Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కర్ణాటకలోని మైసూరులో ‘కాస్మోస్-మైసూరు’ ప్లానిటోరియం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

కర్ణాటకలోని మైసూరులో ‘కాస్మోస్-మైసూరు’ ప్లానిటోరియం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం


అందరికీ నమస్కారం!

కర్ణాటక గవర్నర్ శ్రీమతి సుధా యాదవ్ గారు, ముఖ్యమంత్రి శ్రీ డి. కె. శివకుమార్ గారు, నా మంత్రివర్గ సహచరులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, రాష్ట్ర మంత్రి శ్రీ బసవరాజ్ రాయరెడ్డి గారు, పార్లమెంటులో నా సహచరులు శ్రీ యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ గారు, హాజరైన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఉపాధ్యాయులు, ఇతర విశిష్ట అతిథులు, మైసూరులోని నా ప్రియమైన సోదరీసోదరులకు నమస్కారాలు.

మొదటగా, నేను తల్లి చాముండేశ్వరి దేవికి భక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. మరోసారి మైసూరుకు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. కొద్ది నెలల కిందటే ‘వివేక స్మారక’ ప్రారంభోత్సవం కోసం నేను మీ మధ్యకు వచ్చాను. నేడు ‘కాస్మోస్ ప్లానిటోరియం’ను జాతికి అంకితం చేసే కార్యక్రమం కోసం మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఈ రెండు సందర్భాలూ భారత విలువలు, సంస్కృతి గురించి స్పష్టమైన సందేశాన్ని అందిస్తున్నాయి. ‘వివేక స్మారక’ మన అంతరాత్మను తరచి చూసుకోవడానికి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అన్వేషించడానికి మనకు స్ఫూర్తినిస్తుంది. ‘కాస్మోస్’ వద్ద మన దృష్టి ఆకాశం వైపు మళ్లుతుంది. ఈ విశాల విశ్వాన్ని అన్వేషించడానికి, దాని రహస్యాలను తెలుసుకోవడానికి మనకు ప్రేరణ లభిస్తుంది. దేశంలో ఆధ్యాత్మికత, విజ్ఞాన శాస్త్ర సంప్రదాయాలు ఎల్లప్పుడూ కలిసికట్టుగా పురోగమిస్తుంటాయని చెప్పడానికి ఇదే చక్కటి ఉదాహరణ.

మిత్రులారా,

మన పూర్వీకులు ఆకాశాన్ని ఎంతో నిశితంగా అధ్యయనం చేసేవారు. వారు నక్షత్రాలు, గ్రహాల కదలికలను అర్థం చేసుకున్నారు. పంచాంగాలను రూపొందించారు. సూర్య, చంద్ర గ్రహణాల సమయాలను కచ్చితంగా లెక్కించారు. ఆర్యభట్ట, వరాహమిహిరుడు, భాస్కరాచార్యుడు, నీలకంఠ సోమయాజి వంటి ఎందరో గొప్ప ఖగోళ శాస్త్రవేత్తలకు భారత్ నిలయంగా ఉండేది. నేడు అందుబాటులో ఉన్న ఆధునిక పరికరాలు, సాంకేతికతలు ఆ కాలంలో లేవు. అయినప్పటికీ, వారు ఎన్నో గొప్ప ఆవిష్కరణలు చేశారు. అత్యంత క్లిష్టమైన గణనలనూ పూర్తి చేశారు.

మిత్రులారా,

జ్ఞానాన్వేషణను ప్రోత్సహించే సంస్థలను స్థాపించే గొప్ప సంప్రదాయం మైసూరుకు ఉంది. మహారాజా నాల్వడి కృష్ణరాజ వడియార్ పాలనలో మైసూరు విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు పునాది వేయడంలోనూ వడియార్ రాజవంశం కీలక పాత్ర పోషించింది. ఈ సంస్థలు తరతరాలుగా విద్యార్థులు, పరిశోధకులు పురోగమించేందుకు అవకాశాలను కల్పించాయి. నేడు భారత్ విజ్ఞాన శాస్త్ర రంగంలో ఒకదాని తర్వాత ఒకటిగా విజయాలను సాధిస్తోంది. మైసూరు ఈ అత్యాధునిక ‘కాస్మోస్ ప్లానిటోరియం’ రూపంలో భారత శాస్త్రీయ ప్రయాణంలో నూతన అధ్యాయాన్ని జోడిస్తోంది. ఈ అత్యాధునిక కాస్మోస్ ప్లానిటోరియంను ఈ రోజు దేశ యువతకు, ప్రజలకు అంకితం చేస్తున్నాం. ఇది దేశంలోనే తొలి ఎల్‌ఈడీ డోమ్ ప్లానిటోరియం. కొద్దిసేపటి కిందట ఇక్కడ ఒక ప్రదర్శనను చూసే అవకాశం నాకు లభించింది. అది నిజంగా ఒక అద్భుతమైన అనుభవం. దీని నిర్మాణంలో పాలుపంచుకున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, మైసూరు విశ్వవిద్యాలయం, వివిధ ప్రభుత్వ విభాగాలు, ప్రతి ఒక్కరినీ నేను అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

మన దేశంలో ఎంతో కాలంగా ఒక నినాదం వినిపిస్తోంది. దానిని నిర్మల గారు ఇప్పుడే తన ప్రసంగంలో ప్రస్తావించారు. జై జవాన్, జై కిసాన్. అటల్ జీ దీనికి జై విజ్ఞాన్‌ను జోడించారు. ఆ తర్వాత నేను జై అనుసంధాన్‌ను కలిపాను. 21వ శతాబ్దపు భారత్ ఇదే దార్శనికతతో ముందుకు సాగుతోంది. ఈ విషయంలో మన దేశ యువత అద్భుతంగా రాణిస్తున్నారు. గత ఏడాది ముంబైలో ‘ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఆన్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్’కు భారత్ ఆతిథ్యమిచ్చింది. మన యువత ఇందులో ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఇక ఈ ఏడాది జరిగిన ఇదే ఒలింపియాడ్ తదుపరి ఎడిషన్ కోసం భారత్ నుంచి ఐదుగురు విద్యార్థులు వియత్నాం వెళ్లారు. వారిలో నలుగురు బంగారు పతకాలు సాధించగా, ఒకరు రజత పతకాన్ని గెలుచుకున్నారు. ఇది యావత్ దేశానికి ఎంతో గర్వకారణం.

మిత్రులారా,

మన యువ విద్యార్థులు విజ్ఞాన శాస్త్రంలోని ఇతర రంగాల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ ఒలింపియాడ్‌లలోనూ భారతీయ విద్యార్థులు భారీ విజయాలు సాధించారు. వీటిలో గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం వంటి అంశాలు ఉన్నాయి. విద్యార్థులందరూ స్వర్ణ లేదా రజత పతకాలను గెలుచుకున్నారు. భారత్ సాధించిన రికార్డు విజయం ఇది. మన యువతకు సరైన అవకాశాలు లభించినప్పుడు… నేర్చుకోవడానికి అవసరమైన వనరులు అందినప్పుడు… సాంకేతికత, పరికరాలు, సంస్థల మద్దతు లభించినప్పుడు వారు గొప్ప విజయాలను సాధించడం ద్వారా తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. ఈ కాస్మోస్ ప్లానిటోరియం ఇప్పుడు వారి కలలకు రూపమివ్వడంలో ఎంతో సహాయపడనుంది.

మిత్రులారా,

నేడు సాంకేతికత ప్రపంచాన్ని ఎంతో వేగంగా మార్చేస్తోంది. ఈ రంగంలో నెమ్మదిగా అడుగులు వేసే సాహసం ఏ దేశమూ చేయలేదు. గత దశాబ్ద కాలంలో ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్రం, అంతరిక్ష రంగాల్లో భారత్ అపూర్వ ప్రగతిని సాధించింది. దేశంలో కొత్త టెలిస్కోపులను ఏర్పాటు చేశాం. అంతరిక్ష అన్వేషణలో సవాలుతో కూడిన అనేక విభాగాల్లో… భారత్ ప్రస్తుతం ప్రపంచంలోని అతికొద్ది అగ్ర దేశాల సరసన నిలిచింది. చంద్రయాన్-3 ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువానికి సమీపంలో దిగిన ప్రపంచపు తొలి దేశంగా ఇస్రో భారత్‌ను నిలబెట్టింది. ఆదిత్య-L1 రూపంలో అంతరిక్షంలో దేశానికి తన తొలి సౌర పరిశీలనా కేంద్రం లభించింది. గతేడాది అంతరిక్షంలో డాకింగ్, అన్‌డాకింగ్ (ఉపగ్రహాలను అనుసంధానించడం, వేరు చేయడం) సామర్థ్యాన్ని ప్రదర్శించిన ప్రపంచంలోని నాల్గో దేశంగా భారత్ అవతరించింది.

మిత్రులారా,

ఈ కాలంలో… ఒక భారతీయుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుని, అక్కడ పలు కొత్త ప్రయోగాలను నిర్వహించారు. ఈ మిషన్ ద్వారా పొందిన అనుభవం, మన సొంత మానవ సహిత అంతరిక్ష యాత్ర కార్యక్రమం ‘గగన్‌యాన్’కూ ఎంతో ఉపయోగకరంగా మారుతోంది.

మిత్రులారా,

మా ప్రభుత్వం అంతరిక్ష రంగాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల ప్రైవేట్ రంగానికి కొత్త అవకాశాలు లభించాయి. దేశంలోని అంకురసంస్థలకూ తమ సామర్థ్యాలను నిరూపించుకునే అవకాశం దక్కింది. నేడు మన యువత సొంతంగా రాకెట్లను ప్రయోగిస్తున్నారు. ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపుతున్నారు. అంతరిక్ష రంగంలో భారత్ మునుపెన్నడూ లేని అనేక కార్యకలాపాలను చేపడుతోంది. ఇది ‘నవ భారత్’ శాస్త్రీయ దృక్పథం. ఇక్కడ కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నారు. సరికొత్త సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నారు. మన యువత కోసం కొత్త అవకాశాలను సృష్టిస్తున్నారు.

మిత్రులారా,

భారత్ ఎల్లప్పుడూ ‘మానవత్వమే ప్రథమం’ అనే మంత్రంతో ముందుకు సాగుతోంది. భారత అంతరిక్ష యాత్రలూ మానవాళి సంక్షేమానికే అంకితమయ్యాయి. ఉదాహరణకు, ఇస్రో మన మత్స్యకారులైన సోదరుల కోసం ఒక ఉపగ్రహ సమాచార వ్యవస్థను అభివృద్ధి చేసింది.

ఈ వ్యవస్థ సహాయంతో… రిసీవర్లు అమర్చిన పడవలు సముద్రంలో ఉన్నప్పుడు, తుఫానుల సమయంలో అధికారులు వాటికి సకాలంలో హెచ్చరికలు పంపవచ్చు. ఆ పడవలు సురక్షితంగా తిరిగి తీరానికి చేరుకోవడాన్నీ వారు పర్యవేక్షించవచ్చు.

మిత్రులారా,

మీలో చాలామంది రైళ్ల లైవ్ లొకేషన్‌ను చూస్తూ ఉంటారు. ఒక రైలు ప్రస్తుతం ఎక్కడ ఉంది… అది స్టేషన్‌కు ఎప్పుడు చేరుకుంటుంది అనే విషయాలను ఇది తెలియజేస్తుంది. భారతీయ రైల్వేలు, ఇస్రో కలిసి అభివృద్ధి చేసిన ‘రియల్-టైమ్ ట్రైన్ ట్రాకింగ్ సిస్టమ్’ ద్వారా ఈ సమాచారం అందుబాటులోకి వస్తుంది. ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’లోనూ ఉపగ్రహ డేటాను ఉపయోగిస్తున్నారు. దీని కింద, పొలాల నుంచి సేకరించిన సమాచారంతో పాటు ఉపగ్రహ డేటానూ ఉపయోగించి పంట దిగుబడిని అంచనా వేస్తారు. ఈ అంచనాల ఆధారంగానే రైతులకు అందే బీమా పరిహారాన్ని నిర్ణయిస్తారు. నేడు మన ఉపగ్రహాలు అంతరిక్షంలో ఎంతో ఎత్తుకు చేరుకోవడమే కాకుండా, భూమిపై ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికీ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

మిత్రులారా,

సమాజం కోసం విజ్ఞానం – ఇదే మా విధానం. దేశంలో పరిశోధన, ఆవిష్కరణలను నిరంతరం మేం ప్రోత్సహిస్తున్నాం. దేశంలోని 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల ద్వారా ఇప్పటివరకు కోటి మందికి పైగా విద్యార్థులు ప్రయోజనం పొందారు. ఈ ల్యాబ్‌లు పిల్లలకు వారి ఆలోచనలపై పనిచేయడానికి, కొత్త ప్రయోగాలు చేయడానికి, ఆవిష్కరణలు చేయడానికి అవకాశాలను అందిస్తాయి.

మిత్రులారా,

పరిశోధనను పురోగమింపజేయడం కోసం మన విద్యార్థులు, పరిశోధకులకు ప్రపంచంలోని అత్యుత్తమ పరిశోధన అందుబాటులో ఉండటం అత్యవసరం. ఈ లక్ష్యంతోనే మేం ‘ఒకే దేశం… ఒకే సబ్‌స్క్రిప్షన్’  పథకాన్ని ప్రారంభించాం. ఇది ఇప్పుడు దేశంలోని విద్య, పరిశోధనా సంస్థలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శాస్త్రీయ పత్రికలను అందుబాటులోకి తీసుకురావడంలో ఎంతగానో సహాయపడుతోంది. మేం అనుసంధాన్ జాతీయ పరిశోధనా సంస్థను స్థాపించాం. దీని ద్వారా, అధిక సంఖ్యలో విశ్వవిద్యాలయాలు నూతన పరిశోధనలు చేపట్టడానికి మేం సహాయం చేస్తున్నాం.

మిత్రులారా,

మన దేశ పరిశోధకులకు తగిన మొత్తంలో నిధులు నిరంతరం అందేలా… గత సంవత్సరం మేం రూ. 1 లక్ష కోట్ల విలువైన పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ పథకాన్నీ ప్రారంభించాం. ఇది నూతన సాంకేతికతలను ప్రయోగశాలల నుంచి బయటకు తీసుకువచ్చి, వాటిని ఆచరణాత్మక వినియోగంలోకి తీసుకురావడానికి సహాయపడుతోంది.

మిత్రులారా,

నేడు దేశంలో విజ్ఞాన శాస్త్రం, పరిశోధనల కోసం ఒక బలమైన వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. విజ్ఞాన శాస్త్ర రంగంలో పురోగతి సాధించాలంటే యువతలో జిజ్ఞాస ఎంతో అవసరం. ఈ జిజ్ఞాసను పెంపొందించడంలో ప్లానిటోరియంలు, సైన్స్ సెంటర్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇక్కడి పాఠశాలలు, కళాశాలలు వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులను ఇక్కడికి తీసుకురావడానికి వీలుగా సందర్శనలను ఏర్పాటు చేసే దిశగా పనిచేయాలని ‘కాస్మోస్’ తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ నేను కోరుతున్నాను. విశ్వం గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చే పిల్లలే… ఏదో ఒక రోజు విశ్వం గురించి తాము చేసిన కొత్త ఆవిష్కరణలను మనకు తెలియజేయడానికి ఇక్కడికి తిరిగి రావచ్చు. అదే ఈ కాస్మోస్ ప్లానిటోరియం సాధించే అతిపెద్ద విజయం అవుతుంది. ఈ నమ్మకంతో, మీ రాబోయే ప్రయాణం మరింత విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. మీ అందరికీ నా శుభాకాంక్షలు. చాలా ధన్యవాదాలు.

గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి అనువాదం.

***