ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కర్ణాటకలోని మైసూరులో భారత తొలి ‘ఎల్ఈడీ’ డోమ్ ప్లానెటేరియం ‘కాస్మోస్-మైసూరు’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ- తొలుత కన్నడ భాషలో ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నగరంలో వివేక స్మారకం ప్రారంభోత్సవం తర్వాత కొద్ది రోజుల్లోనే ఈ ప్లానెటేరియంను దేశానికి అంకితం చేయడం కోసం మైసూరుకు రావడం తనకెంతో సంతోషాన్నిస్తోందని ఆయన చెప్పారు. ఆత్మపరిశీలన, ఆధ్యాత్మిక అన్వేషణకు వివేక స్మారకం స్ఫూర్తినిస్తుందని, ఈ ప్లానెటేరియం విశాల విశ్వ రహస్యాల ఛేదన దిశగా మన దృష్టిని ఆకాశం వైపు మళ్లిస్తుందని అభివర్ణించారు. ఈ రెండు చారిత్రక కట్టడాల ప్రగాఢ సాంస్కృతిక సందేశాన్ని విశదీకరిస్తూ- “భారత దేశంలో ఆధ్యాత్మికత, విజ్ఞాన శాస్త్ర సంప్రదాయాలు సదా జమిలిగా ముందుకు సాగాయనడానికి ఇదొక ఉదాహరణ” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
మన పూర్వికులు ఆకాశాన్ని ఎంతో నిశితంగా అధ్యయనం చేశారని, గ్రహ-నక్షత్ర కదలికలను అర్థం చేసుకుంటూ కేలెండర్లను రూపొందించారని ప్రధానమంత్రి గుర్తుచేశారు. అలాగే, సంక్లిష్ట గణనతో సూర్య, చంద్ర గ్రహణాలను లెక్కించారని చెబుతూ- ఆర్యభట్ట, వరాహమిహిర, భాస్కరాచార్య, నీలకంఠ సోమయాజి వంటి గొప్ప భారతీయ ఖగోళ శాస్త్రవేత్తల వారసత్వాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. “నేటి తరహాలో సాంకేతిక పరిజ్ఞానం.. అత్యాధునిక పరికరాలు ఆ కాలంలో లేకపోయినా సంక్లిష్ట గణనతో వారెన్నో అద్భుతాలను ఆవిష్కరించారు” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
మైసూరు విశ్వవిద్యాలయం స్థాపనలో మహారాజా నల్వాడి కృష్ణరాజ ఒడయార్ చొరవను ప్రధానమంత్రి ప్రస్తావించారు. అదే తరహలో తరతరాల విజ్ఞానవేత్తలకు సాధికారత దిశగా బెంగళూరులో ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్’కు పునాది వేయడంలోనూ ఒడయార్ రాచకుటుంబం కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఇటువంటి విజ్ఞాన సంస్థలను ప్రోత్సహించడంలో మైసూరుకు గల గొప్ప సంప్రదాయాన్ని ఆయన కొనియాడారు. ఈ నేపథ్యంలో నేడు అత్యాధునిక ప్లానెటేరియంను యువతకు, పౌరులకు అంకితం చేయడం ద్వారా భారత శాస్త్రవిజ్ఞాన ప్రస్థానంలో మైసూరు మరో కొత్త అధ్యాయాన్ని జోడించిందని పేర్కొన్నారు. ఇక్కడ ‘ఎల్ఈడీ’ డోమ్‌లో ఒక ప్రదర్శనను తిలకించడం అద్భుత అనుభవమని, ఈ కీలక మలుపును చేరిన యావద్దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు. “ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, మైసూరు విశ్వవిద్యాలయం, ప్రభుత్వంలోని వివిధ విభాగాలు సహా ప్లానెటేరియం నిర్మాణంతో ముడిపడిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా నా అభినందనలు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
భారత జాతీయ నినాదం ‘జై జవాన్- జై కిసాన్’కు పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ‘జై విజ్ఞాన్’ను జోడించారని శ్రీ మోదీ గుర్తు చేశారు. అటుపైన 21వ శతాబ్దపు భారత్‌కు మార్గదర్శి వంటి ‘జై అనుసంధాన్’ అనే తన సొంత నినాదాన్ని చేర్చేదాకా పరిణామ క్రమాన్ని ఆయన వివరించారు. నిరుడు ముంబయి నగరంలో నిర్వహించిన అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర, ఖగోళ భౌతిక శాస్త్ర ఒలింపియాడ్‌లలో దేశ యువతరం ఉత్సాహంగా పాల్గొనడాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. అలాగే, ఈ ఏడాది వియత్నాంలో నిర్వహించిన ఒలింపియాడ్‌లలోనూ వారు అద్భుత ప్రతిభను ప్రదర్శించారని ప్రత్యేకంగా కొనియాడారు. “భారత్ నుంచి ఐదుగురు విద్యార్థులు వియత్నాం వెళ్లారు. వారిలో నలుగురు స్వర్ణాలు, ఒకరు రజతం కైవసం చేసుకుని యావద్దేశానికీ గర్వకారణంగా నిలిచారు” అని ప్రధానమంత్రి గుర్తుచేశారు.
ఈ ఏడాది అంతర్జాతీయ ఒలింపియాడ్‌లలో గణిత, భౌతిక-రసాయన శాస్త్ర, జీవశాస్త్ర విభాగాలలో స్వర్ణ, రజత పతకాలతో భారత విద్యార్థులు సాధించిన రికార్డు స్థాయి విజయాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. యువతకు అభ్యసన వనరులతోపాటు సాంకేతికత, సాధనాలు, సంస్థాగత మద్దతు లభిస్తే వారు అసాధారణ విజయాలు సాధించగలరని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో “నేడు వారి కలలకు రెక్కలు తొడగడంలోనూ ఈ కాస్మోస్ ప్లానెటేరియం ఎంతగానో తోడ్పడుతుంది” అని శ్రీ మోదీ అన్నారు.
ప్రపంచ సాంకేతికతలో శరవేగంగా వస్తున్న మార్పుల మధ్య ఏ దేశంలోనూ మందగమనానికి తావివ్వరాదని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. ఈ క్రమంలో కొత్త టెలిస్కోపులు సహా చారిత్రక ఇస్రో మిషన్ల ద్వారా ఖగోళ, ఖగోళ భౌతిక శాస్త్ర, అంతరిక్ష పరిశోధనలలో గత దశాబ్దం భారత్ అసాధారణ ప్రగతి సాధించిందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా చంద్రయాన్-3 ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువ సమీపాన పాదం మోపిన తొలి దేశంగా భారత్ నిలిచిందన్నారు. అలాగే, భారత తొలి అంతరిక్ష సౌర వేధశాల ఆదిత్య-ఎల్1ను ప్రయోగించామని చెప్పారు. “నిరుడు అంతరిక్షంలో డాకింగ్-అన్‌డాకింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించిన నాలుగో దేశంగా భారత్ ఘనత సాధించింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ఇటీవలే భారత వ్యోమగామి ఒకరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, వినూత్న ప్రయోగాలు నిర్వహించారని గుర్తుచేస్తూ- ఈ మిషన్ ఫలితాలకు వ్యూహాత్మక విలువ ఉందని ప్రధానమంత్రి వెల్లడించారు. “ఈ మిషన్ అనుభవం మన సొంత మానవ అంతరిక్ష యాత్రా కార్యక్రమం ‘గగన్‌యాన్’కూ ఉపయోగపడుతోంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి వీలు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో భారతీయ అంకుర సంస్థలకు, యువతరానికి అవకాశాలు అందివచ్చాయన్నారు. ఈ మేరకు ప్రైవేట్ రాకెట్ల ప్రయోగం, ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టడం, అసాధారణ అంతరిక్ష యాత్రలు చేపట్టడం ద్వారా వారు తమ ప్రతిభాసామర్థ్యాలను ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ఇది నవభారత శాస్త్రీయ దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. “నవ్యావిష్కరణలను ప్రోత్సహిస్తూ, కొత్త సాంకేతికతను అభివృద్ధి చేస్తూ, మన యువతకు సరికొత్త అవకాశాలను సృష్టిస్తున్నాం” అని ప్రధానమంత్రి ప్రకటించారు.
భారత్ సదా ‘మానవత్వమే ప్రధానం’ సూత్రాన్ని అనుసరిస్తూ తన అంతరిక్ష కార్యక్రమాన్ని మానవాళి సంక్షేమానికి అంకితం చేసిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా మత్స్యకారుల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రూపొందించిన ఉపగ్రహ సమాచార వ్యవస్థను ఆయన ఉదహరించారు. “రిసీవర్లు అమర్చిన పడవలకు తుపాన్ల సమయంలో ఈ వ్యవస్థ ద్వారా అధికారులు సకాలంలో హెచ్చరికలు పంపగలరు. దీంతో వారు సురక్షితంగా ఒడ్డుకు చేరేలా కూడా పర్యవేక్షించగలరు” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
రైళ్ల రాకపోకల సమయంలో వాటి ప్రత్యక్ష ప్రయాణ ప్రదేశాన్ని అన్వేషించడంలో భారత రైల్వేలు, ఇస్రో సంయుక్తంగా ప్రత్యక్ష ట్రాకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేశాయని ప్రధానమంత్రి తెలిపారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞాన సంబంధిత దైనందిన అనువర్తనాల గురించి, పంట దిగుబడుల అంచనా, వ్యవసాయ బీమా క్లెయిమ్‌ల పరిష్కారం కోసం ప్రధానమంత్రి పంటల బీమా యోజన కింద క్షేత్రస్థాయి సమాచారం దిశగా ఉపగ్రహ గణాంకాల వినియోగం తదితరాలను ఆయన ప్రస్తావించారు. భారత అంతరిక్ష ఆస్తుల ద్వంద్వ ప్రభావాన్ని ఈ సందర్భంగా ప్రధానమంత్రి వివరించారు. “మన ఉపగ్రహాలు నేడు అంతరిక్ష రంగ శిఖరాగ్రానికి చేరుతున్నాయి. అదే సమయంలో భూగోళంపై జన జీవనాన్ని మెరుగుపరచడంలోనూ ఉపయోగపడుతున్నాయి” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
దేశవ్యాప్తంగా పరిశోధన, ఆవిష్కరణల దిశగా ప్రభుత్వ నిరంతర కృషికి ‘సమాజం కోసం విజ్ఞానం’ అనే మార్గదర్శక సూత్రమే చోదక శక్తి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశమంతటా 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల ద్వారా ఇప్పటికే కోటి మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందారని గుర్తుచేశారు. “ఈ ప్రయోగశాలల్లో బాలలు తమ ఆలోచనలకు రూపమివ్వడం, కొత్త ప్రయోగాలు చేయడం, ఆవిష్కరణలకు చొరవ చూపడంలో అవకాశాలు పొందుతున్నారు” అని శ్రీ మోదీ వివరించారు.
పరిశోధనలను ముందుకు తీసుకెళ్లాలంటే విద్యార్థులకు, విజ్ఙానవేత్తలకు ప్రపంచంలోని అత్యుత్తమ శాస్త్రవిజ్ఞాన సాహిత్యాన్ని అందుబాటులోకి తేవాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఈ మేరకు దేశీయ సంస్థలు ప్రపంచ ప్రసిద్ధ పత్రికలను అధ్యయనం చేయడం కోసం ‘ఒకే దేశం-ఒకే చందా’ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. అలాగే, అనుసంధాన్ జాతీయ పరిశోధన ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. “దేశంలోని అనేక విశ్వవిద్యాలయాల్లో కొత్త పరిశోధనలు చేపట్టడానికి ఈ ఫౌండేషన్ ద్వారా మేం తోడ్పడుతున్నాం” అని శ్రీ మోదీ చెప్పారు.
దేశీయ పరిశోధకులకు నిరంతర నిధుల సౌలభ్యం దిశగా నిరుడు రూ.లక్ష కోట్లతో పరిశోధన-అభివృద్ధి-ఆవిష్కరణల పథకాన్ని ప్రవేశపెట్టామని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ పథకం ఆచరణాత్మక ప్రభావాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- “ఇది ప్రయోగశాలల నుంచి నవ్య సాంకేతికతను ప్రపంచానికి పరిచయం చేసి, ఆచరణాత్మక వినియోగం దిశగా సహాయపడుతోంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
దేశంలో విజ్ఞాన-పరిశోధన రంగం వేగంగా పురోగమిస్తున్న తరుణాన యువతలో ఉత్సుకతను రేకెత్తించడంలో ప్లానెటేరియంలు, విజ్ఞాన కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రారంభించిన ప్లానెటేరియం దేశం నలుమూలల నుంచి పాఠశాల-కళాశాల విద్యార్థులను నిరంతరం ఆహ్వానించాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకించి కాస్మోస్‌తో ముడిపడిన వారంతా దీన్ని సందర్శించాలని కోరుతూ, వారి భవిష్యత్ ప్రస్థానం సాఫీగా సాగాలని శుభాకాంక్షలు తెలిపారు. చివరగా- “విశ్వం గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చే బాలల్లో కొందరు భవిష్యత్తులో ఏదో ఒకరోజు ఇక్కడికి మళ్లీ వచ్చి, విశ్వంపై తమ కొత్త ఆవిష్కరణల గురించి మనకు విశదీకరించవచ్చు. అప్పుడది ఈ కాస్మోస్ ప్లానెటేరియం సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి కాగలదు” అని వ్యాఖ్యానిస్తూ శ్రీ మోదీ తన ప్రసంగం ముగించారు.
***
The new COSMOS Planetarium in Mysuru brings the wonders of the universe closer to young minds. https://t.co/AhdAkpkSGF
— Narendra Modi (@narendramodi) November 13, 2026
भारत में आर्यभट्ट, वराहमिहिर, भास्कराचार्य और नीलकंठ सोमयाजी जैसे अनेक महान astronomers हुए। आज जैसे advanced instruments और technology उस समय नहीं थे। इसके बावजूद उन्होंने बड़ी-बड़ी खोजें कीं, मुश्किल calculations किए: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 13, 2026
आज जब भारत science के क्षेत्र में एक के बाद एक नई उपलब्धियां हासिल कर रहा है, तब इस अत्याधुनिक COSMOS Planetarium के रूप में मैसूरु भी भारत की scientific journey में एक नया chapter जोड़ रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 13, 2026
हमारी सरकार ने space sector को open किया। इससे private sector के लिए नई संभावनाएं बनी हैं। भारत के startups को भी अपनी क्षमता दिखाने का अवसर मिला है: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 13, 2026