Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఢిల్లీలో ఫిక్కీ వార్షిక సర్వసభ్య సమావేశం, వార్షిక సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం

ఢిల్లీలో ఫిక్కీ వార్షిక సర్వసభ్య సమావేశం, వార్షిక సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం


నమస్కారం. ఫిక్కీ అధ్యక్షుడు సోదరుడు అనంత్ గోయెంకా గారూ, ఫిక్కీ సభ్యులూ, పారిశ్రామికాధినేతలూ, ఆవిష్కర్తలూ, సోదరీ సోదరులారా…

గతంలో అనేక సందర్భాలలో ఫిక్కీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనే, వాటిలో భాగస్వామ్యం వహించే అవకాశం నాకు లభించింది. కానీ ఈ రోజు కార్యక్రమం మరింత ప్రత్యేకమైనది. ఫిక్కీని నెలకొల్పి వందేళ్లు పూర్తవుతోంది. ఒక సంస్థ వందేళ్ల పాటు నిరంతరం అప్రమత్తంగా, క్రియాశీలకంగా ఉండడం, మారుతున్న కాలంతోపాటు ముందుకు సాగడం, దేశ ఆర్థిక ప్రయాణంలో క్రియాశీల పాత్ర పోషిస్తూ ఉండడమన్నది చాలా గొప్ప విజయం. గతంలోనూ, ప్రస్తుతమూ ఈ సంస్థతో అనుబంధం ఉన్న వారందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

గత వందేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ ఎన్నో దశలను దాటి వచ్చింది. మనం లైసెన్సు – పర్మిట్ – కోటా రాజ్‌ను చూశాం. జాతీయీకరణ అనే విఫల ప్రయోగాన్నీ చూశాం. ఆ తర్వాత 21వ శతాబ్దంలో భారత ఆర్థిక వ్యవస్థను బలహీనమైన అయిదు ఆర్థిక వ్యవస్థల (ఫ్రజైల్ ఫైవ్) జాబితాలో ఒకటిగా లెక్కించే పరిస్థితి కూడా వచ్చింది.

కానీ గత 12 ఏళ్లలో భారత ప్రజలు, మీరంతా ఎంతో కష్టపడి పనిచేశారు. మన యువత, మన రైతులు, మన కార్మిక సోదరీ సోదరులు, పారిశ్రామిక రంగానికి చెందిన మీరంతా ఈ పరిస్థితిని మార్చేశారు. భారత్ నేడు అత్యంత వేగవంతమైన వృద్ధి రేటును కనబరుస్తోంది. అలాగే మునుపెన్నడూ లేని రీతిలో ప్రజలు పేదరికాన్ని అధిగమిస్తున్నారు.

మిత్రులారా,

ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక మనందరికీ గర్వకారణం. కేవలం 12–13 ఏళ్ల వ్యవధిలోనే 50 కోట్ల మంది భారతీయులు పేదరికాన్ని జయించారని ఆ నివేదిక పేర్కొన్నది.

మిత్రులారా,

1970వ దశకంలో ‘గరీబీ హటావో’ నినాదాన్ని ఇచ్చిన సమయంలో.. నాడు దేశ జనాభానే దాదాపు 50 కోట్లు. నాడే పేదరికాన్ని నిర్మూలించాల్సి ఉండేది. అయితే అప్పటి విధానాల్లోను, దురదృష్టవశాత్తూ వారి ఉద్దేశాల్లోనూ లోపాలున్నాయనడానికి ‘ఫిక్కీ’ కూడా సాక్షిగా ఉంది. దాని గురించి నేను వివరాల్లోకి వెళ్లదలచుకోలేదు.

కానీ మిత్రులారా,

సరైన విధానాలతో పనిచేస్తే, ప్రభుత్వం సరైన సంకల్పంతో ముందుకు సాగితే.. కేవలం 12–13 ఏళ్లలోనే 50 కోట్ల మంది పేదరికాన్ని జయించగలరన్న వాస్తవానికి కూడా ఫిక్కీ నేడు సాక్షిగా నిలిచింది. నేడు భారత్ ముందుకు సాగుతున్న స్థాయి, దేశం పురోగమిస్తున్న మార్గం సరైనదని, కచ్చితమైనదని, దేశ విజయానికి భరోసా ఇస్తుందని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి.

మిత్రులారా,

నేడు భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉంది. భారత్ దాదాపు 7 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతుందని ప్రముఖ సంస్థల అంచనాలు సూచిస్తున్నాయి. అక్టోబరు నెలలో మరో గణాంకం అందరి దృష్టినీ ఆకట్టుకుంది. అక్టోబరు నెలలో భారత వస్తు ఎగుమతులు దాదాపు 50 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారతదేశ చరిత్రలో ఇదే అత్యధిక నెలవారీ వస్తువుల ఎగుమతి గణాంకం. నేను ఇక్కడ మిమ్మల్ని ఇంతలా ప్రశంసిస్తుంటే.. మీరు నిశ్శబ్దంగా కూర్చున్నారు! మూడీస్ రేటింగ్స్, ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్, ఫిచ్ రేటింగ్స్, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి ప్రతి సంస్థ మన వృద్ధి అంచనాలను పైపైకి సవరిస్తున్నాయంటే.. దేశ ప్రదర్శన ఆ స్థాయిలో ఉంది.

మిత్రులారా,

వేల ఏళ్ల కిందటే అత్యంత ముఖ్యమైన సందేశాన్ని మన శాస్త్రాలు అందించాయి: “ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్.” అంటే.. మనల్ని మనమే ఉద్దరించుకోవాలి. మన సామర్థ్యాలను మనమే గుర్తించాలి. మన లోపాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. నిరంతరం మరింతగా మెరుగుపడేందుకు కృషి చేయాలి. నిజాయితీతో కూడిన ఆత్మపరిశీలనతోనే మరో అడుగు ముందుకుపడుతుంది. ముందుకు సాగాలంటే మనం ఎప్పటికప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవడం చాలా అవసరం. ఇది కేవలం వ్యక్తులకే కాదు.. పరిశ్రమలకూ, దేశానికీ కూడా వర్తిస్తుంది. భారతీయ పరిశ్రమలు ఎన్నో గొప్ప విజయాలను సాధించిన తీరును వందేళ్ల ప్రయాణంలో ఫిక్కీ ప్రత్యక్షంగా చూసింది. రాబోయే 20 ఏళ్లలో భారతీయ పరిశ్రమలు ఏం సాధించగలవో నిర్ణయించుకోవాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. వికసిత భారత్, ఆత్మనిర్భర్ భారత్ ప్రయాణంలో ఏ విధంగా మీ సహకారాన్ని మరింతగా పెంచగలరు? మీరు ఇప్పటికే స్థిరపడిన వ్యాపారాలలో కొనసాగడం చాలా సులభం కావచ్చు. అవి స్వల్పకాలిక ప్రయోజనాలను కూడా అందించవచ్చు. కానీ జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పరిశ్రమలు సిద్ధం కావాలి. వనరులనే ఆయుధాలుగా మలుస్తున్న ఈ కాలంలో.. అత్యంత కీలకమైన ఆయా సామర్థ్యాలపై మనం పనిచేయాలి. దేశానికి సురక్షిత భవిష్యత్తును అందించడం మనందరి బాధ్యత. కాబట్టి, మీ అందరికీ ఇదే నా విజ్ఞప్తి: వచ్చే 20 ఏళ్లలో మీరు తీసుకునే ప్రతి దీర్ఘకాలిక పెట్టుబడి నిర్ణయంలోనూ ‘దేశమే ప్రథమం’ అనే సూత్రాన్ని పునాదిగా చేసుకోండి. ఇది దేశాన్ని స్వావలంబన దిశగా నడిపించడమే కాకుండా.. మీ వ్యాపారాల వృద్ధికి కూడా కొత్త అవకాశాలనూ అందిస్తుంది.

మిత్రులారా,

మీరు ఇప్పుడే ఒక డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అది మనల్ని తలెత్తుకునేలా చేస్తుందో లేదా తలదించుకునేలా చేస్తుందో ఇప్పుడు మీరే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టరని నాకు తెలుసు. దీని గురించి ఆలోచించండి. వందేళ్లు గడిచిపోయాయి. కానీ 1930లోనూ గాంధీజీ మీ వద్దకు వచ్చి ఇదే మాట చెప్పారు. ఇన్నేళ్ల తర్వాత కూడా నేను మళ్లీ అదే మాట చెప్పాల్సి వస్తోంది. ఇది మీ విజయమా లేక వైఫల్యమా? నా మాట వినకపోయినా పర్వాలేదు, కనీసం గాంధీజీ మాటయినా వినండి. ఆయన కూడా స్వదేశీ గురించే మాట్లాడారు. నేడు మనం ‘ఆత్మనిర్భర్ భారత్’ అని పిలుస్తున్న దాని గురించే ఆయన కూడా మాట్లాడారు. అయినప్పటికీ, మీరు వందేళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ పరిస్థితులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. అందుకే నేను చెబుతున్నాను.. మీరు రూపొందించిన ఆ డాక్యుమెంటరీలో నా ఈ రెండు వాక్యాలను కూడా చేర్చి, దానిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లండి.

మిత్రులారా,

నేను మీకు ఔషధ పరిశ్రమ ఉదాహరణనే ఇస్తాను. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు. భారతదేశాన్ని ‘ప్రపంచ ఔషధ భాండాగారం’ అని పిలుస్తున్నారు. అయినప్పటికీ, భారత్ ఏటా బిలియన్ల డాలర్ల విలువైన ఏపీఐలు, బల్క్ డ్రగ్స్, డ్రగ్ ఇంటర్మీడియట్లను దిగుమతి చేసుకుంటోంది. మనం ఇప్పటికీ దిగుమతులపైనే ఆధారపడుతున్న ఇలాంటి విభాగాలు వందల సంఖ్యలో ఉన్నాయి. దేశంలోనే ఏయే ముడి పదార్థాలను ఉత్పత్తి చేయవచ్చో మన ఔషధ పరిశ్రమలు అన్వేషించాలి. మనం ఇతర దేశాలతో పోటీ పడాలంటే ఏయే రంగాలలో కొత్త సాంకేతికతలపైనా, భారీ ఉత్పత్తి ప్లాంట్లపైనా పెట్టుబడులు పెట్టాలో ఆలోచించాలి. తయారైన ఔషధాల విషయంలో మనకు ఇప్పటికే బలమైన సామర్థ్యం ఉంది. ఇప్పుడు మనం వాటి తయారీకి అవసరమైన ముడి పదార్థాల విషయంలోనూ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి.

మిత్రులారా,

ఇనుము, ఉక్కు రంగాల్లోనూ ఇలాంటి సవాళ్లే ఉన్నాయి. వేల కోట్ల రూపాయల విలువైన ఇనుప ఖనిజాన్ని భారత్ ఎగుమతి చేస్తోంది. అయినప్పటికీ మనం తయారైన ఉక్కును దిగుమతి చేసుకుంటున్నాం. మనం ఏయే గ్రేడ్ల ఉక్కును దిగుమతి చేసుకుంటున్నామో మన పరిశ్రమ ఆలోచించాలి. తద్వారా వాటిని మనమే స్వయంగా తయారు చేసుకునే సాంకేతికతను అభివృద్ధి చేసుకోవచ్చు. అల్యూమినియం రంగంలో కూడా ఇలాంటి అవకాశాలే ఉన్నాయి. వేల టన్నుల కొద్దీ భారీ బాక్సైట్ నిల్వలు భారత్ వద్ద ఉన్నాయి. అయినప్పటికీ ప్రత్యేక అల్యూమినియం మిశ్రమాలు, ఇతర ఉత్పత్తులను మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఈ ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేసే సామర్థ్యాన్ని మనం పెంపొందించుకోవాలి. భారత్‌లోనే ఉత్పత్తుల విలువను పెంచుకునేలా.. ఖనిజాలకు సంబంధించి ప్రతీ దశలోనూ నైపుణ్యం కూడా మనకు అవసరం. గోధుమలను ఎగుమతి చేసి, రొట్టెలను దిగుమతి చేసుకోవడమేమిటో మీరే చెప్పండి. ఆ ప్రశ్నను మీకు మీరే వేసుకోండి.

మిత్రులారా,

మరో లెక్క కూడా చెబుతాను. భారత్ ఇంత పెద్ద దేశం అయినప్పటికీ.. ప్రపంచ వ్యవసాయ ఎగుమతుల్లో మన వాటా కేవలం రెండు నుంచి రెండున్నర శాతం మాత్రమే. మన కార్పొరేట్ రంగం వ్యవసాయంలో పెట్టుబడి పెట్టడానికి వెనుకాడుతూ, దీనికి దూరంగా ఉండడానికే మొగ్గు చూపుతుంది.

మిత్రులారా,

మనం కలిసికట్టుగా ఈ పరిస్థితిని మార్చాలి. మన ఉత్పత్తుల విలువను పెంచుకోగల, ఆహార శుద్ధి పరిశ్రమతో ముడిపడి ఉన్న ఒక గొప్ప అవకాశంగా దీనిని చూడాలి. గత 12 ఏళ్లలో వ్యవసాయ – ఆహార ఎగుమతుల్లో ప్రాసెస్డ్ ఫుడ్ వాటా 13 శాతం నుంచి 20 శాతానికి పైగా పెరిగింది. మనం ఏం ఉత్పత్తి చేస్తున్నామో, ప్రపంచానికి ఏం అవసరమో గుర్తిస్తూ.. పారిశ్రామిక రంగం నేడు ఏకమై భవిష్యత్తు కోసం ఒక వ్యూహాన్ని, సమగ్ర ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉంది. భారత వ్యవసాయ రంగంలో పెట్టుబడులను పెంచాల్సిందిగా మన పరిశ్రమలను కోరుతున్నాను. నిర్దిష్ట విదేశీ మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని నమ్మకమైన సేకరణ వ్యవస్థలను ఏర్పాటు చేయండి. అక్కడ డిమాండ్ ఉన్న ఉత్పత్తులను అభివృద్ధి చేయండి. ఇది ప్రపంచ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులను దేశానికి గుర్తింపుగా నిలపడానికి వీలు కల్పిస్తుంది.

మిత్రులారా,

వీటితోపాటు రోజువారీ ఇంజినీరింగ్ ఉత్పత్తుల రంగంలోనూ భారత్‌కు అపారమైన అవకాశాలున్నాయి. చేతి పనిముట్లు, విద్యుత్/యంత్ర పనిముట్లకు సంబంధించి ప్రపంచ ఎగుమతుల్లో భారత్ వాటా ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది. ప్రపంచ మార్కెట్‌లో మన ఉనికిని పెంచుకోవడానికి మనం ఈ రంగంలో కృషి చేయవచ్చు. అవసరమైన నాణ్యత, స్థాయిలో తయారీ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి.. చిన్న సంస్థలకు మన భారీ కంపెనీలు తోడ్పాటునందించగలవు. యంత్రాల తయారీ మన కోసం ఎదురుచూస్తున్న మరో రంగం. అక్కడ ఎంతో చేయడానికి అవకాశం ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమైన యంత్రాలను మనం కలిసికట్టుగా తయారు చేయవచ్చు. ప్యాకేజింగ్ పరికరాలు, నీటిపారుదల వ్యవస్థలు, కర్మాగారాలకు సంబంధించిన యంత్రాల కోసం మార్కెట్లను అన్వేషించే సామర్థ్యం మన పరిశ్రమలకు ఉంది. ఈ రంగాల్లో ఇంకా ఏం చేయగలమో మన పరిశ్రమలు అంచనా వేయగలవు.   

మిత్రులారా, 

దేశంలోని రైతులు, చిన్న తరహా పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు, సంపద సృష్టికర్తలు, పన్ను చెల్లింపుదారులను గౌరవించకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందదు. వారిని నిత్యం అవమానిస్తూ ఏ దేశం ప్రగతి సాధించలేదు. ఈ విషయం మీలో కొందరికి తెలిసి ఉండవచ్చు. బహుశా పంకజ్‌ భాయ్‌కు కూడా తెలిసి ఉండొచ్చు. ఒకసారి గుజరాత్‌లో ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన భారీ సమావేశం జరిగింది. అప్పుడే నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాను. పాలన గురించి నాకు పెద్దగా అవగాహన లేని సమయం అది. సుమారు 2001–02లో, అంటే దాదాపు 25 ఏళ్ల క్రితం ఈ సమావేశం జరిగి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఉన్నతాధికారులందరూ హాజరయ్యారు. అప్పుడు నేను వారితో.. “ప్రతి ఒక్కరినీ దొంగలుగా చూడటం ఎప్పుడు మానుకుంటారు? ఇదేం వైఖరి?” అని ప్రశ్నించాను. వారు కూడా దేశం కోసమే పనిచేస్తున్నారు. దేశానికి సేవ చేయాల్సిన బాధ్యత మన ఒక్కరిదేనా? ప్రతి పౌరుడూ దేశానికి సేవ చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికీ గౌరవం దక్కాలి. పరిశ్రమల విషయానికొస్తే, ఇటీవలి సంవత్సరాల్లో వ్యాపార నిర్వహణ సౌలభ్యంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. 2014లో ప్రాథమిక కార్పొరేట్‌ పన్ను రేటు 30 శాతంగా ఉండేది. దాన్ని 22 శాతానికి తగ్గించాం. ప్రస్తుతం భారత్‌లో రూ.12 లక్షల వరకు ఆదాయంపై ఆదాయపు పన్ను లేదు. మీరు చప్పట్లు కొట్టరని నాకు తెలుసు. ఎందుకంటే ఎంత ఇచ్చినా మీకు సంతృప్తి కలగడం లేదనిపిస్తోంది. రూ.12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను నుంచి మినహాయించాను. మరి మీరు మీ ఉద్యోగుల జీతాలు పెంచారా? ఉద్యోగుల సంఖ్యను పెంచారా? లేదు. మీ వైఖరి మాత్రం ఇంకా.. “మోదీజీ, మీరు చేయండి… మేం చూస్తాం” అన్నట్లుగానే ఉంది.

 

అయితే మిత్రులారా, 

ఇంత భారీ ఆదాయపు పన్ను రాయితీ కల్పించడానికి ఎంతో ధైర్యం కావాలి. దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పెరిగింది. పన్ను చెల్లింపుదారుల సొమ్ము వ్యవస్థలో అనవసరంగా నిలిచిపోకుండా ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు, రిఫండ్‌ ప్రక్రియలను సరళీకృతం చేశాం. గతంలో పన్ను రిఫండ్‌ రావడానికి ఎనిమిది నెలలు పట్టేది. ఇప్పుడు వారం రోజుల్లోనే అందుతోంది. వస్తోందా లేదా? కనీసం ఇప్పుడైనా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే మేం చేస్తున్న చర్యలు మీకు ఉపయోగపడుతున్నాయా, లేక అనవసరంగా చేస్తున్నామా అన్నది నాకు అర్థం కావడం లేదు. జీఎస్టీ సంస్కరణల కారణంగా అనేక ఉత్పత్తులపై పన్నులు తగ్గాయి. దీంతో డిమాండు‌ పెరిగి, మన పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరింది.

 

మిత్రులారా, 

గత కొన్నేళ్లలో ప్రపంచంలోని అనేక దేశాలతో భారత్‌ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. ఫిక్కీ ప్రతినిధులు ఎప్పుడైనా కూర్చొని ఈ అంశంపై ఆలోచించారా? ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం అంటే మీ కోసం కొత్త అవకాశాల ద్వారాలు తెరుచుకున్నట్లే. ఆ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మీరు ఏమైనా ప్రణాళికలు రూపొందించారా? లేక ఆ విషయాన్ని కూడా వివరించడానికి నేనే ఇక్కడికి రావాలా?

 

మిత్రులారా, నేను ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నాను 

ఇంతకంటే గొప్ప చారిత్రక అవకాశం మరొకటి ఉండదు. నా ఈ ప్రయత్నాలన్నింటి ద్వారా మీరు ప్రయోజనం పొందకపోతే మరెవరు పొందుతారు? మీరే చెప్పండి. నేను ఇదంతా మీ కోసమే చేస్తున్నాను. మీ ద్వారా దేశానికి మేలు జరగాలన్నదే నా ఆకాంక్ష. మీరు ఇందుకు చాలా కీలకమైన మాధ్యమం. మీ బలాన్ని గుర్తించండి.  మనకు 140 కోట్ల మంది జనాభాతో కూడిన దేశీయ మార్కెట్‌ ఉంది. కొన్నిసార్లు ఇదే మీకు సమస్యగా మారిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఏ వస్తువు తయారు చేసినా దాన్ని కొనేవారు ఎక్కడో ఒకచోట ఉంటారని మీకు తెలుసు. ఒక పెద్ద నగరంలో ఒకరు కొనకపోతే చిన్న నగరంలో మరొకరు కొంటారు. అక్కడా కాకపోతే పెద్ద గ్రామంలో, అదీ కాకపోతే చిన్న గ్రామంలోనైనా కొనుగోలుదారులు ఉంటారు. ‘నా ఉత్పత్తి ఎలాగైనా అమ్ముడవుతుంది’ అనే ధోరణి కొనసాగడానికి వీల్లేదు. కాలం మారింది. మీరు నాణ్యతను మెరుగుపరచుకోవాలి. 140 కోట్ల మంది భారతీయులను కేవలం ఖాయమైన మార్కెట్‌గా భావించకండి. కొన్నిసార్లు ఈ విషయంలో నాకు ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది. నేడు మీతో వాస్తవాలు మాట్లాడుతున్నాను. సాధారణంగా రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఈ రెండు వర్గాల వారూ ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు. మొదటి వర్గంలో బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు ఉంటారు. వారు ఒక భారీ భవనాన్ని నిర్మించి, అందులో ఒకటి రెండు ఫ్లాట్లను తమ వద్దే ఉంచుకుంటారు. కొనుగోలుదారులతో ‘ఇది నా కోసం’ లేదా ‘ఇది నా కుమారుడి కోసం’ అని చెబుతారు. అయితే మీకు నిజంగా కావాలంటే విక్రయిస్తాను అని అంటారు. వెంటనే కొనుగోలుదారుడు.. ఆ ఫ్లాట్‌ అత్యుత్తమ నాణ్యతతో నిర్మించి ఉంటారని భావిస్తాడు. ఇక రెండో వర్గం ఉంది. ఇక్కడ ఈ వర్గానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. వారు వినియోగదారులతో ‘ఇది మంచి నాణ్యత కలిగిన ఉత్పత్తి’ అని చెబుతారు. దేశ ప్రజల గురించి మీరేం అనుకుంటున్నారు? వారికి నాణ్యమైన ఉత్పత్తులు పొందే హక్కు లేదా? ఇప్పటికీ వారికి ‘ఇది అధిక నాణ్యత కలిగినది’ అని ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తోంది. అప్పుడు వినియోగదారులు.. ‘విదేశీయుల కోసం తయారు చేశారంటే తప్పకుండా నాణ్యంగా ఉంటుంది’ అని భావిస్తున్నారు. ఈ ధోరణి మారాలి. నా దేశ ప్రజలూ నాణ్యమైన ఉత్పత్తులకు అర్హులే. గోపాల్‌, ఈ విషయాన్ని తర్వాత అందరికీ స్పష్టంగా వివరించండి. అయితే ఇప్పుడు ఇతర దేశాల్లోనూ ఏర్పడుతున్న అవకాశాలను పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దేశం సంస్కరణల ప్రయాణంలో ముందుకు సాగుతున్న తరుణంలో, మీతో కలిసి అడుగులు వేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది.

 

మిత్రులారా, 

నేడు మీతో నిర్మొహమాటంగా విప్పి మాట్లాడాలనుకుంటున్నాను. కేవలం సంప్రదాయం కోసం నేను ఇక్కడికి రాలేదు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాను. మీ పట్ల నాకున్న గౌరవమే ఇందుకు కారణం. అయితే గత ప్రభుత్వాలతో మీకు ఎదురైన అనుభవాలు ఎంత చేదుగా ఉన్నాయంటే, ఆ ప్రభావాన్ని ఇప్పుడు నేను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇది గతంలో ఉన్న ప్రభుత్వం కాదు. ఇది మీకు స్నేహపూర్వకంగా ఉండే ప్రభుత్వం. స్నేహబంధాలను ఎలా కొనసాగించాలో ఈ ప్రభుత్వానికి తెలుసు. మీరు నా నిజమైన మిత్రులు కాబట్టి, మీ నుంచి ఒక పని కోరుకుంటున్నాను. చేస్తారా? చేస్తారా లేదా? ఎలాంటి సంకోచం, సందేహం లేకుండా మీ అభిప్రాయాలను నేరుగా నాకు రాసి పంపండి. ఇంకా ఎలాంటి సంస్కరణలు అవసరమో స్పష్టంగా తెలియజేయండి. మీ సూచనలను స్వేచ్ఛగా పంపాలని నేను పదేపదే కోరుతూనే ఉంటాను. మీరు ఇచ్చే వంద సూచనల్లో కేవలం రెండింటిపైనే నేను చర్యలు తీసుకోగలిగినా, అది నా లోపమే అవుతుంది. అయినా మీరు మాత్రం మీ సూచనలు చెప్పడానికి వెనుకాడవద్దు. ప్రభుత్వ ద్వారాలు, ప్రభుత్వ ఆలోచనా ధోరణి పూర్తిగా తెరిచే ఉన్నాయి. మరోసారి చెబుతున్నాను.. మన దేశీయ మార్కెట్‌ మనకు సౌకర్యవంతమైన పరిధిగా మారకూడదు. 140 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు కాబట్టి మన ఉత్పత్తులు ఎలాగైనా అమ్ముడవుతాయనే ఆలోచనా ధోరణి నుంచి బయటపడాలి. బదులుగా, ప్రపంచ మార్కెట్లలో పోటీపడేందుకు ఈ దేశీయ మార్కెట్‌ మనకు ఆత్మవిశ్వాసాన్ని అందించాలి. అలాంటి ఆలోచనా ధోరణిని పెంపొందించుకోవాలి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకునేందుకు పెట్టుబడులు పెట్టండి. ప్రత్యేక బృందాలను పంపండి. మార్కెట్‌ అవసరాలపై అధ్యయనాలు నిర్వహించండి. ఎవరికి ఏం కావాలి? దాన్ని ఎలా అందించాలి? అనే విషయాలను తెలుసుకోండి. వినియోగదారులకు సులభంగా ఉపయోగపడే ఉత్పత్తులను అభివృద్ధి చేయండి. ఆయా ప్రాంతాల వినియోగదారులు ఇష్టపడే రంగులు, డిజైన్లలో ఉత్పత్తులను తయారు చేయండి. లేకపోతే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను ఎలా చేజిక్కించుకుంటారో మనందరికీ తెలిసిందే. నేడు మనం పూజించే వినాయక విగ్రహాలు భారత్‌లో తయారయ్యాయో, మరెక్కడైనా తయారయ్యాయో కూడా కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది.

 

మిత్రులారా, 

ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేయడం, అంతర్జాతీయ అవసరాలకు సరిపోయే పంపిణీ వ్యవస్థలను నిర్మించడంపై పెట్టుబడులు పెట్టడం మనకు ఎంతో అవసరం. ప్రపంచ మార్కెట్లలో వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొని, వారిని భారత్‌తో అనుసంధానించేలా మన ఉత్పత్తులు ఉండాలి. ఈ విజ్ఞప్తితో మిత్రులారా, నేను మీతో నా ఆలోచనలను చాలా నిక్కచ్చిగా పంచుకున్నాను. మీ శతాబ్ద కాలపు ప్రస్థానం మీకు ఎన్నో అనుభవాలను, పాఠాలను అందించి ఉంటుందని ఆశిస్తున్నాను. అయితే మరో వందేళ్ల కోసం వేచి చూడకండి. రాబోయే పదేళ్లలో దేశానికి మీరేం అందించగలరో ఆలోచించండి. 1927లో ఏర్పాటైన ఒక సంస్థ... కేవలం 20 ఏళ్లలో దేశానికి స్వాతంత్ర్యం రావడాన్ని చూడగలిగితే, భారత్‌ స్వాతంత్ర్యం సాధించి వందేళ్లు పూర్తిచేసుకునే నాటికి, అంటే రాబోయే 20 ఏళ్లలోనే అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించుకోవాలి. ఆ సంకల్పంతో మనం ముందుకు సాగాలి.

 

మిత్రులారా, 

స్వాతంత్ర్యం అనేది కేవలం ఒక నినాదం కాదు. అదొక నిబద్ధత. అదే విధంగా అభివృద్ధి చెందిన భారత్‌ అనేది నినాదం కాదు.. అదొక సంకల్పం. ఈ సంకల్పాన్ని 140 కోట్ల మంది భారతీయులూ తమ జీవితాల్లో ఆచరించాలి. అలా ఆచరిస్తే మనం విజయం సాధిస్తాం. ఈ స్ఫూర్తితో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

 

మీకు ధన్యవాదాలు. 

***