Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేర‌ళ లోని వ‌ర్కలా శివ‌గిరి మ‌ఠంలో 85వ శివ‌గిరి తీర్థయాత్ర ఉత్స‌వాల సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్రారంభిక ప్ర‌సంగ పాఠం

కేర‌ళ లోని వ‌ర్కలా శివ‌గిరి మ‌ఠంలో 85వ శివ‌గిరి తీర్థయాత్ర ఉత్స‌వాల సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్రారంభిక ప్ర‌సంగ పాఠం

కేర‌ళ లోని వ‌ర్కలా శివ‌గిరి మ‌ఠంలో 85వ శివ‌గిరి తీర్థయాత్ర ఉత్స‌వాల సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్రారంభిక ప్ర‌సంగ పాఠం


ఇది 2017వ సంవ‌త్స‌రంలో చివ‌రి రోజు. మ‌రి ఈ రోజు శ్రీ నారాయ‌ణ గురు తో పాటు ఇక్క‌డ వేదిక మీద ఆసీనులైన రుషులంద‌రి ఆశీర్వాదాలను పొందే అవ‌కాశం నాకు ద‌క్కినందుకు నేను అదృష్ట‌వంతుడిని. శ్రీ నారాయ‌ణ గురు దీవెన‌ల‌తో, 2018 వ సంవ‌త్స‌రపు తొలి కిర‌ణం దేశానికే కాక యావ‌త్ ప్ర‌పంచానికి కూడా శాంతిని, స‌ద్భావ‌న ను మ‌రియు అభివృద్ధికి చెందిన‌టు వంటి ఒక నూత‌నమైన వెలుగును తీసుకువ‌స్తుంద‌ని నేను ఆశపడుతున్నాను. శివ‌గిరి మ‌ఠాన్ని సంద‌ర్శించ‌డమంటే అది నాకు ఎల్లప్పటికీ ల‌భించిన ఒక ఆధ్యాత్మిక ఆనందం. శివ‌గిరి తీర్థయాత్ర‌ను ప్రారంభించే అవ‌కాశాన్ని నాకు ప్ర‌సాదించ‌డం ద్వారా మీరు ఈ సంతోషాన్ని మ‌రింతగా పెంచారు. శ్రీ నారాయ‌ణ ధ‌ర్మ సంఘం ట్ర‌స్టుకు మ‌రియు మీ అంద‌రికీ నేను అమిత కృత‌జ్ఞ‌తాబ‌ద్ధుడిని.

సోద‌రులు మ‌రియు సోద‌రీణులారా,

మ‌న స‌మాజంలో నుండి అంత‌ర్గ‌త బ‌ల‌హీన‌త‌ల‌ను మ‌రియు చెడుల‌ను నిర్మూలించే ప్ర‌క్రియ నిరంత‌రంగా కొన‌సాగుతూ ఉండ‌డమనేది మ‌న దేశంతో పాటు మ‌న సంఘం స్వ‌భావాల‌లో ఒక‌టిగా ఉంది. ఈ ప్ర‌క్రియ‌ను ముందుకు తీసుకుపోవ‌డంలో సాధువులు, సంతులు మ‌రియు మ‌హనీయులు ఎప్ప‌టిక‌ప్పుడు ఒక ప్ర‌ముఖ పాత్ర‌ను పోషించారు. ఈ ర‌క‌మైన చెడుల బారి నుండి స‌మాజాన్ని విముక్తం చేయ‌డానికి ఈ ప‌విత్రులు వారి యావ‌త్ జీవితాల‌ను వెచ్చించారు.

మాన్య స్వామి నారాయ‌ణ గురు గారి వంటి మ‌హానుభావుడు జాతి విద్వేషానికి, వ‌ర్ణ వివ‌క్షకు మ‌రియు కుల‌త‌త్త్వానికి వ్య‌తిరేకంగా సంఘాన్ని జాగృతం చేయ‌డానికి, అంతేకాకుండా స‌మాజాన్ని ఏకం చేయ‌డానికి పాటు ప‌డ్డారు. విద్య రంగంలో ఈ విజ‌యాన్ని సాధించ‌డమో లేదా అంట‌రానిత‌నాన్ని మ‌రియు సామాజిక చెడుల‌ను నిర్మూలించ‌డానికి ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాలు అంత సుల‌భ‌మైన‌వేమీ కావు. పోరాట కాలంలో ఆయ‌న ఎన్నో ఇక్కట్టులను ఎదుర్కోవ‌ల‌సి వ‌చ్చింది.

స్నేహితులారా,

శ్రీ నారాయ‌ణ గురు గారు

“విద్య ద్వారా స్వేచ్ఛ‌,

సంస్థ ద్వారా బ‌లం

ప‌రిశ్ర‌మ‌ల ద్వారా ఆర్థిక స్వాతంత్య్రం” అనే మంత్రాన్ని జపించారు.

స‌మాజాన్ని మెరుగుప‌ర‌చ‌డానికి, ద‌ళితుల‌కు, అణ‌చివేత‌కు గురైన వ‌ర్గాల వారికి, మోస‌పోయిన వారికి సాధికారిత‌ను అందించ‌డానికి కొన్ని చ‌ర్య‌ల‌ను ఆయ‌న సూచించారు. పేద‌లు, ద‌ళితులు మ‌రియు వెనుక‌బ‌డిన వ‌ర్గాల వారు విద్య తాలూకు శ‌క్తిని పొందినప్పుడే ముందుకు పోయే స‌త్తాను సాధించుకోగ‌లుగుతార‌ని ఆయ‌న నమ్మారు. స‌మాజం విద్య‌ను ఆర్జించిన‌ప్పుడు మాత్ర‌మే ఆత్మ‌లో న‌మ్మ‌కం మ‌రియు అంత‌ర్దర్శ‌న‌ం నిండుతాయ‌న్న సంగ‌తిని ఆయ‌న ఎంతో బాగా గ్ర‌హించారు. ఈ కార‌ణంగా విద్య‌ను, సంస్కృతిని పెంపొందించ‌డం కోసం ఆయ‌న ఒక్క కేర‌ళ‌లోనే కాకుండా స‌మీప రాష్ట్రాల‌లో సంస్థ‌ల‌ను నెల‌కొల్పారు. ఈ రోజు దేశ, విదేశాల‌లో అసంఖ్యాక సంస్థ‌లు శ్రీ నారాయ‌ణ గురు దార్శ‌నిక‌త‌ను వ్యాప్తి చేయ‌డం లో నిమ‌గ్నం అయ్యాయి.

శ్రీ నారాయ‌ణ గురు త‌న దార్శ‌నిక‌త‌తో స‌మాజంలోని ప్ర‌తి ఒక్క‌రిని స‌న్నిహితుల‌ను చేసే దిశ‌గా కృషి చేశారు. అద్భుతాల‌ను గురించి వల్లించే క‌న్నా, ఆల‌యాల‌లో సత్యానికి మ‌రియు శుభ్ర‌త‌కు ఆయ‌న పెద్ద పీట వేశారు. దేవాలయాల‌లో వాతావ‌ర‌ణాన్ని క‌లుషితం చేసే ప్ర‌తి ఆచారాన్ని ఆయ‌న మార్చారు. భక్తికై పాటించే అంత‌గా అవ‌స‌రం లేని ఆచారాల‌ను తొల‌గించ‌డం ద్వారా శ్రీ నారాయ‌ణ గురు గారు ఒక కొత్త నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ‌ను తీసుకు వ‌చ్చారు. దేవాల‌యాల‌లో ఆరాధించేందుకు ప్ర‌తి ఒక్క‌రికి హ‌క్కులు ఉండేట‌ట్టుగా ఆయ‌న చూశారు. శివ‌గిరి తీర్థయాత్ర ఒక ర‌కంగా సంఘ సంస్క‌ర‌ణ ప‌ట్ల ఆయ‌న యొక్క స్థూల దార్శ‌నిక‌త‌కు ఒక పొడిగింపే. విద్య‌ తోను, ప‌రిశుభ్ర‌త‌ తోను, యదార్థం, ఐక‌మ‌త్యం, విజ్ఞానం, శాస్త్ర విజ్ఞానం, వ్య‌వ‌సాయదారులతోను శివ‌గిరి తీర్థయాత్ర ముడిప‌డటం శ్రీ నారాయ‌ణ గురు దార్శ‌నిక‌త‌కు ఒక సంకేత చిహ్నం. అంతే కాక వాటి అభివృద్ధిని ఈ తీర్థయాత్ర లక్ష్యాలలో భాగంగా చేర్చడం జరిగింది.

ఆయ‌న-

“మీకు ఉన్న విజ్ఞానాన్నంత‌టినీ ఆచరణీయ జీవితంలో ఉపయోగించండి. అలా చేసిన‌ప్పుడు ప్ర‌జ‌లతో పాటు దేశ‌ం సమృద్ధమవుతుంది. శివ‌గిరి తీర్థ‌యాత్ర యొక్క ప్ర‌ధాన ధ్యేయం ఇదే” అని వివరించారు.

గ‌త 85 సంవ‌త్స‌రాల‌లో శివ‌గిరి తీర్థ‌యాత్ర జరిగిన ప్రతి ఒక్క సంద‌ర్భంలోనూ ఆయా రంగాల‌ నిపుణుల‌ను పిలిపించుకొని, వారి అనుభ‌వాలను ఆలకించడమనేది నాకు సంతోషాన్నిచ్చినటువంటి విష‌యం. ఈ రోజుకు కూడా వివిధ రంగాల నిపుణులు ఈ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకొంటున్నారు. మీ అంద‌రికీ ఇదే నా ఆహ్వానం, ఇదే నా అభినందన కూడాను. మీ ఆలోచ‌న‌లు ప్ర‌జ‌ల‌కు ఏదైనా కొత్త విష‌యాన్ని నేర్చుకోవ‌డంలో తోడ్ప‌డుతాయ‌ని నేను ఆశిస్తాను.

సోద‌రులు మ‌రియు సోద‌రీమ‌ణులారా,

శివ‌గిరి తీర్థ‌యాత్ర ఒక విధ‌మైన విజ్ఞాన స్రోతస్విని. ఈ నదిలో మున‌క వేసిన‌వారు ఎవ‌రైనా దివ్య‌త్వాన్ని పొందుతారు.

కుంభ‌ మేళా కాలంలో సైతం, ఈ విశాల దేశాన్ని ఏకం చేసే య‌త్నం జ‌రుగుతుంది. సాధువులు, సంతులు ఒక చోటుకు వ‌చ్చి చేరి స‌మాజం యొక్క స‌మ‌స్య‌ల‌ను, క్లేశాల‌ను గురించి చ‌ర్చిస్తారు. కాల క్ర‌మంలో కొన్ని మార్పులు జ‌రిగినప్పటికీ, కుంభ‌ మేళాలో ఒక ప్ర‌త్యేక‌త ఉన్నది. ప్ర‌తి 12 సంవ‌త్స‌రాల కు సాధువులంతా గుమికూడి స‌మాజం యొక్క భ‌విత‌వ్యాన్ని, దేశం ఏ దిశ‌లో సాగాలి, స‌మాజం ఏ ర‌కంగా వ్యవహరించాలనేది నిర్ణ‌యిస్తారు. ఇవి ఒక విధంగా సామాజిక తీర్మానాల వంటి వన్న మాట‌. దాని త‌రువాత ప్ర‌తి 3 ఏళ్ళ‌కు నాసిక్‌, ఉజ్జ‌యిని ల వంటి వేర్వేరు చోట్లలోను మరియు ఒక్కొక్క సారి కుంభ‌ మేళా కాలంలో హ‌రిద్వార్ లోను వీటిని విశ్లేషించ‌డం జ‌రుగుతుంది. ప్ర‌తిదీ స‌రైన స‌మీక్ష‌కు లోన‌వుతుంది.

ఈ సంవ‌త్స‌రం ముగింపులో ఈ సంద‌ర్భంగా మీరు భేటీ అయిన‌ప్పుడు, నిరుటి చ‌ర్చ‌ల ఫ‌లితం పైన ఒక అర్థ‌వంత‌మైన చ‌ర్చ జరుగుతుందని నేను ఆశిస్తాను. శ్రీ నారాయ‌ణ గురు చూపించిన మార్గంలో ల‌క్ష్యాల‌ను సాధించ‌డంలో మ‌నం ఏ కొని అడుగులనైనా ముందుకు క‌దిపామా లేదా?

స్నేహితులారా,

అది శివ‌గిరి తీర్థయాత్ర కానివ్వండి లేదా కుంభ‌ మేళా కానివ్వండి లేదా ఏ సంప్ర‌దాయ‌మైనా కానివ్వండి, లేదా దేశాన్ని దాని లోప‌లి చెడుల బారి నుండి విముక్తం చేసేట‌టువంటి మరేదైనా అటువంటి సంప్రదాయం కానివ్వండి.. ఇవి ఈ నాటికీ అతి ముఖ్య‌మైన‌టువంటివి. దేశంలోని భిన్న ప్రాంతాల‌లో జ‌రిగే అటువంటి తీర్థయాత్ర‌లు దేశాన్ని ఏకం చేయ‌డంలో తోడ్ప‌డుతాయి. ఒకరు మరొకరి సంప్ర‌దాయాల‌ను గురించి తెలుసుకోవడం కోసం వేరువేరు సిద్ధాంతాల‌ను అనుస‌రించే విభిన్న రాష్ట్రాల నుండి ప్ర‌జ‌లు తరలివచ్చి, ఈ ప్రక్రియలో ఒక్క‌ట‌వుతారు.

స్నేహితులారా,

ఆది శంక‌రాచార్య త‌న అద్వైత త‌త్త్వాన్ని వ్యాప్తి లోకి తీసుకువ‌చ్చింది ప‌విత్ర‌మైన కేర‌ళ గ‌డ్డ మీది నుండే. అద్వైతానికి స‌ర‌ళ‌మైన అర్థం ఏమిటంటే ద‌్వందానికి తావు లేక‌పోవ‌డ‌మే. అక్క‌డ మీరు మ‌రియు నేను రెండు అస్తిత్వాల‌ము కాము; మ‌నమంతా ఒక్క‌టే. ఇదే అద్వైతం యొక్క నిజ‌ ప్ర‌క‌ట‌న‌. శ్రీ నారాయ‌ణ గురు చూపించింది ఈ మార్గాన్నే. తాను బోధించిన సిద్ధాంతాన్ని త‌న జీవితంలో ఆచ‌రించి చూపారు శ్రీ నారాయ‌ణ గురు. అంతేకాదు, ఈ దారిని యావ‌త్ ప్ర‌పంచ స‌ముదాయానికి చూపెట్టారు ఆయన.

సోద‌రులు మ‌రియు సోద‌రీమ‌ణులారా,

శివ‌గిరి తీర్థ‌యాత్ర మొద‌లు కావ‌డాని క‌న్నా ముందుగానే శ్రీ నారాయ‌ణ గురు గారి నాయ‌క‌త్వంలో అద్వైత ఆశ్ర‌మంలో మ‌త సంబంధి పార్ల‌మెంటును నిర్వ‌హించ‌డం జ‌రిగింది. ప్ర‌పంచం న‌లుమూల‌ల నుండి వేరు వేరు జీవ‌న ప‌థాల‌కు చెందిన వారు ఇందులో పాల్గొన్నారు. మ‌త పరమైన విభేదాలను విడ‌నాడాల‌ని, శాంతి, స‌ద్భావ‌న మ‌రియు స‌మృద్ధిల బాట‌లో న‌డ‌వాల‌ని ఈ రిలిజస్ పార్ల‌మెంట్ లో యావ‌త్ ప్ర‌పంచానికి ఒక విన్న‌పం చేయ‌డం జ‌రిగింది.

ఈ ధార్మిక పార్ల‌మెంటు ప్ర‌వేశ ద్వారం వ‌ద్ద గురువు గారి ఆదేశాల మేర‌కు దిగువన పేర్కొన్న ప‌దాల‌ను లిఖించ‌డం జ‌రిగినట్టు నా దృష్టికి తీసుకువ‌చ్చారు.

“మ‌నం ఇక్క‌డ క‌లుసుకుంటున్న‌ది వాదులాడి గెల‌వ‌డం కోసం కాదు,

తెలుసుకోవ‌డానికి, తెలుసుకోబ‌డ‌డానికే”

ఒక‌రు మ‌రొక‌రితో వారి సందేశాన్ని చెప్పుకొనేందుకు మ‌రియు ఒక‌రు మ‌రొక‌రిని అర్థం చేసుకొనేందుకు సాగించే ఈ ప్ర‌య‌త్నం చాలా ముఖ్య‌మైన‌టువంటిది.

ఈ రోజున మ‌నం ప్ర‌పంచ వాతావ‌ర‌ణాన్ని గురించి మాట్లాడుకొన్న‌ట్ల‌యితే మ‌న మునులు సంక్షోభాన్ని ముంద‌స్తుగా ఎరిగి, మ‌న‌కు అదే ప‌నిగా హెచ్చ‌రిక‌లను చేస్తూ వ‌చ్చార‌న్న సంగ‌తిని మ‌నం గ్ర‌హించవచ్చును.

సోద‌రులు మ‌రియు సోద‌రీమ‌ణులారా,

19వ‌ మ‌రియు 20వ శ‌తాబ్దాల కాలంలో సామాజిక సంస్కరణలకు మ‌రియు మ‌త పరమైన సంస్క‌ర‌ణ‌ల‌కు చొర‌వ తీసుకున్న నాయ‌కులు స్వాతంత్య్ర ఉద్య‌మానికి ఎంతో తోడ్పాటును అందించారు. కులాలుగా మ‌రియు వ‌ర్గాలుగా ముక్క‌చెక్క‌లైన స‌మాజం బ్రిటిషు వారితో పోరాడి ఉండేదే కాదు. ఈ బ‌ల‌హీన‌త‌ను అధిగ‌మించ‌డం కోసం దేశంలోని వేరువేరు ప్రాంతాలలో కుల‌తత్త్వానికి వ్య‌తిరేకంగా ఒక భారీ ఉద్య‌మం రూపుదాల్చింది. ఈ ఉద్య‌మాల మ‌రియు సంస్క‌ర‌ణ కార్య‌క్ర‌మాల యొక్క కేంద్ర బిందువు ఏదంటే, దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళి దాస్య శృంఖ‌లాల‌ను ఛేదించ‌డమూ మ‌రియు అంత‌ర్గ‌త దుర్భ‌ల‌త్వాలను ఏరిపార‌వేయ‌డ‌మూను అని చెప్పాలి. ఈ ఉద్య‌మాల‌కు నాయకత్వ స్థానంలో నిలచిన వారు దేశంలోని సామాన్య ప్ర‌జానీకానికి స‌మాన‌మైన‌టువంటి ఆదరణను ఇచ్చారు. వారు వారి యొక్క ఆధ్యాత్మిక ప్ర‌స్థానాన్ని దేశం యొక్క అవ‌స‌రాల‌ను ఆక‌ళింపు చేసుకోవ‌డం ద్వారా జాతి నిర్మాణంతో ముడి వేయ‌గ‌లిగారు. కుల వ్య‌వ‌స్థ నుండి ప్ర‌జ‌లు వారి ఆలోచ‌న‌ల‌ను ఎప్పుడైతే తెగ‌దెంపులు చేసుకోవ‌డం ఆరంభించారో దేశం త‌ల ఎత్తుకొంది. భార‌త‌దేశంలోని స‌మైక్య ప్ర‌జానీకం బ్రిటిషు వారిని గ‌ద్దె దించ‌గ‌లిగింది.

స్నేహితులారా,

దేశం ప్ర‌స్తుతం ఇదే ప‌రిస్థితిని మ‌రోమారు ఎదుర్కొంటోంది. ఈ దేశ ప్ర‌జ‌లు వారి దేశం అంత‌ర్గ‌త దుర్భ‌ల‌త్వాల నుండి విముక్తం కావాల‌ని కోరుకొంటున్నారు. ఈ విష‌యంలో అటువంటి వేలాది సంస్థ‌లు ఒక కీల‌క‌మైన పాత్ర‌ను పోషించ‌గ‌లవు. ప్ర‌జ‌ల‌ను మేలుకొల్పే దిశ‌గాను, జాతి ద్వేషాన్ని తొలగించడంతో పాటు దేశానికి హాని చేస్తున్నటువంటి స‌మాజంలోని ఇత‌ర చెడుల‌ను తొలగించవ‌ల‌సిన అవ‌స‌రం ఉంది. మ‌నం 1947 ఆగ‌స్టు 15వ తేదీన బానిస‌త్వ సంకెళ్ళ‌ను ప‌గుల‌గొట్ట గ‌లిగిన‌ప్ప‌టికీ, మ‌న సామాజిక‌- ఆర్థిక వ్య‌వ‌స్థల పైన ఆ గొలుసుల ఆన‌వాళ్ళు ఇంకా క‌నిపిస్తూనే ఉన్నాయి. మీ అండదండలతో మాత్ర‌మే దీని నుండి మేం బయట ప‌డగ‌లం.

సోద‌రులు మ‌రియు సోద‌రీమ‌ణులారా,

జ్యోతిబా ఫులే, సావిత్రీబాయి, రాజా రామ్ మోహ‌న్ రాయ్‌, ఈశ్వ‌ర్ చంద్ర విద్యాసాగ‌ర్ మ‌రియు ద‌యానంద స‌రస్వ‌తి ల వంటి మ‌హ‌నీయులు స‌మాజంలో మ‌హిళ‌ల గౌర‌వ స‌న్మానాల కోసం ఒక సుదీర్ఘ‌మైన పోరాటం జ‌రిపారు. ఈ రోజు దేశంలో మ‌హిళ‌ల హ‌క్కుల కోసం తీసుకొన్న‌టువంటి అనేక ప్ర‌ధాన చ‌ర్య‌ల‌ను చూసి వారి ఆత్మ‌లు సంతోషించగలుగుతాయి.

మూడుసార్ల త‌లాక్ వ‌ల్ల ఎంతో కాలంగా అనేక మంది ముస్లిమ్ సోదరీమణులు మరియు ముస్లిమ్ మ‌హిళ‌లు బాధితుల‌య్యార‌న్న వాస్తవం ఇకపై ఎంతో కాలం మరుగున పడిపోదు. అటువంటి దీర్ఘకాలపు యుద్ధం అనంత‌రం మూడు మార్ల త‌లాక్ బారి నుండి బ‌య‌టప‌డే మార్గాన్ని వారు కనుగొన్నారు.

సోద‌రులు మ‌రియు సోద‌రీమ‌ణులారా,

సాధువులు, మునులు, రుషులు మ‌న‌కు-

“नर करनी करे तो नारायण हो जाए”।

అంటూ ప్ర‌వ‌చించారు.

ఈ మాట‌ల‌కు-
వ‌ల్లింపులు లేదా మ‌త ఆచారాల ద్వారా కాక,
ఏదైనా సాధించిన‌ప్పుడే ఒక‌ వ్యక్తి నారాయ‌ణుడు కాగ‌లుగుతారు
.. అని భావం. ఈ సంక‌ల్ప‌మే మా యొక్క ‘సంక‌ల్ప్ సే సిద్ధి’ (సంక‌ల్పం ద్వారా సాధ‌న‌) మంత్రం. 125 కోట్ల మంది భార‌తీయులు న‌వ భార‌తం (New India) దిశ‌గా చేసే ప్ర‌యాణం ఇది.

2018వ సంవ‌త్స‌రంలో ఈ యాత్ర వేగం పుంజుకోనుంది. 2018వ సంవ‌త్సరంలో న‌ల్ల‌ధ‌నం, అవినీతి మ‌రియు బినామీ ఆస్తులపైన కఠిన చర్యలను తీసుకోవడం, ఉగ్ర‌వాదానికి, జాతి ద్వేషానికి వ్య‌తిరేకంగా కృషి చేయ‌డంతో పాటు ‘సంస్క‌రించు, ప‌నిచేయు మ‌రియు మార్చు’, ఇంకా ‘స‌బ్‌కా సాథ్ స‌బ్‌కా వికాస్‌’ మంత్రాల స్ఫూర్తితో ముందుకుపోవ‌డం ద్వారా మ‌న భార‌తీయులం అందరమూ మ‌న దేశాన్ని కొత్త శిఖ‌రాల‌కు చేర్చనున్నాం. ఈ విధ‌మైన వాగ్దానాల‌తో, సంక‌ల్పాతో నేను నా ఉప‌న్యాసాన్ని ముగించాల‌నుకొంటున్నాను.

మీకంద‌రికీ, శ్రీ నారాయ‌ణ గురు భ‌క్తుల‌కు మ‌రోసారి ఇవే నా శివ‌గిరి తీర్థ‌యాత్ర, ఇంకా నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు.

అలాగే బహుళమైన ధ‌న్య‌వాదాలు!

***