జోహార్!
జనజాతీయ గౌరవ దివస్ వేడుకల్లో భాగస్వాములవుతూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి అనుసంధానమైన మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయనకు అత్యంత భక్తిశ్రద్ధలతో వినమ్రంగా నమస్కరిస్తున్నాను. గిరిజన సమాజ ఆత్మగౌరవానికి, భగవాన్ బిర్సా ముండా అందించిన స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జాతీయ వేడుక జనజాతీయ గౌరవ దివస్. ఇదే స్ఫూర్తితో నేడు దేశవ్యాప్తంగా జనజాతీయ గౌరవ దివస్ వేడుకలను నిర్వహిస్తున్నారు. దేశం నేడు తన గిరిజన వీరులు, వీరవనితలను గర్వంగా స్మరించుకుంటోంది. ముఖ్యంగా మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఇంత భారీ జనసమూహం ఈ కార్యక్రమంలో పాల్గొంటోంది. నా కంటికి కనిపించినంత మేర ఎటు చూసినా ప్రజలే కనిపిస్తున్నారు. గడ్చిరోలికి గొప్ప గిరిజన సాంస్కృతిక వారసత్వం ఉంది. రఘుజీ భాంగరే, భాగోజీ నాయక్, వీర బాబూరావు షెడ్మాకే వంటి వీరుల సాహసగాథలతో ఈ నేలకు విడదీయలేని అనుబంధం ఉంది. ఈ సందర్భంగా గిరిజన వీరులందరికీ వినమ్రంగా నివాళులర్పిస్తున్నాను. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గవర్నర్లు, గౌరవ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు.
మిత్రులారా!
2021 నవంబర్ 15న ప్రారంభమైన జనజాతీయ గౌరవ దివస్ వేడుకలు నేడు జాతీయ ఉత్సవంగా రూపుదిద్దుకున్నాయి. గత ఏడాది భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా కార్యక్రమాలు నిర్వహించాం. ఈ వేడుకల్లో కోట్లాది మంది పౌరులు పాల్గొన్నారు. ఒకప్పుడు మన దేశంలో అనేక జయంతి ఉత్సవాలు, స్మారక దినోత్సవాలు విదేశీ దృక్పథంతో రూపుదిద్దుకునేవి. కానీ నేడు భారత్ తన వారసత్వాన్ని, చరిత్రను, మహనీయులను స్వదేశీ ఆత్మగౌరవంతో సగర్వంగా స్మరించుకుంటోంది. మన జాతీయ చైతన్యంలో చోటుచేసుకుంటున్న గొప్ప మార్పునకు ఇది ప్రతీక.
మిత్రులారా!
ఖాసీ కొండల్లో తిరోట్ సింగ్ సాగించిన పోరాటం, చోటానాగ్‌పూర్‌లో కోల్ ఉద్యమం, సిధో, కాన్హో నాయకత్వంలో సాగిన సంతాల్ విప్లవం… ఇలా అన్యాయానికి వ్యతిరేకంగా గిరిజన సమాజం ఎప్పుడూ తన గళాన్ని వినిపిస్తూనే ఉంది. మాన్‌గఢ్ నేలపై గోవింద్ గురు అనుచరులు దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. రాణి గైడిన్ల్యూ, తాంత్యా భిల్ వంటి ఎందరో వీరులు, వీరవనితలు తమ ధైర్యసాహసాలతో దేశ ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. అల్లూరి సీతారామరాజు, రాణి దుర్గావతి వంటి మహనీయులు కూడా గిరిజన ఉద్యమాలకు నూతన ఉత్తేజాన్ని అందించారు. ఈ సాహసగాథలకు తోడు, భగవాన్ బిర్సా ముండా నాయకత్వం వహించిన ‘ఉల్గులాన్’ ఉద్యమం, పిన్న వయసులోనే ఆయన సాగించిన అలుపెరగని పోరాటం నేటికీ కోట్లాది మంది భారతీయులలో స్ఫూర్తి నింపుతూనే ఉన్నాయి.
మిత్రులారా!
నేడు జనజాతీయ గౌరవ దివస్ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గిరిజన అభివృద్ధికి సంబంధించిన 170కి పైగా ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు, మరో 70కి పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. మిజోరంలో గొప్ప స్వాతంత్ర్య సమరయోధురాలు రోపుయిలియాని జీకి అంకితంగా నిర్మించిన మ్యూజియాన్ని ప్రారంభించాం. అరుణాచల్ ప్రదేశ్‌లో గిరిజన పరిశోధనా సంస్థకు చెందిన నూతన భవనాన్ని కూడా ప్రారంభించాం. వీటితో పాటు, నేడు ప్రారంభించిన ప్రాజెక్టుల్లో విద్యాసంస్థలు, వైద్య సదుపాయాలు, గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్ కేంద్రాలు, గ్రామాల్లో మౌలిక వసతుల విస్తరణకు సంబంధించిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో దాదాపు రూ.3,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు, మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. ఈ ప్రాజెక్టుల సందర్భంగా మీ అందరికీ, దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు.
మిత్రులారా!
నేడు ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చకు వస్తున్న రెండు కీలక విజయాల నేపథ్యంలో జరుగుతోంది. మొదటిది, దేశంలో దాదాపు 50 కోట్ల మంది ప్రజలు తీవ్ర పేదరికం నుంచి బయటపడి మెరుగైన జీవన స్థితికి చేరుకోవడం. రెండోది, దేశం నక్సలిజం, మావోయిస్టు ఉగ్రవాదం నుంచి విముక్తి పొందడం. ఈ రెండు విజయాలు మన గిరిజన సోదరీసోదరుల జీవితాలతో ఎంతో సన్నిహితంగా ముడిపడి ఉన్నాయి. కొన్ని వారాల క్రితం ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారం, గత 12 – 13 ఏళ్లలో భారత్‌లో దాదాపు 50 కోట్ల మంది ప్రజలు తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారు. ఇది చాలా పెద్ద సంఖ్య. ఏకంగా 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడటం సాధారణ విషయం కాదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశం సాధించిన గొప్ప విజయాల్లో దీనిని ఒకటిగా నేను భావిస్తున్నాను. ఈ విజయం యావత్ దేశానికి చెందుతుంది. దీనికి ఏ ఒక్క ప్రభుత్వానికో మాత్రమే ఘనతను ఆపాదించలేం. సమాజంలోని సమష్టి శక్తి, ప్రతి పౌరుడి కృషి, శ్రమ ఈ విజయం వెనుక ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, గిరిజనుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు కూడా ఈ విజయ సాధనలో కీలక పాత్ర పోషించాయి. ఈ ఘనత సాధించిన దేశ పౌరులందరికీ, ముఖ్యంగా గిరిజన సోదరీసొదరులకు నా హృదయపూర్వక అభినందనలు.
మిత్రులారా!
ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు పేదరికం నుంచి బయటపడటం అనేది నిజంగా ఒక గొప్ప మార్పు. సంకల్పం నుంచి సాఫల్యం వరకు సాగిన సుదీర్ఘ ప్రయాణానికి ఈ మార్పు నిదర్శనం. భారత్ తన సంకల్పాలను నెరవేర్చగలదని, ప్రతి భారతీయుడు ఉన్నత లక్ష్యాలను సాధించగలడనే ఆత్మవిశ్వాసాన్ని ఇది కలిగించింది. దశాబ్దాలుగా అభివృద్ధి ఫలాలకు దూరంగా ఉండిపోయిన వారికి ప్రాధాన్యతనివ్వాలని మేం సంకల్పించాం. ఈ సంకల్పాలు క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చడం ప్రారంభమైన కొద్దీ సానుకూల మార్పుల పరంపర మొదలైంది. జీవితానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు కూడా అందని, అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం మా ప్రభుత్వం తన శక్తినంతా ధారపోసింది. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం – జన్మన్), ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకాల కోసం రూ.లక్ష కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయించాం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా అభివృద్ధి ఫలాలు అందుకోవడంలో అందరికంటే చివరన ఉన్న కుటుంబాలకు ఇప్పుడు ఆ సదుపాయాలను అందరికంటే వేగంగా అందించాలన్నదే మా ప్రయత్నం.
మిత్రులారా,
“నిరుపేదలకు ప్రాధాన్యం — ఇదే మా ప్రథమ కర్తవ్యం. దేశవ్యాప్తంగా పేద కుటుంబాల కోసం నాలుగు కోట్లకు పైగా పక్కా ఇళ్లు నిర్మించాం. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచినా విద్యుత్ సౌకర్యం పొందలేకపోయిన 18,000 గ్రామాలకు కరెంట్ సౌకర్యం అందించాం. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయాన్ని కల్పించాం. దేశవ్యాప్తంగా 1.75 లక్షలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ఏర్పాటుతో, మారుమూల గిరిజన ప్రాంతాలకూ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. పేద కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించి, పారిశుద్ధ్య సౌకర్యాలను మెరుగుపరచడం వల్ల అనేక వ్యాధుల ముప్పూ తగ్గింది.”
మిత్రులారా,
పేదరికాన్ని జయించాలంటే… నిరుపేద కుటుంబాలకు మరిన్ని ఆదాయ మార్గాలను అందుబాటులోకి తేవడం ముఖ్యం. ముద్రా యోజన ద్వారా మేం ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణాలు అందించాం. ఈ పథకం కింద లక్షల కోట్ల రూపాయల విలువైన ఆర్థిక సహాయం అందించాం. ఈ పథకాలన్నింటి ప్రయోజనాలు పేదలకు, దళితులకు, వెనకబడిన వర్గాలకు, మన గిరిజన సోదరీసోదరులకూ అందాయి. ఇది వారిలో పురోగతి సాధించగలమనే ఆత్మవిశ్వాసాన్ని నింపింది.
మిత్రులారా,
దీర్ఘకాలంగా అభివృద్ధిలో వెనకబడి ఉన్న ప్రాంతాలపై మేం ప్రత్యేక దృష్టి సారించాం. అభివృద్ధి, మెరుగైన సౌకర్యాలు, పౌరుల హక్కుల రక్షణ కోసం 100కు పైగా ఆకాంక్షాత్మక జిల్లాలు, 500కు పైగా ఆకాంక్షాత్మక మండలాల్లో ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించాం. ఈ ప్రాంతాల్లో ఎక్కువ భాగం గిరిజన జనాభా ఉంది. పీఎం కృషి ధన్ ధాన్య యోజన కింద వ్యవసాయ రంగంలో వెనకబడి ఉన్న 100 జిల్లాలపైనా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. ఈ ప్రాంతాల రైతులు, పేద కుటుంబాలు, గిరిజన వర్గాలకు కొత్త అవకాశాలను కల్పించడమే మా ప్రయత్నం. ఈ సమష్టి కృషి, ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్‘ మంత్రం దేశంలోని పేదలకు కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి. దీనివల్ల కోట్లాది మంది పేదలు పేదరికం నుంచి బయటపడటంలో విజయం సాధించారు.
మిత్రులారా,
నేను ప్రస్తావించే రెండో విజయం — నక్సలిజం, మావోయిజం నుంచి విముక్తి. నక్సలైట్ల హింస వల్ల మన గిరిజన వర్గాలకు అత్యధిక నష్టం జరిగిందనే విషయం గడ్చిరోలి ప్రజలకూ, దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన ప్రాంతాల ప్రజలకూ బాగా తెలుసు. 2014లో దేశంలోని దాదాపు 125 జిల్లాలు మావోయిజం, నక్సలిజం ప్రభావానికి గురయ్యాయి. ప్రతి సంవత్సరం వందలాది హింసాత్మక ఘటనలు జరిగేవి. ఈ ఘటనల్లో వేలాది మంది అమాయకులు తమ ప్రాణాలను కోల్పోయారు. మరణించిన వారిలో అత్యధిక సంఖ్యలో మన గిరిజన సోదరీసోదరులే ఉన్నారు.
మిత్రులారా,
మావోయిజం, నక్సలిజం బారిన పడిన నా సోదరీసోదరులను అప్పటి ప్రభుత్వాలు వారి కర్మకు వారిని వదిలేశాయి. వారి హక్కులను కాలరాశాయి. అందరూ మౌనంగా కూర్చుని, నోరు మెదపకుండా ఉండిపోయారు. మన గిరిజన వర్గాలకు చెందిన ఈ సోదరీసోదరులను కనీసం ఓటు కూడా వేయనివ్వలేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అప్పటి ప్రభుత్వాలు కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ, కళ్లు మూసుకుని కూర్చున్నాయి. పేద తల్లుల నుంచి చిన్న పిల్లలను మావోయిస్టులు, నక్సలైట్లు ఎత్తుకెళ్లిపోతుంటే ఎవరూ ఏమీ చేయలేకపోయారు. మన ఇళ్లలోని ఆడపిల్లలను నక్సలైట్లు అపహరించుకుపోతుంటే, అందరూ నిస్సహాయ స్థితిలో ఆవేదనతో చూస్తూ ఉండిపోవాల్సి వచ్చేది.
మిత్రులారా,
ఇప్పుడు మావోయిజం, నక్సలిజం అంతమైనందున నా గిరిజన సమాజంలోని తల్లులు, సోదరీమణులు… మాపై ఆశీస్సుల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు సురక్షితంగా ఉన్నానని భావిస్తున్న ఆ సోదరి మమ్మల్ని దీవిస్తోంది. ఒకప్పుడు తమ బాల్యాన్ని కోల్పోయిన చిన్నారులు నేడు యువకులుగా మాతో కలిసి ముందుకు సాగుతున్నారు. వారికి విద్య, ఉపాధి అవకాశాలూ లభిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ వంటి ప్రాంతాలకు ఒకప్పుడు ప్రజలు వెళ్లడానికే భయపడేవారు. అయితే కొద్ది రోజుల కిందటే నేను స్వయంగా ఆ ప్రాంతపు నడిబొడ్డున మన భద్రతా దళాలతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నాను. ఈ దీపావళికి… గడ్చిరోలి సహా గతంలో నక్సల్ ప్రభావితమైన అన్ని ప్రాంతాల ప్రజలకూ కేవలం దీపాల వెలుగు మాత్రమే కాదు… వారి జీవితాల్లో కొత్త ఆశాకిరణాల వెలుగూ లభించింది.
మిత్రులారా,
మన గిరిజన సమాజం, మన జనజాతీయ వర్గం ప్రస్తుతం దేశ ప్రగతిలో ఎంతో ఉత్సాహంతో పాలుపంచుకుంటోంది. దేశ నాయకత్వం గిరిజన సమాజానికి చెందిన ఒక ఆడబిడ్డ చేతుల్లోనే ఉంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని చూసి మనమంతా గర్వపడుతున్నాం.
మిత్రులారా,
భగవాన్ బిర్సా ముండా స్ఫూర్తిగా… వికసిత్ భారత్ కల సాకారం కోసం మన పూర్తి శక్తిని అంకితం చేయాల్సిన సమయం ఇది. ఈ పిలుపు ద్వారా భగవాన్ బిర్సా ముండాకు ప్రణమిల్లుతూ, జనజాతీయ గౌరవ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం నవంబర్ 15వ తేదీ కోసం ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూసేలా ఈ వేడుకలు నిర్వహించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. భగవాన్ బిర్సా ముండా జయంతి… అంతకంటే మిన్నగా జనజాతీయ గౌరవ దినోత్సవం యావత్ దేశానికి గర్వకారణం, ఆత్మగౌరవానికి ప్రతీక. ప్రతి నవంబర్ 15న, మునుపటి కంటే మరింత బలంగా, మరింత ఉత్సాహంతో, మరింత ఘనంగా మనం ఈ వేడుకను జరుపుకుంటూ ముందుకు సాగాలి. జనజాతీయ గౌరవ దినోత్సవం రోజున మనం కొత్త సంకల్పాలు తీసుకుంటూ, నిర్ణీత కాలపరిమితిలో ఆ సంకల్పాలను నెరవేర్చడానికి మన సర్వశక్తులనూ ధారపోయాలి. స్వాతంత్య్రం వచ్చిన ఇన్ని దశాబ్దాల్లో ఏదైతే సాధ్యం కాలేదో… దానిని మనం అతి తక్కువ సమయంలోనే సాధించి చూపాలి. నేను స్క్రీన్ వైపు చూస్తున్నప్పుడు… అనేక ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలందరిలోనూ ఎంతో ఉత్సాహం, ఉత్తేజం కనిపిస్తున్నాయి. ఈ దృశ్యమే జనజాతీయ గౌరవ దినోత్సవానికి గౌరవాన్ని, వైభవాన్ని, గొప్పతనాన్నీ తీసుకొచ్చింది. ఇంతటి విజయవంతమైన ప్రయత్నం చేసినందుకు గిరిజన సమాజానికి చెందిన మీరంతా అభినందనలకు అర్హులు. మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీ అందరికీ చాలా ధన్యవాదాలు.
జోహార్.
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి అనువాదం.
***
Janjatiya Gaurav Diwas celebrates the rich heritage, culture and contributions of India's tribal communities. https://t.co/jaafdnMJ6n
— Narendra Modi (@narendramodi) November 15, 2026
15 नवंबर 2021 से जनजातीय गौरव दिवस मनाने की जो शुरुआत हुई, आज वो एक राष्ट्रीय उत्सव बन चुका है: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 15, 2026
एक समय था, जब हमारे देश में अनेक दिवस और उत्सव विदेशी दृष्टिकोण से तय होते थे। लेकिन आज भारत अपनी विरासत को, अपने इतिहास को, अपने नायकों को स्वदेशी स्वाभिमान के साथ याद कर रहा है। ये हमारी राष्ट्रीय चेतना में आए एक बड़े परिवर्तन का प्रतीक है: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 15, 2026
देश की दो बड़ी उपलब्धियों की चर्चा हर जगह हो रही है। पहली उपलब्धि है देश के करीब 50 करोड़ लोगों की भीषण गरीबी को परास्त करना। और दूसरी उपलब्धि है, देश का नक्सलवाद...माओवादी आतंक से मुक्ति पाना: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 15, 2026
हमने उन क्षेत्रों पर भी विशेष ध्यान दिया, जो लंबे समय तक विकास में पीछे रह गए थे। देश के 100 से अधिक आकांक्षी जिलों और 500 से अधिक आकांक्षी ब्लॉकों में विशेष अभियान चलाया। इनमें बड़ी संख्या में जनजातीय आबादी वाले क्षेत्र शामिल हैं। अब पीएम कृषि धन धान्य योजना के तहत कृषि के क्षेत्र में पिछड़े 100 जिलों पर भी विशेष ध्यान दिया जा रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 15, 2026