పిఎంఇండియా
ప్రధానమంత్రి: స్మిత్ గారూ.. నమస్తే!
కెప్టెన్ స్మిత్: జై హింద్.. నమస్తే సర్!
ప్రధానమంత్రి: ఎలా ఉన్నారు.. ముఖ్యంగా మీ ఆరోగ్యం ఎలా ఉంది?
కెప్టెన్ స్మిత్: అంతా బాగుంది సర్… దేవుడి దయవల్ల క్షేమమే.
ప్రధానమంత్రి: దేశంలోని ప్రజలంతా మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మీ కోసం అన్ని చోట్లా మృత్యుంజయ మహామంత్ర జపం నిరంతరం కొనసాగుతోంది.
కెప్టెన్ స్మిత్: అవునా సర్… సంతోషం.
ప్రధానమంత్రి: మీ ధైర్యం, సహనం, సంక్లిష్ట స్థితిలో మీ సమయస్ఫూర్తి అద్భుతం.. రెప్పపాటులో మీరు చాలా కీలక నిర్ణయాలు తీసుకోగలగడం అభినందనీయం.
కెప్టెన్ స్మిత్: ధన్యవాదాలు సర్.
ప్రధానమంత్రి: ఎందరో ప్రయాణికుల ప్రాణాలు రక్షించారు. భారతీయులంటే ప్రాణాలు కాపాడేవాళ్లు తప్ప ప్రాణం తీసేవాళ్లు కాదనే వాస్తవాన్ని యావద్దేశం నేడు సగర్వంగా పునరుద్ఘాటిస్తోంది.
కెప్టెన్ స్మిత్: వాస్తవం చెప్పారు సర్.
ప్రధానమంత్రి: మీరు తీవ్రంగా గాయపడి, రక్తస్రావం అవుతున్నా, ప్రయాణికుల ప్రాణాలు రక్షించడం కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టారు. మీ త్యాగనిరతితో ముఖ్యంగా 140 కోట్ల మంది దేశ ప్రజల గౌరవాన్ని ఇనుమడింపజేశారు.
కెప్టెన్ స్మిత్: ధన్యవాదాలు సర్.
ప్రధానమంత్రి: అందుకే, నేనెంతో గర్వంతో ఉప్పొంగుతూ హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను.
కెప్టెన్ స్మిత్: సర్… నాదొక…
ప్రధానమంత్రి: మీ తల్లిదండ్రులు శ్రీ భూపేంద్ర, గీత, మీ జీవిత భాగస్వామి సోనాల్‌లతో మాట్లాడే అవకాశం నిన్న నాకు లభించింది. అయితే, మీ పిల్లలు జవా, బాబీలతో మాత్రం మాట్లాడటం కుదరలేదు. అయితే, మీ తల్లి గీత గారితో నేనొక మాటన్నాను: ఆమె పేరు ‘గీత’ కావడమొక్కటే కాదు… సాక్షాత్తూ శ్రీకృష్ణుని ‘గీతా’ సారాన్ని ఔపోసన పట్టారు. ఆ విలువలతోనే ఆమె మీ జీవితాన్ని తీర్చిదిద్దారని నేను గ్రహించాను.
కెప్టెన్ స్మిత్: అది పూర్తిగా వాస్తవం సర్.
ప్రధానమంత్రి: స్మిత్ గారూ… మీరేదో చెప్పబోయారు.. ఇప్పుడు మీ మాటలు వినాలని భావిస్తున్నాను.
కెప్టెన్ స్మిత్: సర్.. నా విషయానికొస్తే- నాకు ఆదర్శం మీరేనని ఒక సందర్భంలో మీతోనే చెప్పాను. ఇప్పుడు మరొకసారి చెబుతున్నాను.. మీరే నాకు అత్యున్నత ఆదర్శప్రాయులు. ఈ సమయంలో మీరు నన్నిలా పలుకరించి యోగక్షేమాలు విచారించడం నాకెంతో గర్వంగా ఉంది. ఆ సమయంలో… నిజమే సర్… మొదట నా ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నించాను. పెనుగులాటలో కింద పడిపోయాను.. అప్పటికే తీవ్ర గాయాలతో రక్తం ఎక్కువగా పోతోంది. ఆ క్షణంలో ఏదో ఒకటి చేయాల్సిందే.. తప్పదు. అప్పుడు నేనో దృఢ నిశ్చయానికొచ్చాను. ఒకవేళ నేను లేచి నిలబడలేకపోతే పరిస్థితేమిటి? సర్, నేను 17 ఏళ్లుగా విమానాలు నడుపుతున్నాను. ఈ అనుభంలో 11 ఏళ్లుగా కెప్టెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. విమానంలో ఏం జరుగుతుందో కళ్లు మూసుకుని చెప్పగలను. కాబట్టే, నేను కింద పడే సమయానికే విమానం వేగంగా భూమ్మీదకు జారిపోతోందని నాకు అర్థమైంది. ఇక చివరి ప్రయత్నం చేయక తప్పదని నాకు స్పష్టంగా తెలుసు- “స్మిత్.. నువ్వలా చేయగలిగితే- తలుపు అందుబాటులో ఉంది. మరోవైపు పెనుగులాట కొనసాగుతూనే ఉంది.. అయినా, అతికష్టంతో నేను తలుపు తెరవగలిగాను సర్. దీంతో ప్రయాణికులు కూడా నాకు తోడు నిలిచారు. విమానం మళ్లీ గాడిన పడటంలో వారందరి పాత్ర కూడా ఉంది. ఎంతోకొంత స్పృహతో ఉన్నాను కాబట్టి, నా కోసం నేనే కాకుండా, ప్రయాణికులలో ఏ ఒక్కరికీ ముప్పు రాకూడదని సంకల్పం తీసుకున్నాను. చివరకు ఇక్కడ, సౌదీలో… నాకు ఇంతకన్నా మంచి సంరక్షణ లేదా వైద్యం లభించేది కాదు. సర్, నేను… ఏ క్షణంలోనూ సంయమనం కోల్పోలేదు. సానుకూల దృక్పథంతో ముందుకెళ్లాను. నాకు ఏదైనా బాధ కలిగినప్పుడల్లా హనుమాన్ చాలీసా మననం చేసుకోవడం నా అలవాటు. అదే విధంగా ఆ సమయంలోనూ మదిలో హనుమాన్ చాలీసా పఠనం సాగుతూనే ఉంది. నన్ను కాపాడింది ఆ దేవుడేనని నాకు తెలుసు… ఇప్పుడు, సర్.. నాకు ఆదర్శప్రాయుడైన మీరు స్వయంగా నా కుశలం వాకబు చేయడం ఎంతో గర్వంగా అనిపిస్తోంది. ఇంతకు ముందు ఆ భావన కలగలేదుగానీ, ఇప్పుడు కలుగుతోంది.
అప్రయత్నంగానే కన్నీరుబుకుతోంది… మీ ముందు కన్నీరు పెడుతున్నందుకు క్షమించండి.
ప్రధానమంత్రి: స్మిత్, నా సమక్షంలో కాకపోతే ఇంకెక్కడ మీరు భావోద్వేగానికి గురికాగలరు?
కెప్టెన్ స్మిత్: సర్… నాకు మీతో మాట్లాడే అవకాశం వస్తుందని నేను కలలో కూడా ఎన్నడూ ఊహించలేదు.
ప్రధానమంత్రి: సోదరా! మీరెంత ఎంత గొప్ప పని చేశారంటే- ఇవాళ దేశ ప్రజలే కాదు… యావత్ ప్రపంచ ప్రజానీకం నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని కుతూహలంతో ఉన్నారు. ఇక హనుమాన్ చాలీసా గురించి నువ్వు చెప్పింది విన్నపుడు- నీకు అటువంటి విలువలు బోధించిన మీ తల్లిదండ్రులు భూపేంద్ర, గీత దంపతులకు నేను శిరసాభివందనం చేశాను. ఇకపోతే నాకెంతో ఆశ్చర్యం కలిగించిన ఒక విషయం మీకు చెబుతాను. స్మిత్! నిన్న మీ సతీమణి సోనల్‌తో సంభాషించినపుడు ఆమె ఎంత ప్రశాంతంగా మాట్లాడారో తలచుకుంటే నాకింకా ఆశ్చర్యంగానే ఉంది!
కెప్టెన్ స్మిత్: అలాగా సర్..
ప్రధానమంత్రి: నిజంగా… సోదరి ఎంతో ఆత్మస్థైర్యం చూపారు. మీరు పరాయి దేశంలో ప్రాణాపాయ స్థితిలో పడి, ఆసుపత్రిలో కోలుకుంటున్న పరిస్థితిలోనూ సోదరి అంత ప్రశాంతంగా మాట్లాడగలరని నేనెంత మాత్రం ఊహించలేదు. ఓ కుటుంబంగా మీరు నిజంగానే యావద్దేశం గర్వపడేలా చేశారని ఘంటాపథంగా చెప్పగలను.
కెప్టెన్ స్మిత్: సర్, ప్రతి ఉదయం నేను ప్రార్థన చేసే వేళ రెండేళ్ల నా కుమారుడు ఒడిలో కూర్చుంటాడు.. అప్పుడు నేను హనుమాన్ చాలీసా వినిపిస్తాను… నా తల్లిదండ్రులు నాకు నేర్పిన విషయాలనే అతనికి చెబుతాను. ఎందుకంటే- మనం మాతృభూమికి దూరంగా జీవించాల్సి వచ్చినా, మన సంస్కృతికి మాత్రం ఎన్నడూ దూరం కారాదన్నదే నా నిశ్చితాభిప్రాయం.
ప్రధానమంత్రి: మీరన్నది అక్షరాలా నిజం…
కెప్టెన్ స్మిత్: ఇప్పుడు నేను ఇక్కడున్నప్పటికీ, విదేశంలో ఉన్నానన్న భావనే నాలో కలగడం లేదు. ఆసుపత్రి సిబ్బంది, ఇక్కడి ప్రజలు మమ్మల్నెంతో ఆదరాభిమానాలతో ప్రేమతో, శ్రద్ధతో చూసుకుంటున్నారు.
ప్రధానమంత్రి: మీకొక విషయం తెలిసి ఉండకపోవచ్చు.. సవర్కుండ్ల, వధవాన్ వంటి ప్రాంతాల్లో ప్రజలు ఎంతో భావోద్వేగ వాతావరణం సృష్టించారు. వాస్తవానికి దేశమంతటా ఇదే పరిస్థితి కనిపించింది. మీరు క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ నిన్న అన్ని చోట్లా ఆలయాల్లో ప్రార్థనలు, పూజలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాల్లో హారతి ఇచ్చారు. మీ ఆయురారోగ్యాల కోసం అందరూ ప్రార్థిస్తున్నారు. కాబట్టి, మీరు కచ్చితంగా త్వరలోనే కోలుకుంటారు. మీకు స్వాగతం పలకడానికి దేశమంతా ఆసక్తితో ఎదురుచూస్తోంది. ప్రస్తుతం గాయాలతో మీ శారీరక వేదనను నేను అర్థం చేసుకోగలను. అయితే, మీరెంతో ధైర్యం గలవారు కాబట్టి, అంతటి బాధను భరించగలుగుతున్నారని నాకు అనిపిస్తోంది.
కెప్టెన్ స్మిత్: లేదు సర్… ఈ సంఘటనలో గాయపడ్డానని నేను భావించడం లేదు. అలా భావిస్తే నేను త్వరగా కోలుకోవడం వీలు కాదు. నా జీవన పయనంలో ఇదొక గడ్డు మలుపుగా భావిస్తున్నానంతే! ఇది నెమ్మదిగా, అంచెలంచెలుగా సాగే ప్రక్రియ, కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. కానీ, సంపూర్ణారోగ్యంతో తిరిగి నా కుటుంబాన్ని కలుసుకోగలననే ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.
ప్రధానమంత్రి: మిమ్మల్ని శ్రద్ధగా చూసుకుంటున్న సౌదీ, యూఏఈ ప్రభుత్వాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నాను. నేను కూడా వారికి రుణపడి ఉంటాను. స్మిత్… మీకు ఎప్పుడు అవసరమనిపించినా, నేను కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటానని మరచిపోకండి.
కెప్టెన్ స్మిత్: ధన్యవాదాలు సర్.
ప్రధానమంత్రి: ఈ సందర్భంగా మీకొక వాస్తవం చెప్పాలి. మీరు సాహసం అసాధారణం. మీ వీరోచిత పోరాటంపై నిన్న సోషల్ మీడియాలో ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను నేను గమనించాను. మీరు ప్రాణం పణంగా పెట్టి, పరిస్థితిని చక్కదిద్దకపోతే భారత్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చేదోననిపించింది. భారత పైలట్లు ఎలాంటి దుస్థితికి గురయ్యేవారో అనిపించింది. ప్రపంచం ఎలా చూస్తుందో ఊహించలేమని కూడా అందరూ అభిప్రాయపడ్డారు. ఈ అనుమానాలకు తావులేకుండా మీరు భారతీయతను వేనోళ్ల చాటే సాహసం చేశారు. నిజంగా మీ సమయస్ఫూర్తి అద్భుతం!
కెప్టెన్ స్మిత్: నిజమే సర్. జరగరానిది జరిగితే అలాంటి అభిప్రాయాలు సహజం.
ప్రధానమంత్రి: మనం నేరుగా కలిసినప్పుడు ఈ సంఘటన గురించి ఆమూలాగ్రం తెలుసుకుంటాను. మొబైల్ ద్వారా మీతో ఇలాంటి అంశాలపై చర్చించడం నాకిష్టం లేదు.
కెప్టెన్ స్మిత్: అలాగే సర్..
ప్రధానమంత్రి: యావద్దేశం మీకు అండగా ఉంది… ఇక కోలుకోవడంపైనే పూర్తిగా దృష్టి నిలపండి.
కెప్టెన్ స్మిత్: ధన్యవాదాలు సర్.
ప్రధానమంత్రి: ఇక మీరు అలసిపోయేలా చేయడం నాకు ఎంతమాత్రం తగదు. నా శుభాకాంక్షలు మీకెల్లప్పుడూ ఉంటాయి. ఇవాళ గాంధీ జయంతి. అహింస అంటే నిజంగా ఏమిటో మీ చర్యల ద్వారా నిరూపించారు.
కెప్టెన్ స్మిత్: ధన్యవాదాలు సర్.
ప్రధానమంత్రి: సరే… ఉంటాను.. జై శ్రీ కృష్ణ, జై శ్రీ కృష్ణ! మనం కాసేపు గుజరాతీలో మాట్లాడుకుందామా..!
కెప్టెన్ స్మిత్: జై శ్రీ కృష్ణ.. సర్.
ప్రధానమంత్రి: మీ పిల్లలు బాబీ, జీవా గుజరాతీ మాట్లాడగలరా?
కెప్టెన్ స్మిత్: మాట్లాడతారు సర్… ఇద్దరికీ గుజరాతీ భాష వచ్చు.
ప్రధానమంత్రి: ఆ భాషలో అనర్గళంగా మాట్లాడగలరా?
కెప్టెన్ స్మిత్: వాళ్లు మొదట నేర్చుకున్నది గుజరాతీయే… ఆ తర్వాతే ఇంగ్లిష్ నేర్చుకున్నారు సర్.
ప్రధానమంత్రి: అవునా… మీ పిల్లలను కలిశారా? వాళ్లను కలిసేందుకు డాక్టర్లు అనుమతించారా?
కెప్టెన్ స్మిత్: నా కూతురు వచ్చింది.. కానీ, నా పరిస్థితి స్వయంగా చూశాక ఆమె ఎంతో భయపడిపోయింది.
ప్రధానమంత్రి: అర్థమైంది… అర్థమైంది…
కెప్టెన్ స్మిత్: ఆమె ఇప్పటికే కొంచెం అనారోగ్యంతో ఉంది.. పైగా నేనంటే ఆమెకు ఎనలేని ప్రేమ. ఇక నా కొడుకు వయసు రెండేళ్లే.. అందుకే అతన్ని తీసుకురావడానికి డాక్టర్లు అనుమతించలేదు.
ప్రధానమంత్రి: అది అర్థం చేసుకోదగ్గ విషయమే. ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్త అవసరం. ఏదేమైనా సోదరి సోనాల్ చాలా ధైర్యవంతురాలు.
కెప్టెన్ స్మిత్: అవును సర్.
ప్రధానమంత్రి: నిన్న నాతో ఎంతో ప్రశాంతంగా మాట్లాడారు. సాధారణంగా నా అనుభవం ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా అసలు మాట్లాడలేరు. అయితే, ఆమె మాటల్లో ఏమాత్రం నిందాత్మక ప్రయోగం లేదు. నిన్న ముంబయి విమానాశ్రయంలో భూపేంద్ర, సోదరి గీతలతో కూడా మాట్లాడాను. అప్పుడు వారుకూడా ఎలాంటి నిందాపూర్వక పద ప్రయోగం చేయలేదు. ‘దేవుడేది చేసినా అంతా మన మంచికే’ అనే భావనే వారి మాటల్లో కనిపించింది.
కెప్టెన్ స్మిత్: అవును సర్…
ప్రధానమంత్రి: సరే… ఇక ఉంటాను… జై శ్రీ కృష్ణ, త్వరగా కోలుకోండి, తర్వాత కలుద్దాం.
కెప్టెన్ స్మిత్: అలాగే సర్… ధన్యవాదాలు.
ప్రధానమంత్రి: దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక!
కెప్టెన్ స్మిత్: ధన్యవాదాలు సర్.. జై హింద్!
ప్రధానమంత్రి: జై హింద్!
గమనిక: ప్రధానమంత్రితో కెప్టెన్ స్మిత్ సంభాషణలో కొంత గుజరాతీ భాషలో సాగింది. ఇది దానికి
స్వేచ్ఛానువాదం మాత్రమే.
An unforgettable conversation with Captain Smit, filled with pride and emotions. pic.twitter.com/CCf46PKOWR
— Narendra Modi (@narendramodi) October 2, 2026