జై జగన్నాథ్.
ఒడిశా గవర్నర్ శ్రీ బ్రజ్మోహన్ రామ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ గారు, కేంద్ర ప్రభుత్వంలో నా సహ మంత్రులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, శ్రీ జువల్ ఓరమ్ గారు, భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ శ్రీ సంజయ్ మల్హోత్రా గారు, ఒడిశా ఉపముఖ్యమంత్రులు శ్రీమతి ప్రవతి పరిదా గారు, శ్రీ కనక వర్దన్ సింగ్ దేవ్ గారు, బ్యాంకింగ్, ఆర్థిక రంగంలో పని చేస్తున్న ఇతర విశిష్ట అతిథులు, సోదరీసోదరులారా,
వాతావరణం ఎందుకు గంభీరంగా ఉంది? బ్యాంకింగ్ రంగంలో ఇంత ఒత్తిడి ఉంటుందా? సాంకేతికత ఇంత ఒత్తిడిని మోస్తుందా? సౌకర్యవంతంగా కూర్చోండి.
మహాప్రభు ఆశీస్సులతో భారతదేశానికి కొత్త సంస్థను ఈ రోజు భువనేశ్వర్ అందిస్తోంది. ఈ నగరంలో ఆర్బీఐ డేటా సెంటర్, సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ సెంటర్ రెండింటి ప్రారంభోత్సవం ఓ ముఖ్యమైన సందర్భం. ఇది ఒడిశా ప్రజలకు, యావత్ దేశానికి అపారమైన ప్రయోజనాన్ని అందించనుంది. ఆర్బీఐకు, ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
మిత్రులారా,
భారతదేశంలో పరిపాలన విధానం ఎలా రూపాంతరం చెందుతోందో, ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో ఈ కార్యక్రమం తెలియజేస్తోంది. దీనిలో భాగంగా అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం, అభివృద్ధిని విస్తరించడం, చివరి వ్యక్తి వరకు అభివృద్ధిని చేరవేయడంపైనే మా దృష్టి సారించాం.
మిత్రులారా,
స్వాతంత్ర్యం తర్వాత దేశంలో పెద్ద నగరాలు అభివృద్ధి చెందాయి. గొప్ప సంస్థలు ఏర్పాటయ్యాయి. పెద్ద ఆసుపత్రులను, భారీ విమానాశ్రయాలను నిర్మించారు. అయినప్పటికీ దేశంలోని చాలా ప్రాంతాలు ప్రాథమిక సౌకర్యాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి. ఢిల్లీలో పెద్ద ఆసుపత్రులు ఉన్నాయి. కానీ చిన్న నగరాలు, మారుమూల ప్రాంతాలకు చెందినవారు మెరుగైన వైద్య సౌకర్యాల కోసం చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేంది. విమానయాన సౌకర్యాలు పెద్ద నగరాలకు అందుబాటులో ఉన్నాయి. కానీ చిన్న నగరాల్లో విమాన సౌకర్యాల ఏర్పాటు చేయడంపై తగినంత దృష్టి సారించలేదు. పెద్ద నగరాల్లో కొన్ని సౌకర్యాలున్నాయి. కానీ అనేక గ్రామాల్లో రోడ్లు, విద్యుత్తు, నీరు లాంటి కనీస అవసరాలను తీర్చడం సైతం పెద్ద సవాలుగా మారింది. సాధారణ ప్రజల ప్రయాణాల్లో రైల్వే స్టేషన్లు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే అక్కడ ఆధునిక సౌకర్యాల కొరత ఉంది. మరో మాటలో చెప్పాలంటే… ప్రతి ప్రాంతానికి, ప్రతి పౌరునికి అభివృద్ధి ఫలాలను సమానంగా చేరేలా చూడటమే పెద్ద సవాలుగా మిగిలిపోయింది. మేం ఈ మనస్తత్వాన్ని మార్చేందుకు ప్రయత్నించాం. ప్రజానుకూలమైన, క్రియాశీలకమైన, సుపరిపాలన విధానంతో మేం ముందుకు సాగాం. మా దృష్టిలో అభివృద్ధి అంటే భారతదేశమంతటా సమతుల్య పురోగతిని సాధించడం, గ్రామాలు, చిన్న పట్టణాల్లో అవకాశాలను కల్పించడం. మారుమూల ప్రాంతాలకు మెరుగైన అనుసంధానాన్ని కల్పించడం, వెనకబడిన కుటుంబాలకు గౌరవంగా జీవించే సౌకర్యాలను అందించడం, అభివృద్ధి ప్రయాణంలో వెనకబడిపోమనే విశ్వాసాన్ని ప్రతి పౌరునిలోనూ నింపడమే మా లక్ష్యం. ఇప్పుడు దేశంలోని చిన్న నగరాలను ఎక్స్‌ప్రెస్ మార్గాలు అనుసంధానిస్తున్నాయి. ఎయిమ్స్ లాంటి ప్రముఖ సంస్థలు పలు రాష్ట్రాలకు విస్తరించాయి. చిన్న నగరాల్లో వైద్య కళాశాలలు ప్రారంభమవుతున్నాయి. గ్రామాల్లో దాదాపు 1.75 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఏర్పాటయ్యాయి. మారుమూల ప్రాంతాల్లో డిజిటల్ అనుసంధానం విస్తరిస్తోంది. పౌరుల జీవితాలను సులభతరం చేయడం, వారి ఆకాంక్షలకు కొత్త మార్గాలను అందించడమే ప్రస్తుత పరిపాలన అసలు ఉద్దేశం.
మిత్రులారా,
సాధారణ కుటుంబాలు, పేదలు, మధ్యతరగతి ప్రజలు దశాబ్దాల పాటు ఎలా వంచనకు గురయ్యారో చెప్పడానికి మన బ్యాంకింగ్ రంగం కూడా ఒక ప్రధాన ఉదాహరణగా నిలిచింది. 1960, 70వ దశకాల్లో పేదల పేరుతో బ్యాంకులను జాతీయం చేశారు. అయినప్పటికీ 2014 వరకు సగానికి పైగా దేశ జనాభా బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగానే ఉంది. మధ్య తరగతి ప్రజలకు బ్యాంకు రుణాలు లాంటి ఆర్థిక ఉత్పత్తులు అందని ద్రాక్షలా ఉండేవి. ఇక పేదలు, చిన్నకారు రైతులు, భూమి లేని వారు, మన సోదరీమణులు, కుమార్తెలు వాటి గురించి కూడా ఆలోచించేవారు కాదు. ప్రస్తుతం భారత్‌లో అవలంబిస్తున్న డిజిటల్ బ్యాంకింగ్ అందరికీ 24 గంటలూ ఆర్థిక సేవలను అందిస్తోంది. 2014కు ముందు ‘ఫోన్ బ్యాకింగ్’ పూర్తిగా వేరుగా ఉండేది. ఢిల్లీలోని కొందరికి, పలుకుబడి ఉన్న వర్గాలతో సంబంధాలున్న వారికి ఫోన్ కాల్స్ ద్వారా వేల కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసేవారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు బ్యాంకు ఖాతా తెరవాలి అంటే మరొకరు హామీ ఇవ్వాల్సి వచ్చేది. ధనవంతులకు మాత్రం కాంగ్రెస్ ఫోన్ బ్యాంకింగ్ విధానం ద్వారా వేల కోట్ల రూపాయలు ఎప్పుడూ అందుబాటులో ఉండేవి. ఈ తరహా దుర్వినియోగమే భారత ఆర్థిక వ్యవస్థను ఎన్పీఏల గుప్పిట్లోకి వెళ్లేలా చేసి నాశనం అంచుకి చేర్చింది.
మిత్రులారా,
విస్తృత పరివర్తన సాధించాలంటే విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి. ఆలోచనలు స్వచ్ఛంగా, లక్ష్యాలు ఉన్నతంగా ఉన్నప్పుడు, అసాధ్యం అనిపించే పనులు కూడా సుసాధ్యమవుతాయి. దృష్టి సంకుచితంగా మారినప్పడు అవకాశాలు కూడా కుంచించుకుపోతాయి. డిజిటల్ ఇండియా పరిధిలో అభివృద్ధి చేసిన వ్యవస్థలతో పాటు ఇటీవలి సంవత్సరాల్లో దేశంలో అమలు చేస్తున్న విధానాలు బ్యాంకింగ్ సేవలను ప్రతి పౌరునికీ చేరువ చేస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత బలమైన బ్యాంకింగ్ రంగాల సరసన భారత్ నిలబడింది. గతంలో, ఫోన్ బ్యాంకింగ్ ద్వారా ఢిల్లీలోని ఒక ఉన్నత కుటుంబం పరిధిలో ఉన్నవారు మాత్రమే ప్రయోజనం పొందేవారు. నేడు, డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి కుటుంబం లబ్ధిదారుగా మారింది.
మిత్రులారా,
ఢిల్లీ నుంచి ఒక రూపాయి పంపితే ప్రజలకు 15 పైసలు మాత్రమే చేరుతుందని ఒక మాజీ ప్రధాని ఈ ఒడిశా నేల నుంచే చెప్పారు. ఓ ప్రధాని చేసిన ప్రకటన అది. అది ఆ కాలం. ప్రస్తుతం వేరు. ఇప్పుడు ఒక రూపాయి ఢిల్లీ నుంచి బయలుదేరితే, ఆ రూపాయి నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాకు చేరుతుంది. ఇప్పుడే నిర్మల గారు చెప్పినట్టుగా, దేశంలో తెరిచిన సుమారు 59 నుంచి 60 కోట్ల జన్ ధన్ ఖాతాల వల్లే ఇది సాధ్యమైంది.
మిత్రులారా!
ఎటువంటి పూచీకత్తు ఇవ్వలేని వ్యక్తులకూ ఇప్పుడు వ్యాపారారంభానికి స్వల్ప వడ్డీతో అధికారిక రుణం లభిస్తోంది. చిన్న పారిశ్రామికవేత్తలు, సంప్రదాయ హస్త కళాకారులు, వీధి వ్యాపారులు సహా అసంఘటిత కార్మికులకు అధికారిక బ్యాంకింగ్ ప్రయోజనాలు లభిస్తున్నాయి. తొలిసారి ముద్రా యోజన కింద 13 కోట్ల మంది పారిశ్రామికవేత్తలుగా మారారు. ‘పీఎం స్వానిధి’ కింద లక్షలాది వీధి వర్తకులకు తొలిసారి రుణాలు లభించాయి. అలాగే, పీఎం విశ్వకర్మ పథకంతో నిపుణ కళాకారుల అనుసంధానమయ్యారు. ఇక దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది గ్రామీణ మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్వయం సహాయ సంఘాలకు బ్యాంకులు కోట్లాది రూపాయల ఆర్థిక సహాయం అందజేశాయి.
మిత్రులారా!
దేశంలో ఒకనాడు డెబిట్-క్రెడిట్ కార్డులు కేవలం ధనవంతులకే పరిమితమయ్యాయి. కోట్లాది రూపే కార్డులు ఇప్పుడు దేశంలోని ప్రతి పౌరునికీ అందుబాటులోకి రావడం ద్వారా ఆత్మగౌరవం, స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఇదంతా మీ సమష్టి సహకారం వల్లనే సాధ్యమైంది. మన రిజర్వు బ్యాంకు, వాణిజ్య బ్యాంకులతోపాటు దేశంలోని ప్రతి బ్యాంకు ఉద్యోగికీ ఈ ఘనతలో తమదైన వాటా ఉందనడంలో సందేహం లేదు.
మిత్రులారా!
గడచిన పదేళ్లలో ఆర్థిక సాధికారత సహా సామాజిక భద్రత వలయం అసాధారణ స్థాయిలో విస్తరించింది. ‘అటల్ పెన్షన్ యోజన’ కింద 9 కోట్ల మంది పౌరులు లబ్ధి పొందితే, వారిలో ఒక్కడి ఒడిషాలోనే 38 లక్షల మంది ఉన్నారు. పది, పన్నెండేళ్ల కిందట బీమా అనేది ఒక విలాస ప్రయోజనంగా ఉండేది. పేదలు, అణగారిన వర్గాలకు అదొక అందని ద్రాక్ష వంటిది. మాకు మాత్రం ‘పౌర దేవోభవ’ అనేది మా సుపరిపాలనకు తారక మంత్రం. ప్రమాద బీమా రక్షణ దిశగా పీఎం సురక్షా బీమా యోజనను మేం ప్రవేశపెట్టాం. ఏటా కేవలం ₹20 నామమాత్రపు రుసుముతో ₹2 లక్షల వరకు రక్షణ లభిస్తోంది. అలాగే, జీవిత బీమా కోసం మేం ₹450 కన్నా తక్కువ వార్షిక ప్రీమియంతో పీఎం జీవన్ జ్యోతి బీమా యోజనను ప్రవేశపెట్టాం. ఈ రెండు పథకాలలో కోట్లాది భారతీయులు నమోదు చేసుకున్నారు. ఇప్పటిదాకా ₹25,000 కోట్లకు పైగా క్లెయిమ్‌లు ప్రజలకు పంపిణీ అయ్యాయి. ఒకవేళ మరేదైనా ప్రభుత్వం ఇంత భారీ మొత్తం పంపిణీ చేసి ఉంటే నెలల తరబడి వేడుకలు, ఆర్భాటాలతో పాటు పత్రికల పతాక శీర్షికలకు ఎక్కి ఉండేది. అయితే, మా పరిపాలనలో పేదలకు, మధ్య తరగతికి కష్ట సమయాల్లో నిశ్శబ్దంగా, ఆర్భాటం లేకుండా సహాయం అందుతుండటం సుపరిపాలనకు నిర్వచనంగా మారింది.
మిత్రులారా!
బ్యాంకింగ్ సేవలు అందని వారికి వాటిని అందుబాటులోకి తేవడంపై గడచిన దశాబ్దంలో దృష్టి సారించాం. రాబోయే దశాబ్దంలో బ్యాంకింగ్‌ను మరింత సమర్థ, విశ్వసనీయ రంగంగా రూపొందించేందుకు శ్రద్ధ వహిస్తాం. ఈ కృషిలో ఒడిషాలోని ఈ కొత్త డేటా సెంటర్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. మన బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితంగా ఉండాలంటే, దాని డిజిటల్ మౌలిక సదుపాయాలకూ గట్టి రక్షణ అవశ్యం. కాబట్టి, పటిష్ట డేటా సెంటర్లు, శక్తిమంతమైన కంప్యూటింగ్ వ్యవస్థలు తప్పనిసరి.
అయితే, మిత్రులారా!
ఆధునిక యుద్ధ రీతులు కేవలం ఆయుధాలకు పరిమితం కాదన్నది ఇవాళ మనందరికీ తెలిసిందే. కాబట్టి, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం ద్వారా ఏ దేశాన్నైనా బలహీనపరిచేందుకు శత్రువు ప్రయత్నం చేయవచ్చు. నేడు భారత్ ఆర్థికంగా బలపడుతున్న తరుణాన సైబర్ నేరగాళ్లు, సైబర్ ఉగ్రవాదుల నుంచి మన బ్యాంకింగ్ వ్యవస్థకూ గట్టి రక్షణ అవసరం. సైబర్ ముప్పుల స్వభావం నానాటికీ మారిపోతోంది. కాలం చెల్లిన వ్యవస్థలు, వాడుకలో లేని శిక్షణ మాడ్యూళ్లు లేదా పాతకాలపు ఉపకరణాలతో ఇలాంటి కొత్త సవాళ్లను ఎదుర్కోలేం. ఇందుకు నిపుణ మానవ వనరులు సహా అత్యాధునిక మౌలిక సదుపాయాలు అవసరం. కాబట్టే, ఈ కొత్త సైబర్ భద్రత శిక్షణ సంస్థ పాత్ర అత్యంత కీలకమవుతుంది.
మిత్రులారా!
ఆర్బీఐ అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త సదుపాయాలు దేశానికిగల సరికొత్త ప్రాధాన్యాలను కూడా ప్రతిబింబిస్తాయి. వికసిత భారత్ సంకల్ప సాకారానికి తూర్పు భారతం ఒక శక్తిమంత వృద్ధి చోదకంగా ఆవిర్భవిస్తోంది. ఒడిషాలో డబుల్-ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పురోగమన వేగం పుంజుకుంది. రాష్ట్ర సహజ వనరులతో పాటు ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు సాంకేతికతతో మరింత బలోపేతమవుతోంది. ఒకవైపు ఖనిజాధారిత పరిశ్రమలు విస్తరిస్తుండగా, మరోవైపు సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ కోసం కొత్త పర్యావరణ వ్యవస్థ రూపకల్పనకు సమష్టి కృషి కొనసాగుతోంది. గనుల నుంచి మైక్రోచిప్‌ల దాకా విస్తరించిన సదుపాయాలతో ఒడిషా కొత్త భవిష్యత్ గాథ రాసేందుకు సిద్ధం కావడం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒడిషాలో డేటా సెంటర్లు, అత్యాధునిక కంప్యూటింగ్ రంగాలలో కొత్త పెట్టుబడి అవకాశాలు అందివస్తున్నాయి. రాష్ట్రంలోని యువత భవిష్యత్తుకు వీటిద్వారా అనేక మార్గాలు ఏర్పడతాయి. ఈ సందర్భంగా రాష్ట్ర యువతరానికి నేనొక హామీ ఇస్తున్నాను- మీ భారీ కలలు కచ్చితంగా నెరవేరుతాయి. మనం ఆ స్వప్నాలను సాకారం చేయగలం. ఈ దిశగా మనమిప్పటికే దృఢ సంకల్పం పూనాం. ఇదే స్ఫూర్తితో మీకందరికీ మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను.
అందరికీ శుభాకాంక్షలు
జై జగన్నాథ్!
గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే
***
A major step towards a more secure financial system. The RBI's new facilities in Bhubaneswar will strengthen digital infrastructure and cybersecurity capabilities. @RBI https://t.co/ryignasX8k
— Narendra Modi (@narendramodi) October 25, 2026
महाप्रभु के आशीर्वाद से, आज भुवनेश्वर... नए भारत को एक नया संस्थान दे रहा है। भुवनेश्वर में RBI के Data Centre और Cybersecurity Training Institute... इन दोनों का उद्घाटन एक महत्वपूर्ण अवसर है। ये ओडिशा और देश के लोगों के बहुत हितकारी होगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 25, 2026
हम Pro-People, Pro-Active, Good Governance का model लेकर चले। हमारे लिए विकास का मतलब है... भारत का संतुलित विकास... गांवों को भी अवसर...छोटे शहरों को भी अवसर: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 25, 2026
आज भारत में digital banking ने सबको 24 घंटे banking सेवाओं से जोड़ा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 25, 2026
जिसके पास bank को guarantee देने के लिए कुछ भी नहीं है, वो भी आज bank से सस्ता और सुलभ loan लेकर अपना कोई काम शुरू कर पा रहा है। छोटे उद्यमी से लेकर पारंपरिक कारीगर तक... रेहड़ी-पटरी वाले से लेकर असंगठित क्षेत्र के श्रमिक तक... पहली बार उन्हें formal banking का फायदा मिला है: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 25, 2026
बीता दशक, banking को उन तक लोगों तक पहुंचाने का था... जो इससे वंचित था। आने वाला दशक... Banking को अधिक efficient, अधिक भरोसेमंद बनाने का है: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 25, 2026
आजकल युद्ध केवल हथियारों से नहीं लड़े जाते। किसी देश को कमज़ोर करना है तो उसकी economy पर attack करके भी ये किया जा सकता है। और जब भारत, आर्थिक रूप से सशक्त हो रहा है तो हमें अपने banking system को भी cyber लुटेरों, cyber आतंकियों से सुरक्षा देनी है: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 25, 2026