పిఎంఇండియా
రైల్వే రంగంలో సాంకేతిక సహకారం కోసం 2017 జనవరి 31న రిపబ్లిక్ ఆఫ్ ఇటలీకి చెందిన ఫెరోవీ డెలో స్టాటో ఇటాలియేన్ ఎస్.పి.ఎ. తో అవగాహనపూర్వక ఒప్పందం (ఎంఒయు) గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గానికి వివరించడం జరిగింది.
ఈ ఎమ్ఒయు భారతీయ రైల్వేల వ్యవస్థ అధునాతన అభివృద్ధి, భద్రత, సామర్థ్యం, స్థిరత్వాలకు సంబంధించిన ప్రావీణ్యాన్ని మార్పిడి చేసుకునేందుకు ఒక వేదిక ఏర్పడుతుంది. అంతేకాదు, సమాచార మార్పిడికి, నిపుణుల సమావేశాలకు, చర్చాసభలకు, సాంకేతిక పర్యటనలకు, సంయుక్తంగా అంగీకరించిన ప్రాజెక్టుల అమలుకు, సహకార కార్యక్రమాల అమలుకు కూడా ఈ ఎమ్ఒయు బాటలు వేస్తుంది.
రైల్వే వ్యవస్థలో భద్రతను, సామర్థ్యాన్ని, స్థిరత్వాన్ని పెంచేందుకు అవసరమైన సాంకేతిక సహకార అభివృద్ధి కార్యక్రమాలు, పరస్పర లాభం కలిగే కార్యక్రమాలు నిర్వహించడం ఈ ఎమ్ఒయు ఉద్దేశం. కింద పేర్కొన్న అంశాలలో సాంకేతిక సహకారానికి ఈ ఎమ్ఒయు తోడ్పడుతుంది :-
1. భారతీయ రైల్వేల యొక్క రైళ్ల కార్యకలాపాలలో భద్రత పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు సేఫ్టీ ఆడిట్ కు;
2. ఆధునిక సాంకేతిక ఆధారిత భద్రత ఉత్పత్తులు, భద్రత సమగ్రత స్థాయి-4 (ఎస్ఐఎల్4) వ్యవస్థ నిర్ధారణకు, సర్టిఫికేషన్ కు;
3. భద్రత ప్రమాణాలు (అత్యాధునిక సిగ్నలింగ్, రైలు నియంత్రణ వ్యవస్థ)లను దృష్టిలో పెట్టుకుని శిక్షణ, యోగ్యతాభివృద్ధికి;
4. నిర్వహణలో, సమస్య నిర్ధారణలో అధునాతన పద్ధతులు;
5. ఇరు దేశాలు సంయుక్తంగా గుర్తించే మరే అంశమైనా..
పూర్వరంగం:
ఫెరోవీ డెలో స్టాటో ఇటాలియేన్ గ్రూపు (ఎఫ్ఎస్ గ్రూపు) ఇటాలియన్ రైల్వే రంగంలో పారిశ్రామిక నిర్వహణ సంస్థ. రైల్వే ఆధారిత కంపెనీల ద్వారా ఈ కార్యక్రమాలు చేపడుతుంది. ఈ గ్రూపులోని ముఖ్య కంపెనీలు.. ట్రెనిటాలియా-రైల్ ట్రాన్స్‌పోర్ట్ రెటే ఫెరోవియారియా ఇటాలియానా-రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్, ఇటాల్‌ఫెర్-ఇంజినీరింగ్ కంపెనీ, ఇటాల్‌సెరిఫెర్-నోటిఫైడ్ బాడీ సర్టిఫయింగ్ రైల్వే సిస్టమ్స్ అండ్ కంపోనంట్స్. ఈ ఎఫ్ఎస్ గ్రూపు పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది. ఇటలీ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది.
రైల్వే మంత్రిత్వ శాఖ.. రైల్వే రంగంలో సాంకేతిక సహకారం కోసం వివిధ విదేశీ ప్రభుత్వాలు, జాతీయ రైల్వేస్‌తో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసుకుంది. హైస్పీడ్ కారిడోర్లు, ప్రస్తుత రూట్లలో వేగం పెంపు, ప్రపంచస్థాయి ప్రమాణాలతో స్టేషన్ ల అభివృద్ధి, కార్యక్రమాల భారీ విస్తృతి, రైల్వే మౌలిక వసతుల ఆధునికీకరణ వంటివి ఈ సహకార అంశాల్లో కొన్ని. ఈ సహకారం రైల్వేల అభివృద్ధిపై (రైల్వేలు, సాంకేతికత, కార్యక్రమాలు, ప్రావీణ్యం, షేరింగ్, సాంకేతిక పర్యటనలు, శిక్షణ, చర్చాసభలు, వర్క్‌షాప్) సమాచార మార్పిడి ద్వారానే సాధ్యమవుతుంది.
ఈ ఒప్పందం భారతీయ రైల్వేల వ్యవస్థ.. అధునాతన అభివృద్ధి, భద్రత, సామర్థ్యం, స్థిరత్వానికి సంబంధించిన విజ్ఞానాన్ని మార్పిడి చేసుకునేందుకు, చర్చించుకునేందుకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. సాంకేతిక నిపుణులు, నివేదికలు, సాంకేతిక వివరాలు, శిక్షణ, ప్రత్యేక సాంకేతిక అంశాలపై చర్చాసభలు, వర్క్‌షాప్ ల నిర్వహణతో పాటు ప్రావీణ్యం పెంచుకోవడంలో చాలా ఉపయోగపడుతుంది.