షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) గౌరవ సెక్రటరీ జనరల్ గారికి, భారత సాంస్కృతిక శాఖ మంత్రి గారికి, భారత ప్రభుత్వంలోని ఇతర మంత్రులందరికీ.. వివిధ దేశాల మంత్రులు, రాయబారులు, హైకమిషనర్లు, ప్రముఖులు, విశిష్ట పండితులు, ప్రఖ్యాత కళాకారులు, ఎస్సీఓ దేశాల నుంచి విచ్చేసిన గౌరవ అతిథులు, సోదర సోదరీమణులకు నా నమస్కారాలు!
ఇది షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) మొట్టమొదటి నాగరికతల సంవాద వేదిక. భారత్కు విచ్చేసిన అతిథులందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను. మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా చర్చలన్నీ యుద్ధం, అశాంతితో నిండి ఉన్న తరుణంలో మనం భారత్లో నాగరికతల అనుసంధానంపై సంవాదం నిర్వహిస్తున్నాం. సాంస్కృతిక అనుబంధం అనేది ప్రపంచ శాంతికి అత్యంత బలమైన హామీ కాబట్టి ఇది మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అందువల్ల నేటి ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత మరింత పెరిగింది.
మిత్రులారా,
కేవలం కొన్ని నెలల క్రితమే షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరాల్లో భద్రత, ఆర్థిక వ్యవస్థ, అనుసంధానత రంగాల్లో ఎస్సీఓ సహకారాన్ని గణనీయంగా విస్తరించింది. ఇటువంటి పరిస్థితుల్లో సాంస్కృతిక, నాగరికతల విషయంలో సహకారం వివిధ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. ఈ వేదిక కొత్త ఆలోచనలకు ఊపిరి పోస్తుందని, సాంస్కృతిక సహకారానికి కొత్త అవకాశాలను సృష్టిస్తుందని, మన ఉమ్మడి నాగరికతల అనుభవాలు ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని నాకు పూర్తి నమ్మకం ఉంది.
మిత్రులారా,
ప్రస్తుతం మనం ఢిల్లీలోని పురానా ఖిలా వద్ద ఉన్నాం. ఈ పురానా ఖిలా భారతదేశపు ఒక అసాధారణ సాంస్కృతిక వారసత్వం. దీనితో ముడిపడి ఉన్న కథల మాదిరిగా దీని చరిత్ర కూడా ఎంతో ఆసక్తిగా ఉంటుంది. దీని గురించి మీరు ఇప్పటికే ఇక్కడ చదివి విని ఉండొచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ కోట చరిత్ర వేల సంవత్సరాల నాటి మహాభారత కాలానికి చెందింది. ఇంతటి ప్రాచీన ప్రదేశంలో అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు, వేద మంత్రాల ఉత్సాహభరితమైన పఠనం, బౌద్ధ తత్వశాస్త్ర ప్రదర్శనలు, హనుమాన్ ప్రయాణ ఘట్టాలు భారతదేశ సంస్కృతిని తెలియజేయటమే కాకుండా మానవాళికి ప్రేమ, ఐక్యత సందేశాన్ని కూడా అందించాయి.
మిత్రులారా,
ఈ భావాలు, ఈ ఆలోచనలు, ఈ బోధనలు ఎంత ప్రాచీనమైనవో అంతే సార్వత్రికమైనవి కూడా. భౌగోళిక-రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఇవి సహజంగానే మనల్ని ఒకరితో ఒకరిని అనుసంధానిస్తాయి. ఈ సదస్సు ఉద్దేశం కూడా ఇదే. ప్రస్తుత కాలపు అవసరం కూడా ఇదే. మీరందరూ ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తారని.. దీనిని చారిత్రాత్మక ఘట్టంగా మార్చటం ద్వారా ఒక నూతన సంప్రదాయానికి పునాది వేస్తారని నేను ఆశిస్తున్నాను. భవిష్యత్తు మీ అందరినీ గుర్తుంచుకునేటువంటి ఒక గొప్ప సంప్రదాయం ఇది.
నేడు అంతర్జాతీయ సహకారం, ప్రజల మధ్య అనుసంధానం గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. మన పూర్వీకులు అనేక శతాబ్దాల పాటు సుసంపన్నం చేసిన విధానం ఇది. దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితం సింధు లోయ నాగరికత, మెసపటోమియా మధ్య వాణిజ్య సంబంధాలు ఉండేవి. ఆ తర్వాత ఇతర వాణిజ్య మార్గాలు ఈ సంబంధాలను మరింత విస్తరించాయి. ఈ ప్రాచీన వాణిజ్య నెట్వర్క్ల ద్వారా భారత్, చైనా, మధ్య ఆసియా, యురేషియాలోని అనేక ప్రాంతాలు అనుసంధానమై ఉండేవి. ఈ మార్గాల వెంట కేవలం వ్యాపారులు మాత్రమే కాకుండా నిపుణులు, యాత్రికులు, బౌద్ధ సన్యాసులు కూడా ప్రయాణించారు. ఈ ప్రయాణాలు.. ఆలోచనలు, భాషలు, సంప్రదాయాల మార్పిడిని సులభతరం చేశాయి. గాంధార, మధ్య ఆసియా మీదుగా బౌద్ధ గ్రంథాలలోని ఆలోచనలు చైనాకు చేరుకున్నాయి. కూచా, డున్హువాంగ్ వంటి ప్రదేశాలు ఈ ప్రయాణంలో ముఖ్యమైన కేంద్రాలుగా మారాయి. ఫాహియాన్, హుయాన్ త్సాంగ్, ఇత్సింగ్ వంటి వారు చైనా నుంచి భారత్ వచ్చారు. వారు భారత విజ్ఞాన సంప్రదాయాలను అధ్యయనం చేసి వాటిని తమ మాతృభూమికి తిరిగి తీసుకువెళ్లారు. నలందా వంటి విశ్వవిద్యాలయాలు ఈ విజ్ఞాన మార్పిడికి కేంద్రాలుగా నిలిచాయి. మధ్య ఆసియాలోని కూచాలో జన్మించిన కుమారజీవ వంటి పండితులు బౌద్ధ గ్రంథాలను చైనీస్ భాషలోకి అనువదించారు. ఈ విధంగా మానవాళి నాగరికత నిరంతరం తమను తాము సుసంపన్నం చేసుకుంటూ అభివృద్ధి చెందుతూ వచ్చాయి. సామ్రాజ్యాలు ప్రపంచ పటాన్ని మార్చి ఉండొచ్చు కానీ నాగరికతల సంవాదాలు ప్రపంచ ఆలోచనలను మార్చటంతో పాటు మేధో సంపన్నతను బలోపేతం చేశాయని నేను విశ్వసిస్తున్నాను. అందువల్ల ఎస్సీఓ నాగరికతల సదస్సు కేవలం ఒక లాంఛనప్రాయ వేదిక మాత్రమే కాదు.. ఇది ప్రపంచానికి దిశానిర్దేశం చేసే వేదికగా మారగలదు.
మిత్రులారా,
విజ్ఞానం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణించినప్పుడు దానిని వ్యక్తీకరించే విధానం మారొచ్చు కానీ దాని ప్రభావం, దాని పాత్ర మారదు. విజ్ఞానం ఏ రూపాన్ని ధరించినా అది వెలుగునే ప్రసరింపజేస్తుంది. దీనికి ఒక ప్రధాన ఉదాహరణ భారతదేశపు ‘పంచతంత్రం’. దీని కథలు పర్షియన్ భాషలోకి ఆ తర్వాత అరబిక్ భాషలోకి ప్రయాణించాయి. ‘కలీలా వా దిమ్నా’ రూపంలో ఈ కథలు ఒక నూతన ఆకృతిని సంతరించుకొని తరతరాల పాటు అమరత్వం పొందాయి. అదేవిధంగా రామాయణం భారత్ నుంచి ఆగ్నేయాసియాకు ప్రయాణించినప్పుడు అక్కడ కూడా అవే ఆదర్శాలను బలోపేతం చేసింది. కంబోడియాలో రామాయణం ‘రీమ్కెర్’ రూపాన్ని సంతరించుకొని స్థానిక సంస్కృతి, ప్రదర్శన కళలు, సాహిత్యంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది.
మిత్రులారా,
విజ్ఞాన శాస్త్రం, గణిత శాస్త్ర రంగాల్లో కూడా ఈ వివిధ దేశాల సాంస్కృతిక మార్పిడి అంతే ముఖ్యమైన పాత్ర పోషించింది. గొప్ప భారతీయ గణిత శాస్త్రవేత్త బ్రహ్మగుప్తుని ఆలోచనలు బాగ్దాద్కు చేరుకున్నాయి. అక్కడ అల్-ఖ్వారిజ్మి వంటి వారు గణిత శాస్త్ర విజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లడంలో గణనీయమైన కృషి చేశారు.
మిత్రులారా,
వాస్తుశిల్పం, సంగీత రంగాల్లో కూడా ఈ ఉమ్మడి ప్రయాణానికి మనకు అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. మధ్య ఆసియాలోని మఖామ్ సంప్రదాయాలు, భారత్లోని రాగ సంప్రదాయాల మధ్య గాఢమైన సాంస్కృతిక అనుబంధం ఉంది. సూఫీ భావాలు, సంగీత సంప్రదాయాలు భారత్లో ఖవ్వాలీ అభివృద్ధిని సుసంపన్నం చేశాయి. మధ్య ఆసియాలోని సమర్కండ్, హెరాత్ ఉద్యానవన సంప్రదాయాలు భారత్లోని చార్బాగ్ శైలిపై ప్రభావం చూపాయి. నేటికీ ఈ మార్పిడులు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరం కొనసాగాలంటే ఈ సదస్సు, ఇటువంటి కార్యక్రమాల పాత్ర అత్యంత కీలకంగా మారుతుంది.
మిత్రులారా,
గతంలో ఎన్నడూ లేనంత గొప్ప అవకాశాలు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి. 21వ శతాబ్దపు సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక అనుసంధానానికి కొత్త మార్గాలను సృష్టించింది. ఒకప్పుడు మన పూర్వీకులు నెలల తరబడి ప్రయాణించిన మార్గాలు… నేడు ఆయా దేశాల ప్రజలను కేవలం కొద్ది క్షణాల్లోనే ఒకరితో మరొకరిని కలుపుతున్నాయి. డిజిటల్ వేదికలు జ్ఞానాన్ని పంచుకోవడాన్ని, ఒకరి సంస్కృతిని మరొకరు తెలుసుకోవడాన్ని, అంతర్జాతీయ సహకారాన్నీ మరింత సులభతరం చేశాయి. ఎస్సీవో దేశాలు ఈ కొత్త అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి.
మిత్రులారా,
గౌరవ అతిథులైన మీ అందరి సమక్షంలో ఈ విషయంగా నేను ఈ రోజు కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాను. మన దేశాల్లోని మ్యూజియంలు, గ్రంథాలయాలు, ప్రాచీన గ్రంథాల్లో… వేల సంవత్సరాలుగా పోగుపడిన అమూల్యమైన వారసత్వం భద్రంగా ఉంది. ప్రాచీన రాతప్రతులు, అరుదైన గ్రంథాలు, చారిత్రక పత్రాలు, కళాఖండాలు మన ఉమ్మడి సంబంధాల్లోని అనేక కోణాలను వెల్లడిస్తాయి. ఈ రోజు, ఈ వారసత్వాన్ని యువ తరాలకు అందించడానికి సాంకేతికత అద్భుతమైన అవకాశాలను కల్పిస్తోంది. ప్రాచీన గ్రంథాల డిజిటలైజేషన్, అనువాదంలో మనం పరస్పరం సహకరించుకోవచ్చు. ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టుల ద్వారా, మన ఉమ్మడి చరిత్రలోని కొత్త కోణాలను ప్రపంచం ముందుకు తీసుకురావచ్చు. దీనివల్ల ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఉన్న యువకులైనా మరో దేశపు సాంస్కృతిక వారసత్వాన్ని మరింత బాగా అర్థం చేసుకోగలరు.
మిత్రులారా,
మన గొప్ప సాహిత్య రచనల్లో ఇప్పటికీ చాలా వరకు పరిమిత భాషల్లోనే అందుబాటులో ఉన్నాయి. కృత్రిమ మేధ సహాయంతో, ఈ రచనల అనువాద ప్రక్రియను గణనీయంగా వేగవంతం చేయవచ్చు. నేడు మనకు గతంలో కంటే ఎన్నో ఎక్కువ సాధనాలు అందుబాటులో ఉన్నాయి… మనం వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి.
మిత్రులారా,
ఒకరి సంస్కృతి గురించి మరొకరు తెలుసుకోవడం కోసం మనం దృష్టి సారించాల్సిన ఎన్నో అవకాశాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు, మన దేశాల్లోని మ్యూజియంలు, సాంస్కృతిక సంస్థలు సంయుక్త ప్రదర్శనలను నిర్వహించవచ్చు. విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు… విద్యార్థులు, పరిశోధకుల కోసం ఒకరి సంస్కృతిని మరొకరు తెలుసుకోవడానికి వీలుండే కార్యక్రమాలను ప్రోత్సహించవచ్చు. సాంస్కృతిక పర్యాటకం మన మధ్య సహకారానికి కీలకమైన రంగంగా మారగలదు. మన దేశాల వ్యాప్తంగా సిల్క్ రూట్స్, బౌద్ధ వారసత్వానికి సంబంధించిన అనేక చారిత్రక ప్రదేశాలూ ఉన్నాయి. హెరిటేజ్ సర్క్యూట్లు, సాంస్కృతిక మార్గాల ద్వారా వాటిని అనుసంధానించే అవకాశాలను మనం అన్వేషించవచ్చు. సంయుక్తంగా నిర్వహించే సాంస్కృతిక ఉత్సవాలు, కళాకారుల ద్వారా ఒకరి సంస్కృతిని మరొకరు తెలుసుకోగలిగే కార్యక్రమాలు… మన కళ, సాంస్కృతిక సంప్రదాయాలను కొత్త ప్రేక్షకులకు అందించగలవు. ఇటువంటి ప్రయత్నాలు ఒకరి సంస్కృతులను మరొకరు మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడం కోసం మన పౌరులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తాయని నేను నమ్ముతున్నాను.
మిత్రులారా,
ఈ రోజు మనం ముందుకు తీసుకువెళ్తున్న ఈ నాగరికతల సంవాదాన్ని రాబోయే దశాబ్దాల్లో మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే బాధ్యత మన యువతపై ఉంది. నేటి యువతరం సాంకేతికత ద్వారా అనుసంధానమై ఉంది. ప్రపంచాన్ని మరింత బాగా అర్థం చేసుకోవాలని కోరుకుంటోంది. ఒకరి భాషలు, సాహిత్యం, సాంస్కృతిక సంప్రదాయాలతో మరొకరు మమేకమవ్వడానికి మన యువతకు మనం మరిన్ని అవకాశాలను కల్పించాలి. మన యువ కళాకారులు, రచయితలు, చలనచిత్ర నిర్మాతలు… డిజిటల్ మీడియా, ఇతర సృజనాత్మక వేదికల ద్వారా మన ఉమ్మడి వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించగలరు. ఈ ప్రయత్నాల్లో స్థానిక కళాకారులను, హస్తకళా నిపుణులనూ మనం భాగస్వాములను చేయాలి.
మిత్రులారా,
భారత్లో మనం ప్రార్థించే సమయంలో, ఆచారాలను నిర్వహించే సమయంలో… “సకల జీవరాశుల మధ్య సద్భావన నెలకొనాలి. ప్రపంచం సుభిక్షంగా ఉండాలి” అని కోరుకుంటాం. ఎందుకంటే, మన సంస్కృతి మనకు ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే ఆదర్శన్ని నేర్పింది. మన సొంత శ్రేయస్సు పట్ల కోరిక… ప్రపంచ శ్రేయస్సుతో విడదీయలేనంతగా ముడిపడి ఉంటుంది. పరస్పర సామరస్యమే ప్రపంచ శ్రేయస్సుకు పునాదిగా మనం భావిస్తాం.
మిత్రులారా,
పరస్పర సామరస్యానికి అత్యంత ముఖ్యమైన అవసరం పరస్పర విశ్వాసం. మనం పరస్పరం ఏదో ఇచ్చిపుచ్చుకుంటున్నామని భావించినప్పుడే పరస్పర విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. మనం పంచుకుంటున్న వాటిపై మనం దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. భారత్ అందించిన అనుభవం నుంచి నేను ఇది కచ్చితంగా చెప్పగలను… మనం అటువంటి విశాల దృక్పథాన్ని అవలంబించినప్పుడు, మన వైవిధ్యమే మన ఐక్యతకు పునాది అవుతుంది. మనకు అనేక భాషలు, జీవనశైలులు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ… దేశంలో మనం పరస్పరం అనుసంధానమై ఉన్నాం. దేశంలో, మనం వైవిధ్యాన్ని అంగీకరిస్తాం. మనం వైవిధ్యాన్ని వేడుకగా జరుపుకొంటాం. ఈ కార్యక్రమం ప్రారంభంలో మనం విన్న మన వేదాల పఠనం నుంచి మనం ఈ స్ఫూర్తిని పొందుతున్నాం.
మిత్రులారా,
మన వేదాలు ఇలా చెబుతున్నాయి… “సంగచ్ఛధ్వం సంవదధ్వం సమ్ వో మనమ్సీ జనతం” – అంటే మనం కలిసి నడుద్దాం, కలిసి సంవాదం చేద్దాం, మన ఆలోచనల్లో సామరస్యం వెల్లివిరియాలి. ఈ స్ఫూర్తితో నిర్వహిస్తున్న… మొదటి ఎస్సీవో నాగరికతల సంవాద వేదిక సందర్భంగా మీ అందరికీ నేను మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది మొదటిది కావడం వల్ల దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ వేదికగా విజయవంతమైన, అర్థవంతమైన చర్చలు జరగాలని ఆశిస్తూ… మీ అందరికీ నా శుభాకాంక్షలు.
ధన్యవాదాలు
నమస్కారం.
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి అనువాదం.
***
Speaking at the SCO Civilisational Dialogue Forum in Delhi. https://t.co/RzZCS5bjnd
— Narendra Modi (@narendramodi) November 20, 2026
साम्राज्यों ने दुनिया के नक्शे जरूर बदले हैं, लेकिन civilisational dialogues ने दुनिया के विचार बदले हैं, उन्हें समृद्ध किया है। इसीलिए, SCO civilisational summit केवल एक ceremonial platform नहीं है। ये विश्व को दिशा देने का एक मंच बन सकता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 20, 2026
21वीं सदी की Technology ने दुनिया में Cultural Connectivity की नई संभावनाएं पैदा की हैं। जिन रास्तों पर कभी हमारे पूर्वजों को महीनों यात्रा करनी पड़ती थी, आज उन्हीं देशों के लोग कुछ ही सेकंड में एक-दूसरे से जुड़ सकते हैं। Digital Platforms ने Knowledge Sharing, Cultural Exchange और International Collaboration को पहले से आसान बना दिया है। SCO के देशों को इन नई संभावनाओं का पूरा लाभ उठाना चाहिए: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 20, 2026
हमारे देशों के Museums, Libraries और Archives में हजारों वर्षों की अनमोल विरासत सुरक्षित है। प्राचीन Manuscripts, दुर्लभ ग्रंथ, ऐतिहासिक दस्तावेज और कलाकृतियां हमारे जुड़ाव के अनेक पहलुओं को सामने लाती हैं। आज Technology की मदद से इस विरासत को नई पीढ़ी तक पहुंचाने के बहुत अच्छे अवसर बने हैं। हम प्राचीन ग्रंथों के Digitisation और Translation में सहयोग कर सकते हैं। Joint Research Projects के माध्यम से हम अपने साझा इतिहास के नए पहलुओं को सामने ला सकते हैं। इससे दुनिया के किसी भी हिस्से में बैठा एक युवा, दूसरे देश की Cultural Heritage को कहीं बेहतर तरीके से समझ सकेगा: PM @narendramodi at the SCO Civilisational Dialogue Forum
— PMO India (@PMOIndia) November 20, 2026
हमारी संस्कृति ने हमें ‘वसुधैव कुटुंबकम्’ की सीख दी है। यानी, ये पूरा विश्व ही हमारा परिवार है। इसलिए, हमारे यहाँ अपने कल्याण की इच्छा विश्व कल्याण के भाव में ही रची बसी है। हम आपसी सद्भाव को ही global wellbeing का base मानते हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 20, 2026