షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) తొలి నాగరిక సంభాషణ వేదికను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు న్యూఢిల్లీలోని పురానా ఖిలాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎస్సీఓ సభ్య దేశాల నుంచి హాజరైన ప్రముఖులు, మంత్రులు, రాయబారులు, హైకమిషనర్లు, పండితులు, కళాకారులు, ఇతర అతిథులకు ఆయన స్వాగతం పలికారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అశాంతికి సంబంధించిన చర్చలు ప్రధానంగా సాగుతున్న ప్రస్తుత తరుణంలో నాగరికతల మధ్య సంబంధాలపై సంభాషణ జరగడం ఎంతో ప్రాధాన్యత కలిగిన విషయమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రపంచ శాంతికి సాంస్కృతిక అనుబంధమే అత్యంత బలమైన భరోసా అని ఆయన అన్నారు. షాంఘై సహకార సంస్థ 25వ వార్షికోత్సవం సందర్భంగా, భద్రత, ఆర్థిక వ్యవస్థ, అనుసంధాన రంగాల్లో పెరుగుతున్న సహకారానికి ఈ వేదిక మరింత బలాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు.“మన ఉమ్మడి నాగరికతా అనుభవాలు ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తాయి” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పురానా ఖిలా ప్రాంగణం మహాభారత కాలం నాటిదని చరిత్రకారులు భావిస్తున్నారని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ చారిత్రక ప్రదేశంలో ప్రదర్శించిన అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్సాహభరితమైన వేద మంత్రోచ్ఛారణలు, బౌద్ధ తత్వశాస్త్ర వివరణలు, హనుమంతుడి యాత్రను చిత్రించే ప్రదర్శనలు భారతీయ సంస్కృతిని చాటిచెప్పాయని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో, భౌగోళిక, రాజకీయ సరిహద్దులకు అతీతమైన ప్రేమ, ఐక్యత, మానవ సంక్షేమం వంటి విశ్వజనీన సందేశాలను ఈ కార్యక్రమాలు ప్రపంచానికి అందించాయని అన్నారు.“మీరందరూ ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించడంతో పాటు, దీనిని చరిత్రలో నిలిచిపోయేలా చేయబోతున్నారు. భవిష్యత్తు తరాలు మీ అందరినీ గుర్తుంచుకునేలా ఒక నూతన సంప్రదాయానికి కూడా ఈ కార్యక్రమం పునాది వేయబోతోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం సింధు లోయ నాగరికత, మెసొపొటేమియా మధ్య సాగిన వాణిజ్య సంబంధాలు మొదలుకుని భారత్, చైనా, మధ్య ఆసియా, యూరేషియా ప్రాంతాలను అనుసంధానించిన సిల్క్ రూట్, ఇతర వాణిజ్య మార్గాల వరకు శతాబ్దాలుగా కొనసాగుతున్న అంతర్జాతీయ సహకారం, ప్రజల మధ్య సంబంధాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ మార్గాల ద్వారా వ్యాపారులు, పండితులు, యాత్రికులు, ఫాహియాన్, హుయాన్ త్సాంగ్ (జువాన్జాంగ్), యిజింగ్, కూచాలో జన్మించిన కుమారజీవ వంటి బౌద్ధ సన్యాసులతో పాటు నలంద వంటి విద్యాసంస్థలు, కూచా, దున్హువాంగ్ వంటి కేంద్రాలు ఆలోచనలు, భాషలు, బౌద్ధ గ్రంథాల మార్పిడి ద్వారా నాగరికతలను సుసంపన్నం చేశాయని ఆయన వివరించారు. ఈ విధంగా సాంస్కృతిక సంభాషణల శాశ్వత శక్తిని ప్రధానమంత్రి వివరించారు. “సామ్రాజ్యాలు ప్రపంచ పటాలను మార్చి ఉండవచ్చు. కానీ నాగరికతల మధ్య సంభాషణలు ప్రపంచ ఆలోచనా విధానాలను మార్చడమే కాకుండా, వాటిని మరింత సుసంపన్నం చేశాయి” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
విజ్ఞానం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరే క్రమంలో దాని వ్యక్తీకరణ రూపం మారవచ్చుగానీ, అది అందించే వెలుగు మాత్రం ఎప్పటికీ చెక్కుచెదరదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారతదేశానికి చెందిన పంచతంత్ర కథలు పర్షియన్, అరబిక్ భాషల్లోకి ‘కలీలా వ దిమ్నా’ పేరుతో అనువాదమై, తరతరాలుగా చిరస్థాయిగా నిలిచిన విషయాన్ని ఆయన ఉదహరించారు. అలాగే రామాయణం ఆగ్నేయాసియా దేశాల స్థానిక సంస్కృతి, ప్రదర్శన కళలు, సాహిత్యాన్ని సుసంపన్నం చేసిందని, కంబోడియాలో ‘రీమ్కేర్’గా ప్రసిద్ధి చెందిందని వివరించారు. “విజ్ఞానం ఏ రూపంలో ఉన్నా, అది పంచేది వెలుగును మాత్రమే” అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
విజ్ఞానశాస్త్రం, గణితశాస్త్ర రంగాల్లో విభిన్న సంస్కృతుల మధ్య విజ్ఞాన మార్పిడి ప్రాధాన్యతను ప్రధానమంత్రి వివరించారు. భారతీయ గణిత శాస్త్రవేత్త బ్రహ్మగుప్తుడి గణిత సిద్ధాంతాలు బాగ్దాద్కు చేరిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. “అక్కడ అల్-ఖ్వారిజ్మీ వంటి పండితులు గణితశాస్త్ర పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
వాస్తుశిల్పం, సంగీత రంగాల్లో దేశాల మధ్య ఉన్న ఉమ్మడి వారసత్వాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. మధ్య ఆసియాలోని ‘మఖామ్’ సంగీత సంప్రదాయానికీ, భారతీయ ‘రాగ’ సంప్రదాయానికి మధ్య ఉన్న సంబంధాలను, సూఫీ ప్రభావాలతో భారత్లో ఖవ్వాలీ సంగీతం మరింత సుసంపన్నమైన తీరును ఆయన వివరించారు. సమర్కండ్, హెరాత్ ప్రాంతాల్లో అభివృద్ధి చెందిన మధ్య ఆసియా ఉద్యానవన సంప్రదాయాలు భారతదేశంలోని చార్బాగ్ ఉద్యానవన నిర్మాణ శైలిని ప్రభావితం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇటువంటి సాంస్కృతిక పరస్పర మార్పిడి నిరంతరాయంగా కొనసాగేందుకు బహిరంగ సంభాషణలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. “ఈ పరస్పర మార్పిడి నేటికీ స్వేచ్ఛగా, నిరంతరాయంగా కొనసాగుతోంది. దీనిని కొనసాగించడంలో ఈ సదస్సు, ఇటువంటి కార్యక్రమాల పాత్ర ఎంతో కీలకం” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
21వ శతాబ్దపు సాంకేతిక పరిజ్ఞానం సాంస్కృతిక అనుసంధానానికి గతంలో ఎన్నడూ లేనన్ని అవకాశాలను కల్పించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మన పూర్వీకులు ఒకప్పుడు నెలల తరబడి ప్రయాణించాల్సి వచ్చిన ప్రాంతాల ప్రజలు, నేడు కేవలం కొన్ని క్షణాల్లోనే పరస్పరం అనుసంధానం కాగలుగుతున్నారని వివరించారు. డిజిటల్ వేదికల ద్వారా విజ్ఞానాన్ని పంచుకోవడం, సాంస్కృతిక మార్పిడి, అంతర్జాతీయ సహకారం మరింత సులభతరమయ్యాయని తెలిపారు. ఈ సాంకేతిక అభివృద్ధి అందిస్తున్న అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. “ఎస్సీఓ సభ్య దేశాలు ఈ నూతన అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
మ్యూజియంలు, గ్రంథాలయాలు, భాండాగారాల్లో భద్రంగా ఉన్న వేల సంవత్సరాల వారసత్వ సంపదను పరిరక్షించి, అందరితో పంచుకోవడంపై కార్యక్రమానికి హాజరైన అతిథులకు ప్రధానమంత్రి పలు సూచనలు చేశారు. ప్రాచీన తాళపత్ర గ్రంథాలు, అరుదైన పుస్తకాలు, చారిత్రక పత్రాలు, పురావస్తు వస్తువులు వంటి అపురూప సంపదను భావితరాలకు అందించేందుకు ప్రాచీన గ్రంథాల డిజిటలీకరణ, అనువాద కార్యక్రమాల్లో పరస్పరం సహకరించుకోవాలని ప్రతిపాదించారు. అలాగే మన ఉమ్మడి చరిత్రపై సంయుక్త పరిశోధనా ప్రాజెక్టులను చేపట్టాలని సూచించారు. “దీనివల్ల ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఉన్న యువత అయినా మరో దేశ సాంస్కృతిక వారసత్వాన్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకోగలుగుతారు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
నేటి కాలంలో వనరులు విస్తృతంగా అందుబాటులోకి వచ్చినప్పటికీ అనేక గొప్ప సాహిత్య, మేధోపరమైన రచనలు ఇప్పటికీ పరిమిత సంఖ్యలోని భాషలకే అందుబాటులో ఉన్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వాటిని మరింత మందికి చేరువ చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు.“కృత్రిమ మేధ (ఏఐ) సహాయంతో వాటి అనువాద ప్రక్రియకు కొత్త ఊపునివ్వవచ్చు” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
సాంస్కృతిక పరస్పర మార్పిడికి మరిన్ని అవకాశాలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా వివరించారు. మ్యూజియంలు, సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రదర్శనలు నిర్వహించడం, విశ్వవిద్యాలయాల మధ్య పండితులు, పరిశోధకుల పరస్పర మార్పిడి, సిల్క్ రూట్, బౌద్ధ వారసత్వ ప్రదేశాలను అనుసంధానిస్తూ వారసత్వ పర్యాటక మార్గాలను అభివృద్ధి చేయడం, సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించడం, ఉమ్మడి సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించడం, కళాకారుల మార్పిడి కార్యక్రమాలు చేపట్టడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెంపొందిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. “ఈ ప్రయత్నాల ద్వారా మన దేశాల ప్రజలకు పరస్పరం ఒకరి సంస్కృతిని ఒకరు మరింత దగ్గరగా తెలుసుకుని, అర్థం చేసుకునే అవకాశాలు లభిస్తాయి” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
నేటి నాగరికతల మధ్య సంభాషణను రాబోయే దశాబ్దాల్లో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత సాంకేతిక పరిజ్ఞానంపై మంచి అవగాహన కలిగి, ప్రపంచాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న యువతరంపైనే ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. యువత వివిధ భాషలు, సాహిత్యం, సాంస్కృతిక సంప్రదాయాలతో పరిచయం పెంచుకునేందుకు మరిన్ని అవకాశాలు కల్పించాలని, ఈ కార్యక్రమాల్లో స్థానిక కళాకారులు, చేతివృత్తుల నిపుణులను కూడా భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. “మన యువ కళాకారులు, రచయితలు, చలనచిత్ర నిర్మాతలు డిజిటల్ మాధ్యమాలు, ఇతర సృజనాత్మక వేదికల ద్వారా మన ఉమ్మడి వారసత్వాన్ని భావితరాలకు చేరవేయగలరు” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే ‘వసుధైక కుటుంబం’ భావనతో భారతీయ క్రతువుల ముగింపులో సకల జీవుల మధ్య సద్భావన, విశ్వ కల్యాణం కోరుతూ ప్రార్థనలు జరుగుతాయని ప్రధాని గుర్తుచేశారు. వ్యక్తిగత, దేశ శ్రేయస్సు ప్రపంచ సామరస్యంతో ముడిపడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. “పరస్పర సద్భావనను మాత్రమే ప్రపంచ శ్రేయస్సుకు మూలస్తంభంగా మేము పరిగణిస్తాము” అని మోదీ స్పష్టం చేశారు.
పరస్పర సద్భావన అనేది ఉమ్మడి అంశాల చుట్టూ నిర్మితమైన పరస్పర విశ్వాసంపై ఆధారపడి ఉంటుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సదస్సు ప్రారంభంలో వినిపించిన వేద పఠనం స్ఫూర్తితో – భిన్న భాషలు, జీవనశైలులు, సంప్రదాయాలలోని వైవిధ్యాన్ని ఆదరించి, వేడుకగా జరుపుకోవడం ద్వారా బహుళత్వాన్ని ఏకత్వంగా మార్చిన భారతదేశ అనుభవాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. “మనం ఈ ఉదార దృక్పథాన్ని అలవరచుకున్నప్పుడు, మన వైవిధ్యమే మన ఐక్యతకు పునాదిగా మారుతుంది” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
అందరూ కలిసి నడవాలి, కలిసి సంభాషించాలి, మనసుల మధ్య సామరస్యాన్ని సాధించాలి అనే అర్థాన్నిచ్చే ‘సంగచ్ఛధ్వం సంవదధ్వం సం వో మనాంసి జానతామ్’ అనే వేద మంత్రోచ్ఛారణతో ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. తొలి ఎస్సీఓ నాగరికతల సంభాషణ వేదిక ప్రారంభోత్సవం సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ సదస్సులోని చర్చలు ఫలప్రదం కావాలని ఆకాంక్షించారు.
***
Speaking at the SCO Civilisational Dialogue Forum in Delhi. https://t.co/RzZCS5bjnd
— Narendra Modi (@narendramodi) November 20, 2026
साम्राज्यों ने दुनिया के नक्शे जरूर बदले हैं, लेकिन civilisational dialogues ने दुनिया के विचार बदले हैं, उन्हें समृद्ध किया है। इसीलिए, SCO civilisational summit केवल एक ceremonial platform नहीं है। ये विश्व को दिशा देने का एक मंच बन सकता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 20, 2026
21वीं सदी की Technology ने दुनिया में Cultural Connectivity की नई संभावनाएं पैदा की हैं। जिन रास्तों पर कभी हमारे पूर्वजों को महीनों यात्रा करनी पड़ती थी, आज उन्हीं देशों के लोग कुछ ही सेकंड में एक-दूसरे से जुड़ सकते हैं। Digital Platforms ने Knowledge Sharing, Cultural Exchange और International Collaboration को पहले से आसान बना दिया है। SCO के देशों को इन नई संभावनाओं का पूरा लाभ उठाना चाहिए: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 20, 2026
हमारे देशों के Museums, Libraries और Archives में हजारों वर्षों की अनमोल विरासत सुरक्षित है। प्राचीन Manuscripts, दुर्लभ ग्रंथ, ऐतिहासिक दस्तावेज और कलाकृतियां हमारे जुड़ाव के अनेक पहलुओं को सामने लाती हैं। आज Technology की मदद से इस विरासत को नई पीढ़ी तक पहुंचाने के बहुत अच्छे अवसर बने हैं। हम प्राचीन ग्रंथों के Digitisation और Translation में सहयोग कर सकते हैं। Joint Research Projects के माध्यम से हम अपने साझा इतिहास के नए पहलुओं को सामने ला सकते हैं। इससे दुनिया के किसी भी हिस्से में बैठा एक युवा, दूसरे देश की Cultural Heritage को कहीं बेहतर तरीके से समझ सकेगा: PM @narendramodi at the SCO Civilisational Dialogue Forum
— PMO India (@PMOIndia) November 20, 2026
हमारी संस्कृति ने हमें ‘वसुधैव कुटुंबकम्’ की सीख दी है। यानी, ये पूरा विश्व ही हमारा परिवार है। इसलिए, हमारे यहाँ अपने कल्याण की इच्छा विश्व कल्याण के भाव में ही रची बसी है। हम आपसी सद्भाव को ही global wellbeing का base मानते हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 20, 2026