పిఎంఇండియా
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు మూలవేతనంలో చెల్లిస్తున్న కరవు భత్యాన్ని (డీఏ) కేంద్ర ప్రభుత్వం 6% మేరకు పెంచింది. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ఈ పెంపుతో ప్రస్తుతం 113 శాతంగా ఉన్న కరవుభత్యం 119 శాతానికి చేరుకుంది. ఈ పెంపు 2015, జులై 1 నుంచి అమలు కానుంది. డీఏ పెంపుదలతో దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులు, 56 లక్షల మంది పింఛనుదారులతో కలిపి మొత్తం కోటి మందికిపైగా ప్రయోజనం పొందనున్నారు. ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి కరవు భత్యాన్ని సమీక్షిస్తుంది. 2015, జులై 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం, పింఛనుదార్లకు కరవు పరిహారం (డీఆర్) అదనపు కిస్తీ (ఇన్స్టాల్మెంట్)ని విడుదల చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆరో కేంద్ర వేతన సంఘం (సీపీసీ) సిఫార్సుల మేరకు ఆమోదించిన సూత్రం ప్రకారం దీన్ని పెంచారు. డీఏ, డీఆర్ రెండింటి మొత్తంతో ఖజానాపై ఏటా రూ.6,655.14 కోట్ల భారం పడుతుంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 8 నెలల కాలానికి (జులై, 2015 నుంచి ఫిబ్రవరి, 2016 వరకు) రూ.4,436 కోట్ల భారం పడుతుంది. ప్రభుత్వం గత ఏప్రిల్లో 6% మేరకు కరవు భత్యాన్ని పెంచింది. మూల వేతనం నిష్పత్తి మేరకు డీఏను చెల్లిస్తారు.