Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పారిస్‌లో అంతర్జాతీయ అంతరిక్ష సదస్సునుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

పారిస్‌లో అంతర్జాతీయ అంతరిక్ష సదస్సునుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం


   ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సునుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సరైన సమయంలో సాదరంగా తనను ఆహ్వానించడంపై చొరవ చూపిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ చారిత్రక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తనకు లభించడంపై- “తొలి అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో పాలుపంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

విశ్వంపై మానవాళికిగల శాశ్వత ఆకర్షణను ప్రస్తావిస్తూ- అంతరిక్షం అనేక శతాబ్దాలుగా మానవ ఊహాశక్తికి స్ఫూర్తినివ్వడమే గాక ఎన్నో పరీక్షలు పెట్టిందని ప్రధానమంత్రి అన్నారు. వాతావరణం, పంటల సాగు నుంచి సముద్రాలు, సమాజాల దాకా ఈ సరిహద్దు నేడు భూగోళంపై దైనందిన జీవితాన్ని తీర్చిదిద్దుతోందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు “అనంత అవకాశాల అంతరిక్షంపై మనందరిదీ సమష్టి బాధ్యత” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

విశ్వావరణంలో నానాటికీ ఇనుమడిస్తున్న సంక్లిష్టతను ప్రస్తావిస్తూ- సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ ముఖ్యంగా కక్ష్యలలో రద్దీ పెరిగిపోతున్నదని పేర్కొన్నారు. తదనుగుణంగా ఈ రంగంలో భాగస్వాముల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో స్వల్ప లబ్ధికన్నా దీర్ఘకాలిక ఫలితాలకు ప్రపంచ భాగస్వామ్యాలు ప్రాధాన్యమివ్వాలని ఆయన ఉద్ఘాటించారు. అంటే- “సంఘర్షణ స్థానే సహకారం, స్వల్ప లబ్ధి బదులు దీర్ఘకాలిక ప్రయోజనం, వెలివేత కాకుండా కలబోతకు ప్రాముఖ్యంతో మన ఆకాంక్షలు సుస్పష్టంగా ఉండాలి” అని శ్రీ మోదీ పిలుపునిచ్చారు.

భూగోళంపై భారత తాత్త్విక దృక్పథాన్ని ప్రస్తావిస్తూ- ‘వసుధైవ కుటుంబకం’.. అంటే- ‘ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు’ స్ఫూర్తితో ఇది దృఢంగా పెనవేసుకు పోయిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ఐక్యతా స్ఫూర్తి సురక్షిత లోకానికి భరోసా ఇస్తూ మన భూగోళాన్ని దాటి ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ క్రమంలో “అంతర్జాతీయ చట్టం, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారం ప్రాతిపదికగా సురక్షిత-సుభద్ర-శాంతియుత-సుస్థిర అంతరిక్ష రంగానికి మేం ప్రాధాన్యమిస్తాం” అని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.

పారదర్శక పరిశోధనల ప్రాధాన్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- అంతరిక్ష రంగంలో భారత్‌ ప్రస్థానం విశ్వ సంక్షేమ తత్త్వాన్ని సంపూర్ణంగా ప్రతిబింబిస్తున్నదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రపంచ ప్రగతి కోసం సమాచార ఆదానప్రదానం అత్యావశ్యకమని ఆయన పేర్కొన్నారు. “శాస్త్రీయ సమాచారం మరింత పారదర్శకత, సమగ్రతతో సామాన్య ప్రజానీకం శ్రేయస్సుకు ఉపయోగపడాలి” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

భారత ఏరోస్పేస్ రంగం అద్భుత పురోగమనాన్ని వివరిస్తూ- వాతావరణంపై అంచనాలు, విపత్తుల నిర్వహణ, నావిగేషన్ కోసం ఉపగ్రహ సాంకేతికత తదితరాల ద్వారా ఒనగూడే ఆచరణాత్మక ఫలితాలను ప్రధానమంత్రి ప్రస్ఫుటం చేశారు. ఈ అత్యాధునిక సామర్థ్యాలు నేడు రైతులు, మత్స్యకారులు సహా క్షేత్రస్థాయిలో అన్ని వర్గాలకూ నేరుగా సేవలు అందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. “ఈ ప్రస్థానంలో కీలక స్థానానగల ఇస్రో తన నైపుణ్యం, స్వల్ప వ్యయంతో  ప్రయోగాల ద్వారా ప్రపంచ దేశాల ప్రశంసలు  చూరగొంటోంది” శ్రీ మోదీ సగర్వంగా ప్రకటించారు.

ఉపగ్రహ ప్రయోగ సేవల రంగంలో భారత అంతర్జాతీయ సహకార విస్తృతిని వివరిస్తూ- స్వదేశీ రాకెట్ల ద్వారా 34 దేశాల నుంచి 430కి పైగా పేలోడ్‌లను విజయవంతంగా ప్రయోగించిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ సంయుక్త శాస్త్రవిజ్ఞాన కృషితో ప్రపంచవ్యాప్త విస్తృత ప్రయోజనాలు సమకూరుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు “భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సాంకేతిక పరిజ్ఞానం, భాగస్వామ్యాలు స్వదేశానికే కాకుండా విశాల ప్రపంచ ప్రయోజనాలకూ దోహదం చేస్తున్నాయి” అని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.

ఈ సంస్థాగత విజయాన్ని భారత అసాధారణ మానవ వనరులకు ఆపాదిస్తూ- తరతరాల శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల అంకితభావం, కఠోర శ్రమకు ప్రధానమంత్రి నివాళి అర్పించారు. అంతరిక్ష ప్రస్థానంలో ముందంజ వేసిన దేశాల సరసన భారత్‌ను సగర్వంగా నిలపడంలో వారి అవిరామ కృషిని వేనోళ్ల కొనియాడారు. “రాత్రింబవళ్లు అలుపెరుగకుండా పనిచేస్తూ, ప్రతి ప్రయోగం.. ప్రతి విజయంతో వారు ఇస్రోకు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిపెట్టారు” అని శ్రీ మోదీ ప్రశంసలు కురిపించారు.

గ్రహ విజ్ఞాన శాస్త్ర పరిశోధనలో సాధించిన అద్భుత విజయాలను గుర్తుచేస్తూ- ప్రస్తుతం ఇస్రో ప్రయోగించిన ‘ఆదిత్య-ఎల్1’ సూర్యగోళ రహస్యాలను ఛేదిస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. అలాగే, నిరుడు భారత వ్యోమగామి ఒకరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపి వచ్చారని చెప్పారు. చంద్రుని దక్షిణి ధ్రువంపై దిగడం ద్వారా ఒక కొత్త ప్రపంచ ప్రమాణాన్ని నెలకొల్పిన ఇస్రో ఘనతను ఆయన సగర్వంగా గుర్తుచేశారు. ఈ మేరకు “చంద్రుని దక్షిణ ధ్రువానికి సమీపాన పాదం మోపిన తొలి దేశంగా చంద్రయాన్-3 భారత్‌ ప్రతిష్టను అంతరిక్షానికి చేర్చింది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి భారత జాతీయ వ్యూహాత్మక ప్రణాళికను ప్రధానమంత్రి వివరించారు. ఈ మేరకు 2035కల్లా స్వదేశీ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు, 2040 నాటికి చంద్రునిపైకి వ్యోమగామిని పంపడం తదితరాలను ఆయన ప్రకటించారు. ఈ దీర్ఘకాలిక కృషి యావత్తూ ఓ కీలక సంకల్పంతో సాగుతున్నదని ఆయన పేర్కొన్నారు. “ఈ దిశగా సాగే ప్రయత్నాలన్నటికీ యావత్‌ మానవాళి ప్రయోజనాలే పరమావధి కావాలన్నదే మా సుస్పష్ట మూలసూత్రం” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.

దేశీయ వాణిజ్యావరణంలో వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరిస్తూ- భారత వ్యవస్థాగత సంస్థలు సహా ప్రైవేట్ అంతరిక్ష రంగం కూడా వేగంగా పురోగమిస్తున్నదని ప్రధానమంత్రి చెప్పారు. వర్ధమాన అంకుర సంస్థలు, సుస్థిర స్థానంలోగల సంస్థల మధ్య చైతన్యపూరిత సమన్వయాన్ని ఆయన ప్రశంసించారు. “ఇస్రో నైపుణ్యంతో నేడు వాణిజ్య సామర్థ్యం జట్టుకడుతోంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

భారత అంతరిక్ష కార్యక్రమం 1960 దశకంలో కేరళంలోని తుంబాలో శ్రీకారం చుట్టుకున్న నాటినుంచీ ఫ్రాన్స్ ఒక విశ్వసనీయ భాగస్వామిగా ఉందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. రెండు దేశాల మధ్య సుదీర్ఘ ద్వైపాక్షిక సంబంధాలకు ఇదొక నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రస్తుత సంయుక్త కార్యక్రమాలు ఉన్నత స్థాయి పరిశోధనను విస్పష్ట సామాజిక ప్రయోజనాలతో విజయవంతంగా జోడిస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ మేరకు “భూ పరిశీలన, అత్యాధునిక సాంకేతికతల దాకా విస్తరించిన నేటి మన సహకారం శాస్త్రవిజ్ఞాన నైపుణ్యాన్ని మానవ లక్ష్యంతో మమేకం చేస్తోంది” అని శ్రీ మోదీ చెప్పారు.

అంతర్జాతీయ భాగస్వాములకు సార్వత్రిక ఆహ్వానం పలుకుతూ- భవిష్యత్‌ అంతరిక్ష అన్వేషణ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. అంతరిక్ష ఆవిష్కరణలలో తదుపరి దశకు మార్గదనిర్దేశంలో చేతులు కలపాలని అంతర్జాతీయ సమాజాన్ని స్వాగతించారు. ఈ మేరకు “అనంత అంతరిక్ష రంగ అన్వేషణలో భారత్‌తో సహ యాత్రికులుగా సాగాలని ఫ్రాన్స్ సహా ప్రపంచ దేశాలకు ఇదే నా వినతి” అని శ్రీ మోదీ ఆహ్వానం పలికారు.

చివరగా- ఈ సదస్సులో పాల్గొన్న ప్రముఖులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ- సహకారాత్మక అన్వేషణ, ఆవిష్కరణలతో అంతరిక్ష వాతావరణ పరిరక్షణకు కృషి చేయాలని అంతర్జాతీయ సమాజానికి ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈ మేరకు “సమష్టి అన్వేషణ, ఆవిష్కరణ, అంతరిక్ష పరిరక్షణకు భరోసా ఇస్తూ యావత్ మానవాళికి… ముఖ్యంగా భావితరానికి ఈ సదస్సు విస్పష్ట సందేశమివ్వాలి” అని పిలుపునిస్తూ శ్రీ మోదీ తన ప్రసంగం ముగించారు.

 

***