Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఐరాస శాంతి ప‌రిర‌క్ష‌ణ చ‌ర్య‌ల స‌ద‌స్సులో ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న‌

ఐరాస శాంతి ప‌రిర‌క్ష‌ణ చ‌ర్య‌ల స‌ద‌స్సులో ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న‌

ఐరాస శాంతి ప‌రిర‌క్ష‌ణ చ‌ర్య‌ల స‌ద‌స్సులో ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న‌


ప్రెసిడెంట్ శ్రీ బ‌రాక్ ఒబామా !

సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ శ్రీ బాన్ కీ మూన్‌,

గౌర‌వ‌నీయులారా !

రెండ‌వ ప్ర‌పంచ యుద్ధ క్షేత్రాల‌లోని వీర సైనికుల త్యాగాలు ఐక్య‌రాజ్య స‌మితికి పునాదులు వేశాయి. 1945 నాటికి, భార‌త సైనిక ద‌ళాల‌కు చెందిన‌ ఇర‌వై ఐదు ల‌క్ష‌ల మంది సిబ్బంది, చ‌రిత్ర‌లోనే అతి పెద్ద‌దైన‌ స్వ‌చ్ఛంద సేవ‌కుల‌ బ‌ల‌గం ఇందులో ఉంది. ఇందులో 24 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా సగం మంది జాడ తెలియ‌రాలేదు. అటువంటి త్యాగ నిర‌తిని వార‌స‌త్వంగా పంచుకున్న‌ మూడు దేశాలు ఇక్క‌డ ఉన్నాయి. ఐక్య రాజ్య స‌మితిలో త‌మ వంతుగా ఎక్కువ సంఖ్య‌లో శాంతి ద‌ళాల‌ను పంపుతున్న ముందు వ‌రుస‌లో ఇప్ప‌టికీ ఈ మూడు దేశాలు ఉన్నాయి. ఐరాస శాంతి చ‌ర్య‌ల‌లో 1,80,000 మంది భార‌తీయ సైనికులు సాలు పంచుకున్నారు. ఏ దేశం కూడా ఇంత పెద్ద సంఖ్య‌లో బ‌లగాల‌ను పంప‌లేదు మొత్తం 69 ఆప‌రేష‌న్లు జ‌రిగితే వాటిలో 48 ఆప‌రేష‌న్ల‌లో పాల్గొన్నారు. శాంతి ప‌రిర‌క్ష‌క చ‌ర్య‌ల‌లో 161 మంది భార‌త‌ సైనికులు మ‌హోన్న‌త రీతిలో ప్రాణ త్యాగాలు చేశారు. లైబీరియాలోని ఐరాస మిష‌న్ కోసం మ‌హిళ పోలీసు యూనిట్‌ను పంపిన తొలి దేశంగా భార‌త్ కు గుర్తింపు వ‌చ్చింది. ప‌లు దేశాల నుంచి వ‌స్తున్న శాంతి ప‌రిర‌క్ష‌క బ‌ల‌గాల‌ అధికారుల‌కు భార‌త్ శిక్ష‌ణ ఇస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 82 దేశాల నుంచి వ‌చ్చిన 800 మంది అధికారులకు మేం శిక్ష‌ణ ఇచ్చాం. శాంతి ప‌రిర‌క్ష‌ణ పై ఈ స‌మావేశం ఏర్పాటు చేసిన అధ్యక్షుడు శ్రీ ఒబామాకు నేను కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌చేసుకుంటున్నాను. కేవ‌లం ఐరాస 70 వ వార్షికోత్స‌వం కార‌ణాన్నే చూప‌కుండా, ఇటువంటి స‌ద‌స్పు ఏర్పాటు చేయ‌డం సంద‌ర్భోచితంగా ఉంది. భ‌ద్ర‌తా ప‌ర‌మైన వాతావ‌ర‌ణంలో మార్పులు,శాంతి స్థాప‌న కోసం పెరుగుతున్న డిమాండ్లు, అందుకు అవ‌స‌ర‌మైన బ‌ల‌గాల ల‌భ్య‌త కూడా సంక్లిష్టంగా మారింది. ఇటువంటి త‌రుణంలో నేటి శాంతి రక్ష‌క ద‌ళాలు కేవ‌లం
శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌కే కాకుండా, సంక్లిష్ట‌మైన స‌వాళ్ల‌ను కూడా ఎదుర్కొన‌వ‌ల‌సి ఉంది. ఆదేశాలు, విధుల‌ ల‌క్ష్యాల కోసం నిర్దేశించిన ఆదేశాలు కొన్ని సంద‌ర్భాల‌లో ఉత్తేజ‌పూరితంగానే ఉంటాయి కానీ అందుకు అవ‌స‌ర‌మైన బ‌ల‌గాల‌ను స‌మ‌కూర్చుకోవ‌డం కూడా క‌ష్ట సాధ్య‌మైన ప‌నే ! కొన్ని సంద‌ర్భాల‌లో వెలువ‌డే ఉత్త‌ర్వులు – సంక్షుభిత‌ దేశంలో జ‌రుగుతున్న‌ ఘ‌ర్ష‌ణ‌ల‌కు శాంతి ప‌రిర‌క్ష‌ణ బ‌ల‌గాల‌ను బాధ్యులుగా చేసి, త‌మ నిర్దేశిత విజ‌య ల‌క్ష్యాల కోసం ప్రాణాల‌కే ముప్పు తెచ్చేలా చేస్తాయి. ప‌రిర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌లో బ‌ల‌గాల‌ను పెద్ద ఎత్తున బ‌ల‌గాల‌ను అందించే దేశాల తో సంప్ర‌దింపులు జ‌ర‌గ‌డం లేదు. విధాన నిర్ణ‌యాల‌లో అటువంటి దేశాల‌కు నిర్దిష్ట పాత్ర లేక‌పోవ‌డంతోనే ఇటువంటి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతాయి.

బ‌ల‌గాల‌కు సార‌థ్యం వ‌హించే సీనియ‌ర్ మేనేజ్ మెంట్‌లో, క‌మాండ‌ర్ల విష‌యంలోనూ అటువంటి దేశాల‌కు ప్రాధాన్యత ఉండ‌దు. శాంతి ప‌రిర‌క్ష‌క బ‌ల‌గాల‌ను వినియోగించే స‌మ‌యంలో ఎంతో దూర‌దృష్టితో వ్య‌వ‌హరించ‌వ‌ల‌సి ఉంటుంది. రాజ‌కీయ ప‌రిష్కారాల‌కు మ‌ద్ద‌తు ఇస్తూనే -త‌మకున్న ప‌రిమితుల‌ను పూర్తిగా అవ‌గాహ‌న చేసుకుని గుర్తెర‌గాలి ! శాంతి ప‌రిర‌క్ష‌ణ చ‌ర్య‌ల పై ఏర్పాటు చేసిన స్వ‌తంత్ర ఉన్న‌త స్థాయి సంఘం ఈ అంశాల‌ను గుర్తించ‌డం మాకు ఎంతో సంతోషం క‌లిగిస్తోంది. ఈ ప్యానెల్ సిఫార్సుల‌పై త‌క్ష‌ణమే స్పందించిన‌ ఐరాస సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ కు కృత‌జ్ఞ‌త‌లు ! త్వ‌ర‌లోనే దీనిపై ఒక నిర్ణ‌యం వెలువ‌డ‌గ‌ల‌ద‌ని మేం ఎదురు చూస్తున్నాం. ఐరాస శాంతి ప‌రిర‌క్ష‌ణ చ‌ర్య‌ల విష‌యంలో భార‌త్ ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటుంది. ఈ నిబ‌ద్ధ‌త కొన‌సాగుతుంది, బ‌ల‌గాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఐరాస శాంతి ప‌రిర‌క్ష‌ణ శాంతి స్థాప‌క చ‌ర్య‌ల కోసం మా వంతుగా మా అభీష్టం మేర‌కు కొత్త‌గా ఎంత మంది బ‌ల‌గాల‌ను వినియోగించాల‌నే విష‌య‌మై ప్ర‌క‌టించాం. ఇప్ప‌టికే ఉన్న వారికి అద‌నంగా మ‌రో 850 మందిని, 03 పోలీస్ యూనిట్ అద‌న‌పు ద‌ళాల‌లో మ‌హిళ‌ల శాతం అధికంగా ఉన్న పోలీసు శాంతి ర‌క్ష‌క బ‌ల‌గాల‌కు , అధిక ప్రాధాన్య‌త ఇస్తాం ! ఆప‌త్కాలంలో ఆదుకోడానికి ఉద్దేశించిన అధికార సిబ్బంది, ఐరాస మిష‌న్ల‌లో పాల్గొన‌డానికి అవ‌స‌ర‌మైన సాంకేతిక సిబ్బందికి భార‌త్ లో శిక్ష‌ణ ఇవ్వ‌డం జ‌రుగుతుంది. భార‌త్ లోని శిక్ష‌ణ కేంద్రాల‌లో ను, క్షేత్రాల‌లోను శాంతి ప‌రిర‌క్ష‌ణ చ‌ర్య‌ల బాధ్యుల‌కు – అద‌న‌పు శిక్ష‌ణ ఇచ్చే కార్య‌క్ర‌మాలు త‌దిత‌ర‌ అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి. ముగింపుగా ఒక మాట ! ఐరాస శాంతి పరిర‌క్ష‌క బ‌ల‌గాల విజ‌య‌మ‌నేది సైనికుల ఆయుధాల‌పైన ఆధార‌ప‌డి ఉండ‌వు, ఐరాస భ‌ద్ర‌తా మండ‌లి నాయ‌క‌త్వం జారీ చేసే ఆదేశాల నైతిక శ‌క్తి పైనే ఆధార‌ప‌డి ఉంటాయి. ఐరాస ఉనికిని, స‌మ‌ర్ధ‌త‌ను ప‌రిర‌క్షించేందుకు వీలుగా ` దీర్ఘ‌కాలంగా అప‌రిష్కృతంగా ఉన్న సంస్క‌ర‌ణ‌ల ల‌క్ష్యాల‌ను నిర్ణీత కాల ప‌రిమితి లోగా పూర్తి చేయ‌వ‌ల‌సిన అవ‌ప‌సరం ఉంది. ఐరాస ఉన్న‌త ల‌క్ష్యాల‌ను కాపాడేందుకు త‌మ ప్రాణాల‌ను త్యాగం చేసిన శాంతి ప‌రిర‌క్ష‌క బ‌ల‌గాల‌కు నా శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టిస్తున్నాను. ఇందుకు సంబంధించి ప్ర‌తిపాదిత స్మార‌క చిహ్న నిర్మాణాన్ని స‌త్వ‌ర‌మే పూర్తి చేయ‌డం స‌ముచితంగా ఉంటుంది. ఈ ల‌క్ష్య సాధ‌నలో , ఆర్ధిక ప‌ర‌మైన తోడ్పాటుతో పాటు అన్ని ర‌కాల స‌హాయ స‌హ‌కారాలు అందించేందుకు భార‌త్ సిద్ధంగా ఉంది.