Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నేపాల్‌ లోని జ‌న‌క్‌ పుర్ లో గల బారాబీగా మైదానం లో ఏర్పాటైన పౌర స్వాగతం కార్యక్రమంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

నేపాల్‌ లోని జ‌న‌క్‌ పుర్ లో గల బారాబీగా మైదానం లో ఏర్పాటైన పౌర స్వాగతం కార్యక్రమంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

నేపాల్‌ లోని జ‌న‌క్‌ పుర్ లో గల బారాబీగా మైదానం లో ఏర్పాటైన పౌర స్వాగతం కార్యక్రమంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

నేపాల్‌ లోని జ‌న‌క్‌ పుర్ లో గల బారాబీగా మైదానం లో ఏర్పాటైన పౌర స్వాగతం కార్యక్రమంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం


ఇక్క‌డ ఉన్న ప్ర‌ముఖులు, పెద్ద సంఖ్య‌ లో ఇక్క‌డకు విచ్చేసిన
ప్రియమైన నా జ‌న‌క్‌ పుర్ సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

జయ్ సియా రామ్‌,

జయ్ సియా రామ్‌,

జయ్ సియా రామ్‌,

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

2014 ఆగ‌స్టు లో నేను తొలి సారి గా ప్ర‌ధాన‌ మంత్రి హోదా లో నేపాల్‌ కు వ‌చ్చిన‌పుడు నేను రాజ్యాంగ‌ పరిషత్తు లో ఒక మాట చెప్పాను; త్వ‌ర‌లోనే జ‌న‌క్‌ పుర్ ను సంద‌ర్శిస్తాను అని.  నేను జ‌న‌క్‌ పుర్ ను సంద‌ర్శించ‌డం కాస్త ఆల‌స్య‌మైనందుకు మీకు అంద‌రికీ క్ష‌మాప‌ణ చెబుతున్నాను.  బ‌హుశా సీతా మైయ్యా (సీతా మాత‌) ఈ రోజున‌, ఈ భ‌ద్ర‌కాళి ఏకాద‌శి నాడు నేను ఇక్క‌డ‌కు రావాల‌ని నిర్ణ‌యించారేమో.  జ‌న‌కుడి రాజ‌ధాని అయిన  ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించి సీతా మాత‌ కు న‌మ‌స్సుమాంజ‌లులు అర్పించాల‌న్న‌ది ఎప్పటి నుండో నాకు కోరిక.  ఈ రోజు జాన‌కీ మాత దేవాల‌యాన్ని సంద‌ర్శించడం ద్వారా నా చిర‌కాల స్వ‌ప్నం సాకార‌ం అయింది.  నా కోరిక‌ నెరవేరినందుకు ఈ జీవితంలో నేను ఎంతో ధ‌న్యుడిని.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

భారతదేశం, నేపాల్‌ లు రెండు దేశాలు అయినప్పటికీ మ‌న మైత్రి మాత్రం ఇటీవ‌లి కాలం నాటిది కాదు.  మ‌నం త్రేతాయుగం నాటి నుండి స్నేహితులం.  (యుగ యుగాల‌ నుండి మిత్రులం). జ‌న‌క‌ మ‌హారాజు, ద‌శ‌ర‌థ మ‌హారాజు జ‌న‌క్‌ పుర్‌, అయోధ్య ల మ‌ధ్య మాత్ర‌మే కాదు, భారతదేశం, నేపాల్‌ ల మ‌ధ్య స్నేహ‌ సంబంధాల‌ను, భాగ‌స్వామ్య సంబంధాల‌ను ఏర్ప‌ర‌చారు.  ఈ  రాముడు- సీత‌, బుద్ధుడు అలాగే మ‌హావీరుడి బంధం.. ఈ  బంధమే రామేశ్వ‌రం ప్ర‌జ‌ల‌ను ప‌శుప‌తినాథ్‌ కు వెళ్లేలట్టు చేస్తోంది.  ఈ బంధ‌మే లుంబిని ప్ర‌జ‌ల‌ను బోధ్ గ‌య‌ కు తీసుకువెళ్తోంది.  ఈ బంధం, ఈ ఆధ్యాత్మిక విశ్వాసం, ఈ ప్రేమ వంటివే న‌న్ను ఈ రోజున జ‌న‌క్‌ పుర్‌ కు తీసుకు వ‌చ్చాయి.

మ‌హాభార‌తం, రామాయ‌ణ కాలం నుండి కూడా జ‌న‌క్‌ పుర్ సంబంధం ఉంది.  మ‌హాభార‌త కాలం లోనే ఈ విరాట‌ న‌గ‌రం.  ఆ తరువాత సిమ్రానా గంజ్‌ ల బంధం ఉంది.  ఈ లుంబిని బంధం బుద్ధుడి కాలంలో ఉంది.  ఇలా ఈ బంధం ఎంతో కాలంగా కొనసాగుతోంది.  భారతదేశం- నేపాల్ మ‌ధ్య సంబంధాలు ఏ నిర్వ‌చ‌నానికీ లంకె పెట్ట‌లేనివి.  అయితే ఇది ఒక భావ‌న‌తో ముడిప‌డింది.  అది విశ్వాసం. ప్రేమ. కుమార్తె ల వివాహాలతో ఇరు వైపులా సంబంధాలు ఏర్ప‌డుతున్నాయి.  ఇది జాన‌కీమాత జ‌న్మ‌స్థ‌లం.  జానకీ మాత లేకుంటే అయోధ్య అసంపూర్ణం.

మ‌న త‌ల్లి, మ‌న విశ్వాసం, రెండూ ఒక‌టే.  మ‌న స్వ‌భావం, మ‌న సంస్కృతి రెండూ ఒక‌టే.  మ‌న విధానం, మ‌న ప్రార్థ‌న‌లూ అన్నీ ఒక్క‌టే.  మ‌న క‌ష్ట‌ప‌డే త‌త్వం, మ‌న శౌర్య‌ప్ర‌తాపాలూ ప‌రిమ‌ళిస్తున్నాయి.  మ‌న ఆశ‌లు, ఆకాంక్ష‌లు, మ‌న కోర్కెలు, మ‌న విధానాలూ అన్నీ ఒక్క‌టే.  మ‌న ఆకాంక్ష‌లు, మ‌న గ‌మ్యం కూడా ఒక్క‌టే.  ఇది క‌ష్ట‌ప‌డే త‌త్వం గ‌ల వారి పురుటి గ‌డ్డ‌.  వీరి కృషి భార‌త‌దేశం అభివృద్ధికి మ‌రింత‌గా దోహ‌ద‌కారి కాగ‌ల‌దు.  నేపాల్ లేకుండా భార‌త‌దేశ విశ్వాసాల‌కు సంబంధించిన వ్య‌వ‌స్థ అసంపూర్ణం.  నేపాల్ లేకుండా భార‌త‌దేశ‌పు విశ్వాసం, చ‌రిత్ర అసంపూర్ణం.  నేపాల్ లేకుండా మా యాత్రా స్థ‌లాలు అసంపూర్ణం.  నేపాల్ లేకుండా మన రాముడు కూడా అసంపూర్ణ‌మే.

సోద‌రులు మరియు సోదరీమ‌ణులారా,

మీ భ‌క్తి స‌ముద్రం కంటే లోతైన‌ది, మీ ఆత్మ గౌర‌వం సాగ‌ర‌మాత‌ కంటే పొడ‌వైంది.  మిథిల తుల‌సి ప‌విత్ర‌మైన ప‌రిమ‌ళాల‌ను భార‌త‌దేశ ప‌రివ్యాప్తం చేస్తున్న‌ట్టు నేపాల్ ప‌ట్ల భారతదేశం ఆత్మీయ‌త ఈ ప్రాంత‌మంతా శాంతి, భ‌ద్ర‌త‌, సంస్కృతి ల వంటి మూడింటితో విస్త‌రించి వుంది.

మిథిల సంస్కృతి, సాహిత్యం, జాన‌ప‌ద క‌ళారూపాలు, మిథిల ఆత్మీయ ఆతిథ్యం, అన్నీ మ‌హాద్భుతాలు.  దీనిని నేను ఈరోజు ఇక్క‌డ అనుభ‌వంలో చూస్తున్నాను.  నేను ఈరోజు మీ ప్రేమాభిమానాలు చూస్తున్నాను.  మీ ఆశీస్సుల‌ను అందుకోగ‌లుగుతున్నాను.  మిథిల సంస్కృతికి ప్ర‌పంచం లోనే అత్యున్న‌త స్థానం ఉంది.  క‌వి విద్యాప‌తి ర‌చ‌న‌ల‌కు భారతదేశంలో, నేపాల్‌ లో స‌మాన ప్రాధాన్య‌ం ఉంది.  ఆయ‌న ర‌చ‌న‌ల‌ లోని తియ్యంద‌నాల‌ను ఇటు నేపాల్‌ లో, అటు భార‌తదేశంలో  ఆస్వాదిస్తున్నారు.

ఇక జ‌న‌క్‌ పుర్ విష‌యానికి వ‌స్తే, మీ ప్రేమ‌, ఆద‌రాభిమానాల‌ను చూసిన త‌రువాత‌, నేను ఎక్క‌డా కొత్త వ్య‌క్తిని అన్న భావ‌న ఏదీ నాకు క‌ల‌గ‌లేదు.  అంతా మ‌న‌ వాళ్ళు, మ‌నం అన్న‌ భావ‌న క‌లిగింది.  ప్ర‌తి చోటా ప్రేమాభిమానాలు చూశాను.  అంతా మ‌న‌వాళ్లే.  మిత్రులే.  నేపాల్ ఆధ్యాత్మిక‌త‌ కు, తాత్విక‌త‌ కు కేంద్రంగా విలసిల్లింది.  లుంబిని గల ప‌విత్ర ప్ర‌దేశం ఇది.  ఆ లుంబిని లోనే బుద్ధ భ‌గ‌వానుడు జ‌న్మించారు.

మిత్రులారా, భూమాత కుమార్తె అయిన సీతా మాత  ఈ రెండు దేశాల‌ను ఒక‌టిగా క‌లిపే మాన‌వ విలువ‌ల‌కు  మాన‌వీయ సిద్ధాంతాల‌కు, సంప్ర‌దాయ‌ల‌కు ప్ర‌తీక‌.  ఈ జ‌న‌క భూమి, సీతా మాత కార‌ణంగా మ‌హిళా చైత‌న్యానికి స్ఫూర్తిగా నిలచింది.  త్యాగానికి, క్ష‌మ‌కు, నిబ‌ద్ధ‌త‌కు, పోరాటానికి సీతా మాత నిలువెత్తు నిద‌ర్శ‌నం.  కాఠ్ మాండూ నుండి క‌న్యాకుమారి వ‌ర‌కు మ‌నమంద‌రం సీతా మాత సంప్ర‌దాయ‌ల‌ను అనుస‌రించే వారం.  ఆమె గొప్ప‌తనాన్ని చెప్పుకోవాలంటే, ప్ర‌పంచ‌ం అంతటా ఆమె భ‌క్తులు విస్త‌రించి వున్నారు.

మ‌న ఆడ‌బిడ్డ‌ల‌ను ఎలా గౌర‌వించుకోవాలో మ‌న‌కు చూపిన పుణ్య‌భూమి ఇది.  మ‌న ఆడ‌బిడ్డ‌ల‌ను గౌర‌వించుకోవాల‌న్న పాఠం ఈ ఆధునిక స‌మాజంలో ఇవాళ అత్యంత ఆవ‌శ్య‌కం.  మ‌న సంప్ర‌దాయాలను, చ‌రిత్ర‌ను సుసంప‌న్నం చేయ‌డంలో మ‌హిళా శ‌క్తి కీల‌క పాత్రను పోషించింది.  ఇక్క‌డి మిథిలా పెయింటింగ్స్‌నే తీసుకోండి, ఈ సంప్ర‌దాయాన్ని ముందుకుతీసుకుపోవ‌డానికి మ‌హిళ‌లు ఎంతో కృషిచేస్తున్నారు.  ఇవాళ ఈ మిథిల క‌ళారూపం ప్ర‌పంచ వ్యాప్తంగా సుప్ర‌సిద్ధం.  ఈ క‌ళా రూపంలో ప్ర‌కృతి చైతన్యాన్ని, ప‌ర్యావ‌ర‌ణ చైత‌న్యాన్ని మ‌నం ద‌ర్శించ‌గ‌లుగుతున్నాము.  ఇవాళ మ‌హిళా సాధికారిత , జల వాయు పరివర్తన ల శ‌కంలో మిథిల నుండి ప్ర‌పంచానికి అందుతున్న గొప్ప సందేశం ఇది.  అద్భుత మేధస్సు క‌లిగిన  గార్గి వంటి వారు, అష్టావ‌క్ర వంటి వారు జ‌న‌క‌ మ‌హారాజు కొలువులో ఉండ‌డాన్ని బ‌ట్టి పాల‌న‌తో పాటు, ఆధ్యాత్మిక‌త‌కు, జ్ఞ‌ానానికి వారు ఎంత విలువ ఇచ్చారో అర్థ‌ం అవుతుంది.

జ‌న‌క‌ మ‌హారాజు కోలువులో అప్ప‌ట్లో పండితులు ప్ర‌జా సంక్షేమ విధానాల‌పై చ‌ర్చ‌లు చేసేవారు. జ‌న‌క‌ మ‌హారాజు  స్వ‌యంగా ఈ చ‌ర్చ‌ల‌లో పాల్గొనే వారు.  ఈ మేధో మ‌ధ‌న చ‌ర్చ‌ల‌ నుండి వ‌చ్చిన ప‌రిష్కారాల‌ను ప్ర‌జ‌ల ప్రయోజనాలను, దేశ ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకొని అమ‌లు చేసే వారు. జ‌న‌క‌ మ‌హారాజుకు ప్ర‌జ‌లే స‌ర్వ‌స్వం.  కుటుంబం, సంబంధ బాంధ‌వ్యాలు ఇవేవీ ఆయ‌న ప‌ట్టించుకోలేదు.  ప్ర‌జ‌లను గురించి ఆలోచించడం ఒక్క‌టే త‌న ధ‌ర్మ‌ంగా ఆయ‌న భావించారు.  అందుకే జ‌న‌క‌ మ‌హారాజు ను విదేహ అని కూడా పిలిచే వారు.  విదేహ అంటే త‌న దేహంతో కూడా సంబంధం లేని, త‌న‌ను తాను ప్ర‌జ‌ల‌కు అంకితం చేసుకున్న, ప్ర‌జా సంక్షేమానికి అంకిత‌మైన వ్య‌క్తి అని అర్థం.

సోద‌రులు మరియు సోద‌రీ మ‌ణులారా,

ఇవాళ‌ భారతదేశం, నేపాల్‌ లు ప్ర‌జాసంక్షేమం సందేశంతో, జ‌న‌క మ‌హారాజు సందేశంతో ముందుకు సాగుతున్నాయి.  భారతదేశం తో నేపాల్ సంబంధాలు రాజ‌కీయాలతో, దౌత్యంతో, వ్యూహాత్మ‌క‌త‌తో ముడిప‌డ్డాయి.  వీట‌న్నింటికీ మించి ఉభ‌య‌ దేశాలు మ‌న దేవ‌తా మూర్తులతో బంధం క‌లిగిన‌వి.  వ్య‌క్తులు, ప్ర‌భుత్వాలు వ‌స్తుండ‌వ‌చ్చు, పోతుండ‌వ‌చ్చు.  కానీ ఈ బంధం మాత్రం కల కాలం ఉంటుంది.  మ‌నం మ‌న విలువ‌లను, విద్య‌ను, శాంతిని, భ‌ద్ర‌త‌ను, సుసంప‌న్న‌త‌ను ప‌రిర‌క్షించుకోవ‌ల‌సిన స‌మ‌యం ఇది.   ప్రాంతీయ అభివృద్ధి కి నేపాల్ అభివృద్ధి మూల‌మ‌ని మేము విశ్వ‌సిస్తాము.  భారతదేశం, నేపాల్ ల మ‌ధ్య స్నేహ‌ స్వ‌భావం ఎటువంటిది ?  రామ‌చ‌రిత మాన‌స్‌ లోని ఈ పంక్తుల ద్వారా దీనిని మ‌నం బాగా అర్థం చేసుకోవ‌చ్చు.

जेनमित्रदु:खहोहिंदुखारी।

तिन्हहिबिलोकतपातकभारी॥

निजदु:खगिरिसमरजकरिजाना।

मित्रकदु:खरजमेरुसमाना॥

ఈ మాటలకు.. త‌న స్నేహితుల బాధ‌ల‌ను ప‌ట్టించుకోని వారి వైపు చూడ‌డం కూడా పెద్ద పాపం.  అందువ‌ల్ల మీ బాధ ఒక పెద్ద కొండంత ఉండ‌నీ, దానికి ప్రాధాన్య‌మివ్వ‌కు, నీ మిత్రుడికి ఏ చిన్న క‌ష్టం వ‌చ్చినా దానిని కొండంత క‌ష్టంగా భావించు.  వారికి  మీకు చేత‌నైనంత సాయం చెయ్యి అని..  అర్థం.

మిత్రులారా,

భారతదేశం లో లేదా నేపాల్‌ లో ఎప్పుడైనా విప‌త్తు వ‌చ్చిప‌డిన‌పుడు ఉభ‌య దేశాలూ క‌లిసి  క‌ట్టుగా నిల‌బ‌డ్డాయి.  క‌ష్ట స‌మ‌యాల‌లో ఒక‌రికి ఒక‌రం అండ‌గా ఉన్నాము.  ద‌శాబ్దాలుగా నేపాల్ అభివృద్ధిలో భార‌త‌దేశం శాశ్వ‌త భాగ‌స్వామిగా ఉంటూ వ‌స్తోంది.  నైబ‌ర్‌హుడ్ ఫ‌స్ట్ అన్న‌ మా విధానంలో నేపాల్ ముందుంటున్న‌ది.  ప్ర‌పంచం లో శ‌ర‌ వేగంతో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌లో మూడో అతి పెద్ద ఆర్థిక వ్య‌వస్థ‌గా ఎదిగేందుకు  భార‌త‌దేశం ముందుకు సాగిపోతోంది.  అలాగే మీ నేపాల్ కూడా శ‌ర‌వేగంతో అభివృద్ధి చెందుతోంది.  ఇవాళ ఈ భాగ‌స్వామ్యానికి కొత్త శ‌క్తి ని ఇచ్చేందుకు నాకు నేపాల్‌ కు వ‌చ్చే అవ‌కాశం ఈనాడు ద‌క్కింది.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

అభివృద్ధికి అత్యంత ముఖ్య‌మైన ష‌ర‌తు ప్ర‌జాస్వామ్యం.  మీరు ప్ర‌జాస్వామిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసుకుంటుండ‌డం నాకు సంతోషం క‌లిగిస్తోంది.  ఇటీవ‌లే మీ దేశంలో ఎన్నిక‌లు జ‌రిగాయి.  మీ ప్ర‌జ‌లు కొత్త ప్ర‌భుత్వాన్ని ఎన్నుకున్నారు.  మీ ఆశ‌ల, ఆకాంక్ష‌ల సాకారానికి తీర్పు చెప్పారు.  ఏడాది లో మూడు స్థాయి ల‌లో విజ‌య‌వంతంగా ఎన్నిక‌లు జ‌రుపుకున్నందుకు మీ అంద‌రికీ నా అభినంద‌న‌లు.  నేపాల్ చ‌రిత్ర‌ లో తొలిసారిగా నేపాల్‌ లోని ఏడు ప్రోవిన్స్‌లూ ప్రవిన్షల్ ప్ర‌భుత్వాల‌ను ఎన్నుకున్నాయి.  ఇది నేపాల్ ప్ర‌జ‌ల‌కే కాదు, భారతదేశానికి, ఈ ప్రాంత‌ వాసులంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం.  సుప‌రిపాల‌న‌, స‌మ్మిళిత అభివృద్ధి ప్రాతిప‌దిక‌లుగా నేపాల్ నూత‌న సామాజిక వికాసం దిశ‌గా ముందుకు సాగుతోంది.

ఈ సంవత్సరం యువ‌త‌ ప‌దేళ్ల క్రితం యువ‌త‌ లా కాకుండా బులిట్‌ కు బ‌దులు బ్యాలట్‌ ను ఎంచుకున్నారు.  ఈ సంద‌ర్భంగా నేను నేపాల్ ప్ర‌జ‌ల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను.  నేపాల్ ప్ర‌జ‌లు సంఘ‌ర్ష‌ణ ప‌థం నుండి బుద్ధుని మార్గం వైపునకు అర్థ‌వంత‌మైన మార్పు దిశ‌ గా సాగుతున్నందుకు ఇవే అభినంద‌న‌లు.  భారతదేశం, నేపాల్ ల మ‌ధ్య ప్రాచీన సంబంధ బాంధ‌వ్యాలు బ‌లోపేతం కావ‌డానికి మ‌రో ముఖ్య‌మైన బంధం ప్ర‌జాస్వామిక విలువ‌లు.  అత్యంత సామాన్యుడి నుండి అసాధార‌ణ వ్య‌క్తి వ‌ర‌కు ఎలాంటి అడ్డంకులు లేకుండా త‌న క‌ల‌ల‌ను సాకారం చేసుకోవ‌డానికి శ‌క్తిని ప్ర‌జాస్వామ్యం క‌ల్పిస్తుంది.  ఈ శ‌క్తి ని భార‌త‌దేశం స‌ద్వినియోగం చేసుకుంది.  భార‌త‌దేశం లోని ప్ర‌తి పౌరుడు త‌న క‌ల‌ల‌ను సాకారం చేసుకునేందుకు అంకిత‌మై ఉన్నాడు.  అలాంటి ఉత్సాహం, మెరుపు నేను మీ అంద‌రి క‌ళ్ల‌లో చూస్తున్నాను.  మీరు కూడా మీ నేపాల్‌ ను ఇదే పంథా లో ముందుకు తీసుకు పోవాల‌ని భావిస్తున్నారు.  అదే త‌ర‌హాలో నేపాల్ కోసం మీ క‌ల‌ల‌ను సాకారం చేసుకోవాల‌న్న ఆకాంక్ష మీ క‌ళ్ల‌లో క‌న‌బ‌డుతోంది.

మిత్రులారా,

నేపాల్ ప్ర‌ధాని శ్రీ ఓలీ గారికి ఢిల్లీ లో సాద‌ర స్వాగ‌తం ప‌లికే అవ‌కాశం ఇటీవ‌లే నాకు ద‌క్కింది.  నేపాల్ ప‌ట్ల వారి దార్శ‌నిక‌త‌ ను తెలుసుకొనే అవ‌కాశం ఆ సంద‌ర్భంగా నాకు లభించింది.  సుసంప‌న్న‌మైన‌, సుఖ సంతోషాల‌తో కూడిన నేపాల్‌ కోసం శ్రీ ఓలీ క‌ల‌లు కంటున్నారు.  భార‌త‌దేశం ఎల్ల‌వేళ‌లా సుసంప‌న్న‌మైన నేపాల్‌ ను ఆకాంక్షిస్తోంది.  125  కోట్ల మంది భార‌త ప్ర‌జ‌ల త‌ర‌ఫున‌, భార‌త ప్ర‌భుత్వం త‌ర‌ఫున నేను ప్ర‌ధాని శ్రీ ఓలీ కి శుభాకాంక్ష‌లు తెలియజేస్తున్నాను.  నేపాల్ కోసం వారు కంటున్న‌ స్వప్నాలు సాకారం కావాల‌ని కాంక్షిస్తున్నాను.  ఇదే దృష్టి నాకు భారతదేశం ప‌ట్ల ఉంది.

భారతదేశం లో మా ప్ర‌భుత్వం ‘స‌బ్‌ కా సాథ్‌, స‌బ్‌ కా వికాస్’ (అంద‌రినీ క‌లుపుకొని.. అంద‌రికీ ప్ర‌గ‌తి) సూత్రం పై ముందుకు సాగిపోతోంది.  భార‌త‌దేశం లోని ఏ ప్రాంతంము ఏ వ‌ర్గమూ కూడాను అభివృద్ధి ఫ‌లాలు అంద‌కుండా దూరంగా ఉండే ప‌రిస్థితి ఉండ‌కూడ‌ద‌న్న‌ది మా అభిమ‌తం.  అది తూర్పు ప్రాంతం కానివ్వండి, ప‌శ్చిమ ప్రాంతం కానివ్వండి; లేదా ఉత్త‌రాది కానివ్వండి, ద‌క్షిణాది కానివ్వండి;  అన్నిదిక్కు ల‌లో అభివృద్ధి రథం వేగంగా ప‌రుగులు తీస్తోంది.  ప్ర‌త్యేకించి  ఇప్ప‌టి వ‌ర‌కు అభివృద్ధి వెలుగులు సోక‌ని ప్రాంతాల‌పైన మా ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా దృష్టిని సారిస్తోంది.  ఈ పూర్వరంగంలో నేపాల్‌ ను ఆనుకుని ఉన్న భార‌తదేశ తూర్పు ప్రాంతం లోని పూర్వాంచ‌ల్‌ పైన ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వహించడం జ‌రుగుతోంది.  ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ నుండి బిహార్ వ‌ర‌కు, ఉత్త‌రాది నుండి తూర్పు ప్రాంతం వ‌ర‌కు, ప‌శ్చిమ బెంగాల్ నుండి ఒడిశా వ‌ర‌కు అన్ని ప్రాంతాల‌ను దేశం లోని మిగ‌తా ప్రాంతాల‌తో స‌మానంగా అభివృద్ధి లోకి తెచ్చేందుకు మేము ప్ర‌తిజ్ఞను స్వీకరించాము.  ఈ ప్రాంతంలో చేప‌ట్టే చ‌ర్య‌లు పొరుగు దేశంగా,  నేపాల్‌కు కూడా ప్ర‌యోజ‌న‌క‌రం కానున్నాయి.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణుల‌రా,

‘సబ్ కా సాథ్- సబ్ కా వికాస్’ ను గురించి నేను మాట్లాడుతుంటాను.  ఇది ఒక్క భార‌త‌దేశాన్ని ఉద్దేశించి మాట్లాడే అంశ‌మే కాదు.. భారతదేశం ఇరుగు పొరుగు దేశాల‌ను ఉద్దేశించి కూడా అంటున్న‌ మాట‌లు అవి.  నేపాల్‌లో..  ‘సమృద్ధమైన నేపాల్- సంతోష‌క‌ర‌మైన నేపాలీలు’ గురించి చర్చ‌లు జ‌రుగుతున్నాయి.  ఇది నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది.  నాతో పాటు 125 కోట్ల మంది భార‌తీయులు కూడా సంతోషిస్తున్నారు.  జ‌న‌క్ పుర్ కు చెందిన నా సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, భార‌త‌దేశంలో మేము ఒక భారీ నిర్ణ‌యాన్ని తీసుకున్నాము.  ఇది మ‌రేమిటో  కాదు ఒక న్యూ ఇండియా ను నిర్మించడాన్ని గురించిన నిర్ణయం.

భార‌త‌దేశం 2022 వ సంవత్సరానికల్లా స్వాతంత్ర్యం సముపార్జించుకొని 75 ఏళ్ల‌ు పూర్తి చేసుకోనుంది.  ఆ రోజు నాటికి ఒక న్యూ ఇండియా ను రూపొందించుకోవాల‌ని 125 కోట్ల మంది భార‌తీయులు ఒక ల‌క్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.  మేము ఒక న్యూ ఇండియా ను నిర్మిస్తున్నాం.  ఇందులో అత్యంత పేద‌వారికి సైతం అభివృద్ధి విష‌యంలో స‌మాన అవ‌కాశాలు ల‌భిస్తాయి.  ఈ న్యూ ఇండియా లో వివ‌క్ష ఉండ‌దు, పెద్ద చిన్న వ‌ర్గాలు ఉండ‌వు.  అంద‌రికీ స‌మాన‌మైన గౌర‌వం ల‌భిస్తుంది.  ప్ర‌తి చిన్నారికి విద్యా సౌక‌ర్యం దక్కుతుంది.  యువ‌తీయువ‌కులంద‌రికీ ఆదాయం, వృద్ధుల‌కు ఆరోగ్య‌ వైద్య సౌక‌ర్యాలు అందివస్తాయి.  ఈ న్యూ ఇండియా లో జీవ‌నం సులువుగా వుంటుంది.  వ్య‌వ‌స్థ కార‌ణంగా సాధార‌ణ పౌరుల‌కు వ‌చ్చే క‌ష్టాలు ఉండ‌వు.  అవ‌క‌త‌వ‌క‌లు, అవినీతి ఉండ‌వు.  అలాంటి న్యూ ఇండియా దిశ‌గా మేము ముందుకు సాగుతున్నాము.

మేము భార‌త‌దేశం లోను, ప‌రిపాలనా వ్య‌వ‌స్థ‌ లోను అనేక మార్పులు చేర్పులు చేశాము.   విధి విధానాల‌ను స‌ర‌ళీక‌రించాము.  మేము తీసుకున్న చ‌ర్య‌ల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి.  జాతి నిర్మాణానికి, ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యానికి మ‌ధ్య‌ గ‌ల బంధాన్ని మేము బ‌లోపేతం చేస్తూనే ఉన్నాము.  నేపాల్ సామాన్య పౌరుల జీవితాలు సౌభాగ్య‌వంతంగా మార్చేందుకు కృషి చేయ‌డానికి 125 కోట్ల మంది ప్ర‌జ‌లు ఎంతో సంతోషంగా ముందుకు వ‌స్తారు.  ఈ  హామీ ని ఇవ్వ‌డానికే నేను ఈ రోజున ఇక్క‌డ‌కు వ‌చ్చాను.

మిత్రులారా, మ‌నం ఇరు దేశాలలో ప‌ర్య‌ట‌న‌లు కొనసాగిస్తుంటే రెండు దేశాల మ‌ధ్య‌ సౌభ్రాతృత్వం మ‌రింత బ‌లోపేత‌ం అవుతుంది.  నేపాల్ ప్ర‌ధాని భార‌త‌దేశాన్ని సంద‌ర్శించిన వెంట‌నే నాకు నేపాల్ లో ప‌ర్య‌టించే అవ‌కాశం ల‌భించ‌డం, మీతో స‌మయాన్ని గ‌డుపుతుండ‌డం సంతోషంగా ఉంది.  నేను ఎలాగైతే ఇక్క‌డ‌కు త‌ర‌చుగా వ‌స్తున్నానో అలాగే ఉభయ దేశాల ప్ర‌జ‌లు కూడా స‌రిహ‌ద్దుల‌కు అటూ ఇటూ చాలా స్వేచ్ఛ‌గా సంచ‌రించాలి.

హిమాల‌య ప‌ర్వ‌తాలు రెండు దేశాల‌ను క‌లుపుతున్నాయి.  వ్య‌వ‌సాయ క్షేత్రాలు, పొలాలు, కొండ‌ మొద‌లు ప్రాంతాలు, లెక్క‌లేన‌న్ని దారులు, కచ్చా రహదారులు, డ‌జ‌న్ల కొద్దీ చిన్న చిన్న న‌దులు మ‌న దేశాలను క‌లుపుతున్నాయి.  అంతే కాదు, రెండు దేశాల నడుమ స్వేచ్ఛా స‌రిహద్దు కూడా రెండింటినీ క‌లుపుతోంది.  అయిన‌ప్ప‌టికీ నేటి రోజుల్లో ఇది మాత్ర‌మే స‌రిపోదు.  ముఖ్య‌మంత్రి ప్ర‌స్తావించిన అంశాల‌ను గురించి నేను క్లుప్తంగా ఇక్క‌డ వివ‌రిస్తాను.  మ‌న దేశాలు రెండూ ప్ర‌ధాన ర‌హ‌దారుల‌ ద్వారా క‌ల‌వాలి.  అలాగే స‌మాచార సాంకేతిక దారుల‌ ద్వారా క‌ల‌వాలి.  వీటిని ఐ- వేస్ అని కూడా అంటారు.  అలాగే విద్యుత్ మార్గాల ద్వారా మ‌నం క‌లావాలి.  దీన్ని ట్రాన్స్ వేస్ అని అంటారు.  రైల్వే లైన్ల ద్వారా మ‌నం క‌ల‌వాలి.  క‌స్ట‌మ్స్ చెక్ పోస్టుల‌ ద్వారా మ‌నం క‌ల‌వాలి.  అలాగే విమాన సేవ‌ల‌ను విస్త‌రించ‌డంద్వారా మ‌నం క‌ల‌వాలి.  అలాగే అంతర్దేశీయ జ‌ల‌ మార్గాల‌ ద్వారా క‌ల‌వాలి.  భూమి అయినా, నీర‌యినా, అంత‌రిక్ష‌మైనా స‌రే.. వాటి ద్వారా మ‌నం ప‌ర‌స్ప‌రం క‌ల‌వాలి.  సంధానం చాలా ముఖ్యం.  త‌ద్వారా ప్ర‌జ‌ల మ‌ధ్య‌ సంబంధాలు మ‌రింత‌ అభివృద్ధి చెందుతాయి; బ‌లోపేత‌ం అవుతాయి.  అందుకే మనం భారతదేశం, నేపాల్ ల మ‌ధ్య‌ సంధానాన్ని పెంచ‌డానికి ప్రాధాన్య‌ాన్ని ఇస్తున్నాము.

ప్ర‌ధాని శ్రీ ఓలీ గారి తో క‌లిసి నేను ఇవాళే జ‌నక్ పుర్‌ నుండి అయోధ్య కు బ‌స్సు సర్వీసును ప్రారంభించాను.  గ‌త నెల‌లో ప్ర‌ధాని శ్రీ ఓలి, నేను క‌లిసి మొట్ట‌మొద‌టి స‌మీకృత చెక్ పోస్టును బీర్ గంజ్ లో ప్రారంభించ‌డం జ‌రిగింది.  ఈ పోస్టు పూర్తి స్థాయి లో ప‌ని చేయ‌డం మొద‌లైతే స‌రిహ‌ద్దులలో వాణిజ్య వ్యాపార కార్య‌క్ర‌మాలు మ‌రింత సులువుగా కొన‌సాగుతాయి.  జ‌య్ న‌గ‌ర్- జ‌న‌క్ పుర్ రైల్వే లైను నిర్మాణానికి సంబంధించిన ప‌ని కూడా చాలా వేగ‌వంతంగా కొన‌సాగుతోంది.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

ఈ సంవ‌త్స‌రాంతానికి ఈ రైల్వే లైను ను పూర్తి చేయడానికి వీలుగా చ‌ర్య‌లు చేప‌ట్టాము.  ఈ రైల్వే లైను పూర్త‌ి అయ్యందంటే అప్పుడు భార‌త‌దేశ విస్తార‌మైన రైల్వే నెట్ వ‌ర్క్‌తో నేపాల్ కు సంబంధాలు ఏర్ప‌డ‌ుతాయి.  బిహార్ లోని రాక్సాల్ ద్వారా కాఠ్ మాండూ ను భారతదేశం తో క‌ల‌ప‌డానికి చాలా వేగంగా ప‌నులు చేస్తున్నాము.  ఇది మాత్ర‌మే కాదు, జ‌ల‌ రవాణా మార్గాల‌ ద్వారా భారతదేశాన్ని, నేపాల్ ను క‌ల‌ప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాము.  త్వ‌ర‌లోనే భార‌తీయ జల మార్గాల‌ ద్వారా నేపాల్‌ కు స‌ముద్రంతో లంకె ఏర్ప‌డుతుంది.  నేపాల్ లో త‌యారైన వ‌స్తువులు ఈ జల మార్గాల‌ ద్వారా ప్ర‌పంచం లోని ఇత‌ర మార్గాల‌కు  చేరుతాయి.  త‌ద్వారా నేపాల్ లో కొత్తగా ప‌రిశ్ర‌మ‌లు ఏర్ప‌డి ఉపాధి క‌ల్ప‌న జ‌రుగుతుంది.  ఈ ప్రాజెక్టులు నేపాల్ సామాజిక ఆర్ధిక మార్పునకు మాత్ర‌మే దోహ‌దం చేయ‌డం లేదు. ఇవి నేపాల్ వాణిజ్య‌ రంగానికి, వ్యాపార రంగానికి ఎంతో ముఖ్యమైన‌వి.

ఇటీవల కాలంలో భార‌త‌దేశానికి, నేపాల్ కు మ‌ధ్య‌ భారీ స్థాయిలో వాణిజ్య కార్య‌క‌లాపాలు కొన‌సాగుతున్నాయి.  ఇరు దేశాల ప్ర‌జ‌లు వ్యాపార నిమిత్తం ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు.  గౌర‌వ‌నీయులైన ముఖ్య‌మంత్రి గారు దీని గురించి గ‌త నెల‌లో మాట్లాడారు.  వ్య‌వ‌సాయ‌ రంగంలో నూత‌న భాగ‌స్వామ్యాన్ని ప్ర‌క‌టించిన‌ప్పుడు ప్ర‌స్తావించారు.  ఈ భాగ‌స్వామ్యం కింద వ్య‌వ‌సాయ‌ రంగంలో స‌హ‌కారానికి మ‌రింత‌గా ప్రోత్సాహం ల‌భిస్తుంది.  ఈ భాగ‌స్వామ్యం కార‌ణంగా రెండు దేశాల్లో త‌ప్ప‌నిస‌రిగా అన్న‌దాత‌ల ఆదాయాలు పెరుగుతాయి.  వ్య‌వ‌సాయ‌ రంగంలో శాస్త్ర సాంకేతిక విజ్ఞాన వినియోగంలో స‌హ‌కారం మ‌రింత‌గా విస్త‌రిస్తుంది.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

సాంకేతిక విజ్ఞానం లేకుండా ఈ ఆధునిక యుగంలో ప్ర‌గ‌తి ని సాధించ‌డం అసాధ్యం. అత్యాధునిక అంత‌రిక్ష సాంకేతిక‌ విజ్ఞానాన్ని క‌లిగివున్న దేశాలలో భార‌త‌దేశానికి ప్ర‌పంచం లోనే ఐదో స్థానం ఉంది.  నేను గ‌తంలో ఒకటో సారి నేపాల్ ను సంద‌ర్శించిన‌ప్పుడు చెప్పిన విష‌యాన్ని మీరు ఓ సారి గుర్తుకు తెచ్చుకోండి.  నేపాల్ లాంటి ఇరుగు పొరుగు దేశాల‌ కోసం భార‌త‌దేశం ఒక ఉప‌గ్ర‌హాన్ని ప్ర‌యోగిస్తుంద‌ని చెప్పాను.  అప్పుడు ఇచ్చిన ఆ హామీ ని గ‌త సంవ‌త్స‌ర‌మే నిల‌బెట్టుకున్నాను.  గ‌త సంవత్సరం భార‌తదేశం ప్ర‌యోగించిన ద‌క్షిణాసియా ఉప‌గ్ర‌హం ఇప్పుడు త‌న పూర్తి సామ‌ర్థ్యంతో ప‌ని చేస్తోంది.  దీని వ‌ల్ల నేపాల్ ల‌బ్ధి ని పొందుతోంది.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

భారతదేశం, నేపాల్ ల ప్ర‌గ‌తి కోసం మ‌నం ఐదు టి- ల మార్గాన్ని అనుస‌రిస్తున్నాం. మొద‌టి ‘టి’ కి అర్థం ట్రెడిశన్.. అంటే సంప్ర‌దాయం.  రెండో ‘టి’ ట్రేడ్‌ ను సూచిస్తుంది. అంటే వాణిజ్యం.  మూడో ‘టి’ టూరిజం గురించింది. అంటే, ప‌ర్యట‌క‌ రంగం.  నాలుగో ‘టి’ టెక్నాల‌జీ.. సాంకేతిక‌ విజ్ఞానం. ఇక అయిదో ‘టి’.. ట్రాన్స్‌పోర్ట్‌..  ర‌వాణా వ్య‌వ‌స్థ‌.  సంప్ర‌దాయం, వాణిజ్యం, ప‌ర్యట‌క రంగం, సాంకేతిక‌ విజ్ఞానం, ర‌వాణా రంగాల‌ ద్వారా భారతదేశాన్ని, నేపాల్‌ ను అభివృద్ధి మార్గంలో ప‌య‌నింప చేయవలసి వుంది.

మిత్రులారా, సంస్కృతి తో పాటు భార‌తదేశానికి, నేపాల్ కు మ‌ధ్య‌ సంబంధాలలో ముఖ్య‌మైన అంశం వాణిజ్యం.  విద్యుత్తు ఉత్ప‌త్తి లో నేపాల్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది.  ప్ర‌స్తుతం భారతదేశం నుండి నేపాల్ కు 450 మెగావాట్ల విద్యుత్తు ను స‌ర‌ఫ‌రా చేయ‌డం జ‌రుగుతోంది.  దీని కోసం నూత‌నంగా విద్యుత్తు స‌ర‌ఫ‌రా లైన్ లను నెల‌కొల్ప‌డం జ‌రిగింది.

మిత్రులారా, 2014లో నేపాల్ అసెంబ్లీ లో నేను మాట్లాడుతూ చ‌మురు ను ట్ర‌క్కుల‌ ద్వారా ఎందుకు స‌ర‌ఫ‌రా చేయాలి ?  గొట్టపు మార్గాల ద్వారా నేరుగా ఎందుకు స‌ర‌ఫ‌రా చేసుకోకూడ‌దు ? అని అడిగాను.  మోతిహారి- అమ‌లేకాగ్ని చ‌మురు పైప్ లైను ఏర్పాటుకు సంబంధించిన ప‌ని ప్రారంభ‌మైంద‌నే విష‌యం తెలిస్తే మీరు సంతోషిస్తారు.

భార‌త‌దేశం లో మా ప్ర‌భుత్వం స్వదేశ్ ద‌ర్శ‌న్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తోంది.  ఈ కార్య‌క్ర‌మం లో భాగంగా మా దేశంలోని చరిత్రాత్మ‌క‌ ప్ర‌దేశాల‌ను, ఆధ్యాత్మిక ప్రాంతాల‌ను క‌లుపుతున్నాము.  రామాయ‌ణ స‌ర్క్యూట్ ను తీసుకుంటే భ‌గ‌వాన్ రాముడు, జాన‌కీ మాత అడుగిడిన ప్రాంతాల‌న్నిటినీ ఇందులో జోడిస్తున్నాము.  ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా నేపాల్ ను కూడా క‌ల‌ప‌డానికి వీలుగా మేము అడుగులు వేస్తున్నాము.  నేపాల్ లో రామాయ‌ణానికి సంబంధం గల ప్రాంతాలు ఏవి ఉన్నప్పటికీ కూడాను వాటిని భార‌త‌దేశం తో క‌ల‌ప‌వ‌చ్చు.  త‌ద్వారా భక్తులకు ప్ర‌యోజ‌నం చేకూరుతుంది.  వారికి అందుబాటులో ఉండేలా యాత్ర సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తే వారు పెద్ద సంఖ్య‌లో నేపాల్ ను సంద‌ర్శిస్తారు.  నేపాల్ ప‌ర్యట‌క‌ రంగం అభివృద్ధ‌ి చెందుతుంది.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

ప్ర‌తి ఏడాది వివాహ పంచ‌మి సంద‌ర్భంగా భార‌త‌దేశాన్నుండి వేలాది భ‌క్తులు జ‌న‌క్ పుర్ ను సంద‌ర్శిస్తున్నారు.  అంతే కాదు భ‌క్తులు నిత్యం ఇక్క‌డ‌కు వ‌చ్చి సంవత్స‌ర‌మంతా ప‌రిక్ర‌మ నిర్వ‌హిస్తున్నారు.  ఈ భ‌క్తులు ఇక్క‌డ ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోకూడ‌దు.  కాబ‌ట్టి జ‌న‌క్ పుర్, దాని పరిసర ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్ర‌మాల‌ను చేయ‌డానికిగాను నేపాల్ రూపొందించిన ప్ర‌ణాళిక అమ‌లు కావ‌డానికి భార‌త‌దేశం స‌హ‌క‌రిస్తుంద‌ని చెప్ప‌డానికి ఎంత‌గానో సంతోషిస్తున్నాను.  ఈ ప‌నుల కోసం రూ.100 కోట్ల సహాయాన్ని భార‌త‌దేశం అందిస్తుంది.  ఇందుకు సంబంధించిన ప్రాజెక్టు ల‌ను నేపాల్ ప్ర‌భుత్వం తోను, స్థానిక ప్ర‌భుత్వం తోను సంప్ర‌దించి గుర్తించ‌డం జ‌రుగుతుంది.  జ‌న‌క మ‌హారాజు కాలం నుండి జ‌న‌క్ పుర్ ధామ్ కు ఓ సంప్ర‌దాయం ఉంది.  ఇక్క‌డ‌ నుండి అయోధ్య‌ కు ఏదో ఒక‌టి ఇచ్చే సంప్ర‌దాయ‌ం ఇది.  అయోధ్య‌కే కాదు, మొత్తం స‌మాజానికే ఏదో ఒక‌టి ఇస్తూ వ‌చ్చారు.  నేను ఇక్క‌డ‌కు జాన‌కీ మాత ఆశీస్సులను తీసుకోవ‌డానికి వ‌చ్చాను.  125 కోట్ల మంది భార‌తీయుల త‌ర‌ఫున నేను ఈ ప్ర‌క‌ట‌న‌లు చేశాను.  వాటిని జాన‌కీమాత పాద‌ల చెంత అంకితం చేశాను.  వీటిలాగే మ‌రో రెండు కార్య‌క్ర‌మాలు ఉన్నాయి.  అవి బౌద్ధ స‌ర్క్యూట్‌, జైన స‌ర్క్యూట్‌ లు.  ఈ కార్య‌క్ర‌మాల లో భాగంగా భార‌త‌దేశంలో బౌద్ధ క్షేత్రాల‌ను, మ‌హ‌వీర క్షేత్రాల‌ను క‌ల‌ప‌డం జ‌రుగుతుంది.  అలాగే నేపాల్ లో కూడా అనేక బౌద్ధ‌ క్షేత్రాలు, జైన క్షేత్రాలు ఉన్నాయి.  ఇరు దేశాల కు చెందిన భ‌క్తులు, ప‌ర్యట‌కులు మ‌న రెండు దేశాల్లోని ఈ క్షేత్రాల‌ను సంద‌ర్శించి వారి అనుబంధాన్ని పెంచుకోవ‌చ్చు.  అంతే కాదు దీని వ‌ల్ల నేపాల్ లోని యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు ఏర్ప‌డ‌ుతాయి.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

రెండు దేశాలకు చెందిన ఆహార‌పు అల‌వాట్ల‌లో, భాష‌లలో అనేక సామీప్యాలు ఉన్నాయి. భార‌త‌దేశంలో మైథిలి భాష మాట్లాడుతున్న‌వారు నేపాల్ లో అదే భాష మాట్లాడుతున్న‌ వారు ఒక‌టే.  నేడు మైథిలి క‌ళ‌, సంస్కృతి, నాగ‌రక‌తలను ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చించుకుంటున్నారు.  మైథిలి భాష అభివృద్ధి కోసం భార‌త‌దేశం, నేపాల్ సంయుక్తంగా కృషి చేస్తే అప్పుడు ఈ భాష మ‌రింత సులువుగా అభివృద్ధి చెందుతుంది.  మైథిలి భాష‌లో చలనచిత్రాలను నిర్మించే వారు వాటిని నేపాల్, భార‌త‌దేశంలతో పాటు కతర్‌, దుబయ్ లలో కూడా విడుద‌ల చేస్తున్నార‌ని నాకు చెప్పారు.  ఇది ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం.  దీనికి త‌ప్ప‌కుండా ప్రోత్సాహం ఉండాలి.  ఇక్క‌డ భారీ సంఖ్య‌ లో ప్ర‌జ‌లు మైథిలి భాష ను మాట్లాడుతారు.  అలాగే భారతదేశం లో నేపాలీ భాష మాట్లాడే వారు కూడా చాలా ఎక్కువ‌ మంది ఉన్నారు.  నేపాలీ భాషా సాహిత్య అనువాదాల‌ను ప్రోత్స‌హించ‌డానికి చ‌ర్య‌లు చేప‌ట్టాలి.  ఇక్క‌డ మీకు ఒక విష‌యాన్ని గుర్తు చేస్తున్నాను.  భార‌త రాజ్యాంగం గుర్తించిన భార‌తీయ భాష‌లలో నేపాలీ కూడా ఉంది.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

ఇరు దేశాల భాగ‌స్వామ్యాన్ని మ‌రింత అభివృద్ధి చేయ‌డానికి మ‌రొక రంగం కూడా ఉంది.  భార‌త‌దేశం లో ప్ర‌జ‌లు భారీ స్థాయిలో స్వ‌చ్ఛ‌ భార‌త్ అభియాన్ ను ప్రారంభించారు.  మీరు బిహార్ , ఇంకా ఇత‌ర పొరుగు భార‌త‌దేశ రాష్ట్రాల లోని మీ బంధువుల‌ను చూడ‌డానికి వెళ్లిన‌ప్పుడు దీని గురించి మీకు తెలిసే వుంటుంది.  కేవ‌లం మూడు నాలుగు సంవ‌త్స‌రాలలో భార‌త‌దేశం లోని 80 శాతం గ్రామాలలో బ‌హిరంగ మ‌ల‌ మూత్రాదుల విస‌ర్జ‌న లేకుండా చేశాము.  భార‌తదేశం లోని ప్ర‌తి పాఠ‌శాల‌లో బాలిక‌ల‌ కోసం ప్ర‌త్యేకంగా మ‌రుగుదొడ్ల‌ను నిర్మించ‌డం జ‌రిగింది. స్వ‌చ్ఛ భార‌త్‌, స్వ‌చ్ఛ గంగ ఉద్య‌మాల లాగానే మీరు కూడా జ‌న‌క్ పుర్ కు చెందిన పుణ్య‌క్షేత్రాలలో, చారిత్ర‌క ప్ర‌దేశాలలో ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త ఉద్య‌మాన్ని విజ‌య‌వంతంగా మొద‌లుపెట్ట‌ిన‌ట్టు నాకు తెలిసింది.  చాలా సంతోషం.  పురాణ ప్రాశ‌స్త్యం గ‌ల ప్రాంతాల‌ను సంర‌క్షించుకొనే కార్య‌క్ర‌మాలలో నేపాల్ యువ‌త పాల్గొన‌డం మ‌రింత ఆనందాన్ని ఇస్తోంది.  ముఖ్యంగా ఈ ప్రాంత మేయ‌ర్ ను ఆయ‌న స‌హ‌చ‌రుల‌ను, ఈ ప్రాంత యువ‌త‌ను, చ‌ట్ట‌స‌భ‌ల స‌భ్యుల‌ను అభినందిస్తున్నాను. స్వ‌చ్ఛ జ‌న‌క్ పుర్ కార్య‌క్ర‌మాన్ని వారు ముందుకు తీసుకుపోవ‌డం అభినంద‌నీయం.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

ఈ రోజు జాన‌కీమాత ఆల‌యాన్ని సంద‌ర్శించాను.  రేపు ముక్తినాథ్ దామ్‌, పశుప‌తినాథ్ క్షేత్రాల‌ను సంద‌ర్శించి ఆశీస్సులు తీసుకుంటాను.  దైవానుగ్ర‌హంతో, నేపాల్ ప్ర‌జ‌ల ఆశీస్సు ల‌తో ఉభయ దేశాల మ‌ధ్య‌ కుదుర్చుకొనే అన్ని ఒప్పందాల కార‌ణంగా భార‌త‌దేశం, నేపాల్ రెండూ సుభిక్షంగా సంతోషంగా ఉంటాయ‌ని నేను న‌మ్ముతున్నాను.

నేపాల్ ప్ర‌ధాని శ్రీ ఓలి గారికి, రాష్ట్ర ప్ర‌భుత్వానికి, ప‌ట్ట‌ణ ప్ర‌భుత్వానికి, నేపాల్ ప్ర‌జ‌ల‌కు మ‌రొక్క మారు నా మన:పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లను వ్యక్తం చేస్తున్నాను.  మీకు అంద‌రికీ ఇవే ధన్యవాదాలు.

జయ్ సియా రామ్‌,

జయ్ సియా రామ్‌.

***