Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కాశ్మీర్ నుంచి వ‌ల‌స పోయిన వ్య‌క్తుల పున‌రావాసం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగాల క‌ల్ప‌న


కాశ్మీర్ నుంచి వ‌ల‌స వెళ్ళిన కుటుంబాల పున‌రావాసానికి సంబంధించి కేంద్ర మంత్రివ‌ర్గం రెండు కీల‌క నిర్ణ‌యాల‌ను తీసుకుంది. వాటిలో మొద‌టిది అటువంటి వారికి రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను క‌ల్పించ‌డం కాగా, రెండ‌వ‌ది కాశ్మీర్ లోయ‌లో వారికి వ‌స‌తి స‌దుపాయాల‌ను స‌మ‌కూర్చ‌డం. మొత్తం రూ. 2 వేల కోట్ల అంచ‌నా వ్య‌యం ఉండ‌గ‌ల ఈ ప్ర‌తిపాద‌న‌ల‌ను ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర‌మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదించింది. జ‌మ్మూ – కాశ్మీర్‌లో ఉగ్ర‌వాదుల హింస‌, తీవ్ర‌వాదం పెచ్చుమీరిన నేప‌థ్యంలో కాశ్మీరీ పండిత్ వ‌ర్గాలతోపాటు కొంత‌మంది సిక్కులు ముస్లిం కుటుంబాలవారు అప్ప‌ట్లో కాశ్మీర్ లోయ‌లోని త‌మ నివాసాల‌ను వ‌దిలిపెట్టి వెళ్ళిపోవ‌ల‌సి వ‌చ్చింది. ప్ర‌స్తుతం జ‌మ్మూ, ఢిల్లీ ఎన్‌.సీ.ఆర్ ల‌తోపాటు దేశంలోని ఇత‌ర ప్రాంతాల్లో త‌ల‌దాచుకున్న కాశ్మీరీ వ‌ల‌స కుటుంబాల సంఖ్య దాదాపు 62 వేల వ‌ర‌కు ఉన్న‌ట్లు అధికారిక లెక్క‌లు చెబుతున్నాయి. కేంద్రం నూత‌నంగా ఆమోదించిన ప్ర‌తిపాద‌న ప్ర‌కారం కాశ్మీరీ వ‌ల‌స కుటుంబాల‌కు అద‌నంగా 3000 రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు అందివ‌స్తాయి. అలాగే రాష్ట్ర ప్ర‌భుత్వం ఉద్యోగాలు ఇచ్చిన / ఇవ్వ‌బోతున్న కాశ్మీరీ వ‌ల‌స‌వాద కుటుంబాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం అందించే ఆర్థిక స‌హాయంతో కాశ్మీర్ లోయ‌లో వ‌స‌తి స‌దుపాయాల‌ను నిర్మిస్తారు. ఇంత‌కుముందు 2008లో కాశ్మీర్ లోయను వ‌దిలిపెట్టి వెళ్ళిపోయిన‌వారు తిరిగి రావ‌డానికి వీలుగా రూ. 1618.40 కోట్ల ప్యాకేజీని అమ‌లుచేశారు. ఈ ప్యాకేజీలో భాగంగా కేంద్ర సాయంతో 3000 రాష్ట్ర ప్ర‌భుత్వ నౌక‌రీల‌ను భ‌ర్తీ చేయాల‌నుకున్నారు. ఇందులో 1963 మందికి ఇప్ప‌టికే కొలువులు చూపించారు. మిగ‌తావారికి కూడా ఉద్యోగాలు క‌ల్పించే ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. మ‌రోవైపు కాశ్మీర్ లోయ‌లో ఇలా కొత్త‌గా రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు పొందిన 469 మందికి గృహ వ‌స‌తి చూపించారు.