పిఎంఇండియా
ఆరోగ్య రక్షణ మరియు అనుబంధ వృత్తిసంబంధ విద్య, సేవల ప్రమాణీకరణ మరియు నియంత్రణ బిల్లును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. ఆరోగ్య రక్షణ మరియు అనుబంధ వృత్తులకు సంబంధించి ప్రమాణాలు నిర్దేశించడం మరియు సదుపాయాలు కలుగజేయడం కోసం భారత్ ఆరోగ్య రక్షణ మరియు అనుబంధ వృత్తుల మండలి మరియు రాష్ట్ర స్థాయి మండలుల ఏర్పాటుకు బిల్లి వీలు కల్పిస్తుంది.
వివరాలు:
1. ఆరోగ్య రక్షణ మరియు అనుబంధ వృత్తులకు సంబంధించి 53 వృత్తులతో సహా 15 ప్రధాన వృత్తి వర్గాల కోసం కేంద్ర ఆరోగ్య రక్షణ మరియు అనుబంధ వృత్తిసంబంధ మండలి మరియు సంబంధిత రాష్ట్ర మండలులు ఏర్పాటు చేయడం.
2. కేంద్ర మండలి మరియు రాష్ట్ర మండలుల నిర్మాణం, సంస్థ రూపురేఖలు, సంవిధానం, విధులను బిల్లు నిర్దేశిస్తుంది. ఉదాహరణకు విధానాలు మరియు ప్రమాణాల రూపకల్పన, వృత్తిపరమైన ప్రవర్తన నియంత్రణ, రిజిస్టర్ల సృష్టి మరియు నిర్వహణ, సాధారణ ప్రవేశం మరియు నిష్క్రమణ పరీక్షల నిబంధనలు మొదలగునవి.
3. కేంద్ర మండలిలో 47 మంది సభ్యులుంటారు. వారిలో వివిధ విధులు నిర్వహించే 14 మంది పదవిరీత్యా సభ్యులు కాగా మిగిలిన 33 మంది పదవితో సంబంధం లేకుండా ప్రధానంగా 15 వృత్తి వర్గాలకు ప్రాతినిధ్యం వహించేవారు.
4. రాష్ట్ర మండలులు కూడా కేంద్ర మండలినే పోలి ఉంటాయి. రాష్ట్ర మండలిలో ఏడుగురు పదవిరీత్యా సభ్యులు కాగా 21 మంది పదవితో సంబంధం లేనివారు. పదవితో సంబంధం లేకుండా నియమితులయ్యే సభ్యుల నుంచే చైర్ పర్సన్ ఎన్నిక జరుగుతుంది.
5. కేంద్ర మరియు రాష్ట్ర మండలుల పరిధిలోని వృత్తి సలహా సంఘాలు గుర్తింపు పొందిన వర్గాలకు సంబంధించిన వివిధ అంశాలను స్వతంత్రంగా పరిశీలించి సిఫార్సులు చేస్తుంది.
6. ఈ బిల్లు పరిధిలోకి వచ్చే వృత్తులకు సంబంధించి ఇదివరకే ఆమోదించిన శాసనాలను ఈ బిల్లు కొట్టివేస్తుంది.
7. రాష్ట్ర మండలి ఆరోగ్య రక్షణ మరియు అనుబంధ సంస్థలను గుర్తింపు ఇస్తుంది.
8. అక్రమాలు జరగకుండా అదుపు చేయడానికి నేరాలు, జరిమానాల క్లాజును బిల్లులో చేర్చడం జరిగింది.
9. దీనికి సంబంధించి నియమాలను రూపొందించే అధికారం బిల్లు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంక్రమిస్తుంది.
10. మండలికి ఆదేశాలు జారీ చేసేందుకు, క్రమబద్దీకరణకు, షెడ్యూల్ లో చేర్పులు మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది.
లక్ష్యాలు:
చట్టం ఆమోదించిన ఆరు నెలల లోపల తాత్కాలిక మండలి రెండేళ్ళ పాటు కేంద్రమండలి ఏర్పాటయ్యే వరకు పదవిలో ఉంటుంది. కేంద్ర మరియు రాష్ట్రాల మండలులు సంస్థలుగా ఉంటాయి. అవి వివిధ మార్గాల ద్వారా నిధులు పొందవచ్చు. ఈ మండలులకు అవసరమైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక నిధి రూపంలో అండగా నిలుస్తాయి.
అయితే ఆరంభ సంవత్సరాలలో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అశక్తత వ్యక్తం చేస్తే కేంద్రం మంజూరు చేయవచ్చు.
ఉపాధికల్పన సామర్ధ్యం పెంపుతో సహా ప్రధాన ప్రభావం:
1. మండలి ఏర్పాటు ముందున్న ఆరోగ్య రక్షణ మరియు అనుబంధ వృత్తుల వారిని మండలి ఏర్పాటు చేసిన తొలి సంవత్సరాలలోనే మండలి పరిధిలో తేవడం.
2. ఆరోగ్య రక్షణ మరియు అనుబంధ వృత్తులలో ఉన్నవారి నైపుణ్యం పెంపొందించడం ద్వారా ఆరోగ్య రక్షణలో ఆరోగ్య రక్షణలో అర్హతలున్న, ఉన్నత శ్రేణి వృత్తి నైపుణ్యమున్న, సమర్ధ ఉద్యోగాలు కల్పించడం
3. ఆయుష్మాన్ భారత్ సంకల్ప దృష్టితో అధిక నాణ్యమైన, బహుశాస్త్ర మిశ్రిత ఆరోగ్య సేవలు అందించడం ఇందుకోసం డాక్టర్ నేతృత్వంలో సాగే చికిత్స కాకుండా ‘అందుబాటులో చికిత్స మరియు వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స జరిగే విధానాన్ని అవలంభించడం
4. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 2030 నాటికి ఆరోగ్య రక్షణ సేవలు అందించే వారు దాదాపు కోటిన్నర మంది అవసరమవుతారు (కొరత ఉంటుంది). నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా ఆ కొరతను కొంతవరకు తీర్చడం
వ్యయం అంచనా:
మొదటి నాలుగేళ్ళలో మొత్తం వ్యయం రూ. 95 కోట్లు ఉండగలదని ఆశిస్తున్నారు. మొత్తం బడ్జెట్లో అయిదింట నాలుగోవంతు (4/5) అంటే రూ. 75 కోట్లు రాష్ట్రాలకు కేటాయిస్తారు. మిగిలిన సొమ్ము నాలుగేళ్ళపాటు కేంద్ర మండలి కార్యకలాపాల కోసం, కేంద్ర మరియు రాష్ట్ర రిజిస్టర్ల ఏర్పాటుకు ఖర్చు చేస్తారు.
లబ్ధిదారుల సంఖ్య:
ఈ బిల్లు వల్ల దేశంలో ఆరోగ్య రక్షణ మరియు అనుబంధ సేవలు అందిస్తున్న 8-9 లక్షల మంది వృత్తిపనివారికి మరియు ప్రతియేటా ఉత్తీర్ణులై ఆరోగ్య వ్యవస్థలో చేరుతున్నవారికి ప్రత్యక్షంగా లబ్ధి కలుగుతుంది. అయితే ఈ బిల్లు పరమార్ధం దేశంలో ఆరోగ్య సేవలు అందించే వ్యవస్థను పటిష్టం చేయడం కావునా ఆరోగ్య రంగం మొత్తంగా మరియు దేశ జనాభా అందరూ లబ్ధి పొందుతారని చెప్పవచ్చు.
నేపధ్యం:
1. ప్రస్తుతం అమలులో ఉన్న ఆరోగ్య రక్షణ వ్యవస్థలో చాలామంది ఆరోగ్య , అనుబంధ సేవల వృత్తి నిపుణులు గుర్తింపులేకుండా, నియంత్రణలేకుండా, పూర్తి సామర్థ్యంతో పనిచేయకుండా ఉన్నారు. ఇప్పుడు కేవలం డాక్టర్లు, నర్సులు, ఆశా కార్యకర్తలు, ఏ ఎన్ ఎంల సంఖ్యను , వారి పని సామర్ధ్యాన్ని పెంచడం జరుగుతోంది. గడచినా కొద్ది సంవత్సరాలలో ఇంకా చాల మందిని గుర్తించడం జరిగింది. వారిని పూర్తి సామర్ధ్యం మేరకు పని చేయిస్తే గ్రామీణ, రవాణా సౌకర్యాలు సరిగాలేని మారుమూల ప్రాంతాలలో ఆరోగ్య సేవలను మెరుగుపరచి ఎక్కువ మందికి సేవ చేయవచ్చు.
2. ఆరోగ్య , అనుబంధ సేవల వృత్తి నిపుణులు (ఏ & హెచ్ పి) ఆరోగ్య సేవల వ్యవస్థలో ముఖ్యమైన భాగం. వారి సేవలను సమర్ధవంతంగా వినియోగిన్చుకున్నట్ల్యితే ఆరోగ్య సేవల ఖర్చు తగ్గడమే కాక ఎక్కువ మందికి నాణ్యమైన సేవలు అందుబాటులోకి వస్తాయి.
3. ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య రక్షణ, అనుబంధ సేవలు అందించే వారు మొదట నాలుగేళ్ళ డిగ్రీతో ప్రారంభించి తాము ఎంపిక చేసుకున్న క్షేత్రంలో పి హెచ్ డి వరకు అధ్యయనం చేస్తారు. అయితే అటువంటి కోర్సులు బోధించే భారతీయ సంస్థలలో ప్రామాణికత కొరవడింది.
4. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో రోగులకు నేరుగా సేవలందించే వివిధ రకాల వృత్తిపనివారికి – ఫిజియోథెరపిస్ట్, న్యుట్రీషనిస్ట్, ల్యాబ్ టెక్నాలజిస్ట్ — లైసెన్సు ఇచ్చే చట్టబద్దమైన వ్యవస్థ ఉంటుంది.
5. మన దేశంలో అటువంటి సేవలు అందించే వారు దశాబ్దాలుగా ఉన్నప్పటికీ అందుకు అవసరమైన నియంత్రణ యంత్రాంగం లేదు. ఏ & హెచ్ పిల విద్య, శిక్షణలో ప్రమాణాలు లేవు.
6. ఆరోగ్య, అనుబంధ సేవల వృత్తులలో ప్రమాణాలు నెలకొల్పి నియంత్రించడానికి అవసరమైన బలిష్టమైన నియంత్రణ యంత్రాంగాన్నిఏర్పాటు చేయడం ఈ బిల్లు ప్రయత్నిస్తుంది.