంగా నమ్ముతాను. ఇదే భారత యువత నిజమైన బాధ్యత. మీరే వికసిత భారత్‌కు అసలైన శక్తి, ఆ అభివృద్ధి ఫలాలను పొందే ప్రధాన లబ్ధిదారులు కూడా మీరే. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటి పరిష్కారాలతో యువత ప్రత్యక్షంగా అనుసంధానమైనప్పుడు దేశ భవిష్యత్తు తప్పకుండా ఉజ్వలంగా ఉంటుంది. ఇదే స్ఫూర్తితో మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.  

ధన్యవాదాలు…

గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి సుమారు తెలుగు అనువాదం.

 

***