పిఎంఇండియా
సహకార బ్యాంకుల నుండి రైతులు స్వల్పకాలిక రుణాలు తీసుకోడానికి వీలుగా 2016 నవంబర్, డిసెంబర్.. ఈ రెండు నెలలకు వడ్డీని మాఫీ చేయడానికి మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ నిర్ణయం వల్ల సహకార బ్యాంకులకు జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) ద్వారా అందించే అదనపు రీఫైనాన్స్ పై నాబార్డ్ కు ఇన్ టరెస్ట్ సబ్ వెన్షన్ ను సమకూర్చడానికి కూడా వీలు కలుగుతుంది.
భారతదేశంలో సహకార బ్యాంకుల నుండి స్వల్పకాలిక పంట రుణాలు తీసుకుంటున్న రైతులందరూ ఈ నిర్ణయం ఫలితంగా ప్రయోజనం పొందగలుగుతారు.
రబీ వ్యవసాయ పనులను చేపట్టడానికి సహకార బ్యాంకుల నుండి రైతులు సులువుగా పంట రుణాలను తీసుకోవడానికి వీలుగా సహకార బ్యాంకుల వద్ద నగదు నిల్వలు తగ్గిన నేపథ్యంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించడానికి అనువుగా సహకార బ్యాంకుల వద్ద తగినంతగా వనరులు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
2016 నవంబర్, డిసెంబర్.. ఈ రెండు నెలల వడ్డీ మాఫీ కోసం అవసరమైన నిధులను సహకార బ్యాంకులకు నాబార్డ్ ద్వారా అదనపు వనరుల రూపంలో సమకూరుస్తారు. వీటిని ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2016-17 లో సహకార బ్యాంకుల ద్వారా రైతులకు అందజేస్తారు. ఇందుకోసం రూ. 1,060.50 కోట్ల అదనపు ఆర్ధిక భారం పడుతుంది. ఇన్ టరెస్ట్ సబ్ వెన్షన్ స్కీమ్ (ఐఎస్ఎస్) అమలు కోసం 2016-17 లో కేటాయించిన రూ.15,000 కోట్లు ఇప్పటికే వినియోగించడం జరిగింది.
పూర్వ రంగం:
ఎ) భారత ప్రభుత్వం 2006-07 నుండి ఇన్ టరెస్ట్ సబ్ వెన్షన్ స్కీమ్ ను అమలు చేస్తూ ఈ పథకంలో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా ఏడాదికి 7 శాతం వడ్డీ తో రూ. 3 లక్షల వరకు స్వల్పకాలిక పంట రుణాలను అందజేస్తోంది. రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించినట్లయితే బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు రైతులకు రూ. 3 లక్షల వరకు రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీ (ఇన్ టరెస్ట్ సబ్ వెన్షన్) ను కల్పించాయి. దీంతో ఈ రుణంపై రైతులు కేవలం 4 శాతం వడ్డీ ని చెల్లించితే సరిపోతుంది.
బి) పాత రూ.500, రూ.1000 ముఖ విలువ కలిగిన నోట్లు రద్దయిన కారణంగానూ, రైతులు వారి ఖరీఫ్ పంట ఉత్పత్తులు విక్రయించగా లభించిన చెక్కులను నగదుగా మార్చుకోవడంలో తలెత్తిన ఇబ్బందుల కారణంగానూ, అదే విధంగా రబీ వ్యవసాయ పనులు చేపట్టడానికి, స్వల్పకాలిక పంట రుణాల తాలూకు వడ్డీని చెల్లించడానికి తగినంతగా నగదు అందుబాటులో లేకపోవడం తో పాటు ముఖ్యంగా సహకార బ్యాంకులపై విధించిన ఆంక్షల నేపథ్యంలో 01.04.2016 నుండి 30.09.2016 మధ్య కాలంలో సహకార బ్యాంకుల నుండి పంపిణీ చేసిన పంట రుణాలపై 2016 నవంబర్, డిసెంబర్ రెండు నెలల కాలానికి రైతులకు వడ్డీని రద్దు చేయడం జరిగింది.
సి) రూ. 1,060.50 కోట్ల మేర సమకూర్చిన అదనపు ఆర్ధిక వనరులను –
i) 01.04.2016 నుండి 30.09.2016 మధ్య కాలంలో సహకార బ్యాంకుల నుండి పంపిణీ చేసిన పంట రుణాలపై 2016 నవంబర్, డిసెంబర్ రెండు నెలల కాలానికి రైతులకు వడ్డీ మాఫీ వ్యయాన్ని భర్తీ చేయడం కోసం,
ii) వర్తమాన ఆర్ధిక సంవత్సరం లో సహకార బ్యాంకులకు అప్పుగా ఇవ్వడానికి స్వల్పకాలిక రుణంగా తీసుకున్న రూ. 20,000 కోట్ల పై నాబార్డు కు ఇన్ టరెస్ట్ సబ్ వెన్షన్ మరియు నిర్వహణ వ్యయం చెల్లింపులకు వినియోగిస్తారు.