Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ పోలీసు స్మార‌క చిహ్నాన్ని దేశ ప్రజలకు అంకితం చేస్తున్న సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి ఉపన్యాసం

జాతీయ పోలీసు స్మార‌క చిహ్నాన్ని దేశ ప్రజలకు అంకితం చేస్తున్న సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి ఉపన్యాసం

జాతీయ పోలీసు స్మార‌క చిహ్నాన్ని దేశ ప్రజలకు అంకితం చేస్తున్న సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి ఉపన్యాసం

జాతీయ పోలీసు స్మార‌క చిహ్నాన్ని దేశ ప్రజలకు అంకితం చేస్తున్న సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి ఉపన్యాసం


గౌర‌వ‌నీయులైన పూర్వ ఉప ప్ర‌ధాని, శ్రీ లాల్ కృష్ణ ఆడ్ వాణీ గారు, కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింహ్ గారు, మంత్రి మండ‌లి లోని ఇత‌ర స‌హ‌చ‌రులు, పార్ల‌మెంటు లో నా స‌హ‌చ‌రులు, పోలీసు బ‌ల‌గాల‌కు చెందిన అవార్డు విజేత‌లు, హాట్ స్ప్రింగ్ ఘ‌ట‌న‌ లో పాల్గొన్న వీరులు, మృత వీరుల కుటుంబ స‌భ్యులు, ఇత‌ర ఆహ్వానితులు, ఇంకా నా ప్రియతమ సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

పరాక్రమానికి మనమందరం శిర‌స్సు ను వంచి తీరవలసిన క్షణాలు మన జీవితాలలో అనేకం ఉన్నాయి. ఆ సమయాలలో మన తనువంతా గర్వంతో నిండిపోతుంది; అలాగే మన మనస్సు లో లోపల భావోద్వేగాలు వెల్లువెత్తుతాయి కూడాను. నా వరకు చూస్తే, ఈ క్షణం ఆ మాదిరి సందర్భమే.

దేశ భ‌ద్ర‌త‌ కు జీవితాల‌ను అంకితం చేసే ప్ర‌తి ఒక్కరికి నేను ఎంతో గౌర‌వ‌ప్ర‌దం గా శిర‌స్సు ను వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను. పోలీసు మృత వీరుల దినం సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన అమ‌ర‌వీరుల కుటుంబాల స‌భ్యుల‌కు శిర‌స్సు ను వంచి ప్రణామం చేస్తున్నాను. మీ అత్యున్న‌త త్యాగాల‌ను, దేశానికి అందించిన సేవ‌ ల‌ను ప్రతి సంవత్సరమూ గుర్తు కు తెచ్చుకొనే రోజు ఇది. పోలీసులు, అర్ధ సైనిక బలగాల‌కు సంబంధించిన సంప్ర‌దాయ‌ం ఇది.

ల‌ద్దాఖ్ మంచు పర్వ‌త ప్రాంతాల్లో క్లిష్ట ప‌రిస్థితుల మ‌ధ్య‌ ముందు వ‌రుస‌ లో నిలచి త‌మ విధుల‌ను వీరోచితంగా నిర్వ‌హించి ప్రాణాలు కోల్పోయిన‌ పోలీసు బ‌ల‌గాల గాథ లను స్మ‌రించుకోవ‌డం కూడా ఈ రోజునే జ‌రుగుతుంది. పోలీసు బ‌లగాలకు చెందిన వేల మంది వారి జీవితాల‌ను త్యాగం చేశారు. అంతే కాదు దేశం కోసం వారు స‌ర్వ‌స్వాన్ని కోల్పోయారు. దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చిన ద‌గ్గ‌ర‌ నుండి ఇప్ప‌టి వరకు అమ‌రులైన‌వారు త‌మ ప్రాణాల‌నే కాదు, అంత‌కు ముందు వారు త‌మ బాధ్య‌త‌ల నిర్వ‌హ‌ణ‌ కోసం త‌మ య‌వ్వ‌నాన్ని, జీవితాన్ని విధుల‌ కోసం అర్పించారు. అలాంటి ప్ర‌తి వీరునికి నేను శిర‌స్సును వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను. ప్ర‌తి అమ‌ర‌వీరుని కుటుంబానికి నా శిర‌స్సును వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను. అమ‌ర‌ వీరుల‌కు సంబంధించిన ప‌లువురు కుటుంబ స‌భ్యులు ఇక్కడ వున్నారు. మీరు మీ కుటుంబ స‌భ్యుని దేశానికి అందించి ఎంతో త్యాగం చేశారు.

మిత్రులారా,

జాతీయ పోలీసు స్మార‌క చిహ్నాన్ని దేశ ప్రజలకు అంకితం చేసే అవ‌కాశం ల‌భించ‌డం నా అదృష్టం. ఇది వీరులు దేశానికి చేసిన సేవ‌లకు, త్యాగాల‌కు ప్ర‌తీక‌ గా నిలుస్తున్న కట్టడం. దీనికి సంబంధించిన ప్ర‌ధాన‌ నిర్మాణం అనేది ప్ర‌తి పోలీసు సామ‌ర్థ్యానికి, ధైర్యానికి, సేవ‌ కు, వారిలో భావోద్వేగాల‌కు ప్ర‌తీక‌ గా నిలుస్తోంది. ఇక్కడ ఈ నిర్మాణం కింద ప్ర‌వ‌హిస్తున్న నీరు స‌మాజం లో నిత్యం క‌నిపించే సామ‌ర‌స్యానికి ప్ర‌తీక‌. ధైర్యాన్ని ప్ర‌తిబింబిస్తున్న గోడ‌ మీద 34, 844 మంది అమ‌రులైన పోలీసు సిబ్బంది పేర్ల‌ ను లిఖించ‌డం జ‌రిగింది. ప‌లు రాష్ట్రాల‌కు చెందిన వీరు త‌మ త‌మ స‌వాళ్ల ను ఎదుర్కోవ‌డం లో అమ‌రుల‌య్యారు. అత్యున్న‌త త్యాగాల‌ను చేశారు.

నూత‌నం గా నిర్మించిన ఈ స్మార‌క చిహ్నం దేశం లోని ప్ర‌తి పౌరుని కి స్ఫూర్తి ని ఇస్తుంద‌నే విశ్వాసం నాలో వుంది. అంతే కాదు, ఇది మ‌న బ‌ల‌గాల్లోని యువ‌కుల‌కు స్ఫూర్తి ని నింపుతుంది. మ‌న భ‌విష్య‌త్తు త‌రాల‌లో ఇది స్ఫూర్తి ని ప్రసాదిస్తుంది. మ‌న పోలీసు బ‌ల‌గాల‌, అర్ధసైనిక దళాల సాహ‌సోపేత గాథ లు మ‌న పిల్ల‌ల‌కు త‌ప్ప‌కుండా స్ఫూర్తి ని ఇస్తాయి.

మీరు రాత్ర‌న‌క ప‌గ‌ల‌న‌క మీ విధుల‌ను నిర్వ‌హిస్తుంటారు. అన్ని కాలాల్లో- అది ఎండాకాలం కావ‌చ్చు, లేదా చ‌లి కాలం కావ‌చ్చు, వ‌ర్షా కాలం కావ‌చ్చు, మంచు కురుస్తుండ‌వ‌చ్చు; కానీ మీరు మాత్రం మీ మీ విధుల‌ను నిర్వ‌హిస్తుంటారు. పండుగ రోజుల్లోనూ మీరు నిరంత‌రం విధులు నిర్వ‌హిస్తుంటారు. ఈ స్మార‌క చిహ్నాన్ని చూసిన‌ప్పుడు విధి నిర్వ‌హ‌ణ‌ లో మీకు క‌లిగిన భావోద్వేగాలు మాలో ప్ర‌తిఫ‌లిస్తుంటాయి.

మిత్రులారా,

దేశంలోని శాంతియుత ప‌రిస్థితుల‌కు భంగం క‌ల‌గ‌జేయాల‌నుకునే వారికి నిరాశే మిగులుతుంద‌ని చాటిన మీ ఉన్నత ఆలోచ‌న‌ల‌కు ఈ చిహ్నం సాక్ష్యంగా నిలుస్తుంది. దేశంలో అభ‌ద్ర‌త‌ను, భ‌యాల‌ను వ్యాపింప చేయ‌డానికి జ‌రిగిన అనేక ప్ర‌య‌త్నాల‌ను మీరు విఫ‌లం చేశారు. దేశానికి వ్య‌తిరేకంగా జ‌రిగిన కుట్ర‌ల వివ‌రాల‌ను దేశ భ‌ద్ర‌త దృష్ట్యా గోప్యంగా వుంచ‌డం జ‌రుగుతుంది. అందుకే మీ వీర‌గాధ‌ల‌ను బ‌హిరంగంగా చాట‌డం కుద‌ర‌దు. దేశంలో శాంతియుత ప‌రిస్థితులు నెల‌కొని వున్నాయంటే..మీరు మీ బాధ్య‌త‌ల నిర్వ‌హ‌ణ‌లో చూపిన భ‌క్తిశ్ర‌ద్ధ‌లే కార‌ణం.

మిత్రులారా,

జ‌మ్ము & క‌శ్మీర్ లో శాంతి భ‌ద్ర‌త‌ ల‌ను నెల‌కొల్ప‌డానికి గాను ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా పోరాడుతున్న ప్ర‌తి జ‌వాను ను గుర్తు చేసుకునే కార్య‌క్ర‌మమే ఈ రోజు ఏర్పాటు చేసుకున్న ఈ కార్య‌క్ర‌మం. న‌క్స‌ల్ ప్ర‌భావిత ప్రాంతాల్లో విధుల‌ను నిర్వ‌హిస్తున్న ప్ర‌తి జ‌వాను విష‌యంలో నేను ఇదే విష‌యం చెబుతాను. మీరు ఎంతో గొప్ప ప‌ని చేస్తున్నారు. శాంతియుత వాతావ‌ర‌ణాన్ని నెల‌కొల్ప‌డానికి మీరు చాలా వేగంగా ప‌ని చేస్తున్నారు. న‌క్స‌ల్స్ ప్ర‌భావిత జిల్లాల సంఖ్య రోజు రోజుకు త‌గ్గుతోంద‌న్నా, అక్క‌డి యువ‌తీ యువ‌కులు ప్ర‌ధాన స్ర‌వంతి లో క‌లిసిపోతున్నార‌న్నా దాని వెన‌క మీరు పోషిస్తున్న ప్ర‌ధాన పాత్రే కార‌ణం. ఈశాన్య రాష్ట్రాల్లో మ‌న స‌హ‌చ‌రులు ప్ర‌ద‌ర్శిస్తున్న ధైర్య‌ సాహ‌సాలను, వారి త్యాగాల‌ను మ‌నం గుర్తు కు తెచ్చుకొంటున్నాం. ఈశాన్య భార‌తం శాంతి, సౌభాగ్యాల‌కు ప్ర‌తీక‌ గా మారుతోందంటే దాని వెనుక మీ కృషి ఎంత‌గానో వుంది.

మిత్రులారా,

ప్ర‌కృతి విప‌త్తుల స‌మ‌యం లో ప‌ని చేసే బ‌ల‌గాలు ఉన్నాయి మ‌న‌కు. వారిని గురించి పెద్ద‌గా మాట్లాడుకోం. కానీ వారు ప్ర‌కృతి విప‌త్తుల నిర్వ‌హ‌ణ స‌మ‌యం లో స‌హాయ చ‌ర్య‌ల్లో పాల్గొంటారు. దేశం లో ఎలాంటి ప్ర‌మాదం సంభ‌వించినా, ఎక్క‌డ సంభ‌వించినా మీరు చూసే వుంటారు.. అక్క‌డ ప‌ని చేసే జ‌వానులు ఎన్ డిఆర్ఎఫ్‌, ఎస్ డిఆర్ఎఫ్ అనే పేర్లు క‌లిగిన యూనిఫారం ను ధ‌రించి విధులు నిర్వ‌హిస్తుండ‌డం మీకు తెలుసు. ప్ర‌జ‌ల జీవితాల‌ను కాపాడ‌డానికి వారు రాత్ర‌న‌క ప‌గ‌ల‌న‌క శ్ర‌మిస్తుంటారు.

ఖాకీ యూనిఫారం ధ‌రించి విధులు నిర్వ‌హించే పోలీసు జ‌వాన్ల‌ లాంటి వారే వీరు కూడా అనే విష‌యం చాలా మందికి తెలియ‌దు. వీరు చూపుతున్న ధైర్యాన్ని, అంకిత‌భావాన్ని, అందిస్తున్న సేవ‌ల‌ను మ‌నం మ‌రచిపోకూడ‌దు. ఏదైనా భ‌వ‌నం ప‌డిపోయిన‌ప్పుడు, ప‌డ‌వ ప్ర‌మాదం సంభవించినప్పుడు, అగ్ని ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు, రైలు ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు.. ఇలా ప‌లు సంద‌ర్భాల్లో ప్ర‌జ‌ల‌ను కాపాడ‌డానికి ప‌ని చేసే వారి గురించి చాలా మందికి ఏమంత తెలియ‌దు. ఈ రోజున మీ అంద‌రికీ నా హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలియ‌జేసుకుంటున్నాను. ప్ర‌తి పోలీసు పోస్టు ద‌గ్గ‌రా, ప్ర‌తి స్టేశన్ లోను, ప్ర‌తి ప్ర‌భుత్వ ఆస్తి ని కాపాడుతూ ప‌ని చేసే జ‌వానులు అంద‌రికీ ఈ రోజు న నా అభినంద‌న‌లను తెలియ‌జేస్తున్నాను.

మిత్రులారా,

సేవ‌కు, ధైర్యానికి ఈ స్మృతి చిహ్నాన్ని అంకితం చేయ‌డం జ‌రిగింది. అంతే కాదు ఇది ప్ర‌భుత్వానికి ఉన్నటువంటి నిబ‌ద్ధ‌త‌ ను తెలియ‌జేస్తోంది. దేశ భ‌ద్ర‌త‌ ప‌ట్ల ప్ర‌తి భార‌తీయునికి గౌర‌వం వుంది. అది దేశ‌ నిర్మాణానికి ప్ర‌తీక‌ గా నిలుస్తుంది. దీనిని పునాదిగా తీసుకొనే ప్ర‌భుత్వం నిబ‌ద్ద‌త‌ తో ప‌ని చేస్తోంది. జాతీయ పోలీసు స్మార‌క చిహ్నాన్నిచూసి ఈ రోజు న నేను చాలా గ‌ర్వపడుతున్నాను. అయితే ఇక్క‌డ నాలో కొన్ని ప్ర‌శ్న‌లు త‌ల ఎత్తుతున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 70 ఏళ్లు అవుతున్నా ఎందుకు ఇంత‌ కాలం పాటు జాతీయ పోలీసు స్మార‌క చిహ్నాన్నినెల‌కొల్పుకోలేక‌పోయాం ? పోలీసు అమ‌ర‌వీరుల దినాన్ని జ‌రుపుకోవ‌డానికి హాట్ స్ప్రింగ్ సంఘ‌ట‌న కార‌ణం. ఇది జ‌రిగి 60 సంవత్సరాలు గడచిపోయాయి. అయినా ఇన్ని సంవ‌త్స‌రాల‌ పాటు స్మార‌క చిహ్నం కోసం ఎందుకు ఆగాల్సి వ‌చ్చింది?

మిత్రులారా,

20-25 సంవ‌త్స‌రాల క్రితం ఈ స్మార‌క చిహ్నాన్ని త‌యారు చేసుకొని పోలీసు బ‌ల‌గాల‌కు అంకితం చేయాల‌నే ఆలోచ‌న వ‌చ్చింది. అప్ప‌టి ప్ర‌భుత్వం దీనిని ఆమోదించింది. అయితే దీనికి సంబంధించిన మొద‌టి అడుగు ప‌డింది మాత్రం కీర్తిశేషులు అట‌ల్ బిహారీ వాజ్ పేయీ ప్ర‌భుత్వం లోనే. నాటి హోం శాఖ మంత్రి శ్రీ ఆడ్వాణీ 2002 లో దీని కోసం పునాదిరాయి ని వేశారు. ఈ రోజున శ్రీ ఆడ్వాణీ గారు కూడా ఇక్క‌డే వున్నారు. త‌న‌ క‌ల సాకారం అవుతున్నందుకు ఆయ‌న గ‌ర్వపడుతున్నారు. తాను పునాది రాయి ని వేసిన త‌రువాత నిర్మాణ ప‌ని ఎందుకు ముందుకు సాగ‌లేదో శ్రీ ఆడ్వాణీ కి బాగా తెలుసు.

కొన్ని చ‌ట్టాల కార‌ణంగా కొన్ని సంవ‌త్స‌రాల‌ పాటు స్మార‌క చిహ్న నిర్మాణం ఆగిపోయింద‌నే విష‌యాన్ని నేను అంగీక‌రిస్తున్నాను. అయితే మా ప్ర‌భుత్వాని కంటే ముందు గ‌ల ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ధి వుంటే, నిజాయతీ గా వారు ప్ర‌య‌త్నించి వుంటే, కొన్నేళ్ల క్రిత‌మే దీనిని నిర్మించి వుండ‌వ‌చ్చు. శ్రీ ఆడ్వాణీ గారు వేసిన పునాది రాయి మీద దుమ్ము పేరుకు పోయేటట్టు వ్య‌వ‌హ‌రించింది మా ముందటి ప్ర‌భుత్వం.

2014 లో ఎన్ డిఎ ప్ర‌భుత్వం మ‌రో మారు అధికారం లోకి వ‌చ్చింది. ఆ వెంట‌నే మేం నిధుల‌ను కేటాయించాం. భారీ భ‌వ‌నాన్ని నిర్మించి దేశానికి అంకితం చేయ‌డం జ‌రిగింది. ఈ ప‌ని ని చేయ‌డానికి బ‌హుశా దేవుడు న‌న్ను ఎంపిక చేసుకున్నారేమో. ఈ ఉన్న‌త‌మైన ప‌ని ని పూర్తి చేయ‌డానికి దేవుడు న‌న్ను ఎంపిక చేసుకున్నాడు. ఇది మా ప్ర‌భుత్వ ప‌ని విధానం. కాల ప‌రిమితి లోపే ప‌నులను పూర్తి చేసి ల‌క్ష్యాన్ని అందుకొనే సంస్కృతి ని మా ప్ర‌భుత్వం అల‌వ‌రుచుకుంది.

మీకు గుర్తుండే వుంటుంది.. ఢిల్లీ లో ఆంబేడ్ కర్ అంత‌ర్జాతీయ కేంద్రాన్ని ప్ర‌జ‌ల‌కు అంకితం చేయ‌డమైంది. ఆ స్మార‌కం నిర్మాణం కోసం చ‌ర్చ‌ లు 1992 లో ఆరంభ‌ం అయ్యాయి. అయిన‌ప్ప‌టికీ దానికి సంబంధించిన ఫైలు రెండు ద‌శాబ్దాలు గా మూల‌న ప‌డి వుండేది. మా ప్ర‌భుత్వం వచ్చిన త‌రువాత ఆ ఫైలు ను బయటకు తీశాం. పునాది రాయి ని వేయ‌డం, ఆ కేంద్రాన్ని దేశ ప్రజలకు అంకితం చేయ‌డం జ‌రిగాయి. అలాగే కీర్తిశేషులు అట‌ల్ గారి హ‌యాం లో 26, అలీ పూర్ రోడ్డు లోని శ్రీ బాబాసాహెబ్ ఆంబేడ్ కర్ నివాసం వ‌ద్ద జాతీయ స్మార‌క మందిరాన్ని నిర్మించే ప‌ని మొద‌లైంది. అటల్ గారి ప్ర‌భుత్వం అధికారాన్ని కోల్పోయిన అనంతరం ఆ ప్రాజెక్టు కు సంబంధించిన ప‌ని ఆగిపోయింది. మా ప్ర‌భుత్వం ఏర్ప‌డిన అనంతరం శంకుస్థాపన చేయ‌డం జ‌రిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నెల‌ లో ఆ స్మృతి చిహ్నాన్ని ప్ర‌జ‌ల‌కు అంకితం చేసే అవ‌కాశం నాకు దక్కింది. ఇప్పుడు ఆ భారీ స్మారకం యావత్తు ప్ర‌పంచానికే స్ఫూర్తి ని ఇస్తోంది.

మిత్రులారా,

కొన్ని సార్లు నా మ‌ది లో చాలా తీవ్ర‌మైన ప్ర‌శ్న‌లు చెల‌రేగుతుంటాయి. దేశం కోసం స‌ర్వ‌స్వాన్ని త్యాగం చేసిన‌ వారి ప‌ట్ల‌, దేశం కోసం వీరోచితం గా పోరాడి ధైర్య‌సాహ‌సాలను చూపి అస‌మాన త్యాగాలు చేసిన వారి ప‌ట్ల నా కన్నా ముందు పాల‌న చేప‌ట్టిన ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్య వైఖ‌రి ని అవ‌లంబించ‌డం వెనుక కార‌ణం ఏమై వుంటుంది ? అనే ప్ర‌శ్న నాలో క‌లుగుతుంటుంది. అలా చేయ‌డం మ‌న సంప్ర‌దాయం కాదు, సంస్కృతి కాదు. ఒక ప‌క్క ఆక‌లి తో అల‌మ‌టిస్తున్న‌ా మ‌రో ప‌క్క‌ దేశ సౌభాగ్యం కోసం స‌ర్వ‌స్వాన్ని త్యాగం చేసిన వాళ్లం మ‌నం. జాతి నిర్మాణం కోసం, జాతి నిర్మాణం లో సంర‌క్ష‌కుని పాత్ర ను పోషించిన ప్ర‌తి భార‌తీయునికి స‌ముచిత గౌర‌వాన్ని ఇచ్చే సంప్ర‌దాయాన్ని తిరిగి నెల‌కొల్ప‌డం జ‌రిగింది. ఈ విష‌యం లో విజ‌యాన్ని సాధించామ‌ని చెప్ప‌డానికి నాకు ఎంతో గౌర‌వంగా ఉంది. ఆ సంప్ర‌దాయం లో భాగంగానే ఈ రోజున జాతీయ పోలీసు స్మార‌కాన్ని ప్ర‌జ‌ల‌కు అంకితం చేయ‌డం జ‌రుగుతోంది. ఈ రోజు మొద‌లు కచ్చితం గా ప‌ది రోజుల త‌రువాత- అంటే అక్టోబ‌ర్ 31న- స‌ర్ దార్ వల్లభ్ భాయ్ ప‌టేల్ గారి మ‌హా విగ్ర‌హాన్ని గుజ‌రాత్ లోని కేవడియా లో దేశ ప్రజలకు అంకితం చేసే భాగ్యం నాకు దక్కనుంది. ఈ విగ్రహం ప్ర‌పంచం లోనే అత్యంత ఎత్తయినటువంటి విగ్ర‌హం. ఇది దేశానికి స‌ర్ దార్ గారు చేసిన సేవ‌ ల‌ను ప్ర‌తిబింబిస్తుంది.

మిత్రులారా,

స్మారకం అనేది ప‌ర్యట‌కులు సంద‌ర్శించ‌డానికి మాత్ర‌మే ప‌రిమితం కాకూడ‌దు. దేశ సంప్ర‌దాయాల‌ను, గొప్ప‌ద‌నాన్ని త‌దుపరి త‌రాల‌కు అందించే కేంద్రం గా రూపొందాల‌ని నేను న‌మ్ముతున్నాను. ఈ స్మారకం పోలీసు బ‌ల‌గాల ధైర్య‌ సాహ‌సాల‌ను త‌దుపరి త‌రానికి అందించాలి. దేశం కోసం త్యాగాలు చేసిన అమ‌ర‌వీరుల విగ్ర‌హాల‌ను వారు చ‌దివిన పాఠ‌శాల‌ల్లో నెల‌కొల్పాల‌ని నేను స‌ల‌హా ఇస్తున్నాను. అక్క‌డ చ‌దువుకొనే విద్యార్థులు ఆ అమ‌ర‌వీరుల త్యాగాల‌తో స్ఫూర్తి ని పొందుతారు.

మిత్రులారా,

పోలీసు, అర్ధసైనిక బలగాల సిబ్బంది, మిలిట‌రీ జ‌వానులు క‌నిపించిన‌ప్పుడు, మ‌న ముందు నుండి వెళ్లిన‌ప్పుడు వారికి చాలా స‌హ‌జంగా గౌర‌వం ఇచ్చే వాతావ‌ర‌ణాన్ని మ‌నం త‌యారు చేసుకోవాలి. ఈ స్మారకం, అమ‌ర‌వీరుల విగ్ర‌హాలు, వారికి సంబంధించిన వీర‌ గాథ లు మ‌న‌కు అలాంటి వాతావ‌ర‌ణాన్ని క‌ల‌గ‌జేస్తాయి. ఇప్పుడు మీ ముందు నేను ఒక ప్ర‌ధాన‌మైన చరిత్రాత్మ‌క ప్ర‌క‌ట‌న చేయాల‌ని అనుకుంటున్నాను.

మిత్రులారా,

దేశం లో ఏదైనా దుర్ఘ‌ట‌న గానీ, ప్ర‌కృతి విప‌త్తు గానీ సంభ‌వించ‌గానే పోలీసు, అర్ధసైనిక దళాలు వెంట‌నే స్పందిస్తాయి. జాతీయ విప‌త్తు స‌హాయ ద‌ళాలు అంటే ఎన్ డిఆర్ఎఫ్ ద‌ళాలు రంగం లోకి దిగుతాయి. అత్య‌వ‌సర ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడ‌డానికి వారు త‌మ జీవితాల‌ను పణం గా పెడ‌తారు. అలాంటి క్లిష్ట‌మైన స‌మ‌యాల్లో వారు చేసిన నిరుప‌మాన‌మైన కృషి ని గురించి ఎవ‌రూ ప‌ట్టించుకోర‌నేది వాస్త‌వం. స‌హాయ చ‌ర్య‌ లు పూర్త‌ి అయి సాధార‌ణ వాతావ‌ర‌ణం ఏర్ప‌డిన అనంతరం ఆ బ‌ల‌గాలు తిరిగి త‌మ బెటాలియ‌న్ కు వెళ్లిపోతాయి; లేదా తమ ఉద్యోగం ఎక్క‌డో ఆ ప్రాంతానికి వెళ్లిపోతాయి. విప‌త్తు నిర్వ‌హ‌ణ‌ లో భాగం గా ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడిన వారికి ఎంతో ధైర్యం గా సేవ‌లను అందించిన‌ వారి కి అవార్డు ను ప్ర‌క‌టిస్తున్నాను.

భర‌త‌ మాత ముద్దు బిడ్డ దేశం కోసం వీరోచిత పోరాటం చేసిన నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ గారి పేరు మీద ఈ పురస్కారాన్ని నెల‌కొల్ప‌డం జ‌రుగుతుంది. దీనిని ఆయ‌న జ‌యంతి సంద‌ర్భం గా ప్ర‌తి సంవత్సరం జ‌న‌వ‌రి 23న ప్ర‌క‌టించ‌డం జ‌రుగుతుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వీరుడు సుభాష్ బాబు గారు. బ్రిటిష్ వారు దేశాన్ని వ‌దలి వెళ్లిపోవ‌డం లో ప్ర‌ధాన పాత్ర ను పోషించారు. ఆయ‌న పేరు మీద పురస్కారాన్ని నెల‌కొల్ప‌డం ద్వారా ఆ అవార్డు కు ఎంతో వైభ‌వం వ‌స్తుంది. ఆయ‌న ఆజాద్ హింద్ స‌ర్కార్ నెల‌కొల్పి ఈ రోజు తో 75 సంవత్సరాలు కావ‌డం మ‌నం అంద‌రం ఎంత‌గానో గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యం.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

మ‌న‌కు ఉన్న వైభ‌వోపేత సంప్ర‌దాయాలు, అద్భుత‌మైన వీరోచిత గ‌తం, ధైర్య‌సాహ‌సాలు, త్యాగాల గురించి మాట్లాడుకున్నాం. వీటితో పాటు మ‌న భావి స‌వాళ్ల‌ను కూడా నేను మీ ముందు ఉంచుతాను. మీరు వీటి ని గురించి ఆలోచించాలి.

నేడు సాంకేతిక‌త మ‌న జీవితాల్లో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులను తీసుకువచ్చింది. అంతే కాదు ఈ సాంకేతిక‌త కార‌ణం గా నేరాలు కూడా ప్ర‌భావిత‌ం అవుతున్నాయి. సాంకేతిక‌త‌ ను నేరగాళ్లు వారి ఆయుధం గా మార్చుకుంటున్నారు. వదంతులు, నేరాలు మ‌న‌కు పెద్ద పెద్ద స‌వాళ్ల‌ ను రువ్వుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో పోలీసు బ‌ల‌గాలు ఇత‌ర సంస్థ‌ ల‌తో స‌రైన స‌మ‌న్వ‌యాన్ని క‌లిగి వుంటూనే సాంకేతిక‌త‌ ను, నూత‌న ప‌రిక‌రాల‌ను ఉప‌యోగించుకుంటూ నేరాల‌ను అరిక‌ట్టాలి.

మిత్రులారా,

ఈ దిశ‌ గా దేశ‌వ్యాప్తం గా అనేక ముఖ్య‌మైన చ‌ర్య‌ల‌ను చేపట్ట‌డం జ‌రిగింది. ఎఫ్ఐఆర్ ను ఫైల్ చేయ‌డానికి సామాజిక మాధ్యమాలను కూడా ఉప‌యోగించుకోవ‌డం ప‌లు రాష్ట్రాల్లో జ‌రుగుతోంది. అంతే కాదు సామాజిక మాధ్యమాల ద్వారా వాహనాల రాకపోకలకు ఎదురయ్యే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం జ‌రుగుతోంది. ఇది ఎంతో ప్ర‌శంస‌నీయ‌మైన ప‌ని. రూటీన్‌ గా ఇచ్చే ఫిర్యాదుల‌ కోసం, చిన్న చిన్న ధ్రువీక‌ర‌ణ‌ల‌ కోసం ప్ర‌జ‌లు పోలీసు స్టేశన్ ల దాకా రావలసిన అవ‌స‌రం లేదు.

మిత్రులారా,

మీకంద‌రికీ తెలుసు.. గ‌త సంవత్సరం పోలీసు సంస్క‌ర‌ణ‌ ల విష‌యంలో ప్ర‌భుత్వం ప్ర‌ధాన‌మైన నిర్ణ‌యాన్ని తీసుకుంది. పోలీసు ప‌థ‌కాల‌ను ఆధునికీక‌రించ‌డానికి గాను దాదాపు 45 వేల కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేయ‌బోతున్నాం. ఈ మొత్తాన్ని 2019-20 నాటిక‌ల్లా పోలీసుల ప్రాథమిక సౌక‌ర్యాల క‌ల్ప‌న‌ కు, సాంకేతిక‌త‌ కు, శిక్ష‌ణ‌ కు ఉప‌యోగించడం జ‌రుగుతుంది. ఈ ప‌థ‌కం లో భాగం గా (మోడ‌ర్నైజేశన్ ఆఫ్ పోలీస్ స్కీమ్స్.. ఎంపిఎస్‌) ఆధునికీక‌ర‌ణ‌ కు సంబంధించిన ప‌లు ప‌నుల‌ను చేప‌ట్ట‌డం జ‌రిగింది. క‌మ్యూనికేశన్ టెక్నాల‌జీ లోను, వ్య‌వ‌స్థ‌ ల‌ను ఆధునీక‌రించ‌డం లోను చేప‌ట్టిన ఈ ప‌నుల‌ ద్వారా ఆధునిక ఆయుధాల సహాయం తో పోలీసు బ‌ల‌గాలు చాలా వేగంగా త‌మ విధుల‌ను నిర్వ‌హిస్తాయి. దీనితోపాటు పోలీసు స్టేశన్ లను అనుసంధానించ‌డం ద్వారా నేర‌గాళ్లకు, నేరాల‌కు సంబంధించిన స‌మాచారం తో జాతీయ స్థాయి లో డేటాబేస్ ను త‌యారు చేసుకోవ‌డం జ‌రుగుతుంది. ఈ డేటాబేస్ ను ఫోరెన్సిక్ ల్యాబులకు, న్యాయస్థానాల‌కు అనుసంధానించ‌డం జ‌రుగుతుంది.

దేశం లోని ప్ర‌తి రాష్ట్రంలో, ప్ర‌తి న‌గ‌రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను మెరుగుప‌ర‌చ‌డానికి గాను, ట్రాఫిక్ నిర్వ‌హ‌ణ‌ ను మ‌రింత బాగా చేయ‌డానికి గాను ఆయా రాష్ట్రాల‌కు, న‌గ‌రాల‌కు ఆధునిక సాంకేతిక‌త‌ ను కేంద్ర‌ప్ర‌భుత్వం అందిస్తుంది. కానీ మ‌నిషి స్పంద‌న‌ ల‌కు సాంకేతిక‌త ప్ర‌త్యామ్నాయం కాదు. పోలీసు బ‌ల‌గం లోని ప్ర‌తి స‌భ్యుని పాత్ర ఎంతో ముఖ్య‌మ‌ని చెప్ప‌డానికి ఇదే కార‌ణం. స‌మాజంలో దోపిడి కి గురి అయ్యే, హింస‌ బారిన ప‌డే, అణ‌చివేయబ‌డే ప్ర‌జ‌లను ర‌క్షించ‌డానికి మొద‌ట‌గా ముందుకు క‌దలేది మీరు. క‌ష్టాల్లో వున్న ప్ర‌జ‌ల‌ను ఆదుకొనే క్ర‌మం లో మీరు వారికి మొద‌టి స్నేహితులు. మీకు శాంతి భ‌ద్ర‌త‌ల‌ను నెల‌కొల్పే బాధ్య‌త ఉన్న‌ప్ప‌టికీ, అదే స‌మ‌యం లో ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను, ఫిర్యాదుల‌ను ఎంతో సున్నితంగా అర్థం చేసుకొని వారి క‌న్నీటిని తుడ‌వాల్సి వుంది.

పోలీసు ఠాణా కు వ‌చ్చిన బాధితుల‌కు తాగ‌డానికి మంచినీళ్ల ఇచ్చి, వారితో ప్రేమ‌గా మాట్లాడితే పోలీసుల‌కు, స‌మాజానికి ఉన్నటువంటి బంధం మ‌రింత బ‌లోపేత‌ం అవుతుంది. త‌ద్వారా స‌హ‌కారం, ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం మ‌రింత బ‌ల‌ప‌డి పోలీసుల‌కు, స‌మాజానికి మ‌ధ్య‌న బంధం మ‌రింత‌గా గ‌ట్టిప‌డుతుంది. అంతే కాదు ఈ ప‌ని ని చేయ‌డం వ‌ల్ల‌ స‌మాజం సాయం తో నేరాల‌ను నియంత్రించ‌డం చాలా పెద్ద ఎత్తున చేయ‌వ‌చ్చు. ఈ విష‌యాన్ని నేను దృఢం గా విశ్వ‌సిస్తున్నాను.

పోలీసుల అమ‌ర‌వీరుల దినం సంద‌ర్భంగా ఈ ఆధునిక జాతీయ పోలీసు స్మార‌క చిహ్నాన్ని ప్రారంభించుకున్నందుకు మీకు మ‌రోసారి అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను.

ఈ సంద‌ర్భం గా అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.. మీరు ఈ స్మారకాన్ని ద‌ర్శించండి. అమ‌రులైన పోలీసు సిబ్బందికి ఘ‌న నివాళి ని ఘ‌టించండి అని.

ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఇక్క‌డ‌కు వ‌చ్చి వారి రాష్ట్రాల‌కు చెందిన అమ‌రులైన‌ పోలీసు సిబ్బంది కి ప్ర‌త్యేకంగా నివాళి ని అర్పించవ‌చ్చు. మీరు మీ అధికారుల సాయంతో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసుకొని ఈ మెమోరియ‌ల్ ను సంద‌ర్శించ‌గ‌ల‌రు. పోలీసుల విధుల‌కు, వారి అంకిత‌భావానికి శిర‌స్సు ను వంచి న‌మ‌స్క‌రిస్తూ, రాబోయే పండుగ‌ ల‌ను పుర‌స్క‌రించుకొని పోలీసుల కుటుంబాల‌కు నా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ నా ఈ ప్ర‌సంగాన్ని ముగిస్తున్నాను.

మీ అంద‌రికీ అనేకానేక ధన్యవాదాలు.