పిఎంఇండియా
నా మంత్రివర్గ సహచరులు, ప్రస్తుతం వారాణసీ లో ఉన్న స్మృతి ఇరానీ గారు, తివాచీ పరిశ్రమ తో అనుబంధం కలిగిన పారిశ్రామికవేత్తలు, నా నేత సోదరులు మరియు సోదరీమణులు, ఇంకా ఇక్కడకు విచ్చేసిన ఇతర ప్రముఖులందరికీ శుభాకాంక్షలు. అలాగే దేశ విదేశాల నుండి ఈ పవిత్ర స్థలమైన కాశీ కి తరలివచ్చిన వారందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. 38 దేశాల నుండి 250 కి పైగా అతిథులు ఇక్కడకు హాజరైనట్లు నా దృష్టి కి తీసుకువచ్చారు. వీరికి అదనంగా, జమ్ము & కశ్మీర్, పశ్చిమ బెంగాల్ లు సహా పలు ఇతర రాష్ట్రాల నుండి కూడా తివాచీ పరిశ్రమ తో సంబంధం ఉన్న వారు ఇక్కడకు వచ్చారు. బనారస్ కు చెందిన పార్లమెంట్ సభ్యుని గా మీ అందరినీ ఈ ఎక్స్ పో కు ఆహ్వానిస్తున్నాను.
మిత్రులారా,
దేశం లో ఇది పండుగ ల సీజను. దసరా మరియు దుర్గా పూజ ల అనంతరం మొదటి సారి సాంకేతిక విజ్ఞానం సహాయం తో బనారస్ తో అనుసంధానం అయ్యే అవకాశం నాకు లభించింది. ఇప్పుడు మీరంతా ధన్ తేరస్ కోసం, ఇంకా దీపావళి కోసం ఏర్పాట్లు చేసే హడావుడి లో ఉన్నారు. మొత్తం ఏడాది లో మీరు చాలా బిజీ గా ఉండే సమయం ఇది. ఈ సమయం లో మీకు చాలా డిమాండ్ ఉండడం తో మీకు ఈ సమయం చాలా ప్రధానమైంది. ఇది కాక మీ పనితనానికి, మీరు పడ్డ కష్టానికి తగిన గుర్తింపు, ప్రతిఫలం లభించే ఉత్తమమైన సమయం కూడాను.
మిత్రులారా,
వారాణసీ, ఉత్తరప్రదేశ్ లోని నేత కార్మికులకు, వ్యాపారులకు ఈ పండుగలు రెండు సార్లు ఆనందాన్ని తీసుకువచ్చాయి. దీన్ దయాళ్ హస్తకళా సంకుల్ లో ఒకటో భారతీయ తివాచీ ఎక్స్ పో ను ఏర్పాటు చేసిన మీ అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దేశం లోని తివాచీ పరిశ్రమ, డిజైనర్లు, వ్యాపారులు వారి నైపుణ్యాన్ని, ఉత్పత్తులను ప్రపంచానికి ఇప్పుడు వారాణసీ లో చూపించే అవకాశం వచ్చింది.
మిత్రులారా,
దీన్ దయాళ్ హస్తకళా సంకుల్ ఏ ఉద్దేశ్యం తో అభివృద్ధి చెందిందో ఆ దిశ గా విజయం సాధించడానికి ఎంతో వేగంగా ముందుకు పోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. తివాచీ పరిశ్రమ కు ఈ ప్రాంతం కేంద్రంగా ఉండడం వల్ల కూడా ఇది చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకొంది. హస్తకళా రంగానికి చెందిన దేశం లోని నేత శ్రామికులు, కార్మికులు, వ్యాపార సోదరులు మరియు సోదరీమణులలో సుమారు 25 శాతం మంది ఇక్కడే జీవనం సాగిస్తున్నారు. అది వారాణసీ కానీయండి, భదోహీ కానీయండి లేదా మిర్జాపుర్ కానీయండి.. ఇవన్నీ కూడా తివాచీ పరిశ్రమ కు కేంద్రాలు గా ఉన్నాయి. ఇప్పుడు యావత్తు తూర్పు భారతదేశం జౌళి ఎగుమతులకు ఒక అంతర్జాతీయ కేంద్రం గా మారింది. అంతేకాదు, హస్తకళ ల రంగం లో అంతర్జాతీయ గుర్తింపు ను పటిష్ఠపరచడం కోసం, దీన్ దయాళ్ హస్తకళా సంకుల్ కూడా ఒక ముఖ్యమైన పాత్ర ను పోషిస్తోంది.
మిత్రులారా,
ఈ రంగం లో చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో సాంకేతికత ను, ప్రచారాన్ని ఉపయోగించడంపై ప్రభుత్వం ఎల్లప్పుడూ నొక్కి చెబుతోంది. అదేవిధంగా వస్తువులు ఉత్పత్తి చేస్తున్న ప్రదేశం లోనే ఈ సదుపాయాలు అందుబాటులో ఉండాలని కృషి చేస్తోంది. ఈ సారి ఈ భారతీయ తివాచీ ప్రదర్శన ను వారాణసీ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దిశ గా ఇది ఒక ముఖ్యమైన చర్య మాత్రమే కాదు, జౌళి రంగం లో ఐదు ‘‘ఎఫ్’’లతో మేం నిర్దేశించుకొన్న లక్ష్య సాధన లో ఒక ప్రధానమైన చర్య కూడాను. ఐదు ‘‘ఎఫ్’’లు అంటే – వ్యవసాయ క్షేత్రం నుండి ఫైబర్ వరకు, ఫైబర్ నుండి కార్ఖానా వరకు, కార్ఖానా నుండి ఫాశన్ వరకు, అదే విధంగా ఫాశన్ నుండి విదేశాల వరకు. ఈ భారీ చర్య ద్వారా రైతులను, నేత శ్రామికులను, ప్రపంచ వ్యాప్తంగా విపణి తో అనుసంధానించడం జరుగుతుంది. వచ్చే నాలుగు రోజుల్లో ఈ ప్రదర్శన లో అనేక గొప్ప డిజైన్ లను ప్రదర్శిస్తారు, కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది, ఒప్పందాలు జరుగుతాయి, వ్యాపారం కోసం కొత్త మార్గాలకు అవకాశాలు ఏర్పడుతాయి, నేతకారులకు కొత్త ఆర్దర్లు వస్తాయి. విదేశాల నుండి వచ్చిన వ్యాపార మిత్రులు కాశీ తో పాటు భారతదేశం అంతటా అమలు లో ఉన్న మన సంస్కృతి, మారిన వ్యాపార వాతావరణాన్ని అర్ధం చేసుకోగలుగుతారు.
మిత్రులారా,
భారతదేశం లో హస్తకళలకు ఒక పురాతనమైన సంప్రదాయం ఉంది. ఈ రోజుల్లో కూడా, భారతదేశం లోని గ్రామీణ ప్రాంతాల్లో నూలు వడకడానికి ఎక్కువ గా రాట్నాన్నే ఉపయోగిస్తారు. ఈ విషయం లో బనారస్ ఒక గొప్ప పాత్ర ను పోషిస్తోంది. హస్తకళ లతో పాటు సంత్ కబీర్ విషయం లో కూడా బనారస్ సమానంగా ప్రసిద్ధి చెందింది. కబీర్ నూలు వాడికే వారు. నూలు ను వడుకుతూనే తన సందేశాన్ని అందించే వారు. కబీర్ దాస్ గారు ఇలా చెప్పారు..
‘‘కహీ కబీర్ సునో హో సంతోం చరఖా లఖే జో కోయ్,
జో యహ్ చరఖా లఖీ భాయే, తకో అవగమన్ న హొయ్’’.
ఈ దోహా కు- రాట్నం జీవితం యొక్క సారాంశం, దీనిని అర్ధం చేసుకున్న వారు, జీవిత పరమార్ధాన్ని అర్ధం చేసుకుంటారు- అని భావం. ఇటువంటి అతి ముఖ్యమైన జీవిత తత్త్వం తో ముడిపడ్డ హస్తకళ లు ఉన్న ప్రదేశం లో నేతకారుల జీవితాల కు ఈ విధమైన సదుపాయాల తో కూడిన అభివృద్ధి ని కల్పిస్తే నాకు తృప్తిగా ఉంటుంది.
మిత్రులారా,
మన దేశం లో, హస్తకళ లు ప్రేరణ కు ఒక మాధ్యమంగా ఉంది, వ్యాపారం మరియు వాణిజ్యం కంటే స్వాతంత్య్ర పోరాటం, స్వంతంగా ఆధారపడడం ముఖ్యం. గాంధీ గారి యొక్క సత్యాగ్రహం, రాట్నం మనందరికీ సుపరిచితాలే.
మీ అందరి సహకారం తో, హస్తకళ ల ద్వారా స్వావలంబన సందేశాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిర్విరామం గా కృషి చేస్తోంది. ఆ కారణం చేతనే, భారతదేశం ప్రస్తుతం తివాచీ ల తయారీ లో ప్రపంచం లోకెల్లా అతిపెద్ద ఉత్పత్తిదారు గా నిలచింది. చేతి తో నేసిన తివాచీ ల విషయం లో మనం గత నాలుగున్నర సంవత్సరాల్లో ప్రపంచం లోనే ప్రథమ స్థానం లో ఉన్నాం. ఇది లక్షలాది మంది నేత కారులు, డిజైనర్లు, వ్యాపారులు మరియు ప్రభుత్వ విధానాల కృషి ఫలితం గా సాధ్యపడింది.
మిత్రులారా,
ప్రపంచం మొత్తం మీద తివాచీ ల విపణి లో ఈ రోజున భారతదేశం వాటా మూడో వంతు కంటే ఎక్కువ గా.. అంటే 35 శాతం గా.. ఉంది. వచ్చే రెండు, మూడేళ్ళ లో ఇది 50 శాతానికి చేరుకొంటుందని అంచనా వేయడం జరిగింది. అంటే రానున్న కొన్ని సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తివాచీ ల వ్యాపారం లో మీరు సగానికి చేరుకోనున్నారన్న మాట.
గత ఏడాది మనం తొమ్మిది వేల కోట్ల రూపాయల విలువైన తివాచీ లను ఎగుమతి చేశాం. ఈ ఏడాది మనం సుమారుగా ఒక వంద దేశాల కు తివాచీలను ఎగుమతి చేశాం. ఇది మెచ్చుకోదగ్గదే కానీ మనం దీనిని ఇంకా ముందుకు తీసుకుపోవాలి. మనకు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయ్యే 2022వ సంవత్సరం కల్లా మన ఎగుమతుల విలువ 25,000 కోట్ల రూపాయలకు చేరే విధం గా మనం కృషి చేయాలి. కేవలం ఎగుమతులే కాదు, గత నాలుగేళ్ల లో దేశీయం గా కూడా తివాచీ ల వ్యాపారం మూడు రెట్లు పెరిగింది. నాలుగేళ్ల క్రితం 500 కోట్ల రూపాయలు గా ఉన్న వ్యాపారం ఈ రోజున 1600 కోట్ల రూపాయలకు చేరింది. మన దేశ తివాచీ ల వ్యాపారం ఇంతగా విస్తరించిందంటే దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటోది దేశం లో మధ్య తరగతి జనాభా నిరంతరంగా పెరుగుతోంది; రెండోది తివాచీ ల పరిశ్రమ కు గతం లో లేని సదుపాయాలు ఇప్పుడు అందుబాటు లోకి వచ్చాయి. దీనికి తోడు తివాచీ ల పరిశ్రమ కు ప్రచారం పెరిగింది; తద్వారా తివాచీ లను ప్రాచుర్యం లోకి తేవడానికి కృషి జరుగుతోంది.
మిత్రులారా,
మనం ఇదే ధోరణిని కొనసాగిస్తే, దేశంలో తివాచీ లు, వస్త్ర రంగం భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉంటుంది. అతి చిన్న తివాచీ నుండి అతి పెద్ద తివాచీ వరకు ఉత్పత్తి చేసే దేశం ప్రపంచం లో భారతదేశం ఒక్కటే ఉంది. అంతేకాదు, కళలు, హస్త కళల పరంగా భారతీయ తివాచీ లు అద్భుతమైనవని పేరుతెచ్చుకొన్నాయి. అవి పర్యావరణ పరం గా కూడా అనుకూలమైనవి. మీ పరిజ్ఞానం తోను, నైపుణ్యం తో కూడిన అద్భుతమైన పనితనం కారణం గాను భారతదేశం లో రూపుదిద్దుకొనేటటువంటి తివాచీ లు ప్రపంచం లోనే ఒక పెద్ద బ్రాండు గా ప్రసిద్ధమయ్యాయి.
మిత్రులారా,
వీటి ని మరింత పటిష్టపరచడానికి ప్రభుత్వం కట్టుబడి వుంది. తివాచీ ఎగుమతిదారు సంస్థ లకు సదుపాయాల్లో ఎటువంటి కొరత లేకుండా ప్రభుత్వం రవాణా పరమైన పూర్తి మద్దతు ను కల్పిస్తోంది. దేశవ్యాప్తం గా శో రూములు, గిడ్డంగులు అందుబాటు లో ఉండే విధం గా పనులు చురుకు గా సాగుతున్నాయి. అంతేకాదు, సాంకేతికంగా, నాణ్యతపరంగా సౌకర్యాలను అభివృద్ధి చేయడం కూడా జరుగుతోంది. తివాచీ లను పరీక్షించడానికి ప్రపంచ స్థాయి ప్రయోగశాల లను భదోహీ, శ్రీనగర్ లలోని భారతీయ కార్పెట్ టెక్నాలజీ సంస్థ, ఐఐసిటి లలో ఏర్పాటుచేయడం జరిగింది. మన ఉత్పత్తులలో ఎటువంటి లోపం, ఎటువంటి ప్రభావం ఉండకుండా తయారు చేయడానికీ, పర్యావరణానికి ఎటువంటి నష్టం లేకుండా, మచ్చ లేని ఉత్పత్తులను తయారుచేయడానికి మనం కృషి చేస్తున్నాం.
దీనికి తోడు, తివాచీ లతో పాటు ఇతర హస్తకళా ఉత్పత్తుల మార్కెటింగ్ కు నేతకారులకు అవసరమైన ఇతర సహాయాన్ని అందించడానికి వీలు గా అనేక సదుపాయాలను అభివృద్ధి చేయడం జరిగింది. వారాణసీ లో తొమ్మిది ఉమ్మడి సదుపాయాల కేంద్రాలను, ఉమ్మడి సేవా కేంద్రాలనూ అభివృద్ధిపరచడమైంది; ఈ కేంద్రాలు వేలాది మంది నేతకారులకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి.
మిత్రులారా,
నేత పనివారు, చిన్న వ్యాపారులు, నిధులకు సంబంధించిన సమస్య లను ఎదుర్కోవలసిన అవసరం రాకుండా వారికి నాణ్యత కు భరోసా తో పాటు, పలు ఇతర చర్యలను కూడా తీసుకోవడం జరిగింది. ముద్రా పథకం లో భాగం గా 50 వేల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు హామీ లేని రుణాలు చాలా సహాయకారి గా ఉన్నాయి. ముద్రా పథకం లో భాగం గా నేత పనివారికి 10 వేల రూపాయల మార్జిన్ మనీ ని అందజేసే సదుపాయం కల్పించడం జరిగింది. నేత పనివారి కి ఇచ్చే ఏ విధమైన ఆర్ధిక సహాయం కానీ, ఋణం కానీ, ఆ మొత్తాన్ని అతి తక్కువ సమయం లో వారి బ్యాంకు ఖాతా లోకే నేరుగా జమ చేయడం జరుగుతోంది. ‘పహ్ చాన్’ పేరు తో నేతకారులకు జారీ చేసిన గుర్తింపు కార్డులు మధ్యవర్తులను తొలగించడానికి బాగా ఉపయోగపడుతున్నాయి.
భదోహీ -మీర్జాపుర్ మెగా కార్పెట్ క్లస్టర్ మరియు శ్రీనగర్ కార్పెట్ క్లస్టర్ లలో నేతపనివారికి ఆధునిక మగ్గాలు కూడా అందజేయడం జరిగింది. మగ్గాలను ఉపయోగించడానికి అవసరమైన నైపుణ్యాన్ని మెరుగుపరచుకోడానికి వీలు గా వారికి శిక్షణ ను కూడా ఇవ్వడమైంది. నేత కార్మికులు వారి నైపుణ్యాలను మెరుగుపరచుకోడానికి వీలుగా వారికి పలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
మిత్రులారా,
గతం లో నేను ఎప్పుడు నేత సోదరులు మరియు సోదరీమణులతో మాట్లాడినా వారు తమ పిల్లలు ఈ వ్యాపారం లోకి రావడానికి ఇష్టపడడం లేదని చెప్పే వారు. ఇంతకంటే తీవ్రం గా విచారించవలసిన విషయం ఏముంటుంది ? అయితే ఈ రోజున తివాచీల వ్యాపారం విషయం లో మనం ప్రపంచం లోనే అగ్రస్థానం లో ఉన్నాం. అందువల్ల ఇప్పుడు ఇది మన భవిష్యత్ తరాలను ప్రోత్సహించవలసిన సమయం.
ఐఐసిటి, భదోహీ లో కార్పెట్ టెక్నాలజీ లో బి.టెక్, కోర్సు ప్రారంభమైంది. దేశం లోని ఇతర ప్రాంతాల్లో అన్య శిక్షణ సంస్థలలోనూ ఇదే విధమైన కార్యక్రమాలను ప్రారంభించాలనే ప్రణాళిక ఉంది. నేత కార్మికులకు శిక్షణ ఇవ్వడం తో పాటు వారికి, వారి పిల్లలకు విద్యను అందించడానికి కూడా శ్రద్ధ తీసుకోవడం జరిగింది. పేద నేత కార్మికుల పిల్లల రుసుములలో 75 శాతం రుసుము లను ప్రభుత్వం చెల్లిస్తోంది.
మిత్రులారా,
మీ కళ లను, శ్రమ శక్తిని జాతీయ బలం గా మార్చడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. రానున్న రోజుల్లో ఈ దేశానికీ, బనారస్ కు ఈ కళ లను ప్రదర్శించడానికి భారీ అవకాశాలు ఉన్నాయి.
వచ్చే సంవత్సరం జనవరి లో కాశీ లో ప్రవాసీ భారతీయ సమ్మేళన్ జరుగనుంది. ప్రచారానికి ఇది ఒక పెద్ద అవకాశం గా ఉంటుంది. మన వారసత్వాన్ని, మన హస్తకళ లను, అలాగే మారుతున్న కాశీ ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు అర్ధం చేసుకొంటారన్న దృఢ విశ్వాసం తో నేను ఉన్నాను.
ధన్ తేరస్ మరియు ఛఠ్ పూజ ల సందర్భంగా మీ అందరికీ నేను మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం గా నిర్వహించినందుకు జౌళి మంత్రిత్వ శాఖ ను మరో సారి అభినందిస్తున్నాను. కాశీ కి, నా నేత సోదరులు మరియు సోదరీమణులకూ అంతర్జాతీయ గౌరవం తీసుకువచ్చినందుకు మరో మారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాశీ ని సందర్శించినందుకు, అదే విధంగా కాశీ ని ఒక గుర్తింపు కేంద్రం గా రూపుదిద్దినందుకూ ఈ ఎగుమతి- దిగుమతి వ్యవహారాలతో సంబంధం ఉన్న వారందరికీ ఇవే నా శుభాకాంక్షలు.
మీకు అనేకానేక ధన్యవాదాలు.