పిఎంఇండియా
ఆఫ్రికా, యూరేసియాలకు చెందిన వేటాడే వలస పక్షుల సంరక్షణార్థం అవగాహన పూర్వక ఒప్పందం(ఎంఓయూ) పైన ఇండియా సంతకం చేయడానికి వీలుగా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని రాప్టర్ ఎంఓయూ అని కూడా అంటారు. ఇది వలస జాతుల సంరక్షణ (సీఎంఎస్) ఒప్పందానికి సంబంధించిన అవగాహన ప్రతం. ఈ సంతకంతో ఈ ఎంఓయూ మీద సంతకం చేసిన దేశాల జాబితాలో భారతదేశం 54వది అవుతుంది.
నేపథ్యం:
రాప్టర్ ఎంఓయు 2008 అక్టోబర్ 22న ముగిసింది. ఇది అదే సంవత్సరం నవంబర్ 1నుంచి అమలులోకి వచ్చింది. సిఎంఎస్‌లోని ఆర్టికల్ 4, పేరాగ్రాప్ 4 కింద రాప్టర్ ఎంఓయు అనేది ఒక ఒప్పందం. దీనికి చట్టబద్దత లేదు. ఎంఓయూ మీద సంతకాలు చేసే దేశాలు వేట కోసం వలస వెళ్లే పక్షి జాతులను, వాటి ఆవాసాల సంరక్షణను చేపట్టాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ విధానాన్ని రూపొందించారు. రాప్టర్ ఎంఓయూ పరిధిలో 76 రకాల వేటాడే పక్షి జాతులు ఉన్నాయి. వీటిలో 46 భారతదేశానికి చెందినవి.
మన దేశానికి చెందిన వన్యజీవుల (రక్షణ) చట్టం, 1972లోని నియమాలకు అనుగుణంగానే రాప్టర్ ఎంఓయు రూపొందింది. ఈ చట్టం ప్రకారం పక్షులను సంరక్షించాలి. కాబట్టి భారతదేశానికి ఈ విషయంలో ఉన్న అనుభవం కొద్దీ వేటాడే వలస పక్షుల ఆవాసాలను సమర్థవంతంగా కాపాడుతుంది. ఈ ఎంఓయూ మీద సంతకం చేయడంద్వారా భారతదేశం సరిహద్దు దేశాలతో కలసి రాప్టర్స్ ను సంరక్షించవచ్చు. ఈ ఎంఓయూ మీద మన పొరుగు దేశాలు పాకిస్థాన్, నేపాల్ కూడా సంతకాలు చేశాయి.
సీఎంఎస్ ను బాన్ ఒప్పందం అని కూడా అంటారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ ఈపీ) కింద ఇది రూపొందింది. 1983 నవంబర్ 1 నుంచి భారతదేశం వలస పక్షి జాతుల సంరక్షణ కార్యక్రమంలో భాగస్వామిగా ఉంది.