పిఎంఇండియా
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ లక్నో మెట్రోరైలు ప్రాజెక్టు 1ఎ దశకు ఆమోదముద్ర వేసింది. ఈ దశలో 22 స్టేషన్లతో 22.878 కిలోమీటర్ల నిడివి గల మెట్రోరైలు మార్గం నిర్మిస్తారు.
మొత్తం ప్రాజెక్టు వ్యయం 6928 కోట్ల రూపాయలు కాగా కేంద్రప్రభుత్వం 1300 కోట్ల రూపాయలు ఈక్విటీ, సబార్డినేట్ డెట్ రూపంలో అందిస్తుంది. కేంద్రప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల 50:50 వాటా జాయింట్ వెంచర్‌గా పునర్నిర్మించనున్న లక్నో మెట్రోరైలు కార్పొరేషన్ (ఎల్ఎంఆర్సి) ఈ ప్రాజెక్టును అమలుపరుస్తుంది.
మొత్తం రూట్ పొడవు 22.878 కిలోమీటర్లలో 19.438 కిలోమీటర్లు ఎలివేటెడ్ రూట్లోను, 3.440 కిలోమీటర్లు భూగర్భంలోను నిర్మిస్తారు. ఈ మార్గంలో 19 ఎలివేటెడ్ స్టేషన్లు, మూడు భూగర్భ స్టేషన్లు ఉంటాయి. చౌదరి చరణ్‌సింగ్ ఎయిర్పోర్ట్ నుంచి మున్షీపులియాకు ఇది నిర్మితమవుతుంది.
ఈ ప్రాజెక్టు మెట్రోరైల్వేస్ (పనుల నిర్మాణం) చట్టం 1978, మెట్రో రైల్వేస్ (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) చట్టం 2002, రైల్వేస్ చట్టం 1989 పరిధిలోకి వస్తుంది.
నేపథ్యం
లక్నో నగరం రవాణా వసతుల పరంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. గత రెండు దశాబ్దాల కాలంలో లక్నో నగరం విశేషంగా విస్తరించింది. 2011 జనాభా గణాంకాల ప్రకారం లక్నో అర్బన్ ప్రాంత జనాభా 29 లక్షలు కాగా లక్నో మెట్రోపాలిటన్ ఏరియా జనాభా 50 లక్షలు దాటింది. లక్నో నగరంలో 14.24 లక్షల వాహనాలు నడుస్తున్నాయి. వాటిలో 80 శాతం ద్విచక్రవాహనాలు కాగా 14 శాతం కార్లు. నగరంలో వాహనాల సంఖ్య ఏటా 8.35 శాతం వంతున పెరుగుతోంది.