పిఎంఇండియా
హలో (నమస్కారం!)
జపాన్ వంటి దేశం.. చల్లని ఆకి రుతువు యొక్క ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణం, మీ సమక్షం లో నేను.. నిజంగా ఇది ఒక అపూర్వమైన సమ్మేళనం. భారతదేశం లో పని దినమైన సోమవారం ఉదయం 9 గంటలకు హాజరు కావడమే గగనం; అలాంటిది ఇంత ఉదయాన్నే, ఇంత పెద్ద సంఖ్య లో మీరందరూ రావడం (బహుశా మీరు నిన్న రాత్రే ఇక్కడికి చేరుకొనివుంటారు), ఆశీర్వదించడం నా భాగ్యం గా భావిస్తూ మీకందరికీ నా హృదయాంతరాళం లో నుండి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
ఇవాళ్టి ఈ సమావేశం ఎంతో ప్రత్యేకం; ఎందుకంటే జపాన్ లో నివసించే నా స్వజనాన్ని 2016 తరువాత నేడు మరో సారి కలుసుకుంటున్నాను.
ఈ సందర్భంగా ‘లిబరల్ డెమోక్రటిక్ పార్టీ’ (ఎల్ డిపి) అధ్యక్ష పదవికి మళ్లీ ఎన్నికైన మన ప్రియ మిత్రుడు, ప్రధాని శ్రీ శింజో ఆబే గారి కి భారతదేశం తరఫున, మీ అందరి తరఫున అభినందనలు తెలుపుతున్నాను.
ప్రధాని శ్రీ ఆబే గారు భారత ప్రజలతో పాటు నా పైన కూడా ఎల్లప్పుడూ ఎనలేని ప్రేమాభిమానాలను చూపుతారు. ఇక్కడ నాకు దక్కిన ప్రత్యేక స్వాగత సత్కారాలు ఈ సౌహార్దత కు మరొక కొత్త కోణాన్ని జోడించాయి. ఇందుకుగాను జపాన్ ప్రజానీకానికి, ప్రధాని శ్రీ ఆబే గారి కి మరో మారు నా కృతజ్ఞత ను వెల్లడి చేస్తున్నాను.
దీపావళి పండుగ సందర్భం గా మీకందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దీపావళి నాడు ఒక దీపం తనను వెలిగించిన ప్రదేశాన్ని వెలుగు తో నింపిన తరహా లోనే మీరంతా జపాన్ లోనే కాకుండా ప్రపంచం అంతటా మీ పేరు తో పాటు మీ దేశం పేరు ను ప్రకాశింపజేస్తారని ఆశిస్తున్నాను.
మిత్రులారా,
భారతదేశ ప్రధాన మంత్రి హోదా లో నేను ఇప్పుడు మూడో సారి జపాన్ పర్యటన కు వచ్చాను. ఈ దేశాని కి నేను ఎప్పుడు వచ్చినా ఎంతో ప్రేమపూర్వక అనుభవాన్ని పొందుతుంటాను. సంస్కృతి పరం గానే కాకుండా సంప్రదాయ ధోరణుల పరం గా కూడా భారతదేశం- జపాన్ సంబంధాలు ఎంతో లోతు గా వేళ్లూనుకోవడమే ఇందుకు కారణం. అది హిందూత్వం కావచ్చు.. బౌద్ధం కావచ్చు.. మనది ఉమ్మడి వారసత్వం. మన ఆరాధ్యుల నుండి అక్షరాల దాకా ఈ వారసత్వ కాంతి ప్రతిబింబిస్తుంది. సరస్వతీ మాత కావచ్చు.. లక్ష్మీదేవి కావచ్చు.. మహాశివుడు లేదా గణపతి, తదితర దేవతామూర్తుల సమానులు జపాన్ సమాజం లోనూ కనిపిస్తారు. ‘సేవ’ అనే పదాని కి హిందీ, జపాన్ భాష లలో అర్థం ఒక్కటే.. అలాగే ‘హోమ్’ అనే పదం జపాన్ భాష లో ‘గోమ’ అయింది; ‘తోరణం’ కాస్తా ‘తోరి’గా మారింది. పవిత్ర ‘ఒంతాకే’ కొండ కు యాత్రికులు శ్వేత వస్త్రధారులై వెళ్తుంటారు. వాటి పై ‘సంస్కృత-సిధామ్’ పురాతన లిపి లో కొన్ని అక్షరాలు రాసి ఉంటాయి. అలాగే వారు ధరించే తెల్లని జపానీ ‘తెంగువీ’ (పై పంచె వంటిది)పై ‘ఓం’ అని రాసి ఉంటుంది.
మిత్రులారా,
భారతదేశం- జపాన్ సంబంధాలను పెనవేసిన ఇలాంటి గత కాలపు బలమైన బంధాలు ఎన్నో ఉన్నాయి. బుద్ధుడు- బోస్ భారతదేశం, జపాన్ చరిత్ర లను ముడివేసిన రీతి లోనే ప్రస్తుతం నవ భారత దూత లుగా మీ వంటి వారు ఈ బంధాన్ని మరింత దృఢతరం చేస్తున్నారు. కాబట్టి జపాన్‌లో భారత ప్రభుత్వ రాయబారి ఇక్కడ ఉన్న మీలాంటి వేలాది దూతలలో ఒకరు మాత్రమే.
భారతదేశం తో జపాన్ ను, ఇక్కడి ప్రజల ను, వారి సంస్కృతి ని, రెండు దేశాల ఆకాంక్ష లను కలిపే వారధులు మీరే. ఈ గురుతర బాధ్యత ను మీరు ఎంతో విజయవంతంగా నిర్వర్తిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది.
మిత్రులారా,
జపాన్ ప్రధాని శ్రీ ఆబే గారి తో నేను ఎప్పుడు మాట్లాడినా ఇక్కడి భారత సమాజాన్ని ఆయన ప్రశంసిస్తూనే ఉండడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. మీ నైపుణ్యం, సాంస్కృతిక విలువ లతో మీరున ఇక్కడ అపార గౌరవాన్ని సముపార్జించుకున్నారు.
మీరు యోగాభ్యాసాన్ని జపాన్ ప్రజా జీవనం లో ఒక భాగం చేయడం లో సఫలీకృతులయ్యారు. దద్ధోజనాన్ని ఇక్కడి ఆహార పదార్థాల జాబితా లో చేర్చేశారు. చివరకు మీ జపానీ మిత్రులతో కలసి దీపావళి వేడుకలు కూడా చేసుకుంటున్నారు. యుద్ధ విద్య లకు నెలవైన ఈ దేశాని కి మీరు కబడ్డీ క్రీడా నైపుణ్యాన్ని ఇచ్చారు. ఇక ఇప్పడు క్రికెట్ క్రీడా సంస్కృతి ని వ్యాపింపజేసే ప్రయత్నం లో ఉన్నారు.
జపనీయుల హృదయాల్లో చోటు సంపాదించే దిశగా భాగస్వామ్య మంత్రం, సహజీవనం తో మనస్సులను గెలుచుకోవడమనే పద్ధతులను మీరు అనుసరించిన తీరు ప్రశంసనీయం. భారతీయ సంస్కృతి కి ప్రతినిధులుగా ఇక్కడ 30వేల మంది పనిచేస్తుండడం నాకు చాలా సంతోషం గా ఉంది.
మిత్రులారా,
మీలో చాలా మంది భారతదేశాన్ని సందర్శిస్తూనే ఉండి వుంటారు. అయితే, కొంతకాలం నుండి స్వదేశానికి రాని వారు అక్కడ చోటు చేసుకుంటున్న మార్పులను గురించి వార్తా పత్రికల ద్వారా, ఇంటర్ నెట్ ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. భారతదేశం నేడు ఒక ప్రధాన పరివర్తన దశ లో ఉంది. మానవాళి కి సేవ లో భారతదేశం తన వంతు గా చేస్తున్న కృషి ని ప్రపంచం ఇవాళ ప్రశంసిస్తోంది. ప్రజా సేవారంగం లో చేస్తున్న కృషి కి, ఆ దిశ గా రూపొందుతున్న వైవిధ్య విధానాలకుగాను మన దేశం సర్వత్రా కొనియాడబడుతోంది.
ఇటీవలే రెండు గొప్ప అంతర్జాతీయ సంస్థలు భారతదేశ కృషిని గుర్తించి గౌరవించాయి. హరిత భవిష్యత్తు దిశ గా చేసిన సేవలకుగాను ఐక్య రాజ్య సమితి ‘చాంపియన్ ఆఫ్ అర్థ్’ పురస్కారాన్ని ప్రకటించింది. అలాగే ప్రపంచ శాంతి కోసం చేస్తున్న ప్రయత్నాలకుగాను భారతదేశాన్ని సియోల్ పీస్ ఫౌండేశన్ ‘సియోల్ శాంతి బహుమతి’కి ఎంపిక చేసింది.
మిత్రులారా,
ఈ పురస్కారాలను దేశం లోని 125 కోట్ల మంది భారతీయుల ప్రతినిధి గా నాకు బహూకరించి వుండవచ్చు.. కానీ, ఈ కృషి లో నా పాత్ర దండ లోని దారం లాంటిది. మంచి ముత్యాలను గుదిగుచ్చి మాల గా రూపొందించి అవన్నీ ఒక్కటి గా ముందుకు కదలేటట్టు చేయడానికే అది పరిమితం. మా దేశం అలాంటి మేలి ముత్యాలకు, మీలాంటి వజ్రాలకు నెలవు. కావాల్సిందల్లా సమష్టి కృషి. తదనుగుణంగా మేం నాలుగేళ్ల నుండి ఆ పనే చేస్తున్నాం. కాబట్టే ఈ సామూహిక శక్తి, ప్రజా భాగస్వామ్యాలను ప్రపంచం ఇవాళ గుర్తిస్తోంది.
ప్రపంచ శాంతి, పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక అసమానతల నిర్మూలనలో భారతదేశం కీలక పాత్ర ను పోషిస్తోంది. ఈ నేపథ్యం లో ‘మోదీనామిక్స్’కు సియోల్ శాంతి బహుమతి ని ప్రకటించిన నిర్ణేతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ మేరకు ఈ నిర్ణయం లో వారి భావనను గౌరవిస్తూనే- ఇది ‘మోదీనామిక్స్’కు కాక ‘ఇండోనామిక్స్’కు దక్కిన గౌరవం అని సగర్వంగా ప్రకటిస్తున్నాను.
ఒక ప్రభుత్వాధినేతగా నేను కేవలం భారతీయ సంస్కృతి-సంప్రదాయాలను పోషిస్తున్నాను; అంతే. ‘వసుధైవ కుటుంబకమ్ (విశ్వమంతా ఒకే కుటుంబం), సర్వే భవన్తు సుఖిన: (జనులంతా సుఖంగా ఉండాలి), సర్వే సంతు నిరామయ: (అందరూ ఆరోగ్యంగా ఉండాలి)’ అన్న ప్రాచీన విలువ లకు మేం కట్టుబడి వున్నాం. మా ప్రభుత్వం ఏమేం మార్పులు తెచ్చిందో భారతీయ కళ్లద్దాలతో చూస్తే ప్రపంచం బాగా అర్థం చేసుకోగలుగుతుంది.
మా ప్రభుత్వం సదా ప్రపంచానికి వర్తించే భారతీయ పరిష్కార స్ఫూర్తి ని అనుసరిస్తూ తన వంతు కృషి ని చేస్తోంది. ముందుగా మేం భారతదేశం లో సమస్య లను పరిష్కరించుకుంటూ ఆ నమూనాలను ప్రపంచ దేశాలకు బహూకరిస్తున్నాం.
మిత్రులారా,
భారతదేశం లో జన్ ధన్, ఆధార్, మొబైల్ (జామ్-JAM)లతో కూడిన త్రిసూత్ర విధానం ద్వారా జన జీవనం లో పారదర్శకత ను తెచ్చామని మీకు తెలిస్తే మీరు ఎంతగానో గర్విస్తారు. ఈ విధానం ప్రపంచం లోని ఇతర దేశాలను కూడా ఆకర్షిస్తోంది. భారతదేశం లో అభివృద్ధి చేసిన వ్యవస్థ లు ఇప్పుడు పరిశీలన లో ఉన్నాయి. దీంతో పాటు డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహం కోసం మేం ప్రవేశపెట్టిన భీమ్ (BHIM) యాప్, రూపే (Rupay) కార్డ్ ల వంటి వాటి పై అనేక దేశాలు ఇప్పుడు ఆసక్తి ని కనబరుస్తున్నాయి.
తక్కువ నగదు కు స్థానం ఉన్న ఆర్థిక వ్యవస్థ గా రూపొందడానికి జపాన్ కృషి చేస్తున్నదని నాకు సమాచారం అందింది. అయితే, భారతదేశం ఈ దిశ గా ఇప్పటికే చాలా ముందంజ లో ఉంది. గడచిన నాలుగేళ్ల లో యూపీఐ, భీమ్ యాప్, తదితర వేదిక ల ద్వారా డిజిటల్ లావాదేవీలు దాదాపు 7 రెట్లు పెరిగాయి.
అలాగే ఆర్థిక సేవలను అందరికీ అందుబాటు లోకి తీసుకు రావడంలో భారతదేశం తదుపరి స్థాయి కి తీసుకుపోతోంది. ఆ మేరకు ఆర్థిక సేవలను గ్రామాల్లో తపాలా కార్యాలయాల ద్వారా ఇళ్ల ముంగిటకు తీసుకుపోతోంది. మీరు మీ బాల్యం లో పోస్ట్‌మన్ ను చూసి ఉంటారు. అయితే, ఆ పోస్ట్‌మన్ నేడు బ్యాంకర్ అవుతున్నాడు.
మిత్రులారా,
డిజిటల్ మౌలిక సదుపాయాల రంగం లో భారతదేశం నేడు అనూహ్య వేగం తో పురోగమిస్తోంది. బ్రాడ్‌బ్యాండ్ అనుసంధానం గ్రామాలకు చేరువైంది. 100 కోట్ల కు పైగా మొబైల్ ఫోన్ లు క్రియాశీలంగా పని చేస్తున్నాయి. దేశ జనాభా కన్నా మొబైల్ ఫోన్ ల సంఖ్యే ఎక్కువ అన్న వ్యాఖ్య లు కూడా అప్పుడప్పుడూ వినిపిస్తుంటాయి. దేశం లో ఇప్పుడు అతి చిన్న శీతల పానీయం సీసా కన్నా తక్కువ ధరకే 1జిబి ఇంట్ నెట్ డేటా లభిస్తోంది. సేవల ప్రదానానికి ఈ చౌక డేటా చాలా సమర్థ మాధ్యమం గా మారింది.
మరోవైపు ‘మేక్ ఇన్ ఇండియా’ ఇవాళ అంతర్జాతీయ బ్రాండ్ అయింది. ఈ వినూత్ర కార్యక్రమం కింద నేడు మేం భారతదేశం కోసం మాత్రమే కాకుండా ప్రపంచం కోసం కూడా గొప్ప వస్తువులను తయారుచేస్తున్నాం. ప్రత్యేకించి ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ తయారీ రంగం లో భారతదేశం ప్రపంచ కేంద్రం గా రూపొందుతోంది. మొబైల్ ఫోన్ ల తయారీ లో ఇప్పటికే మేం ప్రథమ స్థానాని కి చేరువ లో ఉన్నాం.
మిత్రులారా,
మేక్ ఇన్ ఇండియా విజయవంతం కావడం లో నాలుగేళ్లు గా మేం సృష్టించిన వ్యాపార వాతావరణానిదే కీలక పాత్ర. ప్రపంచ బ్యాంకు వాణిజ్య సౌలభ్యం ర్యాంకు లలో భారతదేశం ఒక్కసారిగా 40 స్థానాలకు మించి ముందుకు దూసుకెళ్లింది. ఈ ఏడాది కూడా ప్రపంచ స్పర్థాత్మకత ర్యాంకులలో భారతదేశం స్థానం 5 పాయింట్ల మేర మెరుగుపడింది. అదే సమయం లో ఆవిష్కరణల్లోనూ మేం ఇవాళ ప్రపంచ అగ్ర దేశాల సరసన చేరాం. కాబట్టే స్టార్ట్- అప్ సంస్థ లకు అనువైన పర్యావరణం గల రెండో అతి పెద్ద దేశం గా భారతదేశం నేడు అవతరించింది.
మిత్రులారా,
దేశం లో ఎలాంటి ఆవిష్కరణలు వచ్చినా, ఎలాంటి పరిష్కారాలు రూపొందించబడినా అవి చౌకైనవి మాత్రమే గాక నాణ్యత రీత్యా కూడా అత్యుత్తమమైనవే. భారతదేశం అంతరిక్ష కార్యక్రమాలే ఇందుకు తిరుగు లేని ఉదాహరణ. నేడు భారతదేశం ప్రపంచం లోని అనేక దేశాల ఉపగ్రహాలను, ప్రైవేటు కంపెనీల అత్యంత తక్కువ ఖర్చు తో అంతరిక్షం లోకి పంపుతోంది. గత సంవత్సరం లో 100కు పైగా ఉపగ్రహాలను ఒకే సారి రోదసి లోకి ప్రయోగించడం ద్వారా మా శాస్త్రవేత్తలు అపూర్వమైనటువంటి రికార్డు ను సృష్టించారు.
మేం చంద్రయాన్, మంగళయాన్ ఉపగ్రహాలను చాలా తక్కువ బడ్జెట్ తో పంపాం. ఇక 2022 కల్లా గగనయాన్ ప్రాజెక్టుకై రంగాన్ని సిద్ధం చేస్తున్నాం. ఇది పూర్తిగా స్వదేశీ ప్రయోగం మాత్రమే గాక మేం అంతరిక్షం లోకి పంపబోయే వ్యోమగామి కూడా భారతీయుడే కానున్నారు.ః
మిత్రులారా,
భారత దేశం లో ఇవాళ భూమి నుండి ఆకాశం దాకా ఇలాంటి మార్పు లు అనేకం చోటు చేసుకుంటున్నాయి. అందువల్ల భారతదేశం నేడు ప్రపంచం లోకెల్లా అత్యంత వేగం గా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ గా పరిగణన లోకి వచ్చింది. ఈ పరివర్తనాత్మక మార్పు ల నేపథ్యం లో రాబోయే దశాబ్దానికంతా భారతదేశం ప్రపంచ వృద్ధి కి చోదక శక్తి గా అవతరించగలదని అంతర్జాతీయ అగ్ర సంస్థలన్నీ చెబుతున్నాయి. ఈ భారత వృద్ధి గాథ లో జపాన్ మాత్రమే గాక మీరు కూడా మీ వంతు పాత్ర ను పోషించనున్నారు.
బులిట్ రైలు నుండి స్మార్ట్ సిటీస్ దాకా న్యూ ఇండియా లో ప్రతి కొత్త మౌలిక సదుపాయం కల్పన లోనూ భాగస్వామి గా జపాన్ ఉంది. భారతదేశం మానవ శక్తి సంపద, యువ శక్తి లు కూడా జపాన్ నైపుణ్యం తో లబ్ధి ని పొందుతున్నాయి.
మిత్రులారా,
ఈ న్యూ ఇండియా సృష్టి లో పాలుపంచుకోవలసింది గా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నేడు భారతదేశం లో పెట్టుబడులకు తగిన అనేక అవకాశాలు, ఆవిష్కరణల తో పాటు మీ మూలాల తో చురుకైన అనుసంధానం కూడా చాలా ముఖ్యమైనదని గుర్తించండి.
జపాన్ లో స్థిరపడిన భారతీయులు, ఈ దేశ మిత్రుల తో సంయుక్తం గా స్వదేశం కోసం తమ వంతు గా గణనీయ కృషి చేస్తూనే ఉన్నారు. స్వామి వివేకానంద తో పాటు సుభాష్ చంద్రబోస్ గారు, భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమం కూడా జపాన్ తోడ్పాటు ను పొందిన విషయం కోట్లాది భారతీయుల మది లో సదా మెదలుతూ ఉంటుంది.
కాబట్టి భవిష్యత్తు లో మన బంధం మరింత బలోపేతం కావడానికి, భాగస్వామ్యం ఇంకా శక్తిమంతం అయ్యేందుకూ మనమంతా నిరంతర కృషి ని కొనసాగించవలసివుంది.
వచ్చే సంవత్సరం జనవరి లో భారతదేశం నిర్వహించబోయే ప్రవాసీ భారతీయ దినోత్సవం తో పాటు అర్ధ- కుంభమేళా వేడుక లకు ఇవాళ ఈ వేదిక నుండి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పైగా గంగామాత కు హారతి ఇచ్చే కార్యక్రమాన్ని చూసి ప్రధాని శ్రీ ఆబే ఎక్కడైతే ఆశ్చర్యం వ్యక్తం చేశారో ఆ వారాణసీ నగరం లో ఈ సారి ప్రవాసీ భారతీయ దినోత్సవాన్ని నిర్వహించబోతున్నాం. కనుక ప్రధాన మంత్రి గానే కాకుండా వారాణసీ లోక్ సభ నియోజకవర్గానికి పార్లమెంటు లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ హోదా లోనూ ఆ కార్యక్రమానికి నా అతిథులు గా హాజరు కావాలంటూ మిమ్మల్ని ఇవాళ నేను ప్రత్యక్షంగా ఆహ్వానిస్తున్నాను.
రెండు రోజులలో భారతదేశం ప్రపంచ పటం లో మరో కొత్త గుర్తింపు ను సృష్టించుకోనుంది.
అక్టోబరు 31న సర్ దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి. ప్రతి సంవత్సరం ఈ వేడుక లను నిర్వహించడం మామూలే. కానీ, ఈ ఏడాది మాత్రం ఆయన జన్మభూమి అయిన గుజరాత్ అన్ని దేశాల దృష్టి ని ఆకర్షించబోతోంది. ఎందుకంటే… (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) పేరిట ప్రపంచం లో అత్యంత ఎత్తయింది గా రూపొందిన ‘ఐక్యత ప్రతిమ’ అయినటువంటి సర్ దార్ సాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నాం. ఇది అమెరికా లోని ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’ కన్నా రెట్టింపు ఎత్తయింది గా ఉంటుంది. సర్ దార్ పటేల్ విగ్రహం ఆయన మేధస్సు అంతటి సమున్నతమైనది. ప్రపంచం లోనే ఎత్తయిన విగ్రహం భారతదేశం లో ఉందని ప్రతి భారతీయుడూ ఇకపై గర్వంగా చాటుకుంటాడు. ఈ విగ్రహాన్ని అక్టోబరు 31వ తేదీన ఆవిష్కరించబోతున్నాం. మీరు స్వదేశానికి వచ్చినపుడు ఆ విగ్రహ సందర్శనకు వెళ్లండి. అలాగే మీ జపాన్ మిత్రులు భారతదేశానికి వెళ్లేటట్లయితే వారిని కూడా సర్ దార్ పటేల్ విగ్రహ సందర్శన కు ప్రోత్సహించండి. మీకందరికీ ఇది నా యొక్క వినమ్రతాపూర్వకమైనటువంటి విన్నపం.
చివరలో, మరో మారు దీపావళి ని పురస్కరించుకొని మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు.
ఈ ఉదయం పూట మీరు ఇంత పెద్ద సంఖ్య లో సమావేశానికి హాజరైనందుకు నేను మీ అందరికీ మరొక్క మారు హృదయపూర్వక కృతజ్ఞత ను వ్యక్తం చేస్తున్నాను.
ధన్యవాదాలు.
**
Had a delightful interaction with the Indian community in Japan.
— Narendra Modi (@narendramodi) October 29, 2018
The accomplishments of our diaspora make us very proud.
Talked at length about the rich history, robust present and strong future of India-Japan relations. https://t.co/9jdURuB6Il pic.twitter.com/BLiYLMepPq