పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్ వజ్రోత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. భారత దేశం గతం, వర్తమానం, భవిష్యత్తుతో అనుసంధానమైన ప్రతిభావంతులైన, ఆకాంక్షలు కలిగిన యువత తన ముందు ఉన్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సంస్థ 75 ఏళ్ల ప్రస్థానాన్ని, దాని వారసత్వాన్ని గౌరవించుకునేందుకు వారంతా ఇక్కడ సమావేశమయ్యారని అన్నారు. గత 75 ఏళ్లలో ఐఐటీ ఖరగ్‌పూర్ సాధించిన అనేక మైలురాళ్లను ప్రస్తావిస్తూ.. ఈ కాలంలో భారతదేశం ఎడ్లబండ్ల నుంచి బుల్లెట్ రైళ్ల వరకు, ఉత్తరాల నుంచి సామాజిక మాధ్యమ సందేశాల వరకు ఎన్నో సమూల మార్పులను చూసిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. దేశంలోనే తొలి ఐఐటీగా ఈ మార్పుల్లోని ప్రతి దశలోనూ ఈ సంస్థ కీలక పాత్ర పోషించిందని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఇక్కడి విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది, ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
క్యాంపస్ జీవితంలోని కొన్ని జ్ఞాపకాలు మనతో శాశ్వతంగా నిలిచిపోతాయని గుర్తుచేస్తూ, దశాబ్దాల తర్వాత కూడా చాలా మంది పూర్వ విద్యార్థులు చెడీస్లో టీ తాగుతూ జరిపిన చర్చలను ఆప్యాయంగా గుర్తుచేసుకుంటారని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఇతర సంస్థలలోని హాళ్లలా కాకుండా, ఐఐటి ఖరగ్‌పూర్‌లోని హాల్స్ పట్ల ప్రతి విద్యార్థి ఎంతో గర్వపడతాడని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జరిగిన దీపావళి వేడుకలను ప్రస్తావిస్తూ, ఐఐటి ఖరగ్‌పూర్‌లో దీపావళి ఉత్సాహం ప్రత్యేకమైనదని, ఇక్కడి దీపాలంకరణకు ఒక ప్రత్యేక ఆకర్షణ ఉందని, వివిధ హాళ్ల మధ్య జరిగే పోటీ దానిని మరింత విశిష్టంగా మార్చిందని తనకు చెప్పారని ఆయన పంచుకున్నారు. “ఈసారి ఈ పోటీలో ఏ హాల్ గెలిచింది?” అని ప్రధాని శ్రీ మోదీ ప్రశ్నించారు.
ఆలోచనలకు బలం చేకూరి, జాతీయ ఉద్యమాలు పురుడుపోసుకున్న నేలగా బెంగాల్ ప్రత్యేకతను ప్రధానమంత్రి ప్రస్తావించారు. స్వయం పాలనను కోరుకుంటూ, భారత్ ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించిన భారతీయుల అజేయ ధైర్యసాహసాలకు దశాబ్దాల క్రితం సాక్షిగా నిలిచిన స్వాతంత్య్ర సమరయోధుల నిర్బంధ శిబిరం ఉన్న ప్రదేశంలోనే ఐఐటీ ఖరగ్‌పూర్ ఏర్పాటైందని గుర్తుచేశారు. అదే ప్రాంగణం నేడు ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి బలంగా మారుతున్న ఆవిష్కరణలు, ఆలోచనలతో కూడిన యువతను తీర్చిదిద్దుతోందని పేర్కొన్నారు. గతంలో స్వయం పాలన ఆకాంక్ష, స్వాతంత్య్ర స్వప్నం ఉండగా.. నేడు స్వావలంబన సంకల్పం, భవిష్యత్తును నిర్మించుకునే అవకాశం ఉన్నాయని పోల్చి చెప్పారు. ‘‘ఆకాంక్ష నుంచి స్వావలంబన దిశగా సాగుతున్న ఈ ప్రస్థానమే వికసిత్ భారత్ నిర్మాణానికి నిజమైన శక్తి’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
తొలి సార్వత్రిక ఎన్నికలు జరగకముందే, స్వాతంత్య్రం పొందిన కొత్త దేశంలో ఐఐటీ ఖరగ్‌పూర్ స్థాపనతో ప్రారంభమైన ప్రస్థానాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఆ సమయంలో దేశ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇంజినీర్ల అవసరం ఎంతగానో ఉండేదని పేర్కొన్నారు. దేశ శాస్త్ర సాంకేతిక సామర్థ్యాలు పెరిగిన కొద్దీ ఈ సంస్థ పూర్వ విద్యార్థులు అంతరిక్ష, అణుశక్తి కార్యక్రమాల్లో ముందుకు సాగారని తెలిపారు. ఆ తర్వాత సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విస్తరణ దశలో భారత సాఫ్ట్వేర్ పరిశ్రమను బలోపేతం చేయడంతో పాటు, అంతర్జాతీయ స్థాయి ప్రధాన కంపెనీలకు నాయకత్వం వహించారని వివరించారు. ప్రతి యుగంలోనూ దేశ నిర్మాణ బాధ్యతను నెరవేర్చేందుకు ఈ సంస్థ ముందుకు వచ్చిందని, వికసిత్ భారత్ దిశగా దేశం పయనిస్తున్న ప్రస్తుత తరుణంలో.. 75 ఏళ్ల అనుభవం దేశ అభివృద్ధి, ఆవిష్కరణల రంగంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. విద్యార్థులపై తనకు పూర్తి విశ్వాసం ఉందని చెబుతూ.. ‘‘నేటి ఆకాంక్షల భారతదేశం కలలను సాకారం చేయడానికి మీరు ఎలాంటి ప్రయత్నానికైనా వెనుకాడరని నాకు నమ్మకం ఉంది’’ అని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
ఒక వ్యక్తి సామర్థ్యం.. అడ్డంకులను ఎదుర్కొనే ధైర్యంపై ఆధారపడి ఉంటుందే తప్ప, త్వరగా సంతృప్తి చెంది ప్రయత్నాలను విరమించుకోవడంపై ఆధారపడదని ప్రధానమంత్రి వివరించారు. చాలామంది తమ ఆలోచనలకు తామే పరిమితులు విధించుకుంటారని, వీటినే ‘లిమిటింగ్ బిలీఫ్స్’ (పరిమిత ఆలోచనలు) అంటారని పేర్కొన్నారు. ఇవి వారి కలలు, ప్రతిభ, దేశ సామర్థ్యాలను పరిమితం చేస్తాయని, ఏది సాధ్యమో.. ఏది సాధ్యం కాదో ముందుగానే నిర్ణయించుకునేలా చేస్తాయని తెలిపారు. ‘‘మన ఆలోచనల పరిధినే ప్రపంచానికి పరిమితిగా భావిస్తాం’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఇటీవలి సంవత్సరాలలో భారత్ నిరూపించినట్లుగా, దేశాలు కూడా తమ ఆలోచనల పరిమితులను అధిగమించినప్పుడే తమ సామర్థ్యాలను గుర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు. “భారతదేశం ధైర్యంగా చెప్పింది: పరిమితులను అధిగమించండి, అవకాశాలను ఆవిష్కరించండి,” అని శ్రీ ప్రధాని మోదీ అన్నారు.
సెమీకండక్టర్ మిషన్‌ను మరో ఉదాహరణగా ప్రస్తావించిన ప్రధానమంత్రి.. ఈ మిషన్‌ను ప్రారంభించినప్పుడు అనేక ప్రశ్నలు ఎదురయ్యాయని తెలిపారు. ఇతర దేశాలు ఇప్పటికే 50 ఏళ్లుగా సెమీకండక్టర్లను తయారు చేస్తున్నప్పుడు, ఇప్పుడు భారత్ కొత్తగా సాధించేదేమిటని కొందరు ప్రశ్నించారని పేర్కొన్నారు. ‘‘అందుకే నేను సెమీకండక్టర్ మిషన్ గురించి మాట్లాడినప్పుడు.. ఇప్పుడు చాలా ఆలస్యమైందని అన్నారు’’ అని శ్రీ మోదీ గుర్తుచేశారు.
గతంలో ఆలస్యమైందనే కారణంతో భారత్ ఇంకా చేతులు ముడుచుకుని కూర్చోవాలా? అని ప్రశ్నించిన ప్రధానమంత్రి.. ఈ విషయంలో తాను దృఢ సంకల్పంతో ముందుకు సాగానని తెలిపారు. ప్రణాళికల రూపకల్పన కోసం స్వయంగా అధికారులందరినీ ఒకచోట చేర్చి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు గుర్తుచేసుకున్నారు. కేవలం నాలుగేళ్లలోనే దేశవ్యాప్తంగా అనేక సెమీకండక్టర్ తయారీ కేంద్రాలు ప్రారంభమయ్యాయని, భారత్ చిప్‌ల ఎగుమతులను కూడా మొదలుపెట్టిందని పేర్కొన్నారు. ఈ కేంద్రాల్లో అనేకింటికీ ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థులు నాయకత్వం వహిస్తూ, వాటి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ‘‘ఇతర దేశాల్లో ఇప్పటికే ఈ పని జరుగుతోంది కదా.. ఇప్పుడు మనం సెమీకండక్టర్లను ఎందుకు తయారు చేయాలనే ఆలోచనను అంగీకరించి ఉంటే, అసలు ఏమీ జరిగి ఉండేది కాదు’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
అంతరిక్ష రంగాన్ని మరో కీలక ఉదాహరణగా ప్రస్తావించిన ప్రధానమంత్రి.. గతంలో భారత అంతరిక్ష వ్యవస్థ ఇస్రోకే పరిమితమై ఉండేదని తెలిపారు. అందులోకి ప్రవేశించే అవకాశాలు చాలా పరిమితంగా ఉండేవని, ప్రతి ప్రయోగం లేదా మిషన్‌కు ప్రత్యేక విధానం ఉండేదని పేర్కొన్నారు. దీంతో ఇస్రో వెలుపల ఉన్న యువ ప్రతిభావంతులకు అవకాశాలు తక్కువగా ఉండేవని వివరించారు. యువ ఆవిష్కర్తలకు కూడా అవకాశాలు కల్పించాలని సంబంధిత మంత్రిత్వ శాఖకు సూచించి, దేశ అంతరిక్ష రంగాన్ని యువతకు అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థి పవన్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ను స్థాపించి, భారత్ తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగానికి మార్గం సుగమం చేశారని పేర్కొన్నారు. నేడు అనేక అంతరిక్ష అంకుర సంస్థు భారత అంతరిక్ష కార్యక్రమాన్ని వేగవంతం చేస్తూ, ఒకప్పుడు అసాధ్యమనుకున్న వాటిని సుసాధ్యం చేస్తున్నాయని తెలిపారు. ‘‘అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో మీ పూర్వ విద్యార్థులు ఎంతో కీలక పాత్ర పోషించారని గర్వంగా చెప్పగలను’’ అని శ్రీ మోదీ అన్నారు.
రాబోయే రెండు దశాబ్దాలు విద్యార్థుల జీవితాల్లో అత్యంత ఉత్పాదకమైన సంవత్సరాలుగా, భారత అభివృద్ధిలో అత్యంత కీలకమైన కాలంగా నిలవనున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. విద్యార్థులపై దేశం ఎన్నో ఆశలు పెట్టుకుందని తెలిపారు. వారిలో చాలామంది 2047 నాటికి నాయకత్వ స్థానాల్లో ఉంటారని, వారి ప్రతి విజయం దేశానికి ఎంతో ముఖ్యమని అన్నారు. దేశం ఎదుర్కొంటున్న ఏ సవాలును పరిష్కరించడంలో తాము భాగస్వాములు కావాలనుకుంటున్నారో ఎప్పటికప్పుడు తమను తాము ప్రశ్నించుకోవాలని సూచించారు. ‘దేశమే ప్రథమం’ అనే తన మంత్రాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘ఈ ఆలోచనా ధోరణితో మీరు ముందుకు సాగితే, మీకూ కొత్త అవకాశాలు లభిస్తాయి.. దేశానికి కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
గత 75 ఏళ్లుగా ఈ సంస్థ అందించిన విశేష సేవలను ప్రశంసించిన ప్రధానమంత్రి.. వికసిత్ భారత్‌లో ఐఐటీ ఖరగ్‌పూర్ శతాబ్ది వేడుకలు జరుపుకునే సమయానికి మరింత కృషి చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద సూక్తి ‘లేవండి, మేల్కొనండి.. లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి’ అని ఉటంకిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
***