ఈరోజు ఉదయం సుష్మా స్వరాజ్ భవన్‌లో సామాజిక న్యాయం, సాధికారతపై జరిగిన శాఖాపరమైన సదస్సు ముగింపు సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
ఈ సదస్సులో సామాజిక సమ్మిళిత్వం, దివ్యాంగుల సాధికారత, మాదకద్రవ్యాల దుర్వినియోగ నివారణ, ప్రజా భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే వినూత్న విధానాలపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు, ఉన్నతాధికారులు చర్చలు నిర్వహించారు.
విస్తృత స్థాయిలో నిర్వహించిన ఈ సదస్సును ప్రధానమంత్రి అభినందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి లక్ష్య స్ఫూర్తిని ఈ సదస్సు ద్వారా వెలువడిన చర్చల ఫలితాలు, కార్యాచరణాంశాలు ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. ఒక రాష్ట్రం సాధించిన అనుభవాలు, నూతన ఆవిష్కరణల నుంచి ఇతర రాష్ట్రాలు నేర్చుకుంటూ, పోటీతత్వంతో కూడిన సహకార సమాఖ్య స్ఫూర్తితో వాటిని అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
జనభాగీదారి ప్రాధాన్యం గురించి ప్రధానమంత్రి వివరించారు. ఎదుగుదల లోపాలు, వాటిని ముందుగానే గుర్తించడంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో సామాజిక భాగస్వామ్యం ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. సంకోచం, సామాజిక వివక్ష పట్ల భయం, అవగాహన లోపం వల్ల చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలలోని లోపాలను గుర్తించలేకపోతున్నారని, సకాలంలో చికిత్స లేదా సహాయం తీసుకోవడానికి వెనకాడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. సామాజిక ఆధారిత విధానం ద్వారా తల్లిదండ్రుల్లోని సంకోచాన్ని తొలగించి, ప్రారంభ దశలోనే చికిత్సను మరింత ఆమోదయోగ్యంగా మార్చవచ్చని తెలియజేశారు. ముఖ్యమైన సందేశాలను సులభంగా, అందరికీ అర్థమయ్యే విధంగా చేరవేయడానికి సాంకేతికతను వినియోగించుకుంటూ, అవగాహన కల్పించడంలో వినూత్న పద్ధతులను అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే దివ్యాంగుల కదలికలను, సౌలభ్యాన్ని మెరుగుపరచడం, క్రీడలు, రోజువారీ కార్యకలాపాల్లో వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన, అందుబాటు ధరల్లో లభించే సహాయక పరికరాలను రూపొందించేలా యువ ఆవిష్కర్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు స్టార్టప్ పోటీలను నిర్వహించవచ్చని కూడా ఆయన సలహా ఇచ్చారు.
నషా ముక్త భారత్ అభియాన్ గురించి కూడా ప్రధానమంత్రి వివరించారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టే ప్రయత్నాలు కేవలం సాధారణ, నామమాత్రపు కార్యక్రమాలకే పరిమితం కాకూడదని స్పష్టం చేశారు. యువతలో అవగాహన కల్పించడానికి, సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి పాఠశాలల్లో వ్యాసరచన, చర్చలు, వక్తృత్వ పోటీలతో పాటు ఇతర కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన సూచించారు. అలాగే, వ్యసనాల బారి నుంచి విజయవంతంగా బయటపడిన వ్యక్తుల అనుభవాలను అందరితో పంచుకోవడం ఎంతో ముఖ్యమని తెలియజేశారు.
నషా ముక్త్ భారత్‌ను సాధించే దిశగా చేపట్టే ప్రయత్నాల్లో సమాజం, ఆధ్యాత్మిక సంస్థలు, విద్యాసంస్థలతో పాటు వివిధ మంత్రిత్వ శాఖల భాగస్వామ్యం మరింత పెరిగేలా దేశవ్యాప్తంగా సమగ్ర విధానాన్ని ఆచరించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంలో సమాజం చురుకైన భాగస్వామిగా మారినప్పుడే ప్రజల ప్రవర్తనలో శాశ్వత మార్పు తీసుకురావచ్చని ఆయన స్పష్టం చేశారు.
ఉమ్మడి జాతీయ లక్ష్య సాధనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఈ సదస్సులో ప్రదర్శించిన సామూహిక నిబద్ధతను… పోటీతత్వంతో కూడిన సహకార సమాఖ్య స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని, తద్వారా సమ్మిళితమైన, సాధికారత కలిగిన ‘వికసిత్ భారత్‘ నిర్మాణానికి కృషి చేయాలన్నారు.
***
Chaired the valedictory session of the Departmental Summit on Social Justice and Empowerment. Key focus areas: Greater Jan Bhagidari in social schemes. Encouraging StartUps to build affordable assistive technologies. A whole-of-society approach towards a Nasha Mukt Bharat. https://t.co/e0HTNYb8hc
— Narendra Modi (@narendramodi) November 19, 2026