Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దేశ‌వ్యాప్తంగా ఉన్న రైతుల‌తో 2018, జూన్ 20వ తేదీ నాడు ముఖాముఖి సంభాష‌ణ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం


నా రైతు సోద‌రులు  మ‌రియు సోద‌రీమ‌ణులారా, నమస్తే. మీకు శుభాకాంక్ష‌లు.

ఈ రోజు నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిన విషయం ఏమిటంటే దేశం లోని నా రైతు సోద‌రులు మ‌రియు సోద‌రీమ‌ణులు.. ఎవ‌రైతే మాతో సంధానం అయ్యారో, ఎవ‌రైతే 600 కృషి విజ్ఞాన కేంద్రాల (కెవికె స్) ద్వారాను, వివిధ గ్రామాల‌ లోని 2 ల‌క్ష‌ల‌కు పైగా కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ ల ద్వారాను మాతో జోడింపబ‌డ్డారో.. వారి యొక్క అనుభ‌వాల‌ను వారి ముఖత: తెలుసుకొనేటటువంటి అరుదైన ఒక అవ‌కాశం నాకు ల‌భించింది.

ఇందుకోసం మీరు మీ యొక్క స‌మ‌యాన్ని వెచ్చించారు; ఒక సంతోష‌దాయ‌కమైనటువంటి వాతావ‌ర‌ణంలో మీరు ఆసీనులు అయ్యారు; మ‌రి ఇక్కడ ఉన్న నేను మీ అంద‌రి వ‌ద‌నాల‌లోను చిరున‌వ్వుల‌ను చూడ‌గ‌లుగుతున్నాను; మీ యొక్క ఉత్సుక‌త‌ ను నా ముందున్న టీవీ తెర మీద వీక్షించగ‌లుగుతున్నాను.  ఇదే ఈ రోజున నాకు గొప్ప సంతోషాన్ని ఇస్తున్న‌టువంటి విష‌యం.  రైతులు మాకు ఆహారాన్ని అందిస్తారు; వారు ప్ర‌జ‌ల‌కు ఆహారాన్ని అందిస్తారు; వారు పశు గ‌ణానికి దాణా ను మ‌రియు అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌కు ముడి ప‌దార్ధాన్ని కూడా అందిస్తారు; దేశానికి ఆహార భ‌ద్ర‌త‌ ను స‌మ‌కూరుస్తున్న యావ‌త్తు ఖ్యాతి కూడాను మ‌న రైతు సోద‌రులు మ‌రియు రైతు సోద‌రీమ‌ణు ల‌కు చెందుతుంది.

ఆహార ధాన్యాల విష‌యంలో భార‌త‌దేశాన్ని స్వ‌యంస‌మృద్ధం చేయ‌డం కోసం మ‌న రైతులు ఎంత‌గానో శ్ర‌మ కు ఓర్చారు; అయితే, రైతు యొక్క స్వీయ అభివృద్ధి మాత్రం కాల గ‌మ‌నంతో కుంచించుకుపోతూనేవుంది.  ఆరంభం నాటి నుండి దేశ రైతులు విధి యొక్క ద‌య మీద ఆధారప‌డాల్సినటువంటి పరిస్థితి.  ఈ ఆలోచ‌న విధానం లో ఒక ప‌రివ‌ర్త‌న‌ ను తీసుకొని రావ‌డానికి క్ర‌మం త‌ప్ప‌ని ప్ర‌య‌త్నం, శాస్త్రీయ ప‌ర‌మైన కృషి జ‌ర‌గ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉండింది.  అయితే, ఈ కృషి లో సంవ‌త్స‌రాల తరబడి జాప్యం జ‌రిగింది.  గ‌డ‌చిన నాలుగు సంవ‌త్స‌రాల‌లో మేము మంచి నాణ్య‌త క‌లిగిన విత్త‌నాల‌ను త‌యారు చేయ‌డం కోసం, మ‌రి వాటిని రైతుల‌కు అందించ‌డం కోసం, అంతేకాకుండా మ‌న రైతుల‌కు కావ‌ల‌సిన విద్యుత్తు మొద‌లు, నీరు, విపణి ల‌భ్య‌త వ‌ర‌కు.. ప్ర‌తిదీ ఒక స‌మ‌తుల‌మైన పద్ధతిలో, స‌మ‌గ్ర‌మైన ప‌ద్ధ‌తి లో స‌మ‌కూర్చ‌డానికి మా చేత‌నైన  ప్ర‌య‌త్నాలు అన్నీ చేశాము.  2022వ సంవ‌త్స‌రం క‌ల్లా రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసే ల‌క్ష్యం తో ముందుకు పోవ‌ల‌సిన;  ప్ర‌భుత్వం యొక్క పాత విధానాల‌లో స‌వ‌ర‌ణ చేయ‌డం ద్వారాను, మేము ముందుకు వెళ్ళ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని భావించాము.  ఈ దారిలో ఎక్కడెక్కడ ఎటువంటి క‌ష్టాలు మ‌రియు అవ‌రోధాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగ‌మించి ముందుకు పోవ‌ల‌సిన అవ‌స‌రం ఉందని మేము నిర్ణ‌యించుకొన్నాము.

రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయ‌డాన్ని గురించి మ‌నం మాట్లాడుకుంటూ ఉంటే, ఈ విష‌యంలో ఎగతాళి గా మాట్లాడిన వారు ఎంతో మంది ఉన్నారు.  వారు ఇది సాధ్యం కాద‌ని, ఇది ఎంతో క‌ష్ట‌మ‌ని, ఈ ప‌నిని ఎలా చేయ‌గ‌లుగుతార‌ంటూ మాట్లాడారు; మ‌రి ఒక అంధ‌కార భ‌రితమైనటువంటి వాతావ‌ర‌ణాన్ని వారు ఏర్ప‌ర‌చారు.  అయితే, మేము ఈ విష‌యంలో ఒక తీర్మానాన్ని చేసుకొన్నాము.  నాకు ఈ దేశ రైతుల ప‌ట్ల న‌మ్మ‌కం ఉంది.  అది ఏమిటంటే, వారికి ఒక ల‌క్ష్యాన్ని ఇచ్చిన‌ప్పుడు, త‌గిన వాతావ‌రణాన్ని క‌ల్పించిన‌ప్పుడు నా దేశ రైతులు న‌ష్ట భ‌యాన్ని ఎదుర్కోవ‌డానికి సంసిద్ధులుగా ఉంటార‌ని నేను అనుకొన్నాను.  రైతులు క‌ష్టించి ప‌ని చేయ‌డానికి, ఫ‌లితాల‌ను సాధించ‌డానికి సిద్ధమైవున్నారు; గ‌తంలో ఈ విష‌యాన్ని సాధించ‌డం ద్వారా వారు నిరూప‌ణ చేసివున్నారు.

దీనిని సాధించ‌డం కోసం మేము ఒక ల‌క్ష్యాన్ని నిర్దేశించుకొన్నాము.  ఆ దిశ‌గా మీ రైతులంద‌రినీ తీసుకొని వెళ్ళ‌డానికి నిరంత‌ర ప్ర‌యాస ను చేప‌ట్ట‌డం జ‌రుగుతోంది.  దీనిని సాధించ‌డం కోసం నాలుగు విష‌యాలకు ప్రాధాన్యం ఇవ్వ‌డ‌మైంది.  వీటిలో ఒక‌టోది.. సాగు యొక్క వ్య‌యాన్ని, రైతుల యొక్క ముడి ప‌దార్ధాల వ్య‌యాన్ని ఏ విధంగా క‌నీస స్థాయికి చేర్చాల‌నేది; రెండోది.. అత‌డు పండించిన పంట‌ లకు న్యాయ‌మైన ధ‌ర‌లు ల‌భించేలా ఏ విధంగా చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చ‌నేది; మూడోది.. అతడి పంట వృథా పోకుండా ఎలా నిలువ‌రించాల‌నేది;  మ‌రి అలాగే నాలుగో విష‌యం ఏమిటంటే- వ్య‌వ‌సాయ సంబంధిత ఆదాయానికి తోడు అత‌డి ఆదాయానికి పూరకంగా ఉండే ప్ర‌త్యామ్నాయ వ‌న‌రుల‌ను ఎలా క‌ల్పించ‌వ‌చ్చ‌నేది.

దేశంలోని రైతులు పండించే పంట‌లకు స‌మంజ‌స‌మైన ధ‌ర‌లను అందించ‌డం కోసం ఈ సంవ‌త్స‌ర‌పు బ‌డ్జెటు లో ప్ర‌భుత్వం అమిత ముఖ్య‌మైన ఒక నిర్ణ‌యాన్ని తీసుకొంది.  షెడ్యూల్డు పంట‌ల‌కు సాగు ఖ‌ర్చు పై క‌నీసం ఒక‌టిన్న‌ర రెట్ల ఎమ్ఎస్‌పి ని ప్ర‌క‌టించాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.  ఇందులో అనేక అంశాల‌ను మిళితం చేయ‌డ‌మైంది. మరి నేను మీకు చెప్పదలచుకొన్నది ఏమిటి అంటే, ఎమ్ఎస్‌పి ఖ‌రారు చేయ‌డం కోసం లెక్క‌ లోకి తీసుకొనే సాగు వ్య‌యం లో రైతు కూలీల‌కు ఇచ్చే కూలీ ని, యంత్రాల పైన, ప‌శు గ‌ణం పైన పెట్టే ఖ‌ర్చు ను, విత్త‌నాలు, ఇంకా ఎరువులకయ్యే వ్య‌యాన్ని సైతం క‌ల‌ప‌డం, నీటి పారుద‌ల‌కు అయ్యే వ్య‌యాన్ని, రాష్ట్ర ప్ర‌భుత్వానికి చెల్లించే శిస్తును కూడా క‌ల‌ప‌డం, వర్కింగ్ కేపిటల్ పై చెల్లించే వ‌డ్డీని కూడా క‌ల‌ప‌డం, కౌలుకు తీసుకొన్న భూమి తాలూకు కిరాయి ని కూడా ఇందులో క‌ల‌ప‌డం.. ఈ అంశాల‌న్నింటినీ ఎమ్ఎస్‌పి లో మేళ‌వించ‌డం జ‌రిగింది.  ఇది మాత్ర‌మే కాదు,  ఒక రైతు మ‌రియు అత‌డి కుటుంబ స‌భ్యులు చేసే శ్ర‌మ.. ఆ శ్రమ తాలూకు వ్య‌యాన్ని అంచ‌నా వేసి ఆ అంచనాను ఎంఎస్ పి లో కలుపుతారు; దాని ఆధారంగానే ఎమ్ఎస్‌పి ని ఖాయపరుస్తారు.

ప్ర‌భుత్వం బ‌డ్జెటు లో వ్య‌వ‌సాయం కోసం కొంత మొత్తం ధ‌నాన్ని కేటాయిస్తుంది.  మునుప‌టి ప్ర‌భుత్వం యొక్క క‌డ‌ప‌టి అయిదు సంవ‌త్స‌రాల కాలంలోనూ వ్య‌వ‌సాయానికి 1.21 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మొత్తాన్ని కేటాయించ‌డ‌మైంది.  దీనిని మేము 2014వ సంవ‌త్స‌రం మొద‌లుకొని 2019 వ సంవ‌త్స‌రం మ‌ధ్య అయిదేళ్ళ‌ కాలానికి గాను సుమారు 2.12 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌కు పెంచాము.  దీని అర్థం ఏమిటంటే, వ్య‌వ‌సాయానికి బ‌డ్జెటు కేటాయింపు ను దాదాపుగా రెట్టింపు చేశాము అనే.   ఇది రైతుల శ్రేయ‌స్సు పట్ల మా ప్ర‌భుత్వ నిబ‌ద్ధ‌త‌ ను స్ప‌ష్టంగా చాటిచెబుతోంది.

ప్రస్తుతం, ఆహార ధాన్యాల విష‌యంలోనే కాకుండా ఫలాలు, కాయ‌గూర‌లు, ఇంకా పాల‌ లో కూడా రికార్డు స్థాయి ఉత్ప‌త్తి జ‌రిగింది.  మ‌న రైతు సోద‌రులు గ‌త 70 సంవ‌త్స‌రాల రికార్డుల‌ను ఛేదించి, ఒక కొత్త రికార్డు ను నెలకొల్పారు.  గ‌త నాలుగు సంవ‌త్స‌రాల కాలంలో- వ్య‌వ‌సాయ‌ రంగంలో మునుపు ఎన్న‌డూ ఎరుగ‌నంత పురోగ‌తి చోటుచేసుకొంది.  2017-18 సంవ‌త్స‌రం లో ఆహార ధాన్యాల ఉత్ప‌త్తి దాదాపు 280 మిలియ‌న్ ట‌న్నులు గా ఉంది.  మ‌రి మునుప‌టి ప్ర‌భుత్వ హ‌యాం లో 2010- 2014 సంవత్సరాల మ‌ధ్య స‌రాస‌రి ఉత్ప‌త్తి సుమారు 250 మిలియ‌న్ ట‌న్నులు.  ఇదే విధంగా కాయ‌ ధాన్యాల స‌గ‌టు ఉత్ప‌త్తి లో 10.5 శాతం పెరుగుద‌ల మ‌రియు తోట పంట‌ల‌ స‌గ‌టు ఉత్ప‌త్తిలో 15 శాతం పెరుగుద‌ల లు న‌మోదు అయ్యాయి.

నీలి విప్ల‌వం లో భాగంగా చేప‌ల ఉత్ప‌త్తి లో 26 శాతం పెరుగుద‌ల న‌మోదు అవ‌గా, పాల ఉత్ప‌త్తి మ‌రియు ప‌శుసంవ‌ర్ధ‌కం విభాగం లో సుమారు 24 శాతం పెరుగుద‌ల ఉంది.  రైతుల‌కు సాగు యొక్క ప్ర‌తి ద‌శ‌ లో స‌హాయాన్ని అందించాల‌న్న‌ది మా ప్ర‌య‌త్నంగా ఉంది.  అది పంట‌లు నాట‌డానికి ముందు గాని, లేదా పంట నాటిన త‌రువాత గాని మ‌రియు పంట కోత కోసిన త‌రువాత కూడా స‌హాయాన్ని అందించాల‌నేది.  దీనినే ఒక ముక్క‌లో చెప్పాలి అంటే, రైతుల‌కు ఏ స‌హాయాన్నయినా ప్రభుత్వం అందించాలంటే ఆ పనిని ఏ విధంగా ప్రభుత్వం చేయగలుగుతుంది? .. పంట‌ ను పెంచ‌డం మొద‌లుకొని దానిని విప‌ణిలో విక్ర‌యించ‌డం వ‌ర‌కు – దీనికి అర్థం విత్తనం నుండి విపణి వరకు నిర్ణ‌యాల‌ను తీసుకోవ‌డం మ‌రియు ప‌థ‌కాల‌ను రూపొందించ‌డం, సాగుబ‌డి సంబంధ ప్ర‌క్రియ అంత‌టిలోనూ వారికి న్యాయం జ‌రిగేటట్లుగా ఎలా ప్రభుత్వం తోడ్పడగలుగుతుంది.. అన్న‌దే సుమా.

రైతుల శ్రేయం కోసం ఒక వ్య‌వ‌స్థ‌ ను నిర్వ‌హించే దిశ‌గా మేము ముందుకు సాగుతున్నాము.  మేము భూమి స్వ‌స్థ‌త కార్డులను ఇవ్వ‌డం మొద‌లు పెట్టాము.  దీనివ‌ల్ల ఒక రైతు ఏ పంట‌ను వేయాలో తెలుసుకోగ‌లుగుతాడు.  ఒక‌సారి ఇది జ‌రిగిందంటే క‌నుక రైతుల‌కు మంచి నాణ్య‌త తో కూడిన విత్త‌నాలు అందాలి.  రైతు రుణం తీసుకొనేందుకు ఒక ఏర్పాటు ఉండాలి.  మ‌రి కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క ప‌రిధిని విస్త‌రించ‌డం జ‌రిగింది.  త‌ద్వారా వారు మూల‌ధ‌నం విష‌య‌మై స‌మ‌స్య‌ ను ఎదుర్కోవ‌ల‌సిన అగ‌త్యం ఉండ‌దు.

ఇంత‌కు ముందు కాలంలో యూరియా కోసం పెద్ద పెద్ద బారులు క‌నిపించేవి.  అయితే, ఇప్పుడు రైతులు యూరియా ను సుల‌భంగా పొందుతున్నారు.  ఇత‌ర ఎరువులు కూడా వారికి సుల‌భంగా అందుతున్నాయి.  వారు వాటిని న‌ల్లబ‌జారు లో నుండి కొనుగోలు చేయ‌వలసిన పని లేదు.  ప్ర‌స్తుతం దేశ రైతుల‌కు 100 శాతం వేప‌పూత పూసిన యూరియా ల‌భ్యమవుతోంది.

పంట నాట్ల త‌రువాతి వంతు నీటి పారుద‌లది.  ప్ర‌స్తుతం ‘ప్ర‌ధాన మంత్రి కృషి సించాయీ యోజ‌న’ లో భాగంగా సుమారు 100 నీటిపారుద‌ల ప‌థ‌కాలు పూర్తి అయ్యే ద‌శ‌లో ఉన్నాయి.  ప్ర‌తి వ్య‌వ‌సాయ క్షేత్రానికి నీరు అందే విధంగా మన‌ము ముందుకు సాగుతున్నాము.  రైతులు వారి పంట‌ల‌కు ఏ విధ‌మైన న‌ష్ట భ‌యాన్ని ఎదుర్కోవ‌ల‌సిన అగ‌త్యం ఉండ‌కూడ‌దు.  ఈ కార‌ణంగా ఈ రోజున ఒక పంట బీమా ప‌థ‌కం తెర మీదకు వ‌చ్చింది.  రైతు త‌న దిగుబ‌డికి స‌ముచిత‌మైన ధ‌ర‌ను పొంద‌డం కోసం ఒక ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్ ఇ-ఎన్ఎఎమ్ (E-Nam) ను ప్రారంభించ‌డ‌మైంది.  మ‌రొక ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే మ‌ధ్య‌వ‌ర్తులు ప్ర‌స్తుతం ఎటువంటి క‌త్తిరింపులు చేయ‌జాల‌రు;  రైతు యొక్క లాభాన్ని వారు దుర్వినియోగం చేయ‌జాలరు.  ఈ ప‌థ‌కాల ద్వారా మ‌న రైతు సోద‌రులు మ‌రియు సోద‌రీమ‌ణులు ఎటువంటి లాభాల‌ను పొందారో, వారి యొక్క జీవితాల‌లో ఏ విధమైన‌టువంటి మార్పులు వ‌చ్చాయో మ‌నము చూద్దాము.  దీనిని గురించి నేరుగా వారి నోటి నుండే మ‌నం వినే ప‌క్షంలో వారి అనుభవాలను గురించి వారే మ‌న‌కు చెప్పే ప‌క్షంలో బ‌హుశా దేశం లోని ఇత‌ర రైతులు సైతం బహుశ: ‘‘అవును, ఆ ప్రాంతం యొక్క రైతు దీనిని సాధించ‌గ‌లిగినట్లయితే ఆ పనిని నేనూ చేయగలను’’ అని చెప్పేందుకు మ‌రొక్క అవ‌కాశాన్ని పొంద‌గ‌లుగుతారు.

ప్రియ‌మైన నా సోద‌రులు మ‌రియు సోద‌రీమ‌ణులారా,

ఈ రోజున ఈ మొత్తం సంభాష‌ణ‌ను ఎవ‌రైతే వీక్షిస్తున్నారో వారు మ‌న రైతుల‌ను చూసుకొని గ‌ర్విస్తారు.  మ‌న రైతుల క‌ఠోర ప‌రిశ్ర‌మ గురించి మ‌రియు వారు సాధించిన‌టువంటి పురోగ‌తిని గురించి, అంతేకాకుండా వారు నడుం కట్టినటువంటి నూత‌న ప్ర‌యోగాల‌ను గురించి ఈ కార్య‌క్ర‌మాన్ని తిల‌కిస్తున్న‌ వారు చూసి గ‌ర్వించడం తథ్యం.  ఈ దేశం లోని ప‌ల్లెలు, ఈ దేశం లోని రైతులు పురోగ‌మించిన‌ప్పుడు అదుగో అప్పుడు మాత్రమే దేశం పురోగ‌మించగలుగుతుంద‌ని నేను న‌మ్ముతాను.  మ‌న రైతులు బ‌ల‌శాలురు అయిన్ప‌ప్పుడే, మ‌న దేశం కూడాను బ‌లోపేతం కాగ‌లుగుతుంది.

నా రైతు సోద‌రులు మ‌రియు సోద‌రీమ‌ణులారా.

ఈ సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించ‌డం ద్వారా మ‌న దేశంలోని వివిధ ప్రాంతాల ప్ర‌జ‌ల‌తో నేను క్ర‌మం త‌ప్ప‌క సంభాషిస్తూ వ‌స్తున్నాను.  ఈ రోజు కూడా నా ఈ సంభాష‌ణ‌ లో ల‌క్ష‌ల కొద్దీ ప్ర‌జ‌లు, ల‌క్ష‌లాది రైతులు నాతో మ‌మేక‌ం అయ్యారు.  మీ అంద‌రితో ఈ సంభాష‌ణ ను కేవలం నేనే ఆల‌కించ‌డం లేదు; మీతో నా సంభాష‌ణ‌ను యావ‌త్తు దేశం, మ‌రి ఈ దేశం లోని ప్ర‌తి ఒక్క రైతు సహా.. వింటున్నారు.  వారు మీ వ‌ద్ద నుండి తెలుసుకొంటున్నారు.  మీరు చెబుతున్న‌ది ప్ర‌భుత్వ అధికారులు కూడా వింటూ ఉన్నారు.  మీ యొక్క స‌మ‌స్య‌ల‌ను వారు నోట్ చేసుకొంటున్నారు.  మ‌రి వారు మీరు చేసిన ప్ర‌యోగాల‌ను గురించి కూడా చ‌ర్చిస్తారు.  వాటిని మ‌రింత‌గా అమ‌లు లోకి తీసుకు పోయే ప్ర‌య‌త్నాన్ని వారు చేస్తారు.  మ‌రి ఈ నా యొక్క కార్య‌క్ర‌మం మునుముందుకు సాగుతుంది.  ఎందుకంటే, ఈ కార్య‌క్ర‌మం నాకు ఒక విశ్వ‌విద్యాల‌యంగా మారిపోయింది.  ఇది నాకు ఎంతో కొంత బోధిస్తుంది.  ఇలా ప్ర‌తి వారం జ‌రుగ‌నుంది.  ఈ దేశ పౌరుల ద్వారా నేను నేర్చుకోగ‌లుగుతాను.  దేశంలో సుదూర ప్రాంతాల‌లో ఉంటున్న ప్ర‌జ‌ల‌ను క‌లుసుకొనే, వారితో మాట్లాడే అవ‌కాశాలను ఇది నాకు అందిస్తుంది.  సాంకేతిక విజ్ఞానం స‌హాయంతో మీ అంద‌రి వ‌ద్ద నుండి అనేక అంశాల‌ను నేను అర్థం చేసుకోగలుగుతున్నాను.  అలాగే, నేర్చుకోగ‌లుగుతున్నాను కూడా.  దేశం లోని వేరు వేరు ప్రాంతాల‌లో ఏమి జ‌రుగుతోంది అనే స‌మాచారాన్ని మీ వద్ద నుండి నేను ప్రత్యక్షంగా తెలుసుకొంటాను.

కాబ‌ట్టి, వ‌చ్చే బుధ‌వారం వారం నాడు నేను మళ్లీ మీతో భేటీ అవుతాను.  వ‌చ్చే బుధ‌వారం అంటే, జూన్ 27వ తేదీ, ఆ రోజున నేను మ‌న పేద ప్ర‌జ‌ల‌తో, మ‌న దిగువ మ‌ధ్య ఆదాయ వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌ల‌ తో మ‌రియు మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు మొద‌లుకొని, మ‌న రైతు సోద‌రులు మ‌రియు సోద‌రీమ‌ణులు, చేతివృత్తి సోద‌రులు మ‌రియు సోద‌రీమ‌ణుల‌తో వారి యొక్క సామాజిక భ‌ద్ర‌తకు ఉద్దేశించిన బీమా ప‌థ‌కాల‌ను గురించి నేను మాట్లాడుతాను.  ఆయా ప‌థ‌కాల‌ను గురించి, వాటి నుండి వారు పొందుతున్న ప్ర‌యోజ‌నాల‌ను గురించి వారితో నేను సంభాషిస్తాను.  ఎందుకంటే ఈ ప‌థ‌కాల‌పై మేము ఎంతో కూలంకష ప‌ద్ధ‌తి లో కృషి చేశాము.  మ‌రి మీరంద‌రూ.. నా రైతు సోద‌రులు మ‌రియు సోద‌రీమ‌ణులు ఈ ప‌థ‌కాల‌ను ఆవ‌శ్యం స్వీక‌రించేవుంటార‌ని నేను న‌మ్ముతున్నాను.  మీరంతా ‘సుర‌క్ష బీమా ప‌థ‌కం’ తాలూకు ప్ర‌యోజ‌నాన్ని పొందే వుంటారు.  మ‌న దేశ రైతు ల‌తో భేటీ అయ్యే అవ‌కాశాన్ని నేను పొంద‌డం తో ఈ రోజు నాకు సంతోషాన్ని అందించిది.  వారి యొక్క ఆశీర్వాదాల‌ను స్వీక‌రించే అవ‌కాశం, అలాగే వారి యొక్క క‌ఠోర ప‌రిశ్ర‌మ తాలూకు గాథ‌ ల‌ను వినే అవ‌కాశం నాకు చిక్కింది.   ఈ రోజున వారి యొక్క క‌ఠోర ప‌రిశ్ర‌మ, మ‌రి అలాగే వారి యొక్క అంకిత భావం దేశాన్ని నూత‌న‌ శిఖ‌రాల‌కు తీసుకుపోతున్నాయి.

నేను నా రైతు సోద‌రులు మ‌రియు సోద‌రీమ‌ణుల‌కు మ‌రొక్క మారు శిర‌స్సును వంచి ప్రణామం చేస్తున్నాను.  మీరు అందరూ నా కోసం మీ యొక్క స‌మ‌యాన్ని వెచ్చించారు; మ‌రి ఎన్నో విష‌యాల‌ను నా దృష్టికి తీసుకు వ‌చ్చారు.  నేను మీకు అమిత కృత‌జ్ఞుడినై వుంటాను.

మీకంద‌రికీ ధ‌న్య‌వాదాలు.

******