Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్టార్ట‌ప్ ఇండియా ఉద్య‌మాన్ని రేపు ప్రారంభించ‌నున్న ప్ర‌ధాన మంత్రి


న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్ లో రేపు జ‌ర‌గ‌బోయే కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ “స్టార్ట‌ప్ ఇండియా” ఉద్య‌మాన్ని ప్రారంభించ‌నున్నారు. దేశంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ స్టార్టప్ ఇండియా ఉద్య‌మాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి దేశ విదేశాల్లో అగ్రగామి స్టార్టప్ ల స్థాప‌కులు, ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారులు (సీఈఓ లు) హాజరు కానున్నారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని ఒక వర్చుయల్ ప్ర‌ద‌ర్శ‌న‌ను సంద‌ర్శిస్తారు. స్టార్టప్ (అంకుర కంపెనీ)ల ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌ల‌తో ఆయన మాట్లాడ‌తారు. అంతే కాదు, స్టార్ట‌ప్ యాక్ష‌న్ ప్లాన్ ను ఆయన విడుద‌ల చేస్తారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌ను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.

ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని హాజ‌రు కావ‌డాని కంటే ముందు స్టార్ట‌ప్ ఎంట‌ర్ ప్రిన్యూర్ షిప్ అంశంపైన ఒక రోజంతా వ‌ర్క్ షాప్ జ‌రుగుతుంది. ఇందులో ఈ అంశంపైన ప‌లు కోణాల్లో బృంద‌ చ‌ర్చ‌లు ఉంటాయి.

ఈ వ‌ర్క్ షాపులో ‘ఫేస్-టు-ఫేస్ విత్ పాలసీ మేకర్స్’ (విధాన రూపకర్తల‌తో ముఖా ముఖి) అనే పేరుతో ప్ర‌శ్న‌లు, జ‌వాబుల విభాగం ఉంటుంది. ఇందులో కీల‌క మంత్రిత్వ‌ శాఖ‌ల‌కు చెందిన కార్య‌ద‌ర్శులు పాల్గొని, అంకుర కంపెనీలకు భ‌రోసాగా నిలిచే కేంద్ర ప్ర‌భుత్వ ప్రత్యేక వ్య‌వ‌స్థ గురించి వివ‌రిస్తారు. అంకుర కంపెనీల అభివృద్ధికిగాను ప్ర‌భుత్వం ఎలాంటి నిబ‌ద్ద‌త‌తో ప‌ని చేస్తుందో తెలియ‌జేయ‌డ‌మే ఈ కార్య‌క్ర‌మం ముఖ్య ఉద్దేశం.

ఈ కార్య‌క్ర‌మంలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌ముఖులు, వెంచ‌ర్ కాపిట‌లిస్టులతో ముఖాముఖి కూడా ఉంటుంది. సాప్ట్ బ్యాంక్ వ్య‌వ‌స్థాప‌కుడు, సీఈఓ శ్రీ మాసాయోశి సాన్, వుయ్‌వ‌ర్క్ వ్య‌వ‌స్థాప‌కుడు శ్రీ ఏడమ్ న్యూమాన్ మొదలైన‌వారు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వ‌బోతున్నారు.

దేశంలోని ప్ర‌ముఖ విద్యాసంస్థ‌లైన‌ ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీ లు, ఐఐఐటీల‌లోను, కేంద్రీయ విశ్వ‌విద్యాల‌యాల్లోను, 350కి పైగా జిల్లాల‌కు చెందిన యువ‌ బృందాలకు ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సార పద్ధతిలో అందుబాటులోకి తీసుకువస్తారు.