ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 నవంబర్ 21న బిహార్‌లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.15 గంటలకు వైశాలి జిల్లాలోని నితీశ్ సేతును సందర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు వైశాలిలో సుమారు రూ.34,470 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, కొన్నింటిని జాతికి అంకితం చేయడంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా జరిగే సభలో ఆయన ప్రసంగిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, ప్రజలకు అందించే సేవలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను చేపట్టారు. రోడ్డు అనుసంధానం, ఇంధనం, పట్టణ మౌలిక సదుపాయాలు, నీటి పారుదల, విద్య, వైద్యం, రవాణా తదితర కీలక రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి.
గంగానదిపై ప్రత్యేక కేబుల్ సాంకేతికతతో నిర్మించిన వంతెన నితీశ్ సేతును ప్రధానమంత్రి జాతికి అంకితం చేయనున్నారు. సుమారు రూ.4,280 కోట్ల వ్యయంతో ఈ వంతెనను నిర్మించారు. మొత్తం 19.7 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టు.. పాట్నా జిల్లాలోని ఎన్‌హెచ్-22పై ఉన్న కచ్చీ దర్గా నుంచి వైశాలి జిల్లాలోని ఎన్‌హెచ్-322పై ఉన్న బిదుపూర్ను అనుసంధానిస్తుంది. ఇందులో 9.7 కిలోమీటర్ల ప్రధాన వంతెనతో పాటు 10 కిలోమీటర్ల అనుసంధాన రహదారులు ఉన్నాయి.
గంగానదిపై మరో కీలక రహదారి మార్గంగా ఈ వంతెన ఉపయోగపడనుంది. ఇప్పటికే ఉన్న మహాత్మా గాంధీ సేతు, జేపీ సేతులపై వాహనాల రద్దీని తగ్గించడంతో పాటు ఉత్తర, దక్షిణ బిహార్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించనుంది. ముఖ్యంగా రఘోపూర్ దియారా ప్రాంత ప్రజలకు పాట్నాకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు వైద్యం, విద్య వంటి అత్యవసర సేవలను పొందేందుకు వీలవుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు, పారిశ్రామిక వస్తువుల రవాణాకు కూడా ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది. మార్కెట్లకు చేరుకోవడాన్ని సులభతరం చేసి, ప్రాంతీయంగా వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించడం ద్వారా బిహార్ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడనుంది.
ప్రధానమంత్రి రూ.15,600 కోట్లకు పైగా విలువైన పలు కీలక మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ప్రధాన రహదారి ప్రాజెక్టుల్లో ఎన్‌హెచ్-19లోని ఔరంగాబాద్-చోర్దాహా మార్గాన్ని ఆరు లైన్లుగా విస్తరించడం, ఎన్‌హెచ్-227ఎఫ్‌లోని చోర్మా-బైరాగనియా మార్గం, ఎన్‌హెచ్-327లోని ఉమాగావ్-సహర్సా అభివృద్ధి ప్రాజెక్టులు పనులు ఉన్నాయి.
విద్యుత్ రంగంలో 1,320 మెగావాట్ల బక్సర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులో 660 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండో యూనిట్‌ను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. ఇంధన శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యుత్ పంపిణీ, ప్రసార మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా ప్రారంభిస్తారు. వీటిలో రూ.1,130 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన ఆర్డీఎస్ఎస్ నష్టాల తగ్గింపు పనులు తదితర ప్రాజెక్టులు ఉన్నాయి. కాలువలు, గట్ల పునరుద్ధరణ, బలోపేతం చేసే పనులు, నవాడాలోని ఫుల్వారియా డ్యామ్ వద్ద తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టు, కహల్గావ్లో మురుగునీటి పారుదల మౌలిక సదుపాయాలు కూడా ప్రారంభించనున్న ఇతర ప్రాజెక్టుల్లో ఉన్నాయి. విద్యా సంస్థలు, గురుకుల పాఠశాలలు, వైద్య సేవలు, వ్యవసాయం, క్రీడలు, ప్రజా పరిపాలనకు సంబంధించిన భవనాలు, సదుపాయాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులు సాగునీటి సదుపాయాలు, పట్టణ సేవలు మెరుగుపడటంతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావడానికి దోహదపడతాయి.
సుమారు రూ.14,450 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో రూ.3,800 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టనున్న ఎన్‌హెచ్-139డబ్ల్యూలోని సాహెబ్‌గంజ్-అరేరాజ్-బెట్టియా మార్గాన్ని నాలుగు లైన్లుగా విస్తరించే ప్రాజెక్టు, సుమారు రూ.3,350 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పిర్పైంతి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు (3 x 800 మెగావాట్లు) విద్యుత్ తరలింపు ప్రాజెక్టు ప్రధానమైనవి.
బేగుసరాయ్, బిహార్షరీఫ్, పూర్నియా, హాజీపూర్, మోతీహరి, దనాపూర్, ఖగారియా, సమస్తిపూర్, బోధ్‌గయ, సీతామఢి, సహర్సా తదితర పట్టణ ప్రాంతాల్లో మురుగునీటి పారుదల, తాగునీటి సరఫరా ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. కాలువల వ్యవస్థల ఆధునికీకరణ, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఐఐటీ పాట్నా పరిశోధన పార్కు, హాస్టల్, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ విద్యాసంస్థలు, అత్యవసర స్పందన వ్యవస్థ, పోలీసు డేటా కేంద్రానికి సంబంధించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కూడా వీటిలో ఉన్నాయి.
రాష్ట్రంలో పర్యావరణహిత ప్రజా రవాణాకు మరింత ఊతమిస్తూ 100 పీఎం-ఈబస్సులను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద లబ్ధి పొందిన 26,900 మందికి పైగా కుటుంబాలకు గృహప్రవేశ కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. పట్టణ కుటుంబాలకు ఇళ్లను అందించే కార్యక్రమంలో ఇది ఒక ముఖ్యమైన ప్రస్థానంగా నిలవనుంది.
***