పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం ‘‘జాతీయ జల మార్గాల బిల్లు – 2015’’లో అధికారిక సవరణలు చేసేందుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు, సదరు శాఖకు సంబంధించి రవాణా, పర్యాటక రంగం, సంస్కృతిలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయీ సంఘం చేసిన సిఫారసులను ఆధారం చేసుకుని ఈ సవరణలను చేస్తారు. 106 అదనపు అంతర్గత జల మార్గాలను జాతీయ జల మార్గాలుగా ప్రకటించడానికి అవసరమైన కేంద్ర చట్టం చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఇప్పటికే ఉన్న 5 జాతీయ జల మార్గాలకు తాజాగా 106 అదనపు అంతర్గత జల మార్గాలను కూడా కలిపితే, జల మార్గాల మొత్తం సంఖ్య అప్పుడు 111కు పెరుగుతుంది.
కొత్తగా జాతీయ జల మార్గాలుగా ప్రకటించడానికి ఇప్పుడు ప్రతిపాదించిన మొత్తం జల మార్గాల సంఖ్య 106. వాటికి ఇప్పటికే అమల్లో ఉన్న జాతీయ జల మార్గాలను కూడా కలిపితే, బిల్లులో మొత్తం జాతీయ జల మార్గాల సంఖ్య 111కు పెరుగుతుంది. 2015 మే ఐదో తేదీన ప్రవేశ పెట్టిన జాతీయ జల మార్గాల బిల్లు – 2015లోని వాస్తవ జాబితాలోని 101 జల మార్గాల్లో ఈ కింది మార్పు చేర్పులు చేశారు.
– కేరళ రాష్ట్రానికి చెందిన 10 జల మార్గాలను తొలగించారు. ఇప్పటికే అమల్లో ఉన్న జల మార్గాలతో 17 జల మార్గాలను కలిపేశారు. 18 జల మార్గాలను (5 కర్ణాటక, 5 మేఘాలయ, 3 మహారాష్ట్ర, 3 కేరళ, తమిళ నాడు, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కటి) కలిపారు. దాంతో, ఇప్పటికే అమల్లో ఉన్న 5 జాతీయ జల మార్గాలకు అదనంగా సరికొత్త జాతీయ జల మార్గాలుగా ఖరారు చేయడానికి మొత్తం 106 జల మార్గాలను రూపొందించారు. ఈ మార్పు చేర్పులు చేయడానికి జాతీయ జల మార్గాల చట్టం – 2015లో అధికారిక సవరణ కోసం బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే లోక్ సభలో ప్రవేశపెట్టవలసి ఉంటుంది.
అదనంగా 106 జల మార్గాలను జాతీయ జల మార్గాలుగా ప్రకటించడం ద్వారా ఇప్పటికిప్పుడు తక్షణం వచ్చే ఆర్థిక పర్యవసానాలు ఏమీ ఉండవు. ప్రస్తుతానికి ఇన్ లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) చేపట్టిన సాంకేతిక ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక ఫలితాన్ని బట్టి ప్రతి జల మార్గానికి సంబంధిత అధికార యంత్రాంగం నుంచి ఆర్థిక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక వనరులను సమీకరించడం ద్వారా నౌకా రవాణా, నేవిగేషన్ అవసరాల కోసం ఐడబ్ల్యూఏఐ సాధ్యమైన విస్తృతితో జాతీయ జల మార్గాలను అభివృద్ధి చేస్తుంది.
ఈ జాతీయ జల మార్గాలను ప్రకటించడం వల్ల ఐడబ్ల్యూఏఐ వాటిని నౌకా రవాణా, నేవిగేషన్ అవసరాల కోసం అభివృద్ధి చేసేందుకు వీలవుతుంది. నీటి వినియోగం, నదీతల వినియోగం, నదికి అనుబంధంగా ఉండే భూమి వినియోగం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే హక్కులు యథాతథంగా కొనసాగుతాయి. అదనంగా రాష్ర్టాలకు ఇప్పుడు చెప్పుకొనే ప్రయోజనాలు కూడా సమకూరుతాయి. రోడ్లపై రద్దీ తగ్గడం, ప్రమాదాల సంఖ్య తగ్గడం, ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో కూడిన రవాణా సాధనాలు అందుబాటులోకి రావడం, సరుకు రవాణాలో లాజిస్టిక్ వ్యయాలు తగ్గించుకునే అవకాశం లభించడం, నదులకు సమీపంలోని ప్రాంతాలు మరింతగా అభివృద్ధి చెందడం వంటివి ముఖ్యమైన ప్రయోజనాలు.
జాతీయ జల మార్గాలను సత్వరం ప్రకటించి, అభివృద్ధి చేయడం పారిశ్రామిక ప్రగతికి, ఆ జల మార్గం వెంబడి పర్యాటక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. పైగా దేశమంతటా పర్యావరణహితమైన, చవకైన రవాణా మార్గం అందుబాటులోకి వస్తుంది.
నేపథ్యం:
ఇంధన వినియోగపరంగా చూసినప్పుడు అంతర్గత జల రవాణాను అన్నింటి కంటే అతి తక్కువ వ్యయమయ్యే ఉత్తమ సాధనంగా చెప్పాల్సి ఉంటుంది. జల రవాణాలో ఒక అశ్విక శక్తి (హెచ్‌పీ) వినియోగంతో 4,000 కిలోల లోడును తరలించవచ్చు. అదే రహదారి మార్గం, రైలు మార్గాల విషయానికొస్తే అదే సామర్థ్య వినియోగంతో వరుసగా 150 కిలోలు, 500 కిలోల సరుకును మాత్రమే తరలించగలం. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఒక అధ్యయన నివేదికలో కూడా ఈ విషయాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఒక లీటరు ఇంధనంతో అంతర్గత జల రవాణా ద్వారా 105 టన్ను/కిలోమీటర్ రవాణా సాధ్యం కాగా, రైలు మార్గాన 85 టన్ను/కిలోమీటర్, రోడ్డు మార్గాన 24 టన్ను/కిలోమీటర్ రవాణా మాత్రమే సాధ్యమవుతుందని అందులో పేర్కొన్నారు. ప్రతి టన్ను/కిలోమీటర్ రవాణాకు కంటైనర్ వాహనాలు 32 నుంచి 36 గ్రాముల కార్బన్ డయాక్సైడ్‌ను మాత్రమే విడుదల చేస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది. అదే రోడ్డు మార్గాన రవాణాకు వాడే భారీ వాహనాలైతే అదే సామర్థ్యం గల సరుకు రవాణాకు 51 నుంచి 91 గ్రాముల కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తుండటం గమనించాల్సిన అంశం.