పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ ఆర్.ఎన్. రవి, ఇక్కడి ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి శ్రీ సువేందు అధికారి, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు శ్రీ సుకాంత మజుందార్, రాష్ట్ర మంత్రి శ్రీ జగన్నాథ్ ఛటోపాధ్యాయ, ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన శ్రీ టి.వి. నరేంద్రన్, శ్రీ సుమన్ చక్రవర్తి, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఇతర ప్రముఖ అతిథులు, సోదరీసోదరులారా!
ఇక్కడికి చేరుకోవడంలో ఆలస్యమైనందుకు ముందుగా మీ అందరినీ క్షమాపణ కోరుతున్నాను. వాతావరణ పరిస్థితుల కారణంగా నేను సమయానికి చేరుకోలేకపోయాను. ఆ తర్వాత రోడ్డు మార్గంలో ప్రయాణించినప్పటికీ ఆలస్యం జరిగింది. నా కోసం మీరంతా వేచి ఉండాల్సి వచ్చింది. మీకు కలిగిన అసౌకర్యానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
ఐఐటీ ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకల సందర్భంగా భారతదేశ గతం, వర్తమానం, భవిష్యత్తు మూడూ ఒకే చోట అనుసంధానమైన దృశ్యం నా కళ్లముందు కనిపిస్తోంది. అత్యంత ప్రతిభావంతమైన, ఉన్నత ఆశయాలు కలిగిన యువతరం ఇక్కడ కొలువుదీరింది. ఈ సంస్థ 75 ఏళ్ల ప్రస్థానాన్ని వేడుకగా జరుపుకోవడంతో పాటు, దాని ఘనమైన వారసత్వాన్ని గౌరవించేందుకు మనమంతా నేడు ఇక్కడ సమావేశమయ్యాం. స్థాపించిన నాటి నుంచి ఈ 75 ఏళ్లలో ఐఐటీ ఖరగ్‌పూర్ ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. ఈ 75 ఏళ్ల కాలంలో భారత్ కూడా ఎన్నో మార్పులకు సాక్షిగా నిలిచింది. ఎడ్లబండ్ల నుంచి బుల్లెట్ రైళ్ల వరకు, ఉత్తరాల నుంచి సామాజిక మాధ్యమాల సందేశాల వరకు దేశం ప్రగతి పథంలో ముందుకు సాగింది. ఈ మార్పులోని ప్రతి దశలోనూ దేశంలోనే తొలి ఐఐటీగా ఐఐటీ ఖరగ్‌పూర్ కీలక పాత్ర పోషించింది.
మిత్రులారా,
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో గడిపిన జీవితానికి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉండిపోతాయి. ఇక్కడున్న పూర్వ విద్యార్థుల్లో చాలామందికి దశాబ్దాలు గడిచినా చెడీస్ వద్ద టీ తాగుతూ సాగించిన చర్చలు ఇంకా మధుర జ్ఞాపకాలుగా గుర్తుండే ఉంటాయని నేను భావిస్తున్నాను. ఇతర విద్యాసంస్థల్లో హాస్టళ్లు ఉంటాయి. కానీ ఇక్కడ వాటిని ‘హాల్స్’ అని పిలుస్తారు. ప్రతి విద్యార్థికి తన హాల్ పట్ల ఎంతటి గర్వం ఉంటుందో నాకు తెలుసు. ఇక్కడికి రాకముందు దీపావళి వేడుకలకు సంబంధించిన కొన్ని ఫొటోలను నాకు చూపించారు. మీరంతా ఇప్పుడే దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో దీపావళి వేడుకలకు ఒక ప్రత్యేకమైన ఉత్సాహం ఉంటుందని నాకు చెప్పారు. ఇక్కడి దీపాలంకరణకు ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంది. వివిధ హాల్స్ మధ్య జరిగే పోటీ ఈ వేడుకలకు మరింత ప్రత్యేకతను తీసుకొస్తుంది. ఈ ఏడాది ఏ హాల్ గెలిచింది? వారు ఎంత గర్వంగా చెబుతున్నారో చూడండి. విజేతలకు అభినందనలు. విజేతలే చప్పట్లు కొట్టుకోకపోతే, వారి కోసం ఇంకెవరు చప్పట్లు కొడతారు?
మిత్రులారా,
బెంగాల్ గడ్డ ఆలోచనలకు బలాన్నిచ్చిన నేల. జాతీయోద్యమాలకు పురుడు పోసిన భూమి. ఈ సంస్థ కూడా ఒకప్పుడు స్వాతంత్య్ర సమరయోధులను నిర్బంధించిన శిబిరం ఉన్న ప్రదేశంలోనే ఏర్పాటైంది. ఒక్కసారి ఊహించండి.. ఇక్కడ నిర్బంధంలో ఉన్న స్వాతంత్య్ర సమరయోధులు రోజంతా ఎలాంటి చర్చలు జరిపి ఉంటారు? వారి మనసుల్లో ఎలాంటి ఆలోచనలు మెదిలి ఉంటాయి? ఆ కాలంలో వారి జీవితం, ఆలోచనలు, కార్యకలాపాల ప్రతిధ్వనులు ఇప్పటికీ ఇక్కడి వాతావరణంలో ఒక మంత్రంలా మార్మోగుతూ, మీ అందరికీ స్ఫూర్తినిస్తున్నాయేమో! దశాబ్దాల క్రితం ఈ నిర్బంధ శిబిరాలు స్వపరిపాలనను కోరుకున్న, భారతదేశం అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించిన భారతీయుల అజేయ సంకల్పానికి, ధైర్యసాహసాలకు సాక్షిగా నిలిచాయి. నేడు అదే నేలపై నూతన రూపంలో సరికొత్త ఉత్సాహంతో రూపుదిద్దుకున్న మన ఐఐటీ, ఆత్మనిర్భర్ భారత్‌కు బలాన్నిచ్చే ఆవిష్కరణలు, ఆలోచనలతో యువతను తీర్చిదిద్దుతోంది. ఒకప్పుడు స్వపరిపాలన కోసం తపించిన ఈ నేల ఇప్పుడు స్వావలంబన సంకల్పాన్ని ప్రతిబింబిస్తోంది. అప్పట్లో స్వాతంత్య్రం ఒక కల. నేడు భవిష్యత్తును నిర్మించుకునే అవకాశం మన ముందుంది. ఆశయం నుంచి స్వావలంబన దిశగా సాగుతున్న ఈ ప్రయాణమే వికసిత్ భారత్ నిర్మాణానికి అసలైన శక్తి.
మిత్రులారా,
ఐఐటీ ఖరగ్‌పూర్ తన ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి కొద్దికాలమే అయింది. దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు కూడా ఇంకా జరగలేదు. ఆ సమయంలో దేశ పారిశ్రామిక రంగం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇంజినీర్ల అవసరం ఎంతో ఉంది. దేశ శాస్త్ర, సాంకేతిక సామర్థ్యాలు విస్తరిస్తున్న కొద్దీ, ఇక్కడి నుంచి పట్టభద్రులైన వారు మన అంతరిక్ష, అణుశక్తి కార్యక్రమాల్లో కీలకంగా పాలుపంచుకున్నారు. ఆ తర్వాత సమాచార సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొత్త అవకాశాలు వెల్లివిరిశాయి. ఈ సంస్థ నుంచి వచ్చిన యువత భారత సాఫ్ట్వేర్ రంగానికి బలాన్నిచ్చారు. ప్రపంచంలోని ప్రముఖ సంస్థల్లో కీలక బాధ్యతలు చేపట్టి వాటి అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ప్రతి కాలంలోనూ ఈ సంస్థ ముందుకొచ్చి, దేశ నిర్మాణంలో తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించింది. నేడు వికసిత్ భారత్ లక్ష్యంతో మనం ముందుకు సాగుతున్న తరుణంలో, 75 ఏళ్లుగా ఐఐటీ ఖరగ్‌పూర్ సమకూర్చుకున్న అనుభవం దేశ అభివృద్ధికీ, ఆవిష్కరణల రంగంలో భారత్ సామర్థ్యాన్ని పెంపొందించడానికీ ఎంతగానో దోహదపడుతుంది. నేటి ఆకాంక్షల భారతదేశం కలలను సాకారం చేయడంలో మీరు ఎలాంటి లోటూ రానివ్వరని నాకు పూర్తి విశ్వాసం ఉంది.
మిత్రులారా!
సవాళ్లను మనం ఎంత ధైర్యంగా ఎదుర్కొంటామన్నదానిపైనే మన నిజమైన సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. చాలామంది నన్ను సవాళ్ల గురించి అడుగుతుంటారు. వారికి నేను చెప్పేది ఒక్కటే.. సవాళ్లను సవాలు చేయకుండా ఉండలేని స్వభావం నాది.
మిత్రులారా!
మనం సవాళ్లను సవాలు చేస్తున్నామా? లేక చాలా త్వరగా సంతృప్తి చెంది, అక్కడితో ఆగిపోతున్నామా? అన్నదే అసలు ప్రశ్న. చాలాసార్లు కొందరు తమ ఆలోచనలకు తామే పరిమితులు విధించుకుంటారు. తమకు తామే హద్దులు నిర్ణయించుకుంటారు. దీన్నే ‘పరిమిత ఆలోచనా ధోరణి’ అంటారు. అసలు ఈ పరిమిత ఆలోచనా ధోరణి అంటే ఏమిటి? ఇది మన కలలకు హద్దులు విధిస్తుంది. మన ప్రతిభను కట్టడి చేస్తుంది. మన దేశ సామర్థ్యాలను కూడా పరిమితం చేస్తుంది. ఏది సాధ్యమో, ఏది సాధ్యం కాదో అన్నది మనకు మనమే నిర్ణయించుకుంటాం. చాలామంది ‘లేదు, ఇది సాధ్యం కాదు’ అనే మాటతోనే మొదలుపెడతారు. ఇలాంటి నిర్జీవమైన ఆలోచనా ధోరణితో జీవించేవారు జీవితాన్ని నిజమైన అర్థంలో ఆస్వాదించలేరు, మిత్రులారా! చివరికి మన ఆలోచనలకు మనమే విధించుకున్న హద్దులనే, మన ప్రపంచానికి ఉన్న హద్దులుగా భావిస్తుంటాం.
మిత్రులారా!
దేశాలు కూడా తమ ఆలోచనా పరిధులను దాటినప్పుడే తమ అసలైన సామర్థ్యాన్ని గుర్తిస్తాయి. ఇటీవలి సంవత్సరాలలో భారతదేశం సరిగ్గా ఇదే చేసి చూపించింది. భారత్ ఎంతో ఆత్మవిశ్వాసంతో “పరిమితులను ఛేదించండి.. అవకాశాలను అందిపుచ్చుకోండి” అని ప్రకటించింది. నేను మీకు కొన్ని ఉదాహరణలు చెబుతాను, ఒక్కసారి ఆలోచించండి. సుమారు ఇరవై ఏళ్ల క్రితం వరకు మన దేశంలో పేదరికాన్ని ఒక శాశ్వత సమస్యగా భావించేవారు. ఐదు దశాబ్దాల క్రితం ఎర్రకోట సాక్షిగా పేదరిక నిర్మూలన నినాదాలు చేశారు. కానీ ఆ తర్వాత విధానపరమైన స్థాయిలో ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడల్లా యావత్ వ్యవస్థ కేవలం ఫైళ్లు తయారు చేసి వాటిపైనే కూర్చుండిపోయేది (ఫైళ్లను పెండింగ్‌లో పెట్టేది).
మిత్రులారా,
పేదరికాన్ని ఎప్పటికీ నిర్మూలించలేమనే భావన అందరిలో ఉండటమే ఇందుకు కారణం. ‘‘జనాభా చాలా ఎక్కువగా ఉంది... పరిస్థితులు ఎప్పటికీ ఇలాగే ఉంటాయి’’ అని అనుకునేవారు. పేదరిక నిర్మూలనకు సరైన విధానాలను అమలు చేసే ధైర్యాన్ని కూడా ఎవరూ చూపించలేదు.
మిత్రులారా,
మేం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉంది. ఎర్రకోట నుంచి నేను ప్రసంగిస్తూ... పేదల కోసం మరుగుదొడ్లు నిర్మిస్తానని ప్రకటించాను. పార్లమెంటులో కొందరు దీనిపై ఎగతాళి చేశారు. ‘‘ఎర్రకోట నుంచి మరుగుదొడ్ల నిర్మాణం గురించి మాట్లాడుతున్న ఈయన ఎలాంటి ప్రధానమంత్రి?’’ అని ప్రశ్నించారు. పేద కుటుంబానికి, పేద తల్లులు, సోదరీలకు మరుగుదొడ్డి ఎంత ముఖ్యమో అలాంటి వారు అర్థం చేసుకోలేకపోయారు. ఇటువంటి ఆలోచనా ధోరణి కారణంగా దేశం అనేక కనీస సౌకర్యాలకు దూరమైంది. గత 12 ఏళ్లలో మేం ఈ ఆలోచనా ధోరణిని మార్చాం. పేదలకు సాధికారత కల్పించాం. ‘సాధికారత కోసం శక్తినివ్వడం’ అనేది నా జీవితానికి మార్గదర్శక సూత్రంగా ఉంది. పేదలకు శక్తినిచ్చి, వారిని బలోపేతం చేశాం. వారి జీవన సౌలభ్యం కోసం పలు పథకాలను ప్రారంభించాం. వాటి ఫలితాలను నేడు దేశం చూస్తోంది. ఇటీవల విడుదలైన ప్రపంచ బ్యాంకు నివేదికను మీరు చదివి ఉంటారు లేదా విని ఉంటారు. కేవలం 12 నుంచి 13 ఏళ్లలోనే భారత్‌లో 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.
మిత్రులారా,
ఇది చిన్న మార్పేమీ కాదు. ‘పరిమితులను ఛేదించాలి’ అనే ఆలోచనా ధోరణి ఫలితమే ఇది.
మిత్రులారా,
మరో ఉదాహరణ చెబుతాను. నేను సెమీకండక్టర్ మిషన్‌ను ప్రారంభించినప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తాయి. ‘‘ఇప్పుడు ఈ మిషన్ అవసరం ఏముంది? ఇతర దేశాలు ఇప్పటికే సెమీకండక్టర్లను తయారు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గత 50 ఏళ్లుగా సెమీకండక్టర్ల తయారీ జరుగుతోంది. ఇప్పుడు మనం సెమీకండక్టర్లను తయారు చేయడం వల్ల ఏం ప్రయోజనం?’’ అని ప్రశ్నించారు. ఇదే ఆలోచనలో ఉన్న పరిమితికి నిదర్శనం.
మిత్రులారా,
యాభై ఏళ్ల క్రితమే ఒక సంస్థ సెమీకండక్టర్ల తయారీ కోసం భారత్‌కు వచ్చిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. అయితే, ఆ సంస్థకు వాస్తవంగా ఎర్రజెండా చూపించి వెనక్కి పంపించారు. ఈ విషయం చెబితే ఎవరూ చప్పట్లు కొట్టరని నాకు తెలుసు. ఎర్రజెండాలు ఊపిన వారి పనే అది. నేను సెమీకండక్టర్ మిషన్ గురించి మాట్లాడినప్పుడు కూడా అప్పటికే చాలా ఆలస్యమైందని కొందరు అన్నారు.
మిత్రులారా,
కానీ నేను దృఢ సంకల్పంతో ఉన్నాను. ‘‘ఆలస్యమైనా సరే... భారత్ ఇంకా చేతులు ముడుచుకుని కూర్చోవాలా?’’ అని ప్రశ్నించాను. మేం పనిని ప్రారంభించాం. ప్రణాళికల రూపకల్పన కోసం అధికారులతో కలిసి స్వయంగా పనిచేశాను. నేడు కేవలం నాలుగేళ్లలోనే దేశంలో అనేక సెమీకండక్టర్ తయారీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. భారత్ చిప్‌ల ఎగుమతులను ప్రారంభించింది. మీ సంస్థకు చెందిన పూర్వ విద్యార్థుల్లో చాలామంది ఈ కేంద్రాలను నిర్వహిస్తూ, నాయకత్వం వహిస్తున్నారు. వాటి నిర్వహణ, అమలులో కీలక బాధ్యతలు చేపడుతున్నారు. నన్ను నమ్మండి… మీకు ప్రతిచోటా అవకాశాలు ఉన్నాయి. చిప్‌ల నుంచి నౌకల వరకు ప్రతిదీ ఇక్కడే తయారవుతుంది. మీలాంటి యువతే వాటిని తయారు చేస్తారు. ఒకసారి ఆలోచించండి.. ఇతరులు ఇప్పటికే ఈ పని చేస్తున్నారు, మనం ప్రయత్నించకూడదనే ఆలోచనను అంగీకరించి ఉంటే, ఇవేవీ సాధ్యమయ్యేవి కావు.
మిత్రులారా,
మరో బలమైన ఉదాహరణ చెబుతాను. అదే అంతరిక్ష రంగం. గతంలో ఇస్రోలో పరిమిత అవకాశాలు ఉండేవి. ఆ సంస్థలోకి ప్రవేశించడమే చాలా కష్టంగా ఉండేది. ఏదైనా ప్రయోగం లేదా కొత్త మిషన్ చేపట్టాలంటే కఠినమైన విధానాన్ని అనుసరించాల్సి వచ్చేది. ఇస్రో వెలుపల ఉన్న యువతకు అవకాశాలే ఉండేవి కావు. ఈ రంగంలో మన యువ ఆవిష్కర్తలకు కూడా అవకాశం కల్పించాలని నేను సంబంధిత మంత్రిత్వ శాఖకు సూచించాను. భారత అంతరిక్ష రంగాన్ని దేశ యువతకు అందుబాటులోకి తెచ్చాం. నేడు ఏం జరిగిందో చూడండి. ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థి పవన్.. స్కైరూట్ ఏరోస్పేస్ ద్వారా భారత్ తొలి ప్రైవేటు రాకెట్‌ను ప్రయోగించిన ఘనతను దేశానికి అందించారు. నేడు ఇలాంటి అనేక అంతరిక్ష అంకుర సంస్థలు భారత అంతరిక్ష కార్యక్రమాన్ని కొత్త వేగంతో ముందుకు తీసుకెళ్తున్నాయి. ఒకప్పుడు ఇవన్నీ అసాధ్యమనిపించేవి. నేడు అవి సాధ్యమయ్యాయి. వాస్తవ రూపం దాల్చాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో మీ పూర్వ విద్యార్థులు ఎంతో కీలక పాత్ర పోషించారని గర్వంగా చెప్పగలను.
మిత్రులారా,
మీ అందరిపై దేశం ఎన్నో ఆశలు పెట్టుకుంది. రాబోయే రెండు దశాబ్దాలు మీ జీవితంలో అత్యంత ఉత్పాదకమైన సంవత్సరాలుగా నిలవనున్నాయి. 2047 నాటికి మీలో చాలామంది నాయకత్వ స్థానాల్లో ఉంటారు. ఈ సంవత్సరాలే భారత అభివృద్ధికి అత్యంత కీలకమైనవి కూడా. అందువల్ల, మీ ప్రతి విజయం దేశానికి ఎంతో ముఖ్యమైనది. దేశం ఎదుర్కొంటున్న ఏ సవాలును పరిష్కరించడంలో మీరు భాగస్వాములు కావాలనుకుంటున్నారో ఎప్పటికప్పుడు మీకు మీరు ప్రశ్నించుకోవాలి. మిత్రులారా.. నా మంత్రాన్ని గుర్తుంచుకోండి.. దేశమే ప్రథమం. ఈ ఆలోచనా ధోరణితో మీరు ముందుకు సాగితే, అది మీకు కొత్త అవకాశాలను కల్పించడమే కాకుండా, దేశానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
మిత్రులారా,
గత 75 ఏళ్లలో మీరు అసాధారణమైన కృషి చేశారు. ఇప్పుడు ఐఐటీ ఖరగ్‌పూర్ శతాబ్ది వేడుకలను అభివృద్ధి చెందిన భారత్‌లో జరుపుకునేలా ముందుకు సాగాలనే దృఢ సంకల్పంతో పనిచేయాలి. 1925–27 సంవత్సరాల్లో ఇదే నేలపై జైలు శిక్ష అనుభవించిన స్వాతంత్ర్య సమరయోధులు దేశానికి స్వాతంత్ర్యం సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇరవై ఏళ్లలోనే ఆ లక్ష్యాన్ని సాధించారు. నేడు ఇదే ప్రదేశం నుంచి మరో ప్రతిజ్ఞ చేద్దాం. రాబోయే ఇరవై ఏళ్లలో అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మిద్దాం. మనం ఆ లక్ష్యాన్ని సాధిస్తాం. ఇందుకోసం మనల్ని మనం పూర్తిగా అంకితం చేసుకుని, అలుపెరగకుండా కృషి చేద్దాం. నేడు నేను బెంగాల్ గడ్డపై ఉన్నాను కాబట్టి, స్వామి వివేకానంద చెప్పిన మాటలతో నా ప్రసంగాన్ని ముగిస్తాను.. ‘లేవండి, మేల్కొనండి... లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి’. మరోసారి ఈ ప్రత్యేక సందర్భంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
చాలా ధన్యవాదాలు.
నమస్కారం.
***
There are no limits to what young minds can achieve. Speaking at the Platinum Jubilee celebrations of IIT Kharagpur. @IITKgp https://t.co/VkB3UO2Rkn
— Narendra Modi (@narendramodi) November 21, 2026
आज जब हम विकसित भारत के लक्ष्य के साथ आगे बढ़ रहे हैं तो IIT खड़गपुर का 75 वर्षों का अनुभव देश के विकास में, देश के innovation profile में बहुत बड़ी भूमिका निभाने वाला है: PM @narendramodi at Platinum Jubilee celebrations of @IITKgp
— PMO India (@PMOIndia) November 21, 2026
राष्ट्र भी अपनी क्षमताओं को तभी पहचानते हैं जब वे अपनी सोच की सीमाओं को तोड़ते हैं। पिछले कुछ वर्षों में भारत ने यही करके दिखाया है। भारत ने डंके की चोट पर कहा... Break the Limits. Unlock the Possibilities: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 21, 2026
Nation First... जब आप इस mindset से आगे बढ़ेंगे तो निश्चित ही, ये आपके लिए भी नए अवसर लेकर आएगा और देश को भी बहुत लाभ होगा: PM @narendramodi at @IITKgp Platinum Jubilee celebrations
— PMO India (@PMOIndia) November 21, 2026