Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సైప్రస్ ప్రెసిడెంట్ భారతదేశ ఆధికారిక పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన

సైప్రస్  ప్రెసిడెంట్ భారతదేశ ఆధికారిక పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన

సైప్రస్  ప్రెసిడెంట్ భారతదేశ ఆధికారిక పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన


గౌరవనీయులైన సైప్రస్ అధ్యక్షుల వారు,

మాననీయ ప్రతినిధులు,

ప్రసార సాధనాల నుండి విచ్చేసిన మిత్రులారా,

ఎక్సె లెన్సీ, భారతదేశంలో మీ ప్రప్రథమ ఆధికారిక పర్యటన వేళ మీకు స్వాగతం పలకడం నాకు ఆనందంగా ఉంది. ప్రతి సైప్రస్ ప్రెసిడెంట్ హృదయం లోనూ భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఉందన్న విషయం నాకు తెలుసు. దాదాపుగా వారందరు భారతదేశాన్ని సందర్శించారు. అందువల్ల, అటువంటి ఒక గొప్ప స్నేహితునికి, భారతదేశానికి గట్టి మద్దతుదారుకు స్వాగతం పలకడం నాకు దక్కిన ఒక గౌరవంగా భావిస్తాను. ప్రాచీన నాగరికతకు చెందిన గొప్ప వారసత్వాన్ని భారతదేశం, సైప్రస్ లు పంచుకుంటున్నాయి. వేల సంవత్సరాలుగా ఒకరి నాగరికత మరొకరిని ప్రభావితం చేస్తోంది. ఈ ఆధునిక కాలంలో, మన సంబంధాల గురించి మాట్లాడుకునేటప్పుడు, ఒక సారి స్వాతంత్ర్యానికి ముందు కాలానికి వెళితే, అప్పుడు మా పితామహులు సైప్రస్ స్వాతంత్ర్య పోరాటానికి మద్దతు పలికారు. అదే విధంగా, సైప్రస్ కూడా సహృదయపూరితమైన స్నేహంతో ప్రతిస్పందించేది. కీలకమైన అన్ని సమస్యలపైనా సైప్రస్ కు తోడుగా భారతదేశం నిలబడింది. 1974 లో, సైప్రస్ గణతంత్ర రాజ్యం సార్వభౌమాధికారానికి, ఐక్యతకు, ప్రాదేశిక సమగ్రతకు మద్దతు ఇవ్వాలని భారతదేశం గట్టి నిర్ణయం తీసుకుంది. సైప్రస్ లో ఉన్న ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షక దళానికి భారతదేశం సిబ్బందిని పంపింది. భారతదేశానికి చెందిన ముగ్గురు సైనిక కమాండర్లు వారి స్థాయిలో సేవ చేశారు. సైప్రస్ లో వారందరినీ ఎంతో ప్రేమగా గుర్తుచేసుకుంటున్నారని తెలుసుకుని నేను ఎంతో చెలించి పోయాను.

ఎక్సెలెన్సీ ,

సైప్రస్ వివాదం పరిష్కారానికి మీరు తీసుకుంటున్న చర్యలు నాకు తెలుసు. కేవలం సైప్రస్ కే కాదు, మొత్తం ప్రాంతంలో- శాంతి, అభివృద్ధి, భద్రత లకు సంబంధించి ఒక కొత్త యుగాన్ని తీసుకు రావడానికి చేస్తున్న ప్రయత్నాలకు మీరు ముందుండి నాయకత్వం వహిస్తున్నారు. మీ కృషి విజయవంతం కావాలని మేం కోరుకుంటున్నాం. మీ నాయకత్వంలో సైప్రస్, ఇటీవలి ఆర్ధిక, బ్యాంకింగ్ సవాళ్ళను విజయవంతంగా అధిగమించింది. దీనికి తోడు, 2016 లో యూరో జోన్ పరిధిలో అత్యధిక వృద్ధి రేటును సాధించిన దేశాలలో ఒకటిగా నమోదయ్యింది. ఎక్సెలెన్సీ, మీ దేశాన్ని ఈ సంక్షోభం నుండి గట్టెక్కించి, ఆర్ధిక ప్రగతి బాటను పట్టించిన మీ దార్శినికతను మేం ప్రశంసిస్తున్నాం.

మిత్రులారా,

అధ్యక్షుల వారు మరియు నేను ఈ రోజు చాలా వివరంగా చర్చలు జరిపాము. ద్వైపాక్షిక సంబంధాలకు చెందిన అన్ని విషయాలపై మేం చర్చించాం. పరస్పరం ఆందోళన కలిగించే ముఖ్యమైన అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై మేం మా ఆలోచనలను పంచుకున్నాం. సైప్రస్ మరియు భారతదేశం సన్నిహిత ఆర్ధిక సంబంధాలు కలిగి ఉన్నాయి. భారతదేశంలో పెట్టుబడి పెడుతున్న దేశాలలో సైప్రస్ 8వ అతి పెద్ద దేశం. మా మూలధనం, పెట్టుబడి లింకేజీ లను పెంపొందించాలనే లక్ష్యంతో, గత ఏడాది ద్వంద్వ పన్నులను తప్పించే ఒప్పందాన్ని మేం సవరించాం. సైప్రస్ పారిశ్రామికవేత్తలకు భారతదేశం అద్భుతమైన పెట్టుబడి అవకాశాలు కల్పించే విధంగా – అధ్యక్షుల వారు, నేను అంగీకారానికి వచ్చాం. ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన కార్యక్రమాల ద్వారా రెండు ఆర్ధిక వ్యవస్థల లోని పరిశ్రమలు, వ్యాపారం ఆకర్షణీయమైన భాగస్వామ్యాలుగా రూపుదిద్దుకుంటాయి. సైప్రస్ లో ఉన్న అందమైన ప్రకృతి దృశ్యాలు, అవధులు లేని ‘‘ఇంక్రెడిబుల్ ఇండియా’’ మన రెండు దేశాలలో పర్యాటక రంగ అభివృద్ధికి మూలం కాగలవు.

మిత్రులారా!

ఐక్యరాజ్యసమితి భద్రత మండలి లో ముందస్తు సవరణలు తీసుకురావాలనే ఉమ్మడి లక్ష్యాన్ని భారతదేశం, సైప్రస్ లు పంచుకుంటున్నాయి. ప్రపంచం ఎలా ఉందో అలా ప్రతిబింబించే విధంగా సవరించబడిన భద్రత మండలి ఉండాలి కానీ, ఎలా ఉండేదో అలా కాదు. ఈ రోజున ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సవాళ్ళను పరిష్కరించేందుకు ఇది అవసరం. ఎక్సెలెన్సీ, విస్తరించిన ఐక్యరాజ్య సమితి లో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశ వాదనకు మీరు అందిస్తున్న మద్దతును నేను ఈ సందర్భంగా, సంపూర్ణంగా అభినందిస్తున్నాను.

మిత్రులారా !

విశ్వశాంతి, స్థిరత్వానికి వ్యతిరేకంగా తీవ్రవాదం విసురుతున్న సవాళ్ళను సైప్రస్ గట్టిగా ఖండిస్తోంది. సరిహద్దు తీవ్రవాదం పై భారతదేశం కూడా దశాబ్దాలుగా పోరాడుతూనే ఉంది. మన ప్రాంతంలో ఈ తీవ్రవాదాన్ని సృష్టించి, సమర్ధించి, ఆశ్రయం కల్పించి, పోషిస్తున్న శక్తులపట్ల నిర్ణయాత్మకంగా వ్యవహరించవలసిన అవసరం ఉందని మనం అంగీకరించాము. ముఖ్యంగా అంతర్జాతీయ తీవ్రవాదం పై సాధ్యమైనంత తొందరగా సమగ్ర సదస్సు ను పూర్తిచేయడం ద్వారా – సమగ్ర అంతర్జాతీయ చట్టపరమైన వ్యవస్థను ఏర్పాటు చేయవలసిన అవసరం పై అధ్యక్షుల వారు నేను చర్చించాము.

ఎక్సెలెన్సీ ,

మన ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఒక నూతన స్థాయికి తీసుకు వెళ్లేందుకు బలమైన నిబద్ధతను మీతో పంచుకుంటున్నాను. మనం ఈ రోజు జరిపిన చర్చలు, తీసుకున్న నిర్ణయాలు మన భాగస్వామ్యానికి ఒక కొత్త దిశను అందించడంతో పాటు మన భాగస్వామ్యానికి మరింత గాఢతను సంతరిస్తాయని నేను విశ్వసిస్తున్నాను. భారతదేశంలోకి మీకు మరో సారి స్వాగతం పలకనివ్వండి; మీ బస ఫలప్రదం కావాలని, ఉత్పాదకం కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను.

మీకు కృతజ్ఞతలు.

మీకు మరీ మరీ ధన్యవాదాలు.