Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నవంబర్‌ 15న జనజాతీయ గౌరవ దివస్‌ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధానమంత్రి


మహారాష్ట్రలోని గడ్చిరోలిలో 2026 నవంబర్‌ 15వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహించే జనజాతీయ గౌరవ దివస్‌ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా పాల్గొంటారు. ధర్తీ ఆబా భగవాన్‌ బిర్సా ముండా 151వ జయంతి సందర్భంగా జరిగే ఈ కార్యక్రమంలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.3,000 కోట్ల విలువైన 246 అభివృద్ధి ప్రాజెక్టులకు  ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తారు. దేశవ్యాప్తంగా గిరిజన సమాజాల విద్య, వైద్యం, జీవనోపాధి అవకాశాలు, సామాజిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం లక్ష్యంగా  ఈ ప్రాజెక్టులను  చేపడుతున్నారు.

ప్రధానమంత్రి ప్రారంభించే  173 ప్రాజెక్టులలో  గిరిజన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన 38 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ (పీఎం – జన్‌మన్‌) కింద నిర్మించిన 100 బహుళ ప్రయోజన కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలు ప్రభుత్వ సేవల అందచేతకు, సమాజ ఆధారిత కార్యకలాపాలకు కేంద్రాలుగా పని చేస్తాయి. పీఎం – జన్‌మన్‌, ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్‌ అభియాన్‌ (డీఏజీజీయూఏ) పథకాల కింద చేపట్టిన పలు ఇతర ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు.

ప్రధానమంత్రి  ప్రారంభించనున్న ఇతర ప్రధాన ప్రాజెక్టుల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో గిరిజన పరిశోధనా సంస్థ (టీఆర్ఐ) భవనం, మిజోరంలోని ఐజ్వాల్‌లో రోపుయిలియాని గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం ఉన్నాయి. గిరిజన సంస్కృతి, వారసత్వాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను చేపట్టారు. మిజో గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల ధైర్యసాహసాలు, పోరాట పటిమ, త్యాగాలను స్మరించుకునేలా ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. మిజో ప్రజల గొప్ప సాంస్కృతిక సంప్రదాయాలు, చారిత్రక వారసత్వం, జీవనవిధానాలను కూడా ఇందులో ప్రదర్శించనున్నారు. పందొమ్మిదో శతాబ్దానికి చెందిన మిజో మహిళా నాయకురాలు రోపుయిలియాని పేరు మీద ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. బ్రిటిష్‌ వలస పాలనను ఆమె ధైర్యంగా ఎదిరించారు. గిరిజనుల ప్రతిఘటన, త్యాగాలకు ప్రతీకగా ఆమె నేటికీ గుర్తుండిపోయారు.

గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలన్న నిబద్ధతను మరింత బలోపేతం చేస్తూ, 19 కొత్త ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. గిరిజన ఉత్పత్తిదారులకు మార్కెట్‌ సదుపాయాలను మెరుగుపరిచేందుకు 12 గిరిజన బహుళ ప్రయోజన మార్కెటింగ్‌ కేంద్రాల (టీఎంఎంసీలు) నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తారు. పీఎం – జన్‌మన్‌, ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్‌ అభియాన్‌ (డీఏజీజీయూఏ) పథకాల కింద చేపట్టనున్న మరో 42 ప్రాజెక్టులకు కూడా  ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. 

2026 నవంబర్‌ 1 నుంచి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జనజాతీయ గౌరవ పక్షోత్సవాల ముగింపు కార్యక్రమంగా ఈ సభ జరగనుంది. ఈ పక్షోత్సవాల సందర్భంగా జాతీయ స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల విద్యార్థులతో రాష్ట్రపతి ముఖాముఖి, జాతీయ గిరిజన సాహిత్య ఉత్సవం, గిరిజన వైద్యులకు శిక్షణ కార్యక్రమాలు, ప్రత్యేకించి అత్యంత బలహీన గిరిజన తెగల (పీవీటీజీలు) కోసం ఆరోగ్య, పోషకాహార శిబిరాలు నిర్వహించారు. ధర్తీ ఆబా జనభాగీదారీ అభియాన్‌ కింద గిరిజన గ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చేపట్టారు.

****