న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ‘భారత పునరుత్పాదక ఇంధన సదస్సు, ప్రదర్శన – 2026′ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. సదస్సుకు దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, అంకురసంస్థల ప్రతినిధులు, ఉన్నతాధికారులనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. ప్రపంచవ్యాప్త ఇంధన సంక్షోభాల నేపథ్యంలో పునరుత్పాదక ఇంధనం ప్రాధాన్యతను గుర్తిస్తూ ఈ ఏడాది సదస్సు ప్రత్యేక పరిస్థితుల మధ్య జరుగుతోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 9వ అసెంబ్లీతో పాటు, 4వ గ్రీన్ హైడ్రోజన్ కాన్ఫరెన్స్ ప్రతినిధులూ ఇందులో పాల్గొనడం వల్ల ఈ ఏడాది సదస్సు పరిధి మరింత విస్తృతమైందని ఆయన వివరించారు.
కరోనా మహమ్మారి నుంచి ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభం వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఊహించని ఆటంకాలను ఎదుర్కొందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ అలజడులను సమర్థంగా ఎదుర్కొంటూనే, భారత్ అత్యధిక ఆర్థిక వృద్ధిని కొనసాగించడం 140 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమైందని ఆయన అన్నారు. గత పదేళ్లుగా పరిశుద్ధ ఇంధన రంగంలో దేశీయంగా పెట్టిన నిరంతర పెట్టుబడులు, చేపట్టిన వ్యవస్థాగత సంస్కరణలే మన దేశాన్ని తీవ్రమైన బాహ్య సంక్షోభాల నుంచి రక్షించాయని ఆయన స్పష్టం చేశారు. ‘గత దశాబ్ద కాలంలో భారత్ పరిశుద్ధ ఇంధనంపై పెట్టుబడులు పెట్టకుండా, దీని కోసం కొత్త వ్యవస్థలను నిర్మించకుండా ఉండి ఉంటే… మన సంక్షోభం ప్రపంచంలోని మిగతా దేశాల కంటే చాలా తీవ్రంగా ఉండేది‘ అని ప్రధానమంత్రి శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఇంధన భద్రతకు, ఆర్థిక భద్రతకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని ఇటీవలి ప్రపంచ సంక్షోభాలు నిరూపించాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. శిలాజ ఇంధనాలపై అతిగా ఆధారపడటం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పదేపదే దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు. ఈ ఇంధన నిల్వలు పరిమితమైనవి, కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉన్నాయి… ఈ బలహీనతతో పోలిస్తే, పరిశుద్ధ ఇంధనం అపరిమితమైనది, అందరికీ అందుబాటులో ఉండే శక్తినీ కలిగి ఉందని శ్రీ మోదీ వివరించారు. ‘ఇంధన భద్రత భవిష్యత్తు పరిశుద్ధ ఇంధనంతోనే ముడిపడి ఉందని మనందరికీ తెలుసు‘ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
గత 12 ఏళ్లుగా పరిశుద్ధ ఇంధన రంగంలో భారత్ ప్రయాణం మాట, కృషి, ఫలితం అనే మూడు సూత్రాలతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి వివరించారు. 2030 నాటికి శిలాజేతర వనరుల ద్వారా 500 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని సీవోపీ-26 నిర్ణయించడమే దీనికి నిదర్శనమన్నారు. 2030 నాటికి తన మొత్తం విద్యుత్ సామర్థ్యంలో సగభాగాన్ని శిలాజేతర వనరుల ద్వారా పొందాలనే పారిస్ ఒప్పంద లక్ష్యాన్ని భారత్ నిర్దేశిత సమయం కంటే అయిదేళ్ల ముందే, అంటే 2025లోనే సాధించిందని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం 50 శాతానికి పైగా శిలాజేతర విద్యుత్ సామర్థ్యంతో… సౌర, పునరుత్పాదక ఇంధన రంగాల్లో ప్రపంచంలోనే తొలి మూడు దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచిందని శ్రీ మోదీ తెలిపారు. 500 గిగావాట్ల లక్ష్యానికి గానూ ఇప్పటికే దాదాపు 300 గిగావాట్ల లక్ష్యం సాధించామనీ, రాబోయే 10 నుంచి 11 ఏళ్లలో మరో 500 గిగావాట్ల నూతన శిలాజేతర సామర్థ్యాన్ని జోడించాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యంతో ముందుకుసాగుతున్నామని ఆయన ఉద్ఘాటించారు. ‘ఈ లక్ష్యం కొంచెం కష్టమైనదే, కానీ నా దేశ సామర్థ్యంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే చెబుతున్నా, మనం దీనిని సాధించి తీరుతాం!‘ అని ప్రధానమంత్రి శ్రీ మోదీ ధీమా వ్యక్తం చేశారు.
భారత్ సాధించిన సరికొత్త ఆవిష్కరణలు, అనుభవాల ఫలాలు విశ్వమానవాళి అంతటికీ చెందాలన్నదే మన సంకల్పమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. హరిత ఇంధన రంగంలో మన ప్రయాణం కేవలం స్వార్థంతో కాకుండా లోకకల్యాణ సహకార స్ఫూర్తితో సాగుతోందన్న శ్రీ మోదీ… దీనికి పలు ఉదాహరణలను ఉటంకించారు. ‘ఈ ప్రయాణంలో భారత్ అందుకున్న విజయ శిఖరాలు… రేపు ప్రపంచంలోని ఎన్నో దేశాలకు దిక్సూచిగా, తోడ్పాటుగా నిలుస్తాయి‘ అని శ్రీ మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు లక్ష్యంతో 2024 ఫిబ్రవరి నెలలో ప్రారంభించిన ‘పీఎమ్ సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన‘ సాధిస్తున్న వేగవంతమైన పురోగతినీ ప్రధానమంత్రి వివరించారు. కేవలం 24 నుంచి 25 నెలల వ్యవధిలోనే 65 లక్షలకు పైగా కుటుంబాలు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం పొందాయనీ… ప్రతి ఆరు రోజులకు ఒక లక్ష కొత్త ఇళ్లు ఈ పథకంలో చేరుతున్నాయనీ ఆయన పేర్కొన్నారు. దీనివల్ల విద్యుత్ బిల్లులు దాదాపు 76 శాతం తగ్గాయని సూచించిన ఒక అధ్యయనాన్ని శ్రీ మోదీ ఉటకించారు. లక్షలాది కుటుంబాలకు కరెంటు బిల్లు పూర్తిగా ‘సున్నా‘ అవ్వడమే కాకుండా, మిగిలిన అదనపు విద్యుత్తును గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా వారు ఆదాయం పొందుతున్నారని ప్రధానమంత్రి తెలిపారు. ‘మన దేశానికి చెందిన ఈ పథకం ప్రపంచంలోని అనేక దేశాల ఇంధన భద్రతకు ఎంతో బలాన్ని చేకూరుస్తుంది‘ అని శ్రీ మోదీ అభిప్రాయపడ్డారు.
గత 12 ఏళ్లుగా దైనందిన జీవితంలో, పరిశ్రమల్లో, వ్యవసాయ రంగంలో సౌరశక్తిని భాగం చేయడానికి జరుగుతున్న కృషిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. 44,000కు పైగా ప్రభుత్వ భవనాలకు సౌరశక్తిని అనుసంధానించడం ద్వారా ఏటా దాదాపు 700 కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయని ఆయన గుర్తుచేశారు. అలాగే ‘కుసుమ్‘ పథకం ద్వారా 30 లక్షల మందికి పైగా రైతులకు సౌర నీటిపారుదల సౌకర్యం లభించిందనీ, ఈ సోలార్ పంపులను వాడుతున్న ప్రతి రైతు ఏటా దాదాపు లక్ష రూపాయల వరకు ఆదా చేసుకుంటున్నారనీ శ్రీ మోదీ వివరించారు. భూసేకరణ ఖర్చులను తగ్గించుకుంటూ… జలాశయాలు, చెరువులు, సరస్సుల ఉపరితలంపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసే ‘పీఎమ్ సూర్య సరోవర్ యోజన‘నూ ఆయన ఉదహరించారు. ‘సౌరశక్తిని భారత్ తమ పౌరుల జీవన విధానంలో కీలక భాగంగా మారుస్తోంది‘ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
భారత పరిశుద్ధ ఇంధన వ్యవస్థ కేవలం జల, సౌర, పవన, అణుశక్తికే పరిమితం కాలేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ దశాబ్దం ముగిసే సమయానికి 50 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడమే కాకుండా, రవాణా రంగంలోనూ గ్రీన్ హైడ్రోజన్‌ను అనుసంధానించేలా ‘నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‘ కింద దేశం మిషన్ మోడ్‌లో ముందుకుసాగుతోందని ఆయన వివరించారు. ‘కేవలం కొన్ని నెలల కిందటే, భారత్ తన తొలి గ్రీన్ హైడ్రోజన్ రైలును ప్రారంభించింది‘ అని ప్రధానమంత్రి గుర్తుచేశారు.
సౌర, పవన విద్యుత్ ను అధికంగా ఉత్పత్తి అయ్యే ప్రాంతాల నుంచి తక్కువ ఉత్పత్తి జరిగే ప్రాంతాలకు సమర్థవంతంగా సరఫరా చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాలు, పరిశ్రమలకు సమానంగా ప్రయోజనం చేకూరాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనకు ప్రత్యేక ప్రసార లైన్లు, సబ్స్టేషన్లతో కూడిన గ్రీన్ ఎనర్జీ కారిడార్ల అభివృద్ధిని ఆయన ప్రస్తావించారు. ఐదు ప్రాంతీయ విద్యుత్ గ్రిడ్లను ఒకే ఫ్రీక్వెన్సీతో అనుసంధానించి, ‘ఒకే దేశం – ఒకే విద్యుత్ గ్రిడ్’ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ ప్రసార మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేందుకు దేశం ఇప్పుడు తదుపరి దశలోకి అడుగుపెడుతోందని తెలిపారు. “ ఇందుకోసం సుమారు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని ఇటీవలే భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
గతంలో చిన్నచిన్న సౌర విద్యుత్ పరికరాల కోసం కూడా పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు దేశీయ తయారీ రంగంలో గణనీయమైన వృద్ధి సాధించడం వల్లే భారత్ హరిత ఇంధన రంగంలో ఈ విజయాలను అందుకోగలిగిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దశాబ్దం క్రితం సుమారు 2 గిగావాట్లుగా ఉన్న సౌర మాడ్యూళ్ల తయారీ సామర్థ్యం నేడు 200 గిగావాట్లకు పైగా పెరిగిందని తెలిపారు. దీనికి తోడు దాదాపు 40 గిగావాట్ల సౌర విద్యుత్ సెల్ తయారీ సామర్థ్యం అందుబాటులోకి వచ్చిందని, ఇతర విడిభాగాల దేశీయ ఉత్పత్తి కూడా విస్తరిస్తోందని వివరించారు. “అంటే, హరిత ఇంధన రంగంలో భారత్ సాధిస్తున్న లక్ష్యాలు మన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల విజయానికి కూడా నిదర్శనం” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
ఇప్పటివరకు సాధించిన విజయాలతో సంతృప్తి చెంది ఆగిపోకుండా, దేశం ఇదే వేగాన్ని కొనసాగించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రతి ప్రభుత్వ భవనం, పాఠశాల, కళాశాల, ఆసుపత్రి, వీధి దీపాల వ్యవస్థలను వీలైనంత త్వరగా సౌర విద్యుత్‌తో అనుసంధానించాలని సూచించారు. ఈ లక్ష్య సాధనలో మెరుగైన పనితీరు కనబరిచే రాష్ట్రాలు, స్థానిక సంస్థలను ప్రోత్సహించేందుకు వాటి మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించాలని ప్రతిపాదించారు. స్థానిక స్థాయిలో విజయవంతమైన నమూనాల నుంచి ఇతర ప్రాంతాలు కూడా పాఠాలు నేర్చుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. “ఈ పనిని మనం వేగవంతంగా చేపట్టాలి” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
వ్యవసాయ రంగంలో సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించేందుకు ప్రత్యేక సూచన చేస్తూ, లక్షలాది సౌర పంపుల పంపిణీతోనే సరిపెట్టుకోకుండా, సాగులో లేని వ్యవసాయ భూములను కూడా సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. వీలైనన్ని గ్రామాల్లో రైతులను ప్రోత్సహించి, ఖాళీగా ఉన్న భూములతో పాటు పొలాల గట్ల వెంట కూడా సౌర ఫలకాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. “మనం సౌర పంపులకే పరిమితం కాకుండా ముందుకు సాగాలి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు
సౌర విప్లవంలో నూతన శకం కేవలం సౌర విద్యుత్ వినియోగం పెంపుపైనే కాకుండా, వినూత్న ఆవిష్కరణలపైనా ఆధారపడి ఉంటుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. స్టార్టప్‌లు, ఐఐటీలు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు ఈ దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ నిరంతరం విద్యుత్ అందించగలిగే సౌర విద్యుత్ నమూనాలను అభివృద్ధి చేయాలని సూచించారు. గృహాల విద్యుత్ అవసరాల్లో అత్యధిక భాగాన్ని తీర్చగలిగేలా, దిగుమతి చేసుకునే గ్యాస్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు రూఫ్‌టాప్ సౌర విద్యుత్‌తో వంట చేసే సదుపాయాలు, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, కార్లకు ఇళ్ల వద్దనే సౌర విద్యుత్ ఛార్జింగ్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. “దీనివల్ల దేశంలోని మధ్యతరగతి కుటుంబాలు ఏటా వేలాది రూపాయలను ఆదా చేసుకోవచ్చు” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో అనుబంధ రంగాలకు అవసరమైన ప్రత్యేక స్వచ్ఛ ఇంధన పరిష్కారాల ఆవశ్యకతను ప్రస్తావిస్తూ, పాడి పరిశ్రమలో సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక సౌర ఉత్పత్తులను అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. “పశువుల మేత తయారీ, పంటల కోత, కోత అనంతర కార్యకలాపాలు.. ఇలా ప్రతి పనికీ సౌర విద్యుత్‌తో పనిచేసే పరికరాలను అభివృద్ధి చేయాలి” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
ఈ లక్ష్యాలను సాధించేందుకు తరువాతి తరం ఆవిష్కరణలు, స్వదేశీ నిల్వ పరికరాలు, కొత్త బ్యాటరీ నిల్వ సామర్థ్యాల అభివృద్ధి అత్యవసరమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ అవసరం భారత యువతకు అపారమైన అవకాశాలను కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు. పరిశోధకులు, పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. “భారత్‌లో మీరు అభివృద్ధి చేసే పరిష్కారాలు ప్రపంచంలోని అనేక దేశాలకు ఎంతో ఉపయోగపడతాయి” అని శ్రీ మోదీ అన్నారు.
ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశాల్లో ఒకటైన భారత్‌లో ప్రతి స్వచ్ఛ ఇంధన కార్యక్రమం వేలాది ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సౌర ఫలకాల తయారీ, హార్డ్‌వేర్ ఉత్పత్తి, ఏర్పాటు, నిర్వహణ, మరమ్మతులు, రవాణా వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత విస్తరించడం ద్వారా ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలు మరింత పెరుగుతాయని అన్నారు. “వంటగదిలోని పొయ్యి నుంచి రవాణా సాధనాల వరకు అన్నీ సౌర విద్యుత్, హరిత ఇంధనంతో నడిచేలా మారితే, ఒక సరికొత్త పరిశ్రమ ఆవిర్భవిస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
భారత్‌లో ఉన్న అపారమైన డిమాండ్, విస్తృత స్థాయి, అవకాశాలు, రాజకీయ, విధానపరమైన స్థిరత్వాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రపంచ పెట్టుబడిదారులకు ప్రధానమంత్రి ఆహ్వానం పలికారు. గత దశాబ్ద కాలంలో పునరుత్పాదక ఇంధన రంగం 15 లక్షల కోట్ల రూపాయల 164 బిలియన్ డాలర్ల) పైగా పెట్టుబడులను ఆకర్షించిందని తెలిపారు. 2024లో జరిగిన రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ (రీ ఇన్వెస్ట్) సదస్సు తర్వాత కేవలం రెండేళ్లలోనే రూ.6 లక్షల కోట్లకు పైగా (63 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు వచ్చాయని వివరించారు. ఈ దశాబ్దం ముగిసే నాటికి ఈ రంగంలో పెట్టుబడి అవకాశాలు రూ.20 లక్షల కోట్లకు (220 బిలియన్ డాలర్లకు) మించనున్నాయని అంచనా వేశారు.“కాబట్టి, మీ అందరికీ భారత స్వచ్ఛ ఇంధన రంగంలో అవకాశాల సరికొత్త ఆకాశం ఆవిష్కృతం కానుంది” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
భారత్ ప్రపంచానికి అందించిన ‘ఒకే భూమి – ఒకే కుటుంబం – ఒకే భవిష్యత్తు’ సందేశాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇదే స్ఫూర్తి దేశ స్వచ్ఛ ఇంధన ప్రయాణానికి, అంతర్జాతీయ సౌర కూటమి (ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్) ఏర్పాటుకు పునాదిగా నిలిచిందని పేర్కొన్నారు. అవసరమైన నిధులు, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం ప్రతి దేశానికి చేరేలా చూడటానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. “ఈ నేపథ్యంలో ఆఫ్రికా కోసం 200 మిలియన్ డాలర్లతో ఆఫ్రికా సోలార్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ప్రపంచ వాతావరణ లక్ష్యాల సాధనకు రాబోయే దశాబ్దం అత్యంత కీలకమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ మార్పులో ప్రతి దేశాన్ని, ప్రతి ప్రాంతాన్ని భాగస్వాములను చేయడం ద్వారా భవిష్యత్తును సురక్షితం చేయడంలో ఈ సదస్సులో పాల్గొన్నవారు కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి ప్రసంగం ముగించారు. “అప్పుడే మనం స్వచ్ఛమైన భవిష్యత్తును, హరిత భవిష్యత్తును, సురక్షితమైన భవిష్యత్తును నిర్మించగలుగుతాం” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
***
Speaking at the Bharat Renewable Energy Summit in Delhi. Watch my speech. https://t.co/09hT8k2qmU
— Narendra Modi (@narendramodi) November 2, 2026
पिछले कुछ वर्षों से Global Economy ने अभूतपूर्व संकट देखे हैं। कोरोना की महामारी से लेकर West Asia Crisis तक...दुनिया ने कई बड़े संकटों का सामना किया है। और West Asia का संकट तो अभी भी जारी है...लेकिन 140 करोड़ भारतीयों को इस बात का गर्व है कि हमने अब तक इस संकट को बेहतर तरीके से संभाला है और इस संकट के बावजूद भी भारत की growth high रही है: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 2, 2026
Energy Security का future Clean Energy में है: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 2, 2026
सौर क्रांति का ये नया दौर केवल adoption का नहीं है...ये innovation पर भी निर्भर है। इसलिए मैं अपने Startups से, IITs, innovators और Entrepreneurs से विशेष आग्रह करुंगा...आप आगे आएं...आप ऐसे model बनाएं जहां एक परिवार की ज्यादा से ज्यादा जरूरतें solar power से पूरी हों: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 2, 2026