పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం జల వనరుల నిర్వహణలో ద్వైపాక్షిక సహకారంపై భారతదేశం, నెదర్లాండ్స్ మధ్య అవగాహన ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఈ ద్వైపాక్షిక సహకార ఒప్పందంపై భారత ప్రభుత్వ జల వనరులు- నదుల అభివృద్ధి- గంగా పునర్నవీకరణ మంత్రిత్వ శాఖ, నెదర్లాండ్స్ రాజ్య మౌలిక సదుపాయాలు- పర్యావరణ మంత్రిత్వ శాఖ లు సంతకాలు చేశాయి.
జల వనరుల నిర్వహణ, అభివృద్ధికి సంబంధించి అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ స్థాయిలలో సహకారాన్ని అభివృద్ధి పరచేందుకు రెండు ప్రభుత్వాలూ కృషి చేయడం ఈ ఒప్పందంలోని ప్రధానాంశం. ఆ మేరకు పరస్పర అంగీకారం కుదిరిన రంగాలలో సహ భాగస్వామ్యం ద్వారా నైపుణ్యం, అనుభవాల ఆదాన ప్రదానం కొనసాగుతాయి. జల వనరుల సమర్థ వినియోగ సాంకేతికతలు, నదీ పరీవాహక ప్రాంతాల నిర్వహణ, నిర్ణయ మద్దతు వ్యవస్థలు, జలనాణ్యత సమస్యలు, వ్యర్థ జలాల శుద్ధి-వినూత్న రాయితీ ఏర్పాట్లతో పునరుపయోగం వంటివి ఇందులో భాగంగా ఉంటాయి. రెండు దేశాలకు చెందిన నిపుణుల అధ్యయన సందర్శనలు, సదస్సులు, సమావేశాలు, సభలు వంటి కార్యక్రమాల ద్వారా నైపుణ్యం, అనుభవాల కలబోత, పరస్పర ప్రోత్సాహం తదితర రూపాల్లో ఈ సహకార భాగస్వామ్యం కొనసాగుతుంది. సంయుక్త పరిశోధన, సామర్థ కల్పన- నిర్మాణ కార్యక్రమాలు/ శిక్షణ, శిక్షణ బృందాల ఆదాన ప్రదానాలకు ఇది ఉత్తేజమిస్తుంది. అంతేగాక విద్యాసంబంధ, అనువర్తిత పరిశోధన-శిక్షణ, సంబంధిత సంయుక్త పథకాలు, కార్యక్రమాలలో పరస్పరం పాలు పంచుకోవడం సహా ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యాలకు ప్రోత్సాహమిస్తుంది. ఈ అవగాహన ఒప్పందం అమలులో భాగంగా చేపట్టే అన్ని కార్యక్రమాల పర్యవేక్షణకు ఒక సంయుక్త కార్యాచరణ బృందం ఏర్పాటవుతుంది. జల వనరులతో సంబంధమున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల వ్యవస్థాగత, సాంకేతిక సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఈ ద్వైపాక్షిక సహకారం దేశానికి ఎంతో లబ్ధిని చేకూరుస్తుంది. ప్రత్యేకించి నదీ పరీవాహక ప్రాంతాల నిర్వహణ, గంగానది సహా నదుల్లో కాలుష్యం తొలగింపు, వరదల నిర్వహణ, జల నాణ్యత, సమర్థ వినియోగం తదితర ప్రయోజనాలు కూడా ఈ ఒప్పందంతో ఒనగూరుతాయి.
పూర్వరంగం
జల వనరుల అభివృద్ధి, నిర్వహణలో ద్వైపాక్షిక సహకారం పొందాలని కేంద్ర జల వనరులు- నదీ అభివృద్ధి- గంగా పునర్నవీకరణ మంత్రిత్వ శాఖ తలపోసింది. ఈ దిశగా శిక్షణ కోర్సులు, కార్యశాలలు, శాస్త్ర-సాంకేతిక సదస్సులు, అధ్యయన సందర్శనలు, నిపుణుల ఆదాన ప్రదానం తదితరాల ద్వారా విధాన, సాంకేతిక నైపుణ్యాన్ని పంచుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నదీ పరీవాహక ప్రాంత నిర్వహణ, జలవనరుల నిర్వహణకు సమగ్ర ప్రణాళిక రూపకల్పన, కాలుష్యం తొలగింపు, నిర్ణయ మద్దతు వ్యవస్థ, మైదాన నిర్వహణ, జల నాణ్యత, వ్యర్థ జలాల శుద్ధి- పునరుపయోగం తదితరాలలో నెదర్లాండ్స్ విజయాల చరిత్రను దృష్టిలో ఉంచుకొని ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా అక్కడి నైపుణ్యం, అనుభవంతో లబ్ధి పొందాలని నిర్ణయించింది.
***