పిఎంఇండియా
పర్యావరణం, అడవులు మరియు శీతోష్ణస్థితిలో మార్పు శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ అనిల్ మాధవ్ దవే దుఃఖదాయక మరణం పట్ల న్యూ ఢిల్లీలో ఈ రోజు కేంద్ర మంత్రివర్గం ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ప్రత్యేకంగా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన ఒక తీర్మానంలో శ్రీ దవే మరణంతో దేశం ఒక సుదీర్ఘ అనుభవం కలిగిన మాన్య నాయకుడిని కోల్పోయిందని, ఆయన పార్లమెంటు సభ్యుడుగాను, పర్యావరణం, అడవులు మరియు శీతోష్ణస్థితిలో మార్పు శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) వంటి ప్రముఖ పదవులను ఎన్నింటినో అలంకరించారని మంత్రివర్గం పేర్కొంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై, ప్రభుత్వం తరఫున మరియు యావత్ దేశ ప్రజల తరఫున కీర్తి శేషుడైన నేత కుటుంబ సభ్యులకు హృదయ పూర్వక సంతాపాన్ని తెలియజేసింది.
తీర్మానం పాఠం ఈ కింది విధంగా ఉంది:
“శ్రీ అనిల్ మాధవ్ దవే మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయినీ లో ఉన్న బడ్ నగర్ లో 1986 జులై 6వ తేదీన జన్మించారు. ఆయన ఇండోర్ లోని గుజరాతీ కాలేజ్ నుంచి గ్రామీణాభివృద్ధి మరియు మేనేజ్ మెంట్ ప్రత్యేక విషయాలుగా ఎంకాం డిగ్రీ పొందారు.
శ్రీ దవే నదీ పరిరక్షణకు పాటుపడ్డారు. అంతేగాక ఆయన పర్యావరణవేత్త మరియు సంఘ సేవకుడు. మంచి ఆదరణకు నోచుకున్న రచయిత. హిందీ మరియు ఆంగ్ల భాషలలో అనేక గ్రంథాలు రచించారు. ఆయన జన్ అభియాన్ పరిషత్ వ్యస్థాపకుడు కూడా ఈ పరిషత్ ఆధ్వర్యంలో వెలువడిన “చరైవేతి” మాస పత్రికకు శ్రీ దవే సంపాదకుడుగా వ్యవహరించారు. ఆయన శిక్షణ పొందిన పైలట్. నర్మదా నది పుట్టిన చోటు నుంచి సాగర సంగమ స్థానం వరకు సెస్నా 173 విమానం నడిపారు. అలాగే, ఆ నది ప్రవహించే ప్రాంతమంతా కలిపి 1312 కిలో మీటర్ల మేర బల్లకట్టు పై యాత్రను పూర్తి చేశారు. చత్రపతి శివాజీని గురించిన “జనతా రాజా” నాటకం 1000 సార్లు ప్రదర్శించడం వెనుక ఆయన కృషి ఉంది. ఈ నాటకాన్ని లండన్ లోని వెమ్ బ్లే స్టేడియమ్ లోను ప్రదర్శించారు.
2009లో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. జల వనరుల సంఘం మరియు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సంప్రతింపుల సంఘం లతో సహా వేరు వేరు పార్లమెంట్ సంఘాలలో సభ్యునిగా పని చేశారు. భూ తాపం మరియు శీతోష్ణస్థితిలో మార్పు లపై ఏర్పాటుచేసిన పార్లమెంటరీ వేదికలోనూ ఆయన సభ్యుడిగా ఉన్నారు. 2016లో ఆయన మరొకసారి రాజ్యసభకు ఎన్నికై, పర్యావరణం, అడవులు మరియు శీతోష్ణస్థితిలో మార్పు శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) పదవిలో నియమితుడయ్యారు.
శ్రీ అనిల్ మాధవ్ దవే సిసలైన సంఘ సేవకుడు. పేదలన్నా, అణగారిన వర్గాల వారన్నా సహానుభూతిని చూపించేవారు. ఒక పర్యావరణవేత్తగా ఆయన నర్మదా నది పరిరక్షణ కోసం అలుపెరుగని విధంగా కృషి చేశారు. ఆయన పదహారణాల జాతీయవాది. తన బాధ్యతలను ఎంతో మర్యాదతో నిర్వర్తించేవారు. ఆయన కన్ను మూయడంతో మధ్య ప్రదేశ్ నుండి వెలుగులోకి వచ్చిన ఒక ప్రముఖ నాయకుడిని దేశం కోల్పోయింది”.
****
PM @narendramodi paid his last respects to late Shri Anil Madhav Dave. pic.twitter.com/pQgVoNTOoz
— PMO India (@PMOIndia) May 18, 2017